భల్లే భల్లే విందు - తాతా కామేశ్వరి

Balle balle vindu

నేను నా సుధీర్గ సర్వీస్ లో ఆడిటింగ్ పని మీద దేశములో చాలా ప్రదేశాలకు తరుచూ వెళ్తూ ఉంటాను. వివిధ, వినూతనమయినా సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాను. కానీ మూడు, నాల్గు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఒక పెళ్ళి విందులో జరిగిన ఆ సంఘటన గురించి ఆలోచిస్తే నవ్వు ఆపుకోలేను.

ఒకసారి కంపెనీ ఆడిటింగ్ పనిమీద మూడు నెలల కోసం ఢిల్లీ వెళ్ళవలసివచ్చింది. పిల్లలు పైచదువులకి వెళ్ళిపోవడంతో, ఇంటిలో భార్య లక్ష్మి ఒంటరి ఆవడంతో ఆమెను కూడా ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలు చూపించవచ్చు అని కూడా తీసుకువెళ్ళాను.

హైదరాబాద్ నుండి ఢిల్లీ చేరి కంపెనీ వారు యిచ్చిన గెస్ట్ హౌస్ లో దిగి వారాంతాల్లో ఢిల్లీ మరియు చుట్టుపట్ల ప్రదేశాలు పర్యటించి రెండు నెలలు సరదాగా తెలియకుండా గడిచిపోయాయి. ఇంక అక్కడ నా పని పూర్తి కావస్తోవడంతో, నా భార్య తన ఫ్రెండ్స్ ద్వారా సౌథ్ ఢిల్లీలో ఉన్న సరోజినీ నగర్ మార్కెట్ ప్రసిద్ధమైన షాపింగ్ కాంప్లెక్స్ అని తెలుసుకొని ఒక శనివారం ఉదయాన్నె బ్రేక్ఫాస్ట్ ముగించి మార్కెట్ కి బయలుదేరాము. మేము చేరేసరికే మార్కెట్ దారులు సందడిగా అంతులేని దుకాణాలు, విక్రేతలు, కొనుగోలుదారులతో నిండి ఉంది. ఆ మార్కెట్ చూసిన నా భార్య, వెర్రి పట్టినట్టు షాపింగ్ మొదలు పెట్టింది.

ఆమె హైదరాబాద్ లో చాలా రోజులుగా ఉండడం మూలాన కొంచం హిందీ వచ్చు. దానితో ఆమె రెచ్చిపోయి మార్కెట్ అంతా తిరిగి తిరిగి గాలించడం మొదలుపెట్టి, వస్తువు నచ్చితే బేరం కుదరక, బేరం కుదిరితే నచ్చిన రంగు దొరక చివరికి ఒక దుకాణంలో బట్టలు, వులెన్స్ నచ్చి అక్కడ మకాం వేసీంది. ఆమె అక్కడ ఉన్న రంగురంగుల సల్వార్ సూట్ పీసులు, స్వెటర్స్, షాల్స్ అన్నీ ఓ గంట పాటు కెలకలు పెట్టి తీయించి “భయ్యా, ఈ రంగులో మరో డిజైన్ చూపించండి, ఈ డిజైన్ లో మరో రంగు లేదా అని అంటూ’ పాపం ఆ షొప్ లో పనిచేస్తున్న వారిని విసిగించి చివరికి తనకి నచ్చినవి పక్కన పెట్టీ అక్కడ బాగా బేరాలు ఉంటాయని ఫ్రెండ్స్ వద్ద తెలుసుకుని ఆ షాప్ యెజమానితో వచ్చి రాని హిందీలో బేరం ఆడడం ప్రారంబించింది.

ఇలా ఆమె బేరం ఆడుతువుండగా అకస్మాతుగా ఎవరో నా భుజం తట్టడంతో వెనక్కి తిరిగి చూడగా, నా బాల్య మిత్రుడు గిరి, యిరవై ఏళ్లు క్రితం మా ఊరిలో ఏదో పెళ్ళిలో కలుసుకున్నాక ఇదే కలవడం. వాడిలో పెద్ద మార్పు రాకపోవడంతో నేను వెంటనే గుర్తుపట్టాను. వాడిని చూసిన పట్టలేని ఆనందంతో గట్టిగా కౌగిలించుకొని, చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి నా భార్యకు పరిచయం చేశాను. గిరి కుడా తన భార్యని మాకు పరిచయము చేసేకా, ఆడవారి షాపింగ్ అయ్యే వరకు పక్కనే ఉన్న కుర్చీలలో కుర్చొని కొంతసేపు పాత సంగతులు నెమరువేసుకున్నాము.

గిరికి ఢిల్లీలో ఒక బ్యాంక్ కి ట్రాన్సఫర్ ఆయి ఐదు ఏళ్ళగా అక్కడే ఉంటున్నాడు. వచ్చే వారం కుమార్తె వివాహం దగ్గరలోనే ఒక మేరేజ్ హాల్లో చేస్తున్నాడని అడ్రెస్ ఇచ్చి, మా దంపతులను వివాహానికి తప్పక రమ్మని ఆహ్వానించాడు. మహిళలు ఇరువురి షాపింగ్ అవ్వడంతో గిరి దంపతులకి ‘బాయ్’ చెప్పి, వివాహానికి తప్పక వస్తామని సెలవు తీసుకున్నాము.

వివాహం రోజు రానే వచ్చింది. సాయంత్రం ఆరు గంటలకి మేము కళ్యాణ మండపానికి చేరేసరికి అక్కడ చాలా సందడిగా ఉంది. బయట పూలతో అందంగా వధూవరుల పేరు రాసివుంది. రిసెప్షన్లో యిద్దరు అమ్మాయిలు అత్తరు జల్లి, గులాబి పువ్వు యిచ్చి లోపలికి ఆహ్వానించారు. లోపల వివాహ వేదిక చాలా అందంగా అలంకరించబడి ఉంది. రాత్రిపెళ్ళి ఆవడంతో సాయంత్రమే రిసెప్షన్ పెట్టుకున్నారు.

గిరి మమ్మల్ని చూసీ దగ్గరకు వచ్చి పలకరించి వధూవరుల దగ్గరికి తీసుకోని వెళ్ళాడు. వారికి మేము గిఫ్ట్ కవర్ ఇచ్చి, అక్షతలు జల్లి ఆశీర్వదించి స్టేజ్ దిగుతుండగా సునామీ వచ్చిన్నటు ఒక వ్యక్తి భార్య యిద్దరు చిన్న పిల్లల సమేతంగా వేదిక పైకి మమ్మల్ని తోసుకుంటూ వస్తూ ఉండడం చూసీ, గిరి నాకు ఆయన పేరు సింగ్ సాబ్ అని, వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఉంటారని చెప్పి పరిచయం చేశాడు. సింగ్ సాబ్ కుటుంబం అంతా లావుగా ఏనుగుల గుంపులా ఉన్నారు. ఆయన వధూవరుల చేతిలో గిఫ్ట్ కవర్ పెట్టీ, అంతే వేగంగా వెళ్ళి మా ఎదుర వరసులో ఉన్న కుర్చీలో కూర్చున్నారు.

మేము అలా కూర్చుని వుండగా గిరి వచ్చి భోజనాలు బయట లాన్ లో ఏర్పాటు చేశాము అని ఆహ్వానించగానే మేము అక్కడకి వెళ్ళి చూడగా ఆ ప్రాంతం అంతా రకరకాల వంటల ఘుమఘుమలతో నిండి వుంది. అక్కడ చాలా కౌంటర్స్ లో నోరూరిస్తూన్న దేశవిదేశాల వంటకాలు స్వాగతిస్తున్నాయి. ఛాట్ కౌంటర్, ఇటేలియాన్ ఫుడ్ కౌంటర్, దోసా కౌంటర్, పంజాబీ ఫుడ్ కౌంటర్, దేశి ఫుడ్ కౌంటర్, డెసర్ట్ కౌంటర్ అని సుమారు యిరవై కౌంటరస్ లో కనీసం నూటయాభై డిషెస్ ఉంటాయి. మా కన్నా మునుపే సింగ్ సాబ్ కుటుంబ సమేతంగా ప్రతి కౌంటర్ కి వెళ్ళి ఏ డిషెస్ ఉన్నయో, ఏది ముందు తినాలో, ఏది చివారిలో తినాలో, ఎలా తింటే ఎక్కువ తినగలరో హిందీలో పిల్లలకి బోధపరుస్తున్నారు. వారు వేస్తున్న భోజన ప్రణాళిక ఓ యుద్ధ వ్యూహం వేస్తున్నటు అనిపించింది. చాట్ పకోడా కౌంటర్ తో మొదలు పెట్టి అన్నీ కౌంటర్స్ కి వెళ్లి ఎగబడి తింటు మధ్యమధ్యలో పిల్లలను బాగా తినమని, ఐదు వందలు గిఫ్ట్ ఇచ్చామని, ఊరికే తినటం లేదనీ, బాగా తినమని పిల్లలను మోటివేట్ చేస్తూ, నోరు ఆపకుండా తినడం చూసిన వారు వారిని వింతగా చూస్తున్నా, సింగ్ సాబ్ ఏమీ పటించుకోకుండా ఒక సైన్యపు దండులా భోజనం అనే లక్ష్యాన్ని సాధించే తత్పరతతో ఉన్నారు.

