జీవన తరంగాలు - వెంకటరమణ శర్మ పోడూరి

Jeevana Tarangalu.1

అమలాపురం.

గడియార స్తంభం నుంచి ముమ్మిడివరం గెట్ వెళ్లే వైపు ప్రారంభం లో, ఇపుడు ఉన్న సినిమా హాలు స్థలంలో రెండు ఇనప కొట్టులు. ఒకటి పెద్ద గాది కొట్టు, రెండో కొట్టు చిన్న గాది కొట్టు అనేవారు. చిన్న గాది కొట్టు గళ్ళా పెట్టి, ఎదురుగా తక్కెడ తో చిన్న గాది కూర్చున్నాడు. అయన పేరు ఇప్పటికి నాకు తెలియదు . నిక్కరు జేబులో చెయ్యి పెట్టుకుని ఎదురుగ నుంచున్నాను " ఒరేయి కె.జి మేకులు పట్టుకురా" అని పని కుర్రాడితో చెప్పి నాకేసి చూశాడు ఏమిటిఅన్నట్టు. అప్పటి వరకు ఆయన ఆరో వేలినే గమనిస్తున్న నేను ఉలికి పడి " గుప్తా ఉన్నాడా " అన్నాను . ఇప్పటిలా అంకుల్ అనడం అప్పుడు లేదు . గుప్తా గాడు అయన పెద్ద కొడుకు, నా క్లాస్ మేట్. " నువ్వు, వాడు కలిసి రోడ్లు సర్వే చేస్తున్నారా ? " అన్నాడు ఆయన నాకేసి గుర్రు గా చూసి " అప్పుడే లోపలి నుంచి గుప్తా గాడు వచ్చి నా పక్కన నుంచున్నాడు వాళ్ళ నాన్న కేసి భయం గా చూస్తూ . నాతొ వాళ్ళ నాన్న అలా మాట్లాడటం ఇష్టం లేనట్టు, ఆయన ఇప్పుడు ఇచ్చిన కంటే కొంచం గౌరవం నాకు ఎక్కువ ఇవ్వాలి అన్నట్టు, అన్ని కలిసి వచ్చేలా " మా హెడ్ మాస్టారి అబ్బాయి " అన్నాడు ఆదో పెద్ద గుర్తించవలిసిన క్వాలిఫికేషన్ అన్నట్టు.

అయన చూపులో కాస్తతీక్షణత తగ్గించి, " సరే బాగా చదవండి. ఎండలో తిరక్కండి " అన్నాడు ఎదురుగా తక్కెడ మీదకి దృష్టి మరల్చి. " రా రా పోదాం " అని నా చేయి పట్టుకుని కమలేశ్వర టాకీస్ వైపు లాక్కు పోయాడు. *** మేము థర్డ్ ఫారం చదువుతున్నప్పుడు మునిసిపల్ మిడిల్ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక ఫర్లాంగ్ ఇవతల మెయిన్ రోడ్డు మీద రెండు బిల్డింగులలో ఉండేది. కానీ అది అంతకు ముందు మాచి రాజు స్ట్రీట్ లో రాతి బడి లో ఉండేది. నేను ఫస్టు ఫారం లో అక్కడ చేరినప్పుడు మొట్ట మొదటి ఫ్రెండ్ గాది లక్ష్మీ కాంత గుప్తా. మొదటి రోజునే, చేగోడీలు, శనగ ఉండలు మార్చుకుని బాగాస్నేహితులం అయ్యా ము.

హెడ్మాస్టారి అబ్బాయిని కావడం, చాలా సబ్జె క్ట్స్ లో వాడి కంటే ఎక్కువ మార్కులు రావడం తో వాడికి మనం అంటే అదో రకమయిన ప్రత్యేకత.కూచిమంచి అగ్రహారం,నుంచి నేను, గడియారం స్తంభం దగ్గర నుంచి వాడు రోజూ స్కూలు కు వెళ్లే వాళ్ళం. మచిరాజు వీధి నుంచి, స్కూలు మారిన తరువాత రోజూ కొల్లూరి లక్ష్మణ రావు గారి ఇంటి మీదుగా వెళ్ళి వచ్చే వాళ్ళం. ఆయన ఇంటి ఎదురుగా గురవయ్య అని ఒకతను పెద్ద పెద్ద మీసాలు ఉండి, లాండ్రి నడిపేవాడు.

