లోభి మనసు - మద్దూరి నరసింహమూర్తి

Lobhi manasu

శ్రీపతి తన వంతు ఎప్పుడు వస్తుందా అని టోకెన్ నెంబర్ చూపించే బోర్డు వేపు చూస్తూ కూర్చొని గంట అయింది. ఈ గంటలో అరడజను సార్లు లోపలికి వెళ్లేవారి మీద 'ఎంతకూ ఈవలకు రాకుండా ఏమిటి చేస్తున్నారు వీళ్ళు’ అంటూ మనసులో వారిని తిట్టుకోవడమే కాక, ‘ఈ డాక్టర్ రోగులతో పిచ్చా పాటీ వేసుకుంటూ ఎంతో బిజీ అన్న బిల్డ్ అప్ ఇస్తున్నాడా’ అని డాక్టర్ ని కూడా మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు.

బోర్డు మీద తన టోకెన్ నెంబర్ కనపడగానే ఆతృతగా డాక్టర్ దగ్గరకి వెళ్లి కూర్చున్నాడు.

"చెప్పండి ఏమిటి మీ సమస్య"

"మీరేమిటో మెల్లిగా అడిగినట్టున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడరా దయచేసి"

"మీ సమస్య అర్ధమయింది. ఎన్నాళ్ళై మీకు వినికిడి సమస్య ఉంది" అని కొంచెం శృతి పెంచి అడిగేరు డాక్టర్ గారు.

"ఆరు నెలలై ఎడమ చెవి వినికిడి కొంచెం తగ్గింది"

"కొంచెం కాదు, బాగానే తగ్గినట్టుంది. ఆరు నెలలై సమస్య ఉంటే, ఇంత ఆలస్యంగా వచ్చేరేంటి"

"తక్కువ ఖర్చులో తేలిపోతుందని హోమియో మందు తెచ్చుకొని వేసుకున్నాను. అదేమీ పెద్దగా పనిచేయకపోతే, చిట్కా వైద్యం అంటూ వేడి చేసిన వెల్లుల్లి నూనె రోజుకి రెండు మూడు సార్లు చెవిలో వేసుకోవడం చేసేను. చెవిలో గులిమి ఎక్కువగా ఉందేమో అనిపించి ఇయర్ బడ్స్ తో రోజూ శుభ్రం చేసుకోవడం కూడా చేసేను. అలా ఏమి చేసినా సమస్య తగ్గడం బదులు పెరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఆరునెలలైపోయేయి"

"రండి రెండు చెవులు చూస్తాను. ఆ టేబుల్ మీద పడుకోండి"

"రెండెందుకు ఖర్చు ఎక్కువ, ఎడమ చెవి ఒక్కటే చూడండి చాలు"

"మీరు నా ఫీజు కట్టే వచ్చేరా, రసీదేదీ చూపించండి"

"కట్టేనండీ, ఇగో రసీదు"

ఆ రసీదు చూసిన డాక్టర్ గారు "ఇదేమిటి ఒక చెవిలో గులిమి తీయించుకుందికి అని వంద రూపాయలు కట్టేరు"

"అదే కదా మీరు చేసే పని"

"నేనేమి చేయాలో మీరు నిర్ణయిస్తారా, డాక్టర్ ని నేనా మీరా"

"మీరే డాక్టర్ కదండీ"

-2-

"కదా, వెళ్లి నా కన్సల్టేషన్ అని చెప్పి అదే వ్రాయించి వెయ్యి రూపాయలు జమ చేసి నాకు రసీదు చూపించండి"

"మీ ఫీజు ఐదు వందలు చేసుకోకూడదా"

"ఏమిటి మీరు సంతలో కూరలు కొన్నట్టు"

"రెండు చెవులకి మీరు వెయ్యి రూపాయలు తీసుకుంటారు. నాకు మీరు చూసేది ఒక చెవే కదా. అందుకే అలా అడిగేను"

"ముందు మీరు వెయ్యి రూపాయలు జమ చేసి రసీదు చూపించండి. ఒక చెవి చూడాలా, రెండు చెవులూ చూడాలా అన్నది నేను నిర్ణయిస్తాను, మీరు కాదు"

"అలా అయితే, ఇప్పుడు కట్టిన వంద రూపాయలు తగ్గించి తొమ్మిది వందలు జమచేస్తే సరిపోతుంది కదండీ"

"అదేమీ కాదు. ఇప్పుడు వేరే వెయ్యి రూపాయలు జమ చేయవలసిందే, అంతేకాదు, మీకు వేరే టోకెన్ ఇస్తారు. అంతవరకూ వేచి ఉండండి"

'అయ్యో దేముడా అనవసరంగా వంద రూపాయలు నష్టమైపోయేయి. పైగా మరలా పిలిచే వరకూ వేచి ఉండాలట' అని తనలో తానూ గొణుక్కుంటూ వెళ్లి వెయ్యి రూపాయలు జమ చేసి వచ్చి బోర్డు వంక చూస్తే తాను మరో ఆరుగురు కంటే వెనకపడిపోయేనని గ్రహించిన శ్రీపతికి ఏడుపు వచ్చింది.

