ఆరోజు నా శ్రీమతి సరోజ పదవీ విరమణ.. దాదాపు పాతిక సంవత్సరాలు సెకండరీ గ్రేడ్ టీచర్ గా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో దిగ్విజయంగా విధులు నిర్వర్తించి మంచి పేరు గడించింది. జిల్లా స్థాయిలో ‘ఉత్తమ ఉపాధ్యాయిని’ అవార్డు రావడం నాకెంతో గర్వకారణం. అవార్డు కంటే.. విద్యార్థుల, సహ అధ్యాపకుల అమూల్యమైన అభిమానం చూరగొనడం నాకు అమితానందాన్నిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగమన్నాక పదవీ విరమణ తప్పదు. కాని ఆ తరువాత గూడా సరోజ విద్యాసేవలో మునిగి ఉండాలన్నదే నా కోరిక. అదే విషయాన్ని సరోజతో చర్చిస్తూండగా చరవాణి మ్రోగింది. ఫోన్ అందుకున్నాను. అది సరోజ ప్రధానోపాధ్యాయుడు ప్రకాశం గారు చేస్తున్న ఫోన్ కాల్..
సరోజ పదవీ విరమణ ఫంక్షన్ కు హాజరు కావాలని వినయపూర్వకంగా ఆహ్వానించాడు. తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను. నేను ఊహించినదే.. నేనూ సిద్ధంగానే ఉన్నాను. బాలలకోసం ప్రచురించుకున్న కథల పుస్తకాలు ఒక అట్ట పెట్టెలో సర్ధిపెట్టాను. ఆరోజు పిల్లలకు ఆమె చేతుల మీదుగా పంచాలన్నది నాకోరిక. సరోజ ఆలోచన గూడా ఆదర్శనీయమే.. పిల్లలకోసం పాఠశాల వంటకార్మికులకు అదనంగా డబ్బులిచ్చి ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయించింది.
మా ప్రణాళిక ప్రకారం పాఠశాల ప్రాంగణం చేరుకునేసరికి పిల్లలంతా క్రమశిక్షణతో రెండు వరుసలుగా నిల్చున్నారు.. ఆశ్చర్యపోయాను. కొందరు అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి కోలాటమాడుతూ.. ‘స్వాగతం.. సుస్వాగతం..’ అని పాటలు పాడుతుంటే.. నాసరోజ గొప్ప అదృష్టవంతురాలని కళ్ళల్లో ఆనందభాష్పాలు దొర్లాయి. ప్రకాశం గారు, ఉపాధ్యాయబృందంతో కలిసి మాకెదురుగా వచ్చారు. తన ఛాంబార్ లోకి సాదరంగా ఆహ్వానించారు. సరోజ హాజరు పట్టికలో చివరి సంతకం చేస్తుంటే హాలంతా తన సహచరుల కరతాళధ్వనులతో మారుమ్రోగి పోయింది. అప్రయత్నంగా వారితో నాచప్పట్లూ కలిసాయి.
ఇంతలో వంటలు సిద్ధమయ్యాయనే వార్త రావడంతో అంతా కలిసి బయటకు వచ్చాం.
పాఠశాల ఆవరణలో పచ్చని చెట్ల కింద పిల్లలు పళ్ళాలు పట్టుకుని నిలబడి మాకోసమే చూస్తున్నారు. సరోజ, నేను పిల్లలందరికీ వడ్డించాము. ఇంతలో జిల్లా విద్యాశాఖాధికారి విద్యాసాగర్ గారు ముఖ్య అతిధిగా రావడంతో.. ఎదురుగా వెళ్లి అభివాదము చేసి ఆహ్వానించాం. వారితో కలిసి అందరం భోజనం చేసాము.
భోజనాల కార్యక్రమం అనంతరం సరిగ్గా రెండు గంటలకు సభ ఆరంభమయ్యింది.
ముందుగా ప్రకాశం గారు స్వాగతోపన్యాసం చేస్తూ.. సరోజ విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషిని కొనియాడాడు. సరోజ లేని లోటు పూడ్చలేనిదని.. ఉపాధ్యాయలోకానికి ఆదర్శవంతురాలని ప్రశంసించాడు. ఉపాధ్యాయులు గూడా సరోజను పొగడ్తలతో ముంచెత్తుతూ మాట్లాడారు. కొందరు విద్యార్థులు మౌనంగా రోదిస్తూ మాట్లాడారు. ఒక విద్యార్థిని మాట్లాడుతూ వెక్కి, వెక్కి ఏడ్వడం.. సభలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరోజ పరుగు, పరుగున వెళ్లి తన గుండెలకు హత్తుకుని ఓదార్చింది.
ప్రకాశం గారు చెమ్మగిల్లిన తన కండ్లను కర్చీఫ్ తో ఒత్తుకుని .. ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని చెబుతూ.. నన్ను మాట్లాడమని ఆహ్వానించాడు. నేను మైకు ముందుకు వెళ్లి గొంతు సవరించుకున్నాను. సభాసదుల సంబోధన తరువాత నా మదిలోని భావాలను, వాస్తవాలను సభకు చెప్పాలని గొంతు విప్పాను.