గుప్తా వాళ్ళ పెద్ద నాన్న అక్కడికి దగ్గరలోనే ఉండేవాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎదో జరిగి, గుప్తాకి గురవయ్య అంటే చెడ్డ భయం ఏర్పడింది. అందు చేత గురవయ్య షాపు దగ్గరికి రాగానే పుస్తకాలు నాకు ఇచ్చి, పరుగెత్తుకు వెళ్లి ఆషాపు దాటిన తరవాత మళ్లీ పుస్తకాలు తీసుకునేవాడు. వారం లో అన్ని రోజులు కాక పోయినా ఇంచుమించు నాలుగు రోజులు, స్కూలు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఒక రొటీన్ ఉండేది. స్కూల్ నుంచి బయలు దేరేముందు నేను మా నాన్నగారి రూమ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన రూమ్ రోడ్డుకి అనుకుని ఉన్న ఎత్తు అరుగుల బిల్డింగ్ లో ఉండేది. అరుగు దగ్గర నుంచుని కింద నుంచి రూమ్ లో ఉన్న మా నాన్న గారికేసి చూసే వాడిని. మాస్టర్లతో మాట్లాడుతున్నా ఆగి నాకేసి చూసేవారు. ఆయనకు తెలుసు నేను ఎందుకు నుంచున్నానో. మామూలు గా ఒక అర్థణా విసిరేవారు. ఎప్పుడయినా. అణా విసిరితే పండగే. గుప్తా గాడు నేను ఆ అర్థణా తీసుకుని బయలు దేరే వాళ్ళం. ముమ్మిడివరం గేటు దాటి, గున్నయ్య గారి మేడ అవతల కొల్హాపూరి మిఠాయి కొట్టు ఉండేది. ముందు వాడు వెళ్లి ఒక కానీ తో బెల్లం తో చేసిన తొక్కుడు లడ్డు తెచ్చేవాడు. ఆతరువాత నేను వెళ్లి మిగతా కానీ తో ఇంకో లడ్డు తెచ్చుకునే వాడిని. అలా విడి విడి గా ఎందుకంటే, లడ్డు తీసుకున్న తరవాత కొసరు అని చెయ్యి చాపితే, కొద్దిగా కారపు బూందీ చేతిలో వేసే వాడు. ఇద్దరికి కొసరు వేరే వేరే రావాలని అలా చేసే వాళ్ళం. లడ్డు తింటూ ఇంటికి చేరే వాళ్ళం. మిడిల్ స్కూల్ లో థర్డ్ ఫారం దాకానే ఉంది కాబట్టి ఫోర్త్ ఫారం లో బోర్డ్ హై స్కూల్ లో చేరాం. ఆ స్కూల్ మా ఇళ్ళకి దగ్గరే. గుప్తా, నేను ఫోర్త్ ఫారం ఫిఫ్త్ ఫారం మాత్రమే కలిసి చదివాం. అయితే ఈ రెండేళ్లలో చాలా ముఖ్యమయినవి జరిగాయి.