డాక్టర్ గారు శ్రీపతి రెండు చెవులూ పరీక్షించి -

"మీరు కుడి చెవిని కూడా బాగా కెలికినట్టుగా తెలుస్తుంది. ఎడమచెవిలోని కర్ణభేరికి శస్త్రచికిత్స అవసరం. ఆ తరువాత రెండు చెవులకు మీరు వినికిడి మెషిన్ వాడవలసి ఉంటుంది"

"ఎడమ చెవికి శస్త్రచికిత్స కాకుండా మందులతో బాగు చేయడం అవదా డాక్టర్ గారు"

"మందులతో బాగయే స్టేజి దాటిపోయింది. అంతే కాదు, శస్త్రచికిత్స చేయించుకోవడం ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ పెరిగి అది గొంతుకకి ముక్కుకి కూడా అనారోగ్యం చేకూరుస్తుంది"

"చెవి పాడైతే గొంతుక ముక్కు పాడవడమేమిటి"

"ఈ మూడింటికి శరీరం లోపల లింక్ ఉంది. అందుకే, మమ్మల్ని ENT డాక్టర్ అని అంటున్నారు కదా"

"శస్త్రచికిత్స కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు"

"మీరు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ లో చేరిన మరుసటి రోజు శస్త్రచికిత్స చేసి, మూడో రోజున మీరెలాగున్నారో చూసి, అంతా బాగుంటే, ఆ రోజు రాత్రికి ఇంటికి పంపిస్తాము. శస్త్రచికిత్సకు, రెండు చెవులకు మీరు వాడవలసిన మందులకు కలిపి సుమారుగా లక్ష పాతిక వేలు అవొచ్చు. అంతే కాక, రెండు చెవులకు మీరు వాడవలసిన మెషీన్లు ఒక్కొక్కటీ ఏభై వేలు అవుతాయి. అందులో ఉండే బ్యాటరీలు రెండు నెలలొకసారి మార్చుకోవాలి. రెండు మెషీన్లు కలిపి బ్యాటరీలకి ఐదు వందలు అవుతాయి”

-3-

"అంత ఖర్చు అవుతుందా"

“రెండు చెవులూ ఒక ఏడాది వరకూ ప్రతీ నెలా వచ్చి చూపించుకోవాలి. అన్నీ బాగుంటే, ఆ తరువాత ఆరేసి నెలలకోసారి చూపించుకుంటే సరిపోతుంది"

"ఈ ఖర్చులో ఏమేనా తగ్గే అవకాశం ఉందా డాక్టర్ గారు"

"మీకు ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ బిల్ లో మూడు వంతులు ఖర్చు మీకు కలిసివస్తుంది"

"నాకు ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు చేసుకుంటే పనికి వస్తుందా"

"క్రిందనే ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు. వెళ్లి కనుక్కోండి"

"సరే, వస్తాను డాక్టర్ గారు"

శ్రీపతి క్రిందనే ఉన్న ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరకి వెళ్లి కనుక్కుంటే – వాళ్ళు –

"ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పాతికవేలు కట్టి, ప్రతీ నెల అంతే మొత్తం ఒక ఏడాది వరకూ కడితే, ఏడాది తరువాత చేయించుకునే శస్త్రచికిత్సకు మాత్రమే మేము ఇచ్చేది"

--అని చల్లగా చెప్పేరు.

అన్ని వివరాలు ఆకళింపు చేసుకొని ఖర్చుల లెక్కలు చూసుకున్న తరువాత –

‘ఇప్పుడు ప్రీమియం కట్టినా ఏడాది తరువాత కానీ శస్త్రచికిత్స చేయించుకునే పరిస్థితి ఎలాగూ లేదు.

అలాటప్పుడు ఎందుకు ఇంత ఖర్చు; డబ్బు గుంజడానికి డాక్టర్లు ఆడే నాటకాలు ఇవి.

బొత్తిగా వినిపించకపోతే అప్పుడు చూసుకోవొచ్చు.

ఏమో అప్పటికి వినికిడి లోపం అలవాటైపోవొచ్చు.

కాబట్టి ప్రస్తుతం నిశ్శబ్దంగా ఇంటికి వెళ్లిపోవడమే మేలు’ –

అని సలహా ఇచ్చింది లోభత్వంతో నిండిపోయిన శ్రీపతి మనసు.

మనసు మాట వినడమే లాభదాయకం అని భావించేడు శ్రీపతి.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు