"ఒరేయ్ బ్రహ్మం, సులువుగా గొప్ప పేరు వచ్చే మార్గమేమేనా ఉంటే చెప్పరా"
"ముందు నీ మనసులో 'సులువుగా' అంటే అర్ధం ఏంటో చెప్పి ఏడవరా శ్రీనూ"
"సులువుగా అంటే - మన చేయి కాలు కదపక్కరలేకుండా పైసా ఖర్చు పెట్టకుండా అన్నమాట"
"చేయి కాలు కదపకుండా అంటే ఏమిటి"
"ఆ మాత్రం కూడా తెలీని నిన్ను సలహా అడిగేను చూడు, నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి"
"చేయి కాలు కదపకుండా అంటే - అదా అర్ధం"
"ఒరేయ్ బ్రహ్మం, చేయి కాలు కదపకుండా అంటే మనం ఏమాత్రం కష్టపడకుండా అని అర్ధంరా"
"అలా విడమరచి చెప్తే, సలహా ఇవ్వడం ఎంత పనిరా శ్రీనూ"
"అయితే చెప్పు మరి"
"అర్జెంట్ గా నువ్వు ఒక రచయిత అయిపో. ఇంక చూసుకో, గొప్ప పేరు సన్మానాలుతో ఆఖరికి నీకు రచనలు చేయడానికి కూడా టైం ఉండదు"
"ఇదా నువ్విచ్చే వెధవ సలహా"
"రచనలు చేయాలంటే చేతివేళ్ళు రెండు మూడు పనిచేస్తే సరి, కాలు అసలు కదిపే అవసరమే లేదు కదా"
"మరి రచనలు చేయడానికి బుర్ర ఆలోచించక్కరలేదా"
"నువ్వు చేయి కాలు కదపకుండా ఉంటే చాలు అన్నావు కదా శ్రీనూ"
"నిజమే అనుకో. రచనలు చేసేటంత బుర్ర నాకెక్కడిది"
"అలా అయితే, రచనలు చేయగలిగిన అతనిని ఎవరినేనా వెదికి పట్టుకొని, నీ పేరు మీద వ్రాయమని అతన్ని ప్రాధేయపడు"
"అలాంటి వెధవ ఎవడేనా ఉంటాడేంట్రా ఈ భూప్రపంచం మీద"
"అలా అయితే, ఎవడేనా వ్రాసినవి దొంగలించి, వాటికి రచయితగా నీ పేరు పెట్టేసుకో"
“ఏమన్నావు, మళ్ళా చెప్పు"
"ఎవడేనా వ్రాసినవి దొంగలించి, వాటికి రచయితగా నీ పేరు పెట్టేసుకో - అన్నాను"
"ఆ పనే చేయాలి. కానీ, దొంగతనంగా కాదు దొరతనంగా"
"అదెలాగ"
"సంక్రాంతికి ఇంకా ఎన్ని రోజులున్నాయి"
-2-
"రోజులాంటావేమిటిరా, ఇంకా రెండు నెలలు పైనే ఉంటే"
"కదా, అందుకే ఏ పత్రికలవారు సంక్రాతి కథల పోటీ గురించి ప్రకటన ఇవ్వక ముందే, మనం ఒక ప్రకటన లాంటి సమాచారం జనంలోకి చేరవేస్తాం"
"ఏమని"
"రాబోయే సంక్రాంతికి కథల పోటీ నిర్వహిస్తున్నాము; అందుకై తెలుగు భాష మీద అభిమానంతో అచ్చ తెలుగులో వ్రాసే రచయితల నుండి తెలుగుదనం ఉట్టిపడే సంస్కారవంతమైన కథలు ఆహ్వానిస్తున్నాము; వచ్చిన కథలలో ఉత్తమంగా ఎంచబడిన పాతిక కథలకు ఐదువందల రూపాయలు చొప్పున బహుమతి ఇవ్వబడుతుంది; ఆ పాతిక కథలలో అత్యుత్తమంగా ఎంచబడిన ఐదు కథలకు వేయి రూపాయలు చొప్పున బహుమతి ఇవ్వబడుతుంది; మరియు ఆ ఐదు కథలలో సర్వోత్తమంగా ఎంచబడిన ఒకే ఒక కథకు ఐదువే లరూపాయలు బహుమతి ఇవ్వబడుతుంది - అని"
