"చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదు" (సామెత కథ)
రాత్రి వండిన అన్నం మరునాటి ఉదయానికి చద్ది అన్నం అవుతుంది. దానిలో విటమిన్ B12 ఉంటుంది అంటారు. అందుకే ఒంటికి బలమనీ..రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ అంటారు. అది వేరే విషయం.
ఆ చద్దన్నం ఉదయం తింటే కడుపులో నిండుగా ఉండి ఎక్కువ సేపు ఆకలి వెయ్యదు అని కూడా అంటారు.
ఇంట్లో పని పాటలు చేసుకోవలసిన ఆడవారు అలా చద్దన్నం తినేసి కూర్చుంటే.. ఇంట్లో మిగిలిన వారికి పస్తే అని చెప్పటానికి ఈ సామెత వాడతారు.
@@@@
"ఏం చేస్తున్నావే శైలా? పడుకుంటే లేపానా. టీ తాగుతుంటే గుర్తొచ్చావు. మాట్లాడి చాలా రోజులయిందని ఫోన్ చేశాను" అన్నది వనజ మధ్యాహ్నం మూడు గంటల వేళ.
"ఆ :( ...ఇప్పుడే నడుం వాల్చాను. నీ ఫోన్ తోనే లేచాను. మీ భోజనాలు 11 గం లకే అయిపోతాయి. నువ్వు భోజనం చేసి ఓ కునుకు తీసి లేచే టైం కి మా భోజనాలు అప్పుడే అవుతూ ఉంటాయి. చెప్పు..ఏమిటి కబుర్లు" అంది మంచం మీదే దిండుకి ఆనుకుని కూర్చుని శైలజ.
"ఊరికే చేశాను .. పెద్ద విశేషాలేం లేవు. ఇంతకీ మీ అబ్బాయిని ఏ కోచింగ్ సెంటర్ లో చేర్చారు" అన్నది.
"నారాయణ కాన్సెప్ట్ సెంటర్ లో. వాడు మెడిసినో..ఇంజనీరింగో తేల్చుకోలేక పోతున్నాడు. ఒక సారి ఇదంటాడు..ఒక సారి అదంటాడు. ఇప్పటికైతే ఆ కాలేజిలో ఎంపిసి లో చేరాడు. నిలదొక్కుకోగలడో లేదో చూడాలి" అన్నది శైలజ.
"నా మాట విని శుభ్రంగా వాడిని ఏ కామర్సులోనో చేర్చండి. ఇంచక్కా సిఏ చదువుతాడు. అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే ఫైనాన్స్ సెక్టర్ నిర్లక్ష్యం అవుతుంది. ఎంత సంపాదించినా ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ఫెయిల్యూరే! ఎంత మంది పెద్ద బిజినెస్ టైకూన్స్..ఫైనాన్స్ ప్లానింగ్ చేత కాక చతికిలపడ్డాయో..మనం చూడట్లేదా!" అని తన ఉచిత సలహా ఒకటి పడేసింది.
"ఎవరూ..ఫోన్లో" అని సైగ చేశాడు శైలజ భర్త మహేశ్.
"మా ఫ్రెండ్ వనజ" అంది ఫోన్ స్పీకర్ మీద చెయ్యి అడ్డంగా పెట్టి!
"మన వరుణ్ ఏ కాలేజిలో చేరాడు...అని అడిగి..'కామర్సులో చేర్చు' అని ఉచిత సలహా ఒకటి పడేసింది" అన్నది.
"ఆఁ ఎందుకు చెప్పదూ? వాళ్ళ పిల్లలు ఐఐటి లో ఇంజనీరింగ్ చదివి ఐఐఎం లకి, ఐఐఎస్ సి ల కి వెళ్ళాలి..మన పిల్లలు వాళ్ళ కింద ఎకౌంట్స్ అసిస్టెంట్స్ గా పని చెయ్యాలి! ఏం ఫ్రెండే మీ ఫ్రెండు" అన్నాడు.
@@@
శైలజ, వనజ చాలా కాలంగా స్నేహితులు.
వనజకి త్వరగా పెళ్ళి అయింది. పిల్లలు కూడా వెంటనే పుట్టారు.
శైలజ పెళ్ళీ లేటే..పిల్లలు పుట్టటమూ లేటే! అందుకే శైలజ కొడుకు ఇంటర్మీడియెట్ లో చేరే సరికే వనజ కొడుకు పెద్ద కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
తన కొడుకు చదువప్పుడు వనజ పడిన ఆరాటం..ఎక్కడ చేర్చాలి అని అందరిని సంప్రదించటం... మంచి కోచింగ్ సెంటర్ లో చేరాక..కోరుకున్న ర్యాంక్ వస్తుందా..రాదా అని రాత్రిం బవళ్ళు భార్యా భర్తలు పడిన తపన...దేవుడి మొక్కులు..ఉపవాసాలు..అన్నీ శైలజకి మహేశ్ కి తెలుసు.
ఇప్పుడు వాటన్నిటి నించి ఒడ్డెక్కేసింది. తీరుబడిగా కూర్చుని అక్కరలేని సలహాలివ్వటం మొదలు పెట్టింది.
అదే మహేశ్ కి కోపం.
"ఈ సారి ఆవిడ ఫోన్ చేస్తే తన ఉచిత సలహాలు మనకి అవసరం లేదని చెప్పు."
"'చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదని' చిన్నప్పుడు మా తెలుగు టీచర్ సామెత చెబుతూ ఉండే వారు."
"ఈవిడ లాంటి వాళ్ళని చూసే చెప్పి ఉంటారు. ఆవిడ పని అయిపోయింది. కడుపు నిండింది. ఇప్పుడు తోచక సలహాలిస్తోంది" అన్నాడు నిరసనగా.
"పోనీ లెండి..ఏదో చెప్పింది. తను చెప్పినవన్నీ మనమేం ఆచరించబోవట్లేదు. మన వీలు..ఆలోచన మనవి. ఈ సారి తను కనిపించినప్పుడు ఇవేమీ మాట్లాడకండి. బావుండదు."
"చాలా మంది అంతే..అడిగినా అడగకపోయినా ఏదో ఒకటి చెబుతుంటారు. ఆ మాత్రం ఆలోచన మనకి రానట్టు..వాళ్ళే ప్రపంచాన్ని కాచి వడబోసినట్టు! ఇలాంటి సందర్భాల్లో వారికి ఉద్దేశ్యం మంచిదీ ఉండచ్చు.. లేక ఒడ్డెక్కేశాం అనే స్వాతిశయమూ ఉండచ్చు. చూసీ చూడనట్టు..వినీ విననట్టు పోతే మనకి సుఖం..ఏమంటారు" అన్నది..భర్తతో అనునయంగా.
"అబ్బో ఫ్రెండ్ ని బాగానే వెనకేసుకొచ్చావ్. సరే ఆకలేస్తోంది తినటానికి ఏమయినా పెట్టు అంటూ వంటింట్లోకి దారి తీశాడు.