ఎక్కడినుంచి పట్టుకువచ్చేవాడో ఖచ్చితంగా తెలియదు కాని , నన్ను మ్యాట్నీలకి తనే టికెట్ కొని తీసుకువెళ్ళేవాడు. హిందీ సినిమాల పరిచయం, తద్వారా రాజకపూర్, దేవానంద్ సినిమాలు, ముఖేష్ పాటలలో ఆసక్తి అన్ని వాడి పుణ్యమే. మా ఇంట్లో పాకెట్ మనీ ఇవ్వడం కానీ, మ్యాట్నీలకి పంపడం కానీ ప్రశ్నేలేదు. సినిమా అంటే హాఫ్ ఇయర్లి, లేదా ఏడాదికి ఒక మాటు పెద్ద పరీక్షలు అయిన తరువాతే. మధ్యలో మ్యాట్నీలు గుప్తా గాడి పుణ్యమే. నేల టికెట్ మూడు అణాలని గుర్తు. అంటే ఇద్దరికి ఆరణాలు. మనవాడు కొంచం పెద్ద అయ్యాడు కాబట్టి, కొద్ధి సేపు గళ్లా పెట్టి దగ్గర కూర్చో పెడితే ఎదో జరిగేది. మ్యాట్నీలకి ఫండింగ్ అదే సోర్స్ అను కోవాలి. అయితే ఈ సంగతి వాళ్ల నాన్న కనిపెట్టాడా లేదా అన్నది , మనవాడు మ్యాట్నీ చూసిన తరువాత మరునాడో ఎప్పుడో, చెప్పే డైలాగ్ బట్టి వుండేది. " ఒరేయి నేను మా నాన్నకి వాళ్లకి పుట్టిన వాడిని కాదుట. నన్ను పెంచుతున్నారు అంతే" ఇలా చెప్పాడంటే, డబ్బులు సంగతి వాళ్ళ నాన్నకి తెలిసి చితక బాదటం జరిగింది అన్న మాట. ఆ డైలాగు సినిమాల ప్రభావం, వాళ్ళ నాన్న దెబ్బల ప్రభావం అన్నది తరవాత తెలిసిన విషయం. వాడి మాట ఎలా ఉన్నా వాడితో చూసిన చాలా సినిమాల క్లైమాక్స్ పెద్ద అయిన తర్వాత మళ్లీ ఆ సినిమాలు చూసినప్పుడే చూశాను ఎందుకంటారా ? మ్యాట్నీ చివరలో తెరలో క్లైమాక్స్, నేలలో కూర్చున్న నాకు ఒకే మాటు ప్రారంభం అయేది. బయటికి చూడడం, తెర వైపు చూడడం. చీకటి పడుతున్న కొద్దీ టెన్షన్. చీకటి పడే లోపే ఇంట్లో ఉండక పోతే పెద్ద ప్రమాదమే. అందు చేత చాలా సినిమాలు క్లైమాక్స్ పూర్తి అవ కుండానే ఇంటికి పరుగెట్టుకు వెళ్లి, ఆ టైం కి ఇంట్లోనే ఉన్నట్టు, నన్ను చూసి ఎదో గుర్తు ఉండే పని చేయ వలిసిందే. ఫిఫ్త్ ఫారం తరవాత మేము చదువు లో వేరు అయినా జీవితం లో వేరు అవలేదు. నేను కాలేజి లో లెక్చరర్ గా చేరటం, వాడు, వాడు తమ్ముడు వాళ్ళ నాన్న వ్యాపారం లొనే వేరే వేర కొట్లు పెట్టడం జరిగింది. ఎప్పుడయినా వాడి కొట్టుకు వెడితే త్వరగావెళ్ల నిచ్చేవాడు కాదు. కూర్చోమని, వచ్చిన కస్టమర్లకు నా గురించి చెబుతూ ఉండేవాడు. చిన్నప్పుడు ఎలా చదివే వాడినో, ఇప్పుడు కాలేజీలో ఎలా పేరు ఉందొ అన్ని చెబుతుంటే ఎవరికయినా బాగానే ఉంటుంది కదా.కానీ ఇది కాలేజి వదిలేయడం తో ఆగి పోలేదు. ప్రొఫెషనల్ పరీక్షలు పాస్ అయి కంపెనీలకు మారినా, అమలాపురం లో ఇల్లు, తమ్ముళ్లు ఉండడం వల్ల వస్తూ ఉండడం జరిగేది. వాడిని కలవడం మామూలే. ఈ మాటు వాడు కస్టమర్లకు చెప్పేది కూడా మారేది. నేను కష్టమయిన పరీక్షలు ఎలా పాస్ అయింది, ప్రమోషన్ ల తో కంపెనీ లు ఎలా మారింది చెబుతూ ఉండేవాడు. అమలాపురం వచ్చినప్పుడే కాకుండా నేను ఎక్కడ ఉన్నా వాడు గుర్తుకు వచ్చేవాడు. దానికి మా ఆవిడే కారణం. సందర్భాలు చెప్ప వలిసిందే. నేను సాధించింది తక్కువ అయినా అదేదో చాలా ఎక్కువ అన్నట్టు గుప్తా గాడు మిగతా వాళ్ళకి చెప్పేవాడు. కానీ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడుమిగతా వాళ్లకి చెప్పడం మాట అటుంచి, దానికి పూర్తి వ్యతిరేక స్పందన మా అవిడది. ఉదాహరణలు చెబితే కానీ మీకు అందక పోవచ్చు. కాలేజీ లో నేను ఇంకో మిత్రుడు ఒకే మాటు చేరాం. మా తమ్ముళ్లు కూడా కాలేజీ లో అప్పుడు చదువు తున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి"వదినా! కొత్త గా చేరిన ఇద్దరిలో అన్నయ్యకి బాగా చెబుతాడని పేరు వచ్చింది " అని చెబితే, ఈవిడ" అది, రెండో అయన అంత బాగా చెప్ప పోవడం వల్ల వచ్చిన పేరేమో " అనేది.