“మనం ఎదుటివారి నుండి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా శక్తి కొలది సాయం చేస్తే దేవుడు మరో రూపంలో
వచ్చి మనకు సాయం చేస్తాడు. ఒక వేళ సాయం చేసే శక్తి మనలో లేకుంటే.. మిన్నకుండాలి గాని ద్రోహం మాత్రం చేయగూడదు. అనే సిద్ధాంతంతో నా జీవనయానం కొనసాగించాను. నా జీవితంలో జరిగిన రెండు అనుభవాలను మీ ముందుంచుతాను” అంటూ సభను కలియజూసాను. సభలో ఉత్సుకత కనబడింది. నాలో ఉత్సాహం ద్విగుణీకృత మయ్యింది. మరో మారు గొంతు సవరించుకుని తిరిగి చెప్పసాగాను.
“నాకు మొదటగా మెరిట్ ప్రాతిపదికన టెలీఫోన్ డిపార్ట్ మెంటులో టెలీఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది. అప్పటికే నేను హన్మకొండలోని రాధాస్వామి సత్సంఘ్ లోని ఒక గదిలో అద్దెకుండి.. గణితశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను. కాని కాలేజీ సర్వీసు కమీషన్ ఏర్పాటు చేసి జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాలు చేబట్టాలనే ప్రభుత్వ నిర్ణయంతో జాప్యం జరుగుతోంది. మా నాన్నగారు ఉద్యోగ విరమణతో నాకు ఉద్యోగంలో చేరక తప్పలేదు. ఏ ఉద్యోగమైనా అంకిత భావంతో చేయాని మా నాన్నగారి నుండి స్ఫూర్తి పొందాను. ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు. టెలీఫోన్ ఆపరేటర్స్ కనెక్ట్ చేసే లోకల్, ట్రంకాల్స్ మీదనే జనం ఆధారపడే వారు. నాకు ప్రజల నుండి పలుప్రశంసలు రావడంతో.. మాడిపార్ట్ మెంటు గుర్తించి నాకు ‘రాష్ట్ర ఉత్తమ టెలీఫోన్ ఆపరేటర్’ అవార్డు ఇచ్చింది.
ఒకరోజు నా స్నేహితుని వివాహానికి హన్మకొండ వెళ్ళాను. వివాహం అనంతరం రాధాస్వామి సత్సంఘ్ లో స్నేహితులను కలుద్దామని బయలుదేరాను. సత్సంఘ గేటు ముందర ఒక పిల్లవాడు దేవుని రూపంలో సాక్షాత్కరించాడు. అన్నయ్యా.. జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కోసం అప్లై చేసావా! అని అడిగాడు. మా అక్కయ్య చేసిందన్నాడు. నేను ఆ వాడలో వినయవిధేయలతో మెదిలి అందరి మన్నలను పొందడం.. ఇంకా విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పిన ఫలితమది. నేను వారి ఇంటికి వెళ్లాను. అతని అక్కయ్య ఇచ్చిన పత్రికా ప్రకటన చూస్తే ఆమరునాడే చివరి తేది. వెంటనే మా ఆఫీసుకు ఫోన్ చేసి మరో రెండు రోజులు సెలవు పొడిగించాను. దాని ఫలితమే జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం రావడం..నా మంచితనంతో పిల్ల వాని రూపంలో వచ్చిన దేవుని కటాక్షమే కదా..!” అనగానే సభలో చప్పట్లు మారు మ్రోగాయి. ఉత్సాహంతో మళ్ళీ చెప్పసాగాను.
“జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కోసం అప్ప్లై చేసాక మరో ఏడాదికి గాని ఉద్యోగంలో చేరే అవకాశం రాలేదు. ఈమధ్య నా వివాహం జరిగింది. మా స్వగ్రామంలో టెలీఫోన్ ఆఫీసు ఏర్పాటు చేసారు. దానిని అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో.. డిపార్ట్ మెంటు నన్ను మా ఊరుకు బదిలీ చేసింది. మా ఆఫీసరు తన కార్లో నన్ను మా ఊరికి తీసుకు వెళ్ళాడు. నాచే ఆఫీసు ఓపెన్ చేయించి.. మొదటి ట్రంకాల్ వరంగల్ ఆఫీసు సిబ్బందితో మాట్లాడాడు. ఇది నీ స్వంత కార్యాలయమని అభివృద్ధిచేయుమన్నాడు. వారి నమ్మకం వమ్ము చేయలేదు. ప్రతీరోజు దాదాపు రెండు వందల ట్రంకాల్స్ ప్రజలకు అందించాను. నాకు అమితమైన గౌరవం దక్కింది. ఊళ్ళో అధికారుల మన్ననలు దక్కాయి.