ఈలోగా నేను నా భార్య కుడా మాకు నచ్చిన డిషెస్ తిని చివరికి డెసర్ట్ కౌంటర్ కి వచ్చాము. సింగ్ సాబ్ కుటుంబం కుడా అన్నీ కౌంటర్స్ లో బాగా మెక్కి, పిల్లలు ఇక తినలేము అంటున్నా వారిని బలవంతాన డెసర్ట్ కౌంటర్ కి తీసుకోవచ్చాడు. ఆ కౌంటర్ లో ముందు గులాబ్ జామున్, క్యారెట్ హల్వా లాంటివి తిన్న తర్వాత వారి దృష్టి ఐస్ క్రీమ్ వేపు మరలింది. అన్ని వెరైటీ ఐస్ క్రీములు ఓ యాబై లాగించి సింగ్ సాబ్ భార్య మళ్ళీ కాసాటా ఐస్‌క్రీమ్ బాగుందని తెచ్చుకోవడానికి వెళ్ళింది. కౌంటర్ లో ఉన్న బోయ్ ఆమె ఆకారం చూసి కొంచం భయంభయంగానే ‘కాసాటా ఐస్‌క్రీమ్ అయిపోయింది, మరో వెరైటీ తీసుకోండి’ అనడంతో ఆమె చిందుల తొక్కిన కోతిలా హిందీలో వారు ఊరికే తినటం లేదని, అయిదువందలు రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చామని, అడిగిన డిష్ కావలసినంత ఎందుకు ఉంచలేదని గట్టిగా కేకలు వెయ్యడంతో క్యాటరింగ్ సూపర్వైసర్ అక్కడికి వచ్చి ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాడు. ఆమెతో పాటు సింగ్ సాబ్ కూడా కోపంగా వెంటనే కసాటా ఐస్‌క్రీమ్ తెప్పించమనడంతో సూపర్వైసర్ ఐస్‌క్రీమ్ రావడానికి టైమ్ పడుతుందనగానే అక్కడ పరిస్థితి వేడెక్కింది.

ఈ సంగతి గిరికి తెలియడంతో పరుగున వచ్చి సూపర్వైసర్ ని అడిగి విషయం తెలుసుకున్నాడు. ఆయన సంగతి అంతా చెప్పగానే వెంటనే సింగ్ సాబ్ వద్దకు వెళ్లి కోపం తెచ్చుకోవద్దనీ, అమ్మాయి పెళ్ళిలో గొడవ చేస్తే బాగుండదని చెప్పి, ఇంకా ఉన్న వెరైటీ డెసర్ట్స్ తినమని బతిమాలి శాంతబరిచి, సూపర్వైసర్కి అయిపోయిన ఐటమ్స్ వెంటనే తెపించమని చెప్పి, అందరి గెస్ట్స్ వద్దకు వెళ్ళి అసౌకర్యానికి క్షమించమని ప్రార్ధించి, మా వద్దకి కూడా వచ్చి బాధగా నిలబడ్డాడు. నేను వాడి భుజం తట్టి ఇలాంటివి పెళ్ళిళ్ళలో మామూలేనని, పెళ్ళి పనులు చూసుకోమని చెప్పి ఆయనను పెళ్ళి మండపంలోకి పంపించేసాను.

ఈలోగా సింగ్ సాబ్ కొంచం చిరుబురులాడుతూనే మళ్ళీ డెసర్ట్ కౌంటర్ కి కుటుంబం తో సహా చేరి అక్కడ ఉన్న ఇంకొన్ని వెరైటీ స్వీట్స్ తినడం ముగించి హిందీలో “భలే విందు ఇచ్చారు. ఇలాంటి పిసినిగొట్టు విందు ఎక్కడా చూడలేదు” అంటూ గొణుగుకుంటూ అక్కడ నుండి నిష్క్రమించారు. వాళ్ళ మాటలు విని నేను ‘అవును భల్లే భల్లే విందే మరి ’ అనుకుని మనసులో నవ్వుకున్నాను.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు