అగ్నిశిఖ - బొబ్బు హేమావతి

Agnisikha

ఆ రోజు కార్ డ్రైవింగ్ లో ఉండగా హిమాన్షి నా వైపు చూస్తూ అన్నది..." సత్య... నన్ను ఒకరు ఇలా చెయ్యి పట్టుకున్నారు అంటూ నా ఎడమ చేతి ని పట్టుకున్నది" .

నేను వెంటనే ఆ వ్యక్తి ఎవ్వరు అన్నది నాకు తెలిసినా తన నోటి వెంట వినాలని నవ్వుతూ ... "ఎవరు" అన్నాను...

వెంటనే హిమ అన్నది....."దేవా" .

నేను వెంటానే అడిగాను ..."ఎప్పుడు"....

హిమ అన్నది ..."నేను విశ్వవిద్యాలయం లో డాక్టరేట్ పరిశోధన చేసేటప్పడు".

హిమ అన్నది "దేవా నా చేతిని పట్టుకున్నప్పుడు నాకు షాక్ తగిలింది. నేను చాలా బయపడి దూరం జరిగాను. అతనికి కూడా ఆ షాక్ తగిలి భయమేసి దూరం జరిగి వెంటనే పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఇప్పటికి మా మధ్య ఆ ప్రేమ ఉన్నది. ఆ షాక్ కూడా ఉన్నది".

హిమ సత్య వైపు చూసి చెప్పింది "అప్పటి నుండి దేవా ఏ దేశము వెళ్లినా ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటాడు".

హిమ బాధగా పక్కకు చూస్తూ అన్నది "ఆ షాక్ నాకు ఇప్పటికి ఉంది"...

"నేను దేవా కి తనని ప్రేమిస్తున్నానని చెప్పాను "..."కానీ దేవా ముందడుగు వెయ్యలేదు".

సత్య వెంటనే అన్నాడు "నిన్ను ఎవరు ఏమి చెయ్యగలరు" ...

చిన్నగా అన్నాడు "నువ్వు గట్టి దానివే...సున్నితము అయితే కాదు ".

ఏదో ఆలోచన లో హిమ అన్నది "భర్త దారి తప్పితే దారి లోకి తేవడం కూడా భార్య బాధ్యత " అనగానే

సత్య వెంటనే అన్నాడు "నేను ఎక్కడ దారి తప్పాను ".

హిమ అన్నది దిగులుగా "అవును నువ్వు ఎక్కడ దారి తప్పావు".

సత్య తో అన్నది "నిజానికి దేవా చాలా తెలివైన వాడు. తాను బందాని కంటే తన వృత్తికి విలువ ఇచ్చినాడు. బాధ్యత కంటే డబ్బుకు విలువ అని భావించాడు ".

"చిన్నతనం నుండి తనకు డబ్బు లేదని భావించి నాతో బంధం వలన తన విలువ కోల్పోతానేమో నని నాకు దూరం అయ్యాడు".

హిమన్షి తను చదువుకున్న విశ్వ విద్యాలయానికి వెళ్ళింది.

ప్రొఫెసర్ రంజని హిమని చూడగానే నవ్వుతూ పలకరించింది "ఎలా ఉన్నావు" "కనిపించడమే లేదు" అన్నది.

హిమ చిరునవ్వుతో "బాగున్నాను" అనేలోగా ప్రొఫెసర్ రంజని తన కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నది ..."చాలా భాద పడ్డావా హిమ".

హిమ వెంటనే అన్నది"ఏంటి మాం...దేని గురించి".

ప్రొఫెసర్ అన్నది"నీ డాక్టరేట్ పరిశోధన చేసేటప్పడు" అంటూ మరింత డీప్ గా తన కళ్ళల్లోకి చూడటం ప్రారంభించింది.

వెంటనే హిమ కు అర్థం అయ్యి "పడ్డాను " అన్నది తల వంచుకుని సిగ్గుతో.

ప్రొఫెసర్ అన్నది తన వైపు చూస్తూ ..."యంగ్ అండ్ డైనమిక్"...

వెంటనే హిమ అన్నది"ఇప్పుడా"...

ప్రొఫెసర్ అన్నది "కాదు మొదట్నుండి"

హిమ తన వైపు చూసి బాధ గొంతులో సుడులు తిరుగుతుండగా "మాటల్లో ఉంటే ఎలా? చేతల్లో ఉండొద్దూ అన్నది."

ప్రొఫెసర్ "చేతల్లో కూడా" అనగానే....నవ్వుతూ దిగులు నిండిన మొహం తో ...అక్కడ నుండి బయలు దేరిన హిమ కు ఇరవై ఆరు ఏండ్లకు ముందు జరిగిన సంఘటనలు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి.

నిజానికి తాను ఈ రోజు తన వృత్తి లో ఎంతో ఎత్తుకు ఎదిగి ఉండేది... కానీ మనోచోరుడు తన ప్రేమను జ్ఞానాన్ని బలవంతంగా తన నుండి లాక్కోవడం వలన తాను ఎంతో మారిపోయింది.

హిమాన్షి ఇంకా వేదనను అనుభవిస్తూనే ఉంది. తనకు పెళ్లి అయ్యి ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయ్యింది. కానీ వేదనకు అంతులేకుండా ఉంది. దేవా కి పెళ్లి కుదరక పోయినా తనకు చిన్న తననే పెళ్లి కుదిరింది అని చెప్పి తన మనసు తో ఆడుకున్నాడు అనుకుని బాధ పడింది. ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చి తనని హింస పెడుతున్నాయి.

ఆ రోజు హిమాన్షి పరిశోధన శాల కి వెళ్ళగానే తన సీనియర్ దేవా నవ్వుతూ తన వైపు చూసి "ఫోన్ చేసి వచ్చి ఉండవచ్చు కదా. అయినా చెయ్యి పట్టుకుంటే అలా కదలక మెదలక ఉండిపోవడమేనా. కోపంతో పాము లా బుస్సుమనాలి. అలా అయితే ఎలా?" అని నవ్వుతూ అంటూ ఉంటే అటు పక్కన కూర్చొని ఉన్న భావన కూడా నవ్వుతోంది.

హిమన్షి ఇద్దరినీ చూసి మనస్సు లో భాదగా అనుకున్నది "నాతో మీరు ఇద్దరూ ఆడుకున్నారు" . "పిచ్చిగా ప్రేమించాను నిన్ను...చివరికి నన్ను పిచ్చిదాన్ని చేసావు".

"అంటే భావన ఇప్పుడు చెప్పిందా. నేను తనని అడిగి సుమారుగా రెండు సంవత్సరాల పైన అయ్యింది".

హిమన్షి దుఃఖాన్ని ఎప్పుడో మర్చిపోయింది. బాధని మోసి మోసి మనిషి సగం అయిపోయింది.

"ఓహ్ మొత్తానికి దేవా తనకు తన చిన్న వయస్సు లో నే పెళ్లి కుదిరింది అని చెప్పి తన మనస్సు తో ఆడుకున్నాడు"

"నిబద్ధత...హా......ఒక్కరంటే ఒక్కరికి కూడా నువ్వు నా చెయ్యి పట్టుకున్నావని చెప్పలేదు దేవా .నిన్ను ప్రేమించానని చెప్పాను. నీకు అవమానం నాకు కూడా" అని హిమ అనుకున్నది.

"నీకు దూరంగా ఉండాలి అని నీతో మాట్లాడను అన్నాను దేవా ....ఎందుకంటే నిన్ను వదిలి ఉండలేనంత ప్రేమ నాలో .....నాకు ఇష్టం లేని పెళ్ళి మా వాళ్ళు చెయ్యలేరు...నేను వద్దు అంటే ఇక వద్దని అంతే. ఇష్టం లేదు అంటే లేదు అంతే. మరి నీ సంగతి నాకు తెలియక పోయెనే దేవా.... అంటే మన పెళ్లి కుదిరేదా? ఇప్పుడు మీ మాటలు వింటూ ఉంటే నా మనస్సు కాలి పోతూ ఉంది".

హిమ కి వెంటనే దేవా ని మొదటిసారిగా తన ఇంటి దగ్గర చూసింది గుర్తుకు వచ్చింది.

ఆ రోజు దేవా పొట్టి డొక్కు సైకిల్ లో వచ్చాడు హిమన్షి ఇంటికి ...అతనిని చూడగానే ఆ క్షణమే హిమన్షి అతని ప్రేమలో పడింది...మొదటి చూపు లోనే...అతను ఆ అమ్మాయి చూపుల వల లో నుంచి తప్పించుకోలేక ఆ వలలో చిక్కుకు పోయాడు.

హిమన్షి విశ్వవిద్యాలయం లోని పరిశోధన శాల లో చేరగానే...

హిమన్షి ని చూస్తూ దేవ అనుకున్నాడు "ఎందుకో ఎంత చూసినా హిమ ని ఇంకా చూడాలనిపిస్తుంది. బహుశా దీనినే ప్రేమ అంటారేమో?".

అంత వరకు మౌన ముగ్దలా ఉన్నా హిమ.... దేవ ని చూడగానే మాటల ప్రవాహం అయిపోయింది. అతని కోసం మాట్లాడటం మొదలు పెట్టింది. తొందరలోనే దేవా మంచి మిత్రుడు అయ్యాడు.

దేవా మౌనంగా హిమ ని గమనించసాగాడు. దేవా కి ఎక్కడ చూసినా హిమ కన్పిస్తున్నది.

పుస్తకం తీసినా మూసినా హిమ కన్పిస్తున్నది. ఏమి చదవలేక పోతున్నాను ఈ అమ్మడు కన్పించాక అనుకుంటూ దుండు పై తలా వాల్చి ఆ అమ్మాయి తో కలలో తెగ సరసాలు ఆడుతున్నాడు.

దేవా ని చూడగానే ఎందుకో ఆట పట్టించాలని అనిపించింది హిమ కు.

దేవా పొట్టి సైకిల్ పై వచ్చి హిమ ని చూసి ఆగినప్పుడు దేవా ని చూస్తూ హిమ "నువ్వు పొట్టి... నీ సైకిల్ కూడా పొట్టి" అని సైగ చేసింది.

వెంటనే దేవా హిమ ని చూసి "అబ్బో నువ్వు ఇంత లావు" అంటూ సైగ చేసి కోపంగా తరగతి గది లోకి వెళ్ళిపోయాడు.

దేవా నిశ్శబ్దన్గా తన పని తాను చేసుకుంటున్నాప్పుడు... హిమ దేవా వైపు చూసి " బుద్ధుడా లేదా ప్రవరాక్యుడా" అనుకున్నది.

దేవా హిమ ని చూసి "అమ్మ వజ ఎక్కువ పోసినట్లు ఉంది...తెగ వాగుడు" అనుకున్నాడు.

దేవా ఒక రోజు అన్నాడు హిమ తో "మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేద్దామో చూద్దామా? పందెం " అన్న వెంటనే "సరేనని" తల ఊపింది హిమ.

ఒక రోజు దేవా చిన్నప్పటి ఫోటో చూసి పడి పడి నవ్వుతుంటే...ఏమి హిమ నవ్వుతున్నావు అని దేవా అడగగానే "అబ్బా ఆ మొహం చూడు ఎలా ఉందో.. నున్నగా అమ్మాయి లా..నీ చిన్నప్పటి ఫోటోలో ....చిన్నప్పుడు అంటే మరీ అంత చిన్నగా ఏమి లేవులే ...అప్పటికే విశ్వవిద్యాలయం లో చదువుతున్నావు కదా?".

....అస్సలు నీకు మీసాలు గడ్డం ఎన్ని ఏండ్లకు వచ్చాయోయి" అంటుంటే దేవా కోపంగా చూసాడు హిమ వైపు.

హిమ నోట్లో వేలు పెట్టి గోర్లు కొరికేస్తుంటే ..హిమ ని చూసి"కాస్త ఆపుతావా కొరకడం" కోపంగా దేవా అనగానే హిమ దేవా వైపు చూసి "నిన్ను కొరకట్లేదు కదా...నా గోర్లు... నా ఇష్టం "అన్నది.

దేవా ఎక్కడకు కదలకుండా కూర్చొని ఉంటె దేవా ని చూసి అన్నది " మరీ గమ్ వేసి కుర్చీకి అతికించకొయ్ నీ బాడీ ని పొట్టోడు అయ్యిపోతావు" అనగానే దేవా హిమ తలా పై మొట్టిక్కాయ వేస్తాను అన్నట్లు చెయ్యి పైకి ఎత్తాడు...

హిమ అనుకున్నది మనస్సులో " దేవా ఇది కూడా అల్లరే....నిన్ను బాగా కవ్వించానా లేదా".....

ఇద్దరి మధ్య రగులుతున్న కవ్వింపులు తట్టుకోలేక ...దేవా విరహపు బాధ తట్టుకోలేక గడ్డం పెంచి దిగులుగా ఉండటం చూసి....

గోపాల్ అన్నాడు...దేవా తో "ఏరా ఎవ్వరి మీద అయినా సమ్మె చేస్తున్నావా" ...చూపులు హిమ వైపు చూస్తూ.

దేవా హిమ వైపు చూస్తూ నవ్వి పెదవులు చప్పరిస్తూ ఊరుకున్నాడు.

హిమ గమనించి గమనించనట్లు నిశ్శబ్దంగా ...మనస్సులో అనుకున్నది "మీరు కుర్రాళ్ళు ...మమ్మల్ని ఊహించుకుని అతిగా ఆశ పడుతున్నారు". కానీ ఏదో ఆకర్షణ హిమా ఎంత వద్దనుకున్నా కాదనుకున్న తన మనస్సు దేవా వైపు లాగేస్తోంది. అతను ఎటు వైపు పోతే అటు వైపు పోయేది.

ఒక రోజు హిమ లైబ్రరీ కి వెళ్ళింది దేవా ని వెతుక్కుంటూ.... దేవా పరిశోధన ఆర్టికల్స్ చదువుతూ ఉండగా చూసి అతని దగ్గరకు వెళ్ళింది. దేవా ని చూడగానే హిమ మనస్సు పురివిప్పిన నెమలి అయ్యింది.

హిమ ని చూడగానే దేవా అన్నాడు "చూసావా ఈ పరిశోధన ఎంత అద్భుతంగా ఉంది".

దేవా ని చూసి అతన్ని ప్రేరేపించాలని హిమ వెంటనే అనింది "అయితే ఏమి చెయ్య మంటావు". దేవా మనస్సు మూగబోయింది.

ఆ రోజుల్లోనే ఒక రోజు దేవా స్నేహితురాలు భావన హిమ తో అన్నది... "దేవా కి పెళ్లి కుదిరింది. అతను కూడా ఒప్పుకున్నాడు" అని చెప్పింది.

వెంటనే ఆ రోజు హిమ దేవా ని అడిగింది " పెళ్లికి ఒప్పుకున్నావా".

...." హా ఒప్పుకున్నాను. నా చిన్నప్పుడే నాకు నా మరదలితో పెళ్లి కుదిరింది" అని దేవా చెప్పాడు.

వెంటనే అడిగింది దేవాని "పెళ్లి చేసుకోవాలా".

... " చేసుకోవాలి" అని అన్నాడు హిమ వైపు చూస్తూ.

హిమ అన్నది "కట్నం ఎంత"....

దేవా హిమ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు...."తీసుకోను".

మనస్సులో హిమ అనుకున్నది "దేవా మంచివాడే".

ఆ క్షణం హిమ కు అర్థం కాలేదు...దేవా తనతో సరసం ఆడాడు అని...అది తమ ఇద్దరి జీవితాన్ని కాల్చేయబోతుంది అని...

ఒక రోజు దేవా హిమన్షి వైపు చూసి అన్నాడు.... "ఊరెళ్తున్నాను".

హిమాన్షి దేవా తో అన్నది..... "మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు"...అలా అడగడం లో ఏదో దిగులు.

దేవా హిమ వైపు చూయి చెప్పడు" రెండు రోజుల లో వచ్చేస్తాను".

ఇంతలో హిమన్షి భావన తో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పింది తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం కుదిరినట్టే ఉంది అన్నది. వెంటనే భావన అందరికీ చెప్పింది తొందరలోనే హిమ కు పెళ్లి అని.

దేవా హిమని అడిగాడు "ఆ అబ్బాయి ఏమి చేస్తుంటాడు ".

హిమ తల వంచుకుని చెప్పింది "బ్యాంకు లో" పనిచేస్తుంటాడు.

దేవా హిమనీ ఆట పట్టిస్తూ ఆ అబ్బాయి పేరు హిమ పేరు ముందు చేర్చగానే హిమ దేవా తో అన్నది " అలా చెప్పకు".

దేవా అడిగాడు వెంటనే..."ఏమి".

...."నాకు ఇష్టం లేదు" అన్నది హిమ.

......"ఓహ్ హిమ కు ఇష్టం లేదా?" అని దేవా అనుకున్నాడు.

కొద్ది రోజుల్లోనే ఇద్దరికీ అర్థమైంది .... తమ మధ్య ఒక సామాజిక, భావోద్వేగ మానసిక బంధం ఏర్పడింది అని .

దేవా హిమ వచ్చేది చూసి చూడనట్లు చూస్తూ హిమ ని దాటి వెళ్ళగానే హిమ దేవా ని వెనక్కి తిరిగి చూడగానే దేవా కూడా హిమ ని వెనక్కి తిరిగి చూస్తూ .... ఇద్దరూ ఒక క్షణం ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు....

ఒక రోజు భావన హిమని అడిగింది...""నీ పెళ్లి ఎప్పుడు".

హిమ అన్నది "కాన్సల్ అయ్యింది. మా నాన్నకు ఇష్టం లేదు".

భావన వైపు చూస్తూ చెప్పింది "ఈ విషయం దేవా కు చెప్ప వద్దు".

భావన సరేనని తల ఊపింది. అలా ఒకసారి చెప్పొద్దు అని భావనను అడగడం అన్నది చివరకు హిమ దేవాలను ఒకరికి ఒకరిని శాశ్వతంగా దూరం చేస్తుంది అని ఆ క్షణం హిమ ఊహించలేదు ...

హిమ ఆలోచిస్తున్నది "నా పెళ్లి రద్దు అయ్యింది. మరి దేవా కి చిన్నప్పుడే పెళ్లి కుదిరింది అంటున్నాడు. మరి మేమిద్దరమూ ప్రేమలో ఉన్నాము. ఇప్పుడు దేవా తనతో అనుభందం పెంచుకుంటే , అతను తన చిన్నతనం లోనే ఇంకొకరికి వాగ్దానం చేయబడినప్పుడు, తాను ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్లు కదా" .

అంతలో తమ మధ్య బంధం మరింత పెరిగింది గమనించి హిమ అతనితో ఇక మాట్లాడకూడదు అనుకున్నది.

తమ మధ్య మాటలు ఆగిపోవడం తో దేవా ప్రతి క్షణం హిమ ని నిశ్శబ్దంగా గమనించడం మొదలు పెట్టాడు.

ఒక రోజు దేవా హిమ కోపంగా ఉండేది చూసి "హిమ మాట్లాడు నాతో" అనగానే హిమా అడ్డంగా తల ఊపింది నీతో మాట్లాడను అని.

హిమ దేవా తో మాట్లాడటం మానేసింది...హిమ నాతో మాట్లాడు అన్నా...నో అన్నట్లు తను తల ఊపింది...

ఒక రోజు రెండు రోజులు చూసాడు దేవా ...హిమ నాతో మాట్లాడక పోతే ప్రాణం పోయినట్టు ఉంది...

ఆకలి లేదు...ఏ పని చేయ బుద్ది కాలేదు....అనుకున్నాడు.

దేవా ఆలోచించి ఎలాగైనా హిమ ని దక్కించుకోవాలని, ఏమి చెయ్యాలో తెలియక ఒకరోజు హిమ పరిశోధన పని మీద ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఉద్రేకంగా హిమ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.

హిమ ఏదో ఆలోచిస్తూ డోర్ హేండిల్ పట్టుకుని పక్కనే ఉన్న భార్గవి తో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవా రావడం చూసింది. దేవా వచ్చి రాగానే డోర్ హేండిల్ మీద ఉన్న హిమ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. హిమ వెంటనే ఎంతో అలజడి కి గురి అయ్యింది. అటు చూస్తే అక్కడ అటెండర్ వినాయక రావు వీరిని గమనిస్తూ ఉన్నాడు. గట్టిగా అరిస్తే తనకు ఇంకా దేవా కు కూడా అవమానం కదా అని చాలా అలజడితో అనుకున్నది. మొదటి సారి దేవ తన చెయ్యి పట్టుకున్నప్పుడు, అది ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎంతో మంది బస్సులో, ఆటో లలో మహిళల మీద చేతులు వేస్తూ ఉంటారు. మనసులో మనం వారిని వెదవలు అనుకుంటూ దూరం జరుగుతూ ఉంటాము. తేలికగా తీసుకుంటాము.అలా ఆ సంఘటన హిమ మనస్సులో నిలబడలేదు.

ఒక రోజు లాబ్ లో ఉన్నప్పుడు దేవా హిమ మాత్రమే ఉన్నారు....హిమ పూర్తిగా పరిశోధన లో మునిగి ఉంది...నీటిలో తన చెయ్యి ఉంచి పరిశోధన చేస్తూ ఉంది....

తన ఆలోచనలతో ఉన్న దేవా హిమ దగ్గరకు నెమ్మదిగా వెళ్ళా డు ...హిమ కు అత్యంత దగ్గరగా వచ్చి తన చేతిని చాలా బలం ఉపయోగించి ఉద్రేకంగా హిమ చేతిని పట్టుకున్నాడు. అది కూడా హిమ పరిశోధన ల్యాబ్ లో నీటిలో తన చెయ్యి ఉంచి పని చేసుకుంటూ ఉన్నప్పుడు.

వెంటనే హిమ కు ఏదో షాక్ తగిలింది.... హృదయం లోనూ వెనువెంటనే మస్తిష్కము లోనూ....

తను అలా అదిరిపోయి నిల్చొని ఉండిపోయింది...

దేవా హిమ వైపు చూస్తూ.... హిమ అత్యంత ఆకస్మికంగా కలిగిన కుదుపు వలన గడ్డ కట్టిన స్థితిలోనూ ....

నీటిలో ఇద్దరి చేతులు. అవి ఇద్దరి హృదయాలను పెనవెసేశాయి.

దేవా హిమ చేతిని గట్టిగా పట్టుకున్న తరువాత... కొద్ది నిమిషాల పాటు వదిలి పెట్ట లేదు.

హిమ కండ్లు కదపలేదు ...

శరీరాన్ని విదల్చలేదు...

అలాగే నిర్జాంతపోయి ...

ఒక బొమ్మ లా...
దేవా తనకు తానుగా దూరం జరిగాడు....
తనని అలా చూస్తూ నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ...

హిమ మీద సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది ....

లైంగిక వేదింపులు నిరోధించడానికి ఇప్పట్లో ఎన్నో చట్టాలు వచ్చాయి... ఒక వ్యక్తిని ముట్టుకోవాలి అంటే మనం వారి అనుమతి తీసుకోవాలి....

ఆ క్షణంలో అకస్మాత్తుగా జరిగిన ఆ దుందుడుకు చర్య వలన....హిమ కదలిక లేక బొమ్మలా నిలుచుండి పోవడం చూసి దేవ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక తరువాత వారి మధ్య మధ్య మాటలు లేవు...

ఆ తరువాత వారం ....దేవా హిమ ను తిరిగి మాట్లాడించాలని చూసాడు ...

హిమ దేవా ను కన్నెత్తి చూడలేదు...
దేవా గురించి ఎవరికీ చెప్పలేదు...
దేవా హిమ కు సారి చెప్పినా పలకలేదు...
హిమ దేవా ను తప్పించుకొని తిరగడం మొదలు పెట్టింది....

"ఏరా ఏమి చేసావు" అంటూ... సంతోష్

తల పగిలిపోతుంది నాకు...నన్ను ఏమి అడగకు...అని దేవా వాడిని వారించాడు

హిమ ను అలానే దేవా చూడడం మొదలు పెట్టాడు......

కానీ తను దేవా వైపు చూసేది కాదు...