మా ఊరి జూనియర్ కాలేజీలో చదివే పిల్లలు తమకు గణితశాస్త్రం అర్థం కావడం లేదని ట్యూషన్ చెప్పాలని వేడుకున్నారు. సబ్జెక్ట్ బోధించడం నాకూ అవసరమే.. జూనియర్ లెక్చరర్ పదవికి ఎంట్రాన్స్ పరీక్షతో బాటు మోఖిక పరీక్ష సైతం ఉంటుంది. అందుకే పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాను. పిల్లల వద్ద డబ్బులు తీసుకోకపోయే వాణ్ణి. నాకు ఎలాగూ జీతం వస్తుంది కదా అని అనుకునే తత్త్వం నాది. ఆసమయంలో నాశ్రీమతి పదవ తరగతి అనుత్తీర్ణురాలు. ఆమెను గూడా పదవ తరగతి విద్యార్థులతో బాటు కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పాను. మా ప్రక్క ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతీ రోజు నా వద్దకు వచ్చి ఆ పూటకు సరిపోయేలా పదవతరగతి గణితశాస్త్రం లోని కొన్ని సమస్యల సాధనలు నేర్చుకుని వెళ్లి తన బడిలో చెప్పేవాడు. నా శ్రీమతి చదువు
కోవడం గమనించి సరోజను తన పాఠశాల నుండి ప్రైవేటుగా పదవతరగతి పరీక్షలు రాయడానికి దరఖాస్తు పంపుతానన్నాడు. ఫలితంగా మాఊళ్ళో పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుంది. వారి సలహాతో నేను పాఠశాల చదువు లేకుండా పరీక్షలు రాసేందుకు అనుమతి కోసం దరఖాస్తు నింపుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాను. తహసిల్దార్ భాస్కర్ రావు గారు నా దరఖాస్తు తీసుకొని చూసి.. చిరునవ్వు నవ్వుతూ.. ‘నువ్వు ఇంత కష్టపడి నీ భార్యకు చదువు చెబుతున్నావు. పిల్లల వద్ద ట్యూషన్ ఫీజు గూడా తీసుకోవడం లేదు. నాకు నీగురించి అంతా తెలుసు. ఇంత కష్ట పడుతున్న నీకు భవిష్యత్తులో మేలు జరగాలంటే నా చేతనైన సాయం చేస్తాను’ అంటూ సరోజకు భవిష్యత్తుకు పునాది వేశాడు. వారు మా జీవితాలలో దీపం వెలిగించిన దేవుడే కదా! నా నిస్వార్థ సేవకు తాను దేవుని రూపంలో సాయం చేసాడు” అనగానే సభలో మరో మారు కరతాళధ్వనులు మిన్నంటాయి.
నేను చిరునవ్వు నవ్వుతూ.. ప్రసంగం ముగింపు దిశగా సాగించాను..
“సరోజ పదవ తరగతి ప్రథమ శ్రేణిలో పాసయ్యింది. తరువాత ఇంటర్ మీడియట్ గూడా మా ఊళ్లోనే ప్రైవేటుగానే ప్రథమ శ్రేణిలో పాసయ్యింది. ఈ మధ్య నాకు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావడం ఊరు వదలాల్సి వచ్చింది. అయినా సరోజ చదువుకు భంగం కలిగించ లేదు. డాక్టర్ అంబేడ్కర్ యీనివర్సిటీ నుండి ప్రైవేటుగానే బి.ఏ. పాసయ్యింది. బి.ఇడి. చేయించాలనే ప్రయత్నంలో ఒక జూనియర్ లెక్చరర్ పరిచయమయ్యాడు. అతనిదీ గణితశాస్త్రమే. కాని సమస్యలు కొన్ని అర్థంగాక నాచే సాధనలు నేర్చుకొని తన క్లాసులో పిల్లలకు చెప్పేవాడు. ఆ సాయంతో తనూ మాకు సాయం చేసాడు. తనకు టీచర్ ట్రైనింగ్ కాలేజీ ఉందని అందులో సరోజకు సీటిచ్చి ప్రోత్సహించాడు. అతను గూడా మాకు దైవంతో సమానం.
అలా సరోజ ఉపాధ్యాయ వృత్తిలో చేరడానికి ఎందరో మహానుభావులు మాకు సాయం చేసారు. దానికి కారణం.. మన మంచితనం. మనం ఒకరికి ఒక రకంగా సాయం చేస్తే.. మరొకరు దేవుని రూపంలో మరొక రకంగా మనకు సాయం చేస్తారు. ఈ సందర్భంగా సభాముఖంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
పాఠశాల లో గ్రంథాలయం లేదని గమనించాను. దాని కోసం మా అమ్మగారి పేరు మీద ఒక హాలు నిర్మించి ఇస్తానని వాగ్ధానం చేసాను. గ్రంథాలయ ప్రాముఖ్యం గురిచి మరో రెండు మాటలు చెప్పాను” సభ చప్పట్లతో మారుమ్రోగి పోయింది.
జిల్లా విద్యాశాఖాధికారి విద్యాసాగర్ గారు తన ప్రసంగంలో నన్ను ప్రశంసలతో ముంచెత్తి మరో చోట మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు.
చివరగా సరోజ ధన్యవాద ప్రసంగం చేసి పిల్లలకు నేను తెచ్చిన బాలసాహిత్య పుస్తకాలు పంచింది.
ఉపాధ్యాయబృందం, విద్యార్థుల ఆవేదనల మధ్య వీడ్కోలు తీసుకున్నాం. *