"మేము కొత్త ఫ్లాట్ బుక్ చేసాం అమ్మా!. ."
"మంచిది రమ్య..! పెళ్ళైన సంవత్సరం లోపలే.. మంచి వార్త చెప్పారు. అల్లుడుగారికి నా కంగ్రాట్స్ చెప్పు! ఇంతకీ.. నీ మ్యారేజ్ లైఫ్ ఎలాగ ఉందే..?"
"బాగానే ఉంది..మా అత్తయ్యా, మావయ్యా నన్ను బాగా చూసుకుంటున్నారు..!"
"మంచిదే..మాకూ అదే కావాలి.."
"వచ్చే నెలలో ఫంక్షన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాము అమ్మా!..ఏమంటావు?"
"మంచిది.." అంది తల్లి రాధ
"మీ అల్లుడు సర్ప్రైజ్ ఇద్దామని..ఇల్లు గురించి ముందుగా చెప్పలేదు...ఈ వీకెండ్ మా ఇల్లు చూడడానికి రండి.. నువ్వూ, నాన్న.."
"అలాగే రమ్య!"
రామ్ తన భార్య రాధ తో కలిసి..రమ్య కొత్త ఇల్లు చూడడానికి ఆ వీకెండ్ బయల్దేరారు..
"ఏమండీ! మీరా రిటైర్ అయిపోయారు, నేనా హౌస్ వైఫ్..మనం ఎక్కడ ఉంటే ఏమిటి చెప్పండి..మనమూ కూతురు రమ్య అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటే, దగ్గరే ఉంటాము కదా..ఏమంటారు?"
"నీ ఆలోచన మంచిదే..కానీ..వియ్యంకులకు దగ్గరగా ఉంటే, ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లెమ్స్ వస్తాయేమో..!"
"ఏమీ రావు..మన అమ్మాయి దగ్గర ఉండడానికి వాళ్ళ పర్మిషన్ కావాలా ఏమిటి?" అంది రాధ
"కాదు..అమ్మాయికి పెళ్ళైన తర్వాత..మనం అలా ఎలా అనుకోగలం చెప్పు రాధా..?"
"ఊరుకోండి..ఎక్కువ ఆలోచించకండి...అమ్మాయి అపార్ట్ మెంట్ లో చాలా ఫ్లాట్స్ ఖాళీ ఉండే ఉంటాయి..పని లో పని ఇప్పుడే ఒకటి చూసి ఫైనల్ చేసేయండి..మీ రిటైర్మెంట్ డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా..కొనేయండి..కొంటున్నాము అంతే!!!"
(పెళ్ళాం కోరికునేది ఏమిటి అంటే...భర్త పై అధికారం అంట. మొగుడు 'నీ ఇష్టం' అంటే, పెళ్ళానికి చాలా హ్యాపీ అంట..ఈ మధ్య ఎక్కడో చదివాను...ఇప్పుడు అదే జరుగుతుంది..) అని మనసులో అనుకున్నాడు రామ్..
"నీ ఇష్టం రాధా..!"
(హమ్మయ్య!!! వచ్చేసింది నీ పెదాలపై చిరునవ్వు..రాధా!)
ఇద్దరూ కొత్త అపార్ట్ మెంట్ దగ్గరకు చేరగానే, అక్కడకు అప్పటికే వచ్చిన రమ్య, తన కొత్త ఫ్లాట్ చూపించింది. "ఇంతకీ ఎలా ఉంది మా ఫ్లాట్..?" అని అడిగింది రమ్య
"చాలా బాగుంది..!"
"నాకు ఆఫీస్ కు టైం అయిపోతుంది నాన్న! నేను బయల్దేరతాను..మీరు చుట్టు పక్కల అన్నీ చూసుకుని..బయల్దేరండి.."
"అలాగే! వెళ్ళు రమ్య..!"
ఒక వారం తర్వాత...రాధ నుంచి ఫోన్ వచ్చింది. రమ్య ఫోన్ తీసి విషయం అడిగింది..
"నీకూ ఒక సర్ప్రైజ్..మేము ఒక కొత్త ఫ్లాట్ తీసుకున్నాము. ఎక్కడో తెలుసా..? మీ అపార్ట్ మెంట్ లోనే.." చెప్పింది తల్లి రాధ..
తర్వాత..రమ్య కొత్త ఇంటి గృహప్రవేశం గ్రాండ్ గా జరిగింది.
ఈలోపు రమ్య అత్తగారి చెల్లెలు.."అక్కా! మీ వియ్యంకులు ఇక్కడే ఇల్లు తీసుకున్నారంట కదా! నెక్స్ట్ వాళ్ళ గృహప్రవేశం అంట కదా!"
"అవును..ఆ..అవును.."
"నీ మీద ఎంత నమ్మకం లేకపోతే, ఇక్కడే ఇల్లు తీసుకుంటారు చెప్పు..ఏమీ, నువ్వు మీ కోడలిని సరిగ్గా చూడలేవా? దానర్ధం ఏమిటి చెప్పు? వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు కనిపెట్టుకోవచ్చనే ఇక్కడే తిష్ట వేస్తున్నారు..తెలియట్లేదా అక్కా!..లోకం ఇలానే అనుకుంటుంది..నీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో చూడు!"
"అలాంటిదేమీ లేదు..చెల్లి.."
"పోనీ..ఇల్లు తీసుకుంటున్నామని మీ వియ్యంకురాలు నీతో చెప్పిందా..? లేదు కదా..!..అర్ధం చేసుకో మరి!"
"నువ్వు చెబుతుంటే.. అలానే అనిపిస్తోంది చెల్లి!"
ఈ మాటలు పక్కనుంచి విన్న..రమ్య మనసు బాధ పడింది. ఇప్పుడు తన తల్లి ని సపోర్ట్ చేస్తే, అత్తగారికి కోపం..అలాగని అత్తగారిని సపోర్ట్ చేస్తే..అమ్మ ఫీల్ అవుతుంది. ఏదేమైనా..నా భర్త కోసమే కదా నా జీవితం..కాబట్టి అత్తగారికే నా సపోర్ట్ అని అనుకుంది.
అమ్మ తీసుకున్న ఫ్లాట్, రెంట్ కి ఇచ్చేయ్యమని చెబుతాను. వెంటనే తల్లి కి ఫోన్ చేసింది రమ్య..
"అమ్మా! ఇక్కడకు రాకండి!..నువ్వు నాన్న దూరంగానే ఉండండి..అప్పుడప్పుడు ఇక్కడకు వస్తే చాలు..ఏమీ అనుకోవద్దు. మీరు తీసుకున్న ఫ్లాట్, రెంట్ కి ఇచ్చేయండి..అప్పుడే మీరూ, నేను అందరమూ హాపీ గా ఉంటాము" అని కూతురి మెసేజ్ చూసిన తల్లి రాధ.. అదే విషయాన్ని భర్త రామ్ కు చెప్పింది..
*****