అతను దుందుడుకు చర్య తో తన శరీరం మీద దాడి చేసాడు. ఎంత ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా అలా ఎదుటివారి అనుమతి లేకుండా మనల్ని ముట్టుకోవడం లైంగిక చర్య క్రిందకు వస్తుంది. హిమ పూర్తిగా మాటలు రాక శరీరం తిమ్మిరి అయ్యినట్లు అలజడితో భయపడి పోయింది. హిమ కు ఆ కొన్ని నిమిషాల సమయంలో జరిగిన దాడి అలా గుర్తుండిపోయింది ...

హిమ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక... చెబితే నమ్ముతారా? నమ్మరో? అని అనుకుంటూ "దేవ మంచి వాడే కానీ తప్పు చేశాడు ...నా చెయ్యి పట్టుకుని తప్పు చేశాడు" అని బాధపడింది.

దేవాకు తనకు మధ్య పెరిగిన అనుభందం హిమకు సమస్య అయిపొయింది.....

హిమ కు, ఆ రోజుల్లో ప్రతి క్షణం అతని ఆలోచనే. చాలా రోజులు నిద్ర లేదు. చాలా బాధ కలిగింది. దేవా తన చెయ్యి పట్టుకున్నప్పుడు భయంతో తన ఆత్మ , శరీరం రెండూ వేరు వేరు అయ్యాయి. తన శరీరం పూర్తిగా ఆ క్షణంలో గడ్డ కట్టింది. అంతేకాక హిమ కు ఎందుకో గుండెల్లో చాలా నొప్పి కలిగింది.

హిమ ఆలోచిస్తూ అనుకున్నది "నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఫ్రీజ్ అయ్యాను. అయ్యో ఏమి చేసేది నేను. నాలో భావోద్వేగాలు పెరిగాయి. కోరికలు పెరిగాయి. అతను నన్ను ఉత్తేజితం చేశాడు. అతను నా అనుమతి లేకుండా నా చెయ్యి స్పర్శించడం వలన నాలో శృంగార భావనలు తలెత్తాయి" అంటూ బాధపడ సాగింది.

ఆ క్షణమే హిమ కు అనిపించింది "ఇద్దరికీ పెళ్లి అయిపోయినట్టు" .

కానీ హిమ లో భయం మొదలయ్యింది...ఇదేంటి ఇలా అయ్యింది...అతను ఎవరు....నాకు అతని మీద ఇంత ప్రేమ ఎందుకు....అన్ని ప్రశ్నలే తన లో...

దేవా కు పెళ్లి కుదిరింది...నాకు పెళ్లి కుదిరింది అని దేవా కు తెలుసు...అలాంటప్పుడు దేవా అందుకు తన చెయ్యి పట్టుకుని తనని ప్రేరేపించాడో హిమ కు అర్థం కాలేదు....

దేవా తన జీవితంతో ఆడు కోవాలని అనుకుంటున్నాడా అని హిమ చాలా దుఃఖపడాసాగింది.

హిమ బాధ పడటం చూసి దేవా తన దగ్గరగా వచ్చి మాట్లాడించాలని చూసాడు. కానీ భయంతో హిమ అతనికి చాలా దూరం జరిగింది.

హిమ దేవా ఎక్కడ తనని స్పర్శిస్తాడో నని భయపడి దేవా తన దగ్గరకు రాకుండా తిట్టడం మొదలు పెట్టింది.

దేవా అన్నాడు భార్గవి తో "హిమ వెళ్లి పోయాక, ఇక్కడ సుజి ని కూర్చోబెడతాను"

వెంటనే హిమ దేవా తో అన్నది "ఇక పది రోజుల లో నేను వెళ్లి పోతాను. నీవు సుజి ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టు".

దేవా స్నేహితుడు కరణ్ హిమ దగ్గరకు వచ్చి "హిమ నీ కళాశాల చదువు ఎప్పుడు పూర్తి అయ్యింది...అని ఆరా తీస్తూ ...హిమ వయస్సు తెలుసుకుని...ఏమి చిన్న పిల్ల కాదు" అంటూ దేవా వైపు చూసారు.

దేవా వర్షం పడుతుండడం చూసి హిమ తో "గొడుగు తీసుకుని వెళ్లి భావనను లైబ్రరీ నుండి తీసుకుని రా హిమ. నేను చెప్పగా నీవు వచ్చినట్లు భావన తో చెప్పవద్దు. నీకుగా నువ్వు వచ్చినట్లు చెప్పు "అన్నాడు.

హిమ సరేనని భావనని తీసుకుని రాగా ...తిరిగి వచ్చిన వెంటనే "హిమ నువ్వే వచ్చావా నా కోసం " అనగానే హిమ వెంటనే "లేదు దేవా పంపితే వచ్చాను' అంటూ దేవా వైపు చూసినప్పుడు దేవా ఏమనాలో తెలియక హిమ వైపు చూసి... మనస్సులో అనుకున్నాడు "హిమ కు నిజం చెప్పడం మా త్రమే వచ్చు".

హిమ అనుకున్నది ..."భావన మెప్పుదల కోసం నేను ఎందుకు అపద్దం చెప్పాలి".

తరువాత దేవా తనని తన భయాన్ని చూసి నప్పుడు అతనికి హిమ అంటే చాలా ముద్దు వచ్చింది. దేవా తనని చూస్తూ ఉండిపోయాడు . దేవా కు తనని ఎంత చూసినా ఇంకా చూడాలనిపించింది. హిమ ఏ పని మీద ఉన్నా దేవా అక్కడకు వచ్చి తనని చూడటం మొదలు పెట్టాడు.

దేవా ఏదో పని చేస్తూ పనిలో పనిగా హిమ చేతులు తాకాలని లేదా తన పాదాలు ముట్టుకోవాలని చూస్తూ ఉండేవాడు.

హిమ పరిశోధన శాల ని వదిలి వెళ్ళటప్పుడు ...హిమ దేవా ని వదిలి వేళ్ళ లేక పోయింది.

" దేవా ఏమో తనకి చిన్నప్పుడే పెళ్లి కుదిరింది అంటున్నాడు. మరి దేవా కు తెలియని విషయం ఏమిటంటే తన పెళ్లి ఆగిపోయింది. మరి దేవా కు సుజి తో పెళ్లి కుదిరిన కూడా తన చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో" ఎంత ఆలోచించిన హిమ కు అర్థం కాలేదు.

హిమ వాష్ రూమ్ కి వెళ్లి బోరున ఏడ్చి బయటకు రాగానే, అప్పటికే హిమని వెతుక్కుంటూ అక్కడకు వచ్చిన దేవా నవ్వుతూ...హిమ వైపు చూసి అన్నాడు "ఏమి హిమ .......వదిలి వెళ్ళ లేక పోతున్నావా".

హిమ బాధగా దేవా వైపు చూస్తుంటే దేవా వేరొక వైపు చూస్తూ...దేవా హిమ చెయ్యి అలా పట్టుకోవడంలో వారి మధ్య ఏదో తెలియని బంధం ఏర్పడింది.

కొద్ది రోజుల లోనే హిమ కు అర్ధం అయ్యింది... ఆమె పూర్తిగా అతని ప్రేమలో పడిపోయింది . చాలా ఆలోచించి హిమ తన బాధ్యత గా ఒక ముందడుగు వేసింది.

తరువాత ఒక రోజు పరిశోధనశాల కి వెళ్లి దేవా... ఎదురుగా కూర్చున్నది.

దేవా ఆ రోజు హిమ ని "నీ పెళ్లి ఎప్పుడు" అని అడిగాడు ...

వెంటనే దేవా కళ్ళల్లోకి చూస్తూ హిమ అన్నది "కాన్సల్ ".

తన కళ్ళలో నీ సంగతి ఏమిటి అని అడిగినట్లు అనిపించింది. ఆ క్షణం దేవా కళ్ళల్లో ఏదో కలవరపాటు.

పక్కనే ఉన్న భావన ని చూస్తూ "చెప్పలేదా" అన్నది. భావన నవ్వుతూ చెప్పలేదు అన్నట్లు తల ఊపింది.

హిమాన్షి అతనికి తన మనస్సు తెలపాలని అనుకున్నది.

ఎలా చెప్పాలో తెలియట్లేదు అని సతమతమైంది తన మనస్సు . చివరికి నెహ్రు వీధిలోని "గిఫ్ట్ ఫర్ ఎవిరిడే" షాప్ కి వెళ్లి వెతికింది. ఒక గ్రీటింగ్ కార్డు నచ్చి వెంటనే కొన్నది.

