బడి ప్రధానోపాధ్యులవారు పంపిన నోటీసు :
“బోర్డు పరీక్షలు మూడు నెలలు ఉన్నాయనగా మన బడిలో జరిగే ఆఖరి పరీక్షలో ఉత్తీర్ణులైన
విద్యార్థులను బోర్డు పరీక్షలకు పంపడవం జరుగుతుంది. ఆవిధంగా మన బడిలో జరిగే
ఆఖరి పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మొదటి ముగ్గురూ బోర్డు పరీక్షకై కట్టవలసిన
రుసుము మన బడి వారే కడతారు. అంతేకాక, ఆ తరువాత వచ్చిన మార్కుల వరుస క్రమంలో
మరో ముగ్గురు కట్టవలసిన రుసుములో సగం బడి వారే కడతారు. ఆ తరువాత వచ్చిన మార్కుల
వరుస క్రమంలో మరో నలుగురు కట్టవలసిన రుసుములో పావు వంతు బడి వారే కడతారు"
అని పదవ తరగతి విద్యార్థులకు చదివి విని పించేరు జగన్నాధరావు మాష్టారు.
ఆ తరగతిలో రామారావు, భీమారావు, కృష్ణారావు తక్కిన విద్యార్థుల కంటే తెలివైనవారు అని మిగతా విద్యార్థులకు, వారికి చదువులు చెప్పే ఉపాధ్యాయులకు తెలుసు.
ఆ ముగ్గురూ ఇళ్లకు వెళ్లిన తరువాత నోటీసు వివరాలు వారి వారి తల్లి తండ్రులకు చెప్పేరు.
సుమారుగా నలభై ఐదు రోజులలో బడిలో జరిగే ఆఖరి పరీక్షల కోసం -
పిల్లల తల్లితండ్రులు పిల్లలు కష్టపడి చదివేటట్టుగా చూసుకున్నారు.
తరగతిలో పిల్లలందరూ ఆ పరీక్షలు వ్రాసి, సెలవలు తరువాత తెరిచిన బడికి వెళ్లి, వారికి తెలియబోయే మార్కుల గురించి ఉత్సుకతో ఎదురు చూడసాగేరు.
పది రోజుల తరువాత, తెలిసిన మార్కులతో అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా –
సాధారణంగా తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చే మొదటి ముగ్గురిలో ఉండే కృష్ణారావు ఈసారి పదిహేనుమంది విద్యార్థులకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు.
ఆ ఫలితం విన్న కృష్ణారావు ఏడుస్తూ ఇంటికి చేరుకున్నాడు.
కృష్ణారావు తండ్రి గోపాలరావు మరునాడు బడికి వెళ్లి జగన్నాధరావు మాష్టారుని కలిసి –
"మాస్టారూ మా వాడికి ఇంత తక్కువ మార్కులు రావడమేమిటి? ఎక్కడో పొరపాటు జరిగింది అనిపిస్తోంది"
"మీరు దగ్గరుండి మీవాడిని జాగ్రత్తగా చదివించేరా"
"నేను వాడి అమ్మ నెలరోజులుగా దగ్గరుండి వాడిని రోజూ రాత్రి పన్నెండు వరకూ చదివించి మరలా ఉదయం నాలుగో గంటనుంచి ఎనిమిది వరకూ చదివించేమండీ"
"అక్కడే జరిగింది పొరపాటు"
-2-
"అక్కడ పొరపాటు జరగడమేమిటి మాస్టారూ"
"విద్యార్థి ఎన్ని గంటలు చదివేడు, ఎంత వరకూ చదివేడు అన్నది ముఖ్యం కానే కాదు. ఆ చదివినది అవసరమైనప్పుడు జ్ఞాపకం తెచ్చుకునేందుకు ఎంతవరకూ అతని మస్తిష్కంలో దాచుకున్నాడు అన్నది అతి ముఖ్యం. అలా జరగాలంటే, తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటేనే - చదివినది త్వరగా అతని జ్ఞాపకాల పొరలలోకి చేరుతుంది. అందుకే, రోజూ రాత్రి పదివరకూ చదివి ఉదయం నాలుగో గంటకి లేచి కాలకృత్యాలు తీర్చుకొని చదవడానికి కూర్చుంటే, చదివిందంతా బుర్రలో ముద్ర పడుతుంది. అలా కాకుండా మీరు చదివించినట్టు చదివిస్తే, అలసిన శరీరంతో చదివినది బుర్రలోకి ఎక్కదు. దాని ఫలితంగా చదివినదేదీ జ్ఞాపకంలో ఉండదు. జ్ఞాపకాల పొరలు శూన్యమైతే పరీక్షల్లో ఏమని వ్రాయగలరు చెప్పండి"
"అంతే అంటారా"
"అంతే. మీవాడు స్వతహాగా తెలివైనవాడు కాబట్టి అన్ని మార్కులేనా తెచ్చుకున్నాడు. అదే మరో పిల్లడైతే ఇంకా తక్కువ మార్కులు తెచ్చుకొనేవాడు. అందుకే, ఈరోజు నుంచి నేను చెప్పినట్టుగా చదివించండి. నెల రోజుల తరువాత ఒక ఆదివారం నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని విషయాల్లోనూ ముఖ్యమైన ప్రశ్నలతో కొన్ని గంటలు పరీక్ష వ్రాయిస్తాను. మీరే చూద్దురుగాని అప్పుడు వాడికి వచ్చే మార్కులెలా ఉంటాయో"
"అలాగే మాస్టారూ మా పొరపాటు మేము సరిదిద్దుకొని తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాము" అని మాష్టారు దగ్గర సెలవు తీసుకొని గోపాలరావు వెళ్ళిపోయేరు .
నెల రోజుల తరువాత –
ప్రత్యేకంగా మాష్టారు జరిపిన పరీక్షలలో అందరూ ఆశ్చర్య పడేటట్టుగా కృష్ణారావు నూటికి తొంభై శాతం మార్కులు తెచ్చుకున్నాడు.
నీతి: మంచి ఫలితాలు కోరుకొనే విద్యార్థికి -
చదువు ఎంత అవసరమో శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం.
*****