"అంత డబ్బు ఎక్కడిదిరా నీ దగ్గర. పైగా మనం ఏ పత్రికా నడపడం లేదు కూడా"
"నా ఆప్త మితృడివైనా, నా వెధవ ఆలోచన నీకు ఇంకా అర్ధం కాలేదన్నమాట"
" నీ వెధవ ఆలోచన ఏమిటిరా"
"మనం సంక్రాంతికి క్రొత్తగా 'ఔత్సాహిక' అన్న పేరుతో క్రొత్త పత్రిక ప్రారంభిస్తున్నాము, అందుకై కథలు కావాలి అని ప్రకటన ఇస్తామన్నమాట. ఆ నెపంతో, మనం కథలు అందుకుంటాము. కానీ ఎవరికీ ఏమీ బహుమతి ఇవ్వం. ఆ కథలన్నీ ఓపిగ్గా చదివి అందులో చాలా బాగున్నాయి అనిపించిన పది కథలకు చిన్న చిన్న మార్పులు చేసి, వాటి రచయితగా నా పేరు పెట్టి, సంక్రాతి కథల పోటీలు నిర్వహించే పత్రికలవారికి పంపుతాను. ఆ కథలు పోటీల్లో నిలబడి బహుమతులొస్తే, సులువుగా డబ్బుకు డబ్బుకు పేరుకు పేరు వస్తాయి. అంతేకాదు, బహుమతులు ఎంపిక కథలు తిరిగి వాపసు కోరేవారు తగినన్ని పోస్టల్ స్టాంపులు కూడా కథలతో పాటూ ఒక చిన్న కవరులో పెట్టి పంపాలి అని నియమం కూడా జోడించి, ఆ వచ్చే పోస్టల్ స్టాంపులు మనం వాడుకుంటాము లేదా అమ్ముకుంటాము. ఎలా ఉంది నా వెధవ ఆలోచన మొత్తం"
"వినడానికి బ్రహ్మానందంగా ఉంది. కానీ... కానీ..."
"కానీ పరక అంటూ నాకు టెన్షన్ పెట్టక నీకొచ్చిన అనుమానం ఏంటో త్వరగా చెప్పి ఏడు"
"కథలు అందుకొని బహుమతులు ఇవ్వము అంటే చెప్పులతో కొడతారు తెలుసా. అంతేకాక, ప్రకటన ఇవ్వడానికి దండిగానే డబ్బులు కావాలి; మన పేరున పంపిస్తారు కాబట్టి మన చిరునామా మొబైల్ నెంబర్ వివరాలు కథలు పంపే వారి దగ్గర ఉంటాయి కాబట్టి ఏమైనా చిక్కులొస్తే శ్రీకృష్ణజన్మస్థానంలో కాపరం చేయాలి. నీకామాత్రం తట్టలేదా"
-3-
"ప్రకటన వార్తాపత్రికలలో ఇస్తే దండిగా డబ్బులు కావాలి. కానీ కొత్తగా మనమే తయారుచేసిన వాట్సాప్ గ్రూప్ లో ఇస్తే ఏమాత్రం ఖర్చు అవసరం లేదు. వాట్సాప్ గ్రూప్ లో ఒక్క సందేశం చాలు, దావానలం లాగ అతిత్వరగా జనాల్లోకి దూసుకు పోతుంది. ఇప్పుడు తెలిసిందా నాది ఎలాటి బుర్రో"
"మరి మన మొబైల్ నెంబర్ చిరునామా సంగతేమిటి ఆలోచించావు"
"దానికి కూడా మార్గం లేకపోలేదు. పోస్ట్ ఆఫీస్ లో మనం ఒక పోస్ట్ బాగ్ తీసుకొని, కథలు ఆ పోస్ట్ బాగ్ నెంబర్ కి పంపించమని చెప్తాము. కాబట్టి మన చిరునామా ఎవరికీ తెలిసే ప్రశ్నయే లేదు. మన పని అయిపోయిన తరువాత ఆ మొబైల్ సిమ్ ని రెండు ముక్కలుగా విరిచేసి మనమే తయారుచేసిన వాట్సాప్ గ్రూప్ ని ఒక శుభ ముహూర్తాన క్లోజ్ చేసి, మొబైల్ ని కూడా పనికిరాకుండా పాడుచేస్తాము. ఇక ఎటువంటి సమస్యలకూ తావే లేదు"
"మరింకేం, ప్రొసీడ్”
*****