హిమ దేవా కు గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ లో పంపింది.

ఆ రోజు న్యూ ఇయర్ ... హిమ

ల్యాబ్ కి వెళ్లి అడిగింది "గ్రీటింగ్ వచ్చిందా" అని.

దేవ "లేదు" అని తల ఊపాడు.

దేవా ....."గ్రీటింగ్ వచ్చాక ఎవరికీ చూపకు" అన్నది . దేవా చిరునవ్వుతో అలాగే అంటూ తల ఊపాడు.

హిమ గ్రీటింగ్ లో రాసింది స్పష్టంగా "I LOVE YOU".

మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి అడిగింది "నీకు కార్డ్ చేరిందా" అని...."చేరింది" అని నవ్వుతూ తల ఊపి తల దించుకున్నాడు.

వెంటనే "నీకు నచ్చిందా" అడిగింది హిమన్షి దేవా ని . దేవా నవ్వుతూ నచ్చింది అంటూ తల దించుకున్నాడు.

అతను తల దించు కోవడం తోనే ఎందుకో అర్థమయ్యింది హిమ కు "అతను వెనకడుగు వేస్తున్నాడు అని".

దేవా దగ్గర నుండి ఏ జవాబు రాలేదు హిమ కు.

"తన దర్మం తాను నెరవేర్చాను" అని హిమ అనుకున్నది .

ఇంటికి ఒకటే గా ఫోన్ కాల్స్ రావడం మొదలు పెట్టాయి. అమ్మ హిమ వైపు చూసి "ఆ కాల్స్ ఎవరి కోసం" అన్నది సీరియస్ గా...అమ్మ గొంతులో "నీ కోసం కాదు కదా" అన్న అర్థం ధ్వనించింది.

హిమ ఈ వేధింపులు తట్టుకోలేక దగ్గర లోని పాఠశాలలో పంతులమ్మ గా చేరింది.

చిన్న చిన్న పిల్లలతో గడుపుతూ ఉంటే హిమ కు కాలమే తెలియలేదు.

ఇంత వరకు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకునే వాళ్ళము నేను దేవా ఇద్దరం.

ఇప్పుడు ఇద్దరికీ మాటలు రానట్లు మౌన ముద్ర వేసాము.

కానీ దేవా ని వదిలి పెట్టాలి అని అనిపించలేదు. హిమ కు ప్రతి క్షణం దేవా ఆలోచనలే.

హిమ దేవా ని కలవాలి అనుకున్నది. ఆ రోజు భావన ను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు అక్కడ దేవా కనిపించాడు.

హిమ అతనిని కలసినప్పుడు దేవ అన్నాడు "నువ్వు చిన్న పిల్లవి నీకు ఏమి తెలియదు". అతను అన్న మాటలకు హిమ తల దించుకున్నది .

ఆ క్షణం అర్థం కాలేదు...చిన్న పిల్ల అంటే ఏమిటి. అంత వరకు తాను చిన్న పిల్ల నే . కానీ ఆతను తన చెయ్యి పట్టుకోగానే పెద్ద దాన్ని అయ్యాను కదా అనుకున్నది .

అయినా ఆ స్నేహాన్ని వదలలేనని దేవా ని కలవడానికి అధ్యయన కేంద్రానికి వెళ్ళింది.

హిమ దేవా కి కబుర్లు చెబుతూ పాఠశాల లోని పిల్ల గురించి చెప్పడం మొదలుపెట్టింది. చిన్న చిన్న పిల్లలు వారి అల్లరి ఎంతో మైమరిపిస్తూ ఉండగా అతన్ని కలిసినప్పుడు హిమ ఆ పిల్లల గురించి చేప్పేది.

దేవా వైపు చూస్తూ హిమ మురిసిపోతూ "పండు అనే బాబు బుజ్జి అనే పాపా ఎంత ముద్దుగా ఉంటారో " అంటూ ఉంటె దేవా మనసుకు అర్థమై నవ్వుకుంటూ ఉండేవాడు.

"పండు పెన్సిల్ బుజ్జి లాక్కొని పరుగెత్తుతుండే బుజ్జి ని పండు పట్టుకుని తన పెన్సిల్ లాక్కొని " "బుజ్జి నీ మీద మాం కు చెబుతా" అని బెదిరిస్తూ నా దగ్గరకు వచ్చి "చూడు మాం బుజ్జి నన్ను అల్లరి పెడుతోంది" అని అన్నాడు.

దేవా "వారిద్దరి గొడవలు అన్ని కాసేపటి వరకే" ...

"అంతలోనే బుజ్జి పక్కన ఎవరైనా హూర్చొంటే పండు వాళ్ళని బెదిరించి బుజ్జి పక్కన కూర్చునేవాడు"

పండు బుజ్జి ఇద్దరు ఒకరి పక్కన ఇంకొకరు ఎప్పుడు వదిలి పెట్టకుండా కూర్చుంటారో చెప్తుంటే దేవా నవ్వుతూ ఉన్నాడు.

హిమ అనుకొనింది "దేవా కి అర్థం కాలేదా లేదా నటిస్తున్నాడో తెలియట్లేదు".

దేవా భావన గోపాల్ ఆటో ఎక్కారు ఇంటికి వెళ్ళడానికి... హిమ నేను వస్తాను అంటే...భవన వద్దు అన్నప్పుడు గోపాల్ రానీ అంటున్నాడు కానీ...దేవా తలా వంచుకుని కూర్చొనుండడం హిమ చూసింది. హిమ అనుకున్నది దేవా తనకు కనీసం మాట సాయం కూడా రావట్లేదు అనుకున్నది.

తర్వాత ఆలోచించింది హిమ.... తాను ఎందుకు ఇంకో మెట్టు దిగకూడదు అని. ప్రేమ కాదు పెళ్లి వరకు వెళ్ళాలి మనం అని చెప్పాలని అనిపించింది.

అలా తలచి ఒక రోజు మా పరిశోధక అధ్యయన కేంద్రానికి వెళ్ళినప్పుడు .. ఆ రోజు దేవా కనిపించలేదు కానీ అతను సోదరి లా భావించే స్నేహితురాలు భావన కలిసింది. హిమ తనను చూస్తూ ప్రేమ పెళ్లి మంచిదా లేక పెద్దలు కుదిర్చింది మంచిదా అని అడిగింది.

ఆమె హిమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది "దేవా కూడా పొద్దున్నే ఇదే మాట అడిగాడు. నేను పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిది అని చెప్పాను".

నాకు భావన మనస్సు స్పష్టంగా అర్థం అవుతున్నది. మీరు ఇద్దరు ఈ జన్మ లో కలవలేరు అని నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పినట్లు అనిపించింది. తనలోని అసూయ నా కంటికి నిలువుగా కనిపించింది. నా మనస్సు దేవా కోసం పరితపించింది. నేను నిశ్శబ్దంగా దేవా ని తిరిగి కలవలేక వెనుతిరి గాను. ఇప్పటికిప్పుడు వసతి గృహానికి వెళ్లి దేవా తో మాట్లాడవచ్చు కానీ దేవా బయట పడలేదు. దేవా కోసం తన వసతి గృహానికి వెళితే బరితెగించింది అంటారేమోనని బయపడింది.

ఎవ్వరికి చెప్పాలి ఇక ...నేను ఇన్ని సార్లు దేవ ని కలుస్తున్న కానీ దేవ నా కోసం ఒక్కసారి కూడా రాలేదు. గోపాల్ కి చెబుదామా...అతని ఫోన్ నెంబర్ తేలియాడే అనుకున్నది. అయినా దేవా దగ్గ నుండి ఎటువంటి జవాబు రన్నప్పుడు ఎలా బలవంతం చేసేది అని ఆలోచించింది.

దేవా చొక్కా పట్టుకుని "నన్ను ప్రేమించు" అంటే ప్రేమ పుడుతుందా లేక "నన్ను పెళ్లాడు" అంటే ఆ పెళ్లి నిలబడుతుందా అని ఆలోచించింది.

అయినా దేవా లేక బతకలేను అనుకున్నది.

తరువాత ఒక రోజు మళ్ళీ వెళ్లి హిమ దేవా ని కలిసింది...అతను తన పెళ్ళి పత్రికలు పంచుతున్నాడు.

హిమ చొరవగా ఆ పెళ్లి పత్రిక అందుకుని చూసినప్పుడు ....ఆ పెళ్ళి పత్రిక లో చూడగానే దేవా కాబోయే భార్య పేరు ముందు హిమ పేరు. వెంటనే అతనిని అడిగింది "ఏంటిది హిమసుజీ ". అతను మారు పలకకుండా ఒక కార్డ్ ఐదు రూపాయలు పడింది అన్నాడు తల వంచుకుని. హిమకు వెంటనే అనిపించింది "ఏంటిది దేవా డబ్బు తో ప్రేమ ని కొంటున్నాడా....?"

హిమ స్కూల్ నుండి అదే పట్నం లో ఉన్న ఆటవిక పరిశోధన శాల లో ఉద్యోగంలో చేరింది. హిమ దేవా ను కలవడం మానుకోలేదు. దేవా హిమ మనస్సులో భాగం అయిపోయాడు.

దేవా కలవడానికి వెళ్ళినప్పుడు అతను అన్నాడు "నేను వస్తాను పరిశోధన శాల లో నాకు పని ఉంది" అన్నప్పుడు హిమ వెంటనే సరే నంటూ తల వంచుకున్నది.

ఇంకొకరోజు వెళ్లినప్పుడు దేవ తనతో అన్నాడు...."నేను మీ రీసర్చ్ కేంద్రానికి వస్తాను.... వర్క్ చేసుకోవాలి" . వెంటన్ హిమ తల వంచుకొని సరేనని తల ఊపింది. తన మనసు బాధ తో నిండిపోయింది. నన్ను ఎందుకు ప్రేరేపించాలి....ఇప్పుడు నన్ను వదిలేస్తున్నాడు అని అనిపించింది.

తర్వాత దేవా.... హిమ ఇంటికి పెళ్లి కార్డు తెచ్చిచ్చాడు. హిమ అతన్ని పరిశీలనగా చూసింది. అతని కళ్ళు తనను చూడగానే మెరుస్తున్నాయి. తన కళ్ళు విస్తరించినట్లు పెద్దగా...హిమ కు అర్థం అవుతున్నది అతనికి తన మీద ఉన్న ప్రేమ.

హిమ కు ఒక్క క్షణం అతని కాళ్ళు పట్టుకుందామా అని అనిపించింది. నన్ను వదిలి వేయకు అని అడుక్కుందామా అని అనిపించింది. కిటికీలు అన్ని వేసేసాను. తలుపులు మూశాను. కానీ మరుక్షణం నాకు అనిపించింది పెళ్ళి అన్నది బాధ్యత. అలా తను చేసిన పనికి బాధ్యత తీసుకోని వాడిని పెళ్లి ఎలా చేసుకునేది అనిపించింది. ఆ రోజు దేవా తన చెయ్యి పట్టుకున్నప్పుడు ఎదో గుండెల్లో బాధ కలిగింది హిమకు...ఆ బాధ పోనేలేదు....పెళ్లి జరిగినా బాధను భరించాల్సిందే ...జరక్కపోయినా బాధ ను భరించాల్సిందే...అనుకుని దేవా వైపు దిగులుగా చోస్తూ ఏమి చెప్పాలో తెలియంది మూగగా చూస్తూ ఉండిపోయింది.

ప్రేమ పెళ్లి అంటేనే ఎంతో మంది ని ఒప్పించాలి. అతని ఇంట్లో నచ్చచెప్పాలి. మా ఇంట్లో వాళ్ళని కనికరించమని అడగాలి. ఇక నేను అతనిని బిచ్చం అడుక్కోవాలా నన్ను పెళ్లి చేసుకో అని అనిపించింది. నాకు కొంచమైనా సిగ్గు ఉందా లేక పూర్తిగా సిగ్గు వదిలేసానా అని దుఃఖం వచ్చింది. అయినా అతనికి ఏమి కుటుంబ బాధ్యతలు ఉన్నాయో. నిజంగా ప్రేమ అన్నది అతని మీద తనకు ఉంటె అతనికి అడ్డుపడకూడదు అని తలచింది. వెంటనే కిటికీలు తెరిచాను. మూసిన తలుపులు తెరవగానే చల్లటి గాలి ఇంటి లోనికి చొరబడింది.

హిమ నవ్వుతూ వంట గది లోనికి వెళ్లి పళ్ళ రసం తెచ్చి దేవా కు ఇచ్చింది. వెళ్ళేటప్పుడు అతను వైపు చూసి "తప్పకుండా పెళ్లి కి రావాలి" అన్నప్పుడు "నేను పెళ్లికి రాలేను' అని హిమ అన్నది. వెంటనే దేవా " ఏమి చెప్పు ఏమి చెప్పు ఎందుకు రాలేవు " అన్నప్పుడు "మా ఇంట్లో పంపరు" అన్నది హిమ వెంటనే. దేవా హిమ వైపు చూసి "మళ్ళీ మీ ఇంటికి ఎప్పటికీ రాను" అంటే వెంటనే హిమ "రావద్దు ఇక ఎప్పటికీ" అన్నది.

హిమ బహుమతిగా దేవా పెళ్లి కి ఒక గడియారం కొని భావన దగ్గర ఇచ్చింది. ఆ క్షణం కూడా భావన మొహం లో నవ్వు....ఎగతాళి నవ్వు.

తర్వాత సుమారు మూడు సంవత్సరాలు హిమ కు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరించింది.. ఎందుకంటే అతను తనను ముట్టుకున్నది హిమ కు అనుక్షణం గుర్తుకు వచ్చింది. వేరొకరిని ఎలా పెళ్లి చేసుకునేది అనిపించింది. నన్ను పట్టుకున్న వాడిని ఎలా వదిలేది అనిపించింది. తమ మధ్య ఒక తెలియని బంధం ఏర్పడింది. అంతేకాకుండా అతను చేసిన పనికి అతను బాధ్యత వహించలేదు. కనీసం పశ్చాత్తాపం చెందలేదు. తరువాత కూడా అతను చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

దేవ తన పెళ్లి అయినా పదమూడవ రోజు హిమ పనిచేస్తున్న పరిశోధన ఆలయానికి వచ్చాడు.

హిమ తన వైపు చూసి "పెళ్లి పార్టీ" అనగానే ఇస్తాను అని ...హోటల్ కి తీసుకుని వెళ్లి సమోసా ఇంకా టీ ఆర్డర్ పెట్టి తన కళ్ళల్లోకి చూడగానే తల పక్కకు తిప్పుకుంది.

దేవా ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నుండి అక్కడే హిమ ఉన్న పరిశోధన ఆలయం లో ఉండిపోయాడు. అక్కడే పరిశోధన మొదలు పెట్టాడు.

దేవా భోజనం తెచ్చి తినమని అన్నప్పుడు హిమ నాకు వద్దు అంటే...దేవా అందరి ముందు అన్నాడు"నువ్వు తినకపోతే నేను తినను".

ఒక రోజు దేవా అన్నాడు..." నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను సుజి కి. సుజి ఏమి చెప్తుందో నాకు చెప్పు "...అనగానే హిమ నిశ్శబదంగా తలా ఊపింది.

ఆ మరుసటి రోజు...సుజీ ఫోన్ చేసింది హిమ కు ...."నాకు అబార్షన్ అయ్యింది. దేవా కు చెప్పండి " అన్నది. ఆ మాటలు హిమ దేవా కు చెప్పింది.

హిమ ఆ క్షణం లో కుళ్ళి కుళ్ళి ఏడ్చింది లోలోపలే. ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను దేవా కు.

హిమ బాధ పడి పడి దేవా కు తల్లి అయ్యింది. అంటే అంత ప్రేమ...భరించింది. మనస్సు ఖాళీ అయ్యి పోయింది.

హిమ లోపలి పోగానే...భావన తన ఒళ్ళో పడుకుని ఏడ్చింది..."దేవా జీవితం నాశనం అయ్యింది" అన్నది.

దేవా లోపలి రాగానే హిమ దేవా ని అడిగింది...."ఏమి దేవ మీ అక్క ఏడుస్తుంది" అన్నది. "నీ భార్య ఎలా ఉంటుంది" అన్నది...

దేవా హిమ వైపు చూస్తూ "నీలాగా ఉంటుంది" అన్నాడు. భావన చిన్నగా నవ్వుతోంది.

తరువాత ఒక రోజు భావన తన అన్న పెళ్ళికి హిమ ను పిలిచింది....హిమ పెళ్ళికి వెళ్ళింది...పట్టు చీర కట్టుకుని...జుంకాలు పెట్టుకుని...నగలు వేసుకుని......

భావన హిమ ను చూడగానే "ఇటు రా" అంటూ ఒక గుంపులో కూర్చోబెట్టింది....

దేవా భార్య అంటూ ఒక పొట్టి అమ్మాయి ని పరిచయం చేసింది. దేవా చెల్లెలు, తమ్ముడు అంటూ పరిచయం చేసింది....

అటు దూరంగా దేవా... హిమ దేవా వైపు చూడగానే ... దేవా హిమ కళ్ళలోకి చూస్తూ.... దేవా హిమ కళ్ళు కలుసుకున్నాయి... హిమ కళ్ళు దేవా ని "ఇది ఏంటి" అని అడిగినట్లు దేవా కు అనిపించింది.....

హిమ బెంగుళూరు కు పరిశోధన కోసం వెళ్ళినప్పుడు దేవకు ఫోన్ చేసి చెప్పింది..."ఇక్కడ చాలా చలిగా ఉంది" వెంటనే దేవా అన్నాడు "నాక్కూడా".

హిమ తానూ ఇంటి ముందు నిల్చొని రాత్రి బాగా చీకటిలో బయటకు చూస్తూ ఉంది....ఒక మోటారు బండి ఇంటి ముందుకు వచ్చినట్లే వచ్చి సర్రుమని తిరిగి వెనకకు వెళ్లి పోయింది. హిమ బాగా చొయింది అది దేవానే....

మరుసటి రోజు దేవా ని కలవడానికి వెళ్లి దేవా ని అడిగింది...రాత్రి చీకటిలో నువ్వు మా ఇంటి కి వచ్చి నన్ను చూసి వెనకకు వెళ్లవు కదా అన్నది...దేవా వెంటనే నేను కాదు అన్నాడు...హిమ లేదు నిన్ను నేను చూసాను అని దిగులు తో అంటూ ఉంటె ..భావన కాదంటున్నారు కదా. ఇంకా ఎందుకు అడుగుతున్నావు అన్నది, దేవా భావన తో నువ్వు ఊరుకో అని ఇప్పటికే నా కోసం ముగ్గురు కొట్టుకుంటాన్నారు అన్నాడు. అప్పుడు హిమ వెంటనే ఎవరా ముగ్గురు అన్నది. భావన నవ్వుతూ ఉంది.

దేవా భావన ఇంటి దగ్గర లోనే ఒక ఇంట్లో తన కొత్త కాపురం పెట్టాడని హిమ కు తెలిసింది.

హిమ భావన ఇంటి కి వెళ్లి దేవా ను కలిసి అతని చెల్లెలి కాలేజీ అడ్మిషన్ కోసం వివరాలు చెప్పింది.

ఆ రోజు దేవా ను కలిసి నప్పుడు దేవా చూపు... అదో తియ్యదనం

తరువాత హిమ తనకు తానుగా అక్కడ జాబ్ మానేసి విశ్వవిద్యాలయం లో బోధకురాలి గా వెళ్ళిపోయింది.

దేవా కు ఫోన్ చేసి చెప్పింది..."నేను ఇక్కడ జాబ్ మానేసాను. నువ్వు వర్క్ చేసుకో" అన్నది..... దేవా గొంతులో ఏదో కలవరం.

అంతలో దేవా తండ్రి చనిపోయాడని తెలిసింది. హిమ వెళ్లి దేవా ను కలిసి తన సానుభూతి తెలిపింది.

దేవా కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తే....దేవా తన భార్య పేరు తన పేరు కలిసి వచ్చినట్లు దేవసుజి అని నాకు గ్రీటింగ్ పంపాడు. ఆ రోజు హిమ కు దుఃఖం ఆగలేదు. దేవా తనను ఎందుకు బాధ పెడ్తున్నాడో హిమ కు అర్థం కాలేదు.

దేవా తలని పట్టుకుని బాధతో తన స్నేహితుడు గోపాల్ తో అన్నాడు.."హిమ ఇంకా నన్ను వదిలి పెట్టడం లేదు. నాకు పెళ్ళి అయ్యింది. సంసారం ఉంది అని తెలిసి కూడా నా చుట్టూ ఇంకా తిరుగుతున్నది".

ఆ మధ్య హిమ ని పరిశోధన శాల లో చూసి వెంటనే దేవా ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు.

అతని లోని ఫీలింగ్స్ చూసి వెంటనే భావన ను అడిగింది హిమ "ఇప్పట్లో రాడా దేవా". భావన ఏమో తెలియదు అన్నట్లు చూసింది.

వెంటనే హిమ దేవా కు ఫోన్ చేసి అన్నది ...."రా...నీతో మాట్లాడాలి".

దేవా వెంటనే "నేను రాను" అంటే హిమ వెంటనే అన్నది "ఎందుకు రావు? రా"అన్నది.

దేవా "సరే ఎక్కడకు వచ్చేది" అంటే...హిమ అన్నది " బట్టర్ ఫ్లై పార్క్ కి రా " అన్నది.

అక్కడకు దేవా వెళ్ళగానే హిమ బోరున ఏడుస్తూ ఉంది. చుట్టు చాలా మంది కూర్చుని ఐస్ క్రీం తింటున్నారు.

దేవా తనకు ఎదురుగా కూర్చొని "ఏమి ఏడుస్తున్నావు ..ఎవరినైనా ప్రేమించావా" అని అడిగాడు...

హిమ "ఔను అన్నట్లు తల వూపింది".

దేవా "ఎవ్వరిని చెప్పు... ఎవ్వరిని చెప్పు" అని అడిగాడు ...

హిమ కండ్లల్లో నీళ్లతో .... వెంటనే దేవా చెయ్యి పట్టుకుంది .........

దేవా " నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పి చెయ్యి విడిపించుకున్నాడు"...

వెంటనే దేవా దురుసుగా అన్నాడు... "నువ్వు నాకు ఏమిచ్చావు".."ఆ గ్రీటింగ్ కార్డ్ ఒక్కటే కదా...అది మీ ఇంటికి పంపిస్తాను"...అనగానే హిమ కళ్ళలో విస్మయం...

దేవా వెంటనే... హిమ "ఇక రా పోదాం ఇక్కడ నుండి".... గోపాల్ నేను బయలు దేరుతున్నప్పుడే అడుగుతున్నాడు "ఎక్కడికి రా" అని అంటూ.... "కళ్లనీళ్లు తుడుచుకో" అంటూ "ఈ చీర బాగుందే ...ఎవరు సెలెక్ట్ చేశారు" అన్నాడు మాట మారుస్తూ....హిమ నేనే అన్నట్లు తల ఊపింది.

కానీ ఆ క్షణమే హిమన్షి గుండె పగిలింది....దేవ నవ్వు చూడగానే. కానీ దేవా మోహంలో ఎంతో ఆనందం...

హిమ కు మనుషుల మీద నమ్మకం పోయింది. ఆఖరకు తల్లి తండ్రి మీద కూడా.

హిమ తరువాత దేవా ని కలవడం మానేసింది. ...కానీ దేవా తన స్నేహితులతో కబురు పంపాడు...వెళ్లి ఏమి అని అడగగానే....ఏమి రావడం మానేసావు అన్నాడు..."ఇక రాను" అన్నది వెంటనే...

దేవా తరువాత హిమ సాయంత్రము చదువుకుంటున్న ట్యుటోరియల్ కి వచ్చాడు....

దిగులుతో హిమ తన పొడవాటి జుట్టు కత్తిరించుకున్నది..... హిమ దేవా వైపు చూసి "నా హెయిర్ చూడు" అనగానే."అలాగే మైంటైన్ చెయ్యి" అన్నాడు దేవా.....

దేవా రీసర్చ్ అయిపోయింది...ఒక రోజు వెళ్లి హిమ కలిస్తే "నేను ఇక వెళ్ళి పోతున్నాను అనగానే" నాలో ఏదో దిగులు...సరే అని తల ఊపి వచ్చేసాను.