ఆ తరవాత కొద్దిగా రచనా వ్యాసంగం ప్రారంభించి, చాలా తిరస్కారాల తరవాత ఒక కథ ఎవరో వేసుకుంటే, నేను కొంచం గొప్ప ఫీల్ అవుతూ ఆ వార్త చెప్పినప్పుడు కొంచం అమాయకం గా ముఖం పెట్టి," యండమూరి, గొల్లపూడి, అన్ని వందలలో కథలు ఎలా రాస్తారండి? " అనేది. ఆ మాటకి టైరు లో గాలి పూర్తిగా పోయి గుప్తా గాడు గుర్తుకు వచ్చే వాడు. అలాగే ఏవో షేర్లు కొన్నప్పుడు ఒక్క లక్షో, రెండు లక్షలో లాభం వచ్చిందని చెబితే మళ్ళీ అదే అమాయకం ముఖం తో "అంబాని అన్ని వందల కోట్లు ఎలా సంపాదిస్థాడండి?" అనేది., ముష్టి మూడు లక్షలకి ఏమిటి హడావిడి అన్నట్టు . అది నన్ను ఉడికించడానికి అనుకున్నా. కానీ ముఖం మీద పొగడటం ఎందుకని ఇవన్నీ మహా కవి భారవి తండ్రి పాత్ర పోషిస్తోందని, ఆవిడ చెల్లెళ్లకి ఫోన్ లో నాగురించి చెప్పేటప్పుడు వినడం తటస్థించి చాలా కాలానికి కానీ తెలియలేదు.

****** కొన్ని కంపెనీలు మారి , ఆఫ్రికా ఉద్యోగం అయిన తరువాత, నా కాలేజీ మిత్రుడి కొడుకు పెళ్లి కి, ఆవిడా నేను అమలాపురం వచ్చాము. గిఫ్ట్ కొనడానికి బజారుకు ఆవిడ కూడా వచ్చింది. గుప్తా గాడి షాపు ముందునుంచి వెడుతూ, చిన్నప్పడు క్లాస్ మెట్, పరిచయం చేస్తాను రమ్మని ఆవిడని కూడా రమ్మన్నాను. గతం లో లాగే, కస్టమ్మర్లు ఎవరయినా ఉంటే మన గురించి, మా ఆవిడ ముందు చెబుతాడని చిన్న ఆశ. అవేళ ఎవరు లేరు. అవీ ఇవీ మాట్లాడి సడన్ గా అడిగాడు. " ఎరా అన్ని ఉద్యోగాలు మారావు మొత్తం ఏమాత్రం సంపాదించావు రా "అన్నాడు. కొంచం అవకాశం వచ్చింది కదా ఆవిడ ముందు మెచ్చుకుంటాడని,అవీ ఇవీ కలిపి ఒక అయిదు కోట్లు ఉండవచ్చేమోరా "అన్నాను.ఆలా చెప్పి ఊరుకోవచ్చు కదా. " నువ్వు ఎంత సంపాదించావు రా? " అన్నాను. వాడు కొంచం సిగ్గు పడుతూ " ఒక పది కోట్లు ఉండవచ్చు రా " అన్నాడు.నేను మా ఆవిడ ముఖం కేసి చూడలేదు. వస్తానురా అని చెప్పి వచ్చేశాను.అదే ఆఖరు సారి చూడటం *** వ్యాపారం లో పరుగెత్తికోట్లు సంపాదించినా, అదే స్పీడులో, కాజీ పేట స్టేషనులో నీళ్ల కోసం దిగి, బయలు దేరి పోయిన రైలు అందుకోవడానికి బాగా పరిగెత్తి కుప్ప కూలిపోయి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయా డు

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు