“వెన్నెల చల్లదనం యెంత హాయిగా వుందో రేఖా “ వెన్నెల్లో సన్నజాజిలా పరిమళిస్తున్న రేఖను సమ్మోహనం గా చూసాడు రామం .
రేఖ నవ్వింది ఆ నవ్వు లో వెన్నెల నవ్వింది .
“నిన్న రాత్రి నువ్వొస్తావని యెదురు చూసాను ,పిల్లతెమ్మెరలు యెదురు చూసాయి ,నువ్వు రాలేదు ఆకులన్నీ చిన్నబుచ్చుకున్నాయి “రామం భావావేశానికి రేఖ చిన్ని నవ్వుతో రామాన్ని తన్మయం గా చూసింది .రామాన్ని ప్రేమిస్తున్నది ,ఏడడుగులు నడవాలని కాంక్షిస్తున్నది ,రామం రేఖ ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడు .ఊళ్లో వున్న తల్లికి వుత్తరం కూడా వ్రాసాడు .
రేఖ రామం ప్రక్కన పచ్చికలో కూర్చుంటూ గోరింటాకు చేతులను మృదువుగా తడుముకుంటూ “నిన్న నాకు పని ఒత్తిడితో అలసిపోయాను “నవ్వింది .
వారిద్దరి స్నేహం హాస్పిటల్ లోనే జరిగింది .రామం బ్యాంకు లో పనిచేస్తాడు .ఒకరోజు బ్యాంకు కి వస్తుంటే బస్ దిగుతూ జారాడు .దగ్గర్లోనే వున్న క్లినిక్ లో రేఖ నర్స్ . రెండురోజుల పరిచయం లో యెన్నో యెన్నో విషయాలు చర్చించుకుంటూ యిద్దరి అభిప్రాయాలూ ఒకే దిశలో పయనం ! క్రమం గా సాయంకాలాల్లో బీచ్ లో కలవడం కబుర్లు చెప్పుకోవడం అలవాటయ్యింది .ఇద్దరికీ పరస్పరం ప్రేమ చిగురించింది కానీ యెన్నడూ బహిర్గతం కాలేదు .రామం తొలిసారిగా నెమ్మదిగా తన యిష్టాన్ని సూచించాడు .రేఖ మనసు పరిమళించింది .
“రేఖా అమ్మ నీ ఫోటో పంపమంది ఒక ఫోటో యిస్తావా ప్లీజ్ ,నాకు తెలుసు ఫోటో చూసిందంటే వెంటనే ఒప్పుకుంటుంది .మీరిద్దరూ కలిసారంటే నన్ను మర్చిపోతారేమో “నవ్వేసాడు రామం .
అనాథశరణాలయం లో పెరిగిన రేఖ తనకంటూ ఒక జీవితం వుంటుందని కల్లో కూడా వూహించలేదు .క్లినిక్. లో రోగులు తన సేవలకు సంతోషిస్తూ “పిల్లాపాపాపలతో నిండు నూరేళ్లు జీవించమ్మా “అని ఆశీర్వదిస్తుంటే చిరునవ్వుతో చూసేది .రామం తన కలలను నిజం చేస్తున్నాడు .పిల్లలు కనీసం నలుగురినైనా కనాలి .తన యిల్లు యెప్పుడూ సందడిగా వుండాలి .తమ పువ్వుల పొదరింట్లో నిత్యవసంతం విరబూయాలి .రేఖ తన్మయం తో పరవశించింది .
“అమ్మ బోలెడు పిల్లలను కోరుకుంటున్నది .మనవళ్లు ,మనవరాళ్లతో యిల్లంతా సందడిగా వుండాలిట కానీ నాకు పిల్లలంటే యిష్టం లేదు .స్త్రీ లావణ్యం సొగసు అందం అంతా అంతా వాళ్లు తల్లులయితే చెరిగిపోతుంది .భార్య లావణ్యం సొగసు అందం భర్త కు తేనెజల్లు .అందుకే మనకు పిల్లలు వద్దు రేఖా “అన్నాడు రామం .
రేఖ వులిక్కిపడింది .తన పూలపొదరిల్లు కూలిపోయింది . తను భవిష్యత్తుని అందమైన వసంతం లా వూహించుకుంది .రేఖ మనసులోతుల్లో ముళ్లు గుచ్చుకున్నాయి .రామం వైపు జ్వలిత జాలలాగా చూసింది .ఆ తీక్షణకు రామం భయపడ్డాడు .
“రామూ ,నేను అనాథగా పెరిగాను ఆప్యాయత ,లాలన ,ముద్దుముచ్చటలు నాకు తెలియవు .అందుకే నా జీవితం పిల్లల ముద్దుముచ్చటలు వారి లాలన ప్రేమ లో కరిగిపోవాలి .మాతృత్వపు తేనెబిందువులను ఆస్వాదించాలి .ఈ విషయం లో మనదారులు వేరు ! ఇ యాం సారీ “అంటూ కన్నీళ్లతో అక్కడినించి రేఖ వెళ్లిపోయింది .
రామం నిరుత్తరుడై చూస్తూ వుండిపోయాడు . రేఖ కు కోపం వచ్చింది .తనకు పిల్లలంటే యెందుకో విముఖత .సంతానం మాతృత్వం స్త్రీ అందాన్ని అవయవ సౌష్టవాన్ని చెడగొడుతుందని అతని ఆలోచన .
రేఖ కు ఫోన్ ప్రయత్నించాడు ,రేఖ పలకలేదు .క్లినిక్ కి వెళ్లాడు .రేఖ అతన్ని కలవడానికి యిష్టపడలేదు .రెండునెలలు గడిచిపోయాయి .వెన్నెల చల్లదనం రామానికి సెగలగా వుంది .రేఖ రామాన్ని తల్చుకుంటుంది కానీ అతను ‘మనకు సంతానం వద్దు ‘అన్న మాటలు గుర్తుకొచ్చి మనసంతా చీకటయిపోయి రామాన్ని అతని ఆలోచనలను తుదపడానికి ప్రయత్నిస్తుంది కానీ
ఒకరోజు రామం బ్యాంక్ లో వున్నప్పుడు టెలిగ్రామ్ అమ్మ దగ్గరికించి వచ్చింది .”వదిన సీరియస్ వెంటనే రావాలి “రామం పదిరోజులు సెలవు అప్