ఆ రోజు హిమాన్షి దేవా కి ఫోన్ చేసింది. ఎవరో వ్యక్తులు ఫోన్ తీశారు. దేవా కావాలి అనగానే ఎవరని చెప్పమంటారు అని అడిగారు... సుజి అని చెప్పండి అనింది. దేవా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమి అన్నాడు.

నేను సుజి ని కాను హేమని అని " నన్ను వదిలి వెళతావా" అని అడిగింది.

వెంటనే దేవా అన్నాడు "ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాము... పోయేటప్పుడు ఒంటరిగా పోతాము".

వెంటనే "సరేనని" ఫోన్ పెట్టేసింది హిమ .

దేవా ఒక రోజు ..."పది మంది తో తిరిగి ఒక్కరిని ఎంచుకుంటుంది"...అన్నప్పుడు హిమ కదిలి పోయింది ఆ మాటలకు..

ఆ రోజు రాత్రి ఇంటికి కాల్ వచ్చింది..ఎవరో లో గొంతుక తో అంటున్నారు..."143 "...నేను వెంటనే అన్నాను దుఃఖం తో "రాస్కెల్ ఇడియట్ ఎవరినన్నా అక్కడ చూసుకో"..

వెంటనే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న కూడా బాధపడుతూ వచ్చి ఫోన్ తీసుకుని .."ఎవర్రా అది" అన్నారు....

ఒక రోజు దేవ స్నేహితుడు గోపాల్ హిమ ను విశ్వవిద్యాలయం లో కలిసి టీ కి వెళదాము రమ్మని పిలిచాడు.

అప్పుడు చెప్పాడు హిమ తో "దేవ కి ప్రాబ్లమ్స్".

వెంటనే హిమ అడిగింది ...ఏమి ప్రాబ్లమ్స్..."ఫ్యామిలీ ఉంది... కొడుకు పుట్టాడు" అని చెప్పాడు.

అప్పుడు ఆఆలోచించింది ...దేవ నా స్నేహితుడు. నేను అతను బాగుండాలి అని ఆలోచించాలి కానీ అతని జీవితాన్ని నాశనం చేయకూడదు. చిన్న పిల్లాడు అని తలచి, బాల్య చేష్టలు గా భావించి తనని క్షమించుకుంటూ అతన్ని కూడా క్షమించింది.

దేవా ని కలిసి చెప్పింది "మనకు పెళ్లి అవసరం లేదు. పెళ్లి అన్నది బాధ్యత. నాకు నీ బార్య నా కలలో కనిపించింది. ఆమె నిండు గర్భంతో కడుపులో ఒక బిడ్డ, చేతిలో ఒక బిడ్డ, చంక లో ఇంకో బిడ్డ తో వీధులలో బిచ్చం అడుక్కుంటున్నట్లు కల వచ్చింది. నేను ఆ పాపం చేయలేను. నీవు బాగుండాలి. నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగాలి. పది మందికి సహాయ పడాలి. నేను నిన్ను తల్చుకుంటూ బతికేయగలను" అని హిమ అన్నది.

"నేను నిన్ను ప్రేమించాను. ఆ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే నీకు చిన్నప్పుడే పెళ్లి కుదిరింది అన్నావు కదా. కానీ నువ్వు నా చెయ్యి పెట్టుకున్నావు కాబట్టే నిన్ను ప్రేమించానని చెప్పాను. లేకపోతే చెప్పేదాన్ని కాదు అన్నది. నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు నా పెళ్ళికి రావద్దు. నిన్ను చూస్తూ నేను తట్టుకోలేను " అన్నది దేవా తో హిమ.

హిమ మాటలతో దేవా పూర్తిగా మాటలు రాక మూగ వాడు అయ్యాడు. దిగులు పడి వెళ్లి పోయాడు.

హిమ ఆ రోజు ఇంట్లో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే...."ఎవరినైనా తీసుకు రండి" అన్నది

అతను హిమ ను అడిగింది ఒకటే మాట..."ఉద్యోగం చేస్తావా"...వెంటనే హిమ అన్నది "చేస్తాను"... పెళ్లి ఫిక్స్ అయ్యింది.

జ్ఞాపకాలన్నీ ఒక్క సారిగా తిరిగి రాగా ....చాలా ఏండ్ల తరువాత కలసిన దేవతో మాట్లాడుతూ హిమ అన్నది...

"ఆ రోజు నేను నీతో ఇక మాట్లాడను అంటే....నువ్వు అంత ధైర్యంగా నా చెయ్యి పట్టుకున్నావు .....తెలిసి తెలియనట్లు...అప్పుడు నువ్వు నన్ను ప్రేరేపించావు ".

దేవా ...."నువ్వు నా చేయి పెట్టుకున్నావు. బాగా సోచించి ఆలోచించి, నన్ను ఎలా ముట్టుకోవాలి అని. అదే పాణి గ్రహణం... నీ లోని కోరికలు అశలు నా లోకి ...నా లోని ప్రేమ నీ లోకి...నర నరాన ఇంకిపోయాయి"

...."నువ్వు నా చెయ్యి పట్టుకున్న ఆ క్షణమే నాకు నీతో పెళ్ళయి పోయినట్లు భావన కలిగింది. ఎవరికైనా చెబితే నమ్ముతారా?" హిమ ఎందుకు అరవలేదు...గోల చేయలేదు అనుకున్నావు నీవు . అరవడమా అప్పుడు అదీ నిన్ను..నా ప్రాణాన్ని....ఒక్కసారి కాదు మూడు సార్లు పట్టుకున్నావు.... ....నీకు తెలుసు ఆ క్షణానా....నువ్వు ఆ బంధాన్ని చూస్తున్నావు..నేను నిన్నే చూస్తున్నాను....నువ్వు చేసిన పని...అదే నా చెయ్యి పట్టుకోవడం ప్రేమతో కోరికతో ఆలోచనతో....నా బొమ్మ ముద్ర నీ హృదయం లో పడి పోయింది...నీ లోని కోరికలు నాలోకి ప్రవహించాయి..నాకు నీతో బందం ముడి పడిపోయింది..... ఇంక తాళి ఎందుకు... నీవు నా హృదయం లో నిండి పోయావు..ఎంతలా అంటే ...నాలో అనుక్షణం నీవే........తరువాతే నిన్ను చూసి నేను ఉల్లిక్కిపడటం....దూరంగా పోవడం... ఓ పులకరింత నిన్ను చూసినంత నాలో "....

నువ్వు నా చెయ్యి పట్టుకోవడం అన్నది ఏనుగు కాలికి వేసిన బంధనం లా మారిపోయింది. నా మనస్సు నిన్ను ఒక్క క్షణం కూడా వదల వద్దు అని చెప్పింది. "అప్పటి వరకు నేను చిన్న పిల్లని. నువ్వు నేర్పించావు కదా...ప్రేమంటే ఏమిటో.....నీ స్పర్శ తో నన్ను పెద్ద దాన్ని చేసావు".కానీ నీవు బయపడి వెంటనే పెళ్లి చేసుకున్నావు. నిన్ను మర్చి పోలేక ..నీ గుర్తులు చెరిగే వరకు నేను వేచి ఉన్నాను.

దేవా అన్నాడు హిమ తో "నా దైర్యం నువ్వేమి చూసావు లే? నేను నీ పెళ్లి కి వచ్చాను"."వెళ్లి మీ తమ్ముడి ని అడుగు నిజం చెబుతాడు" అన్నాడు.

"నువ్వు నన్ను మోసం చేసావు హిమ" అన్నాడు దేవా

"ఎప్పుడు నీ పెళ్లి కి ముందా లేక నా పెళ్లికి ముందా లేదా తరువాత" అన్నది హిమ కోపంతో

"మోసమా? నిన్ను ఎవరు మోసం చేశారు. నన్ను నేను మోసం చేసుకుంటూ బతుకుతున్నాను" అన్నది హిమ

హిమ నవ్వుతూ అన్నది "బహుశా మనం కలవడం....సమాజానికి ఏదో సందేశం ఇవ్వడం కొరకు అనుకుంటా....అది బాధ్యత గురించి....దేవుడు....ప్రకృతి మనల్ని ఎన్నుకునింది". మనమిద్దరం అదృష్టవంతులం అన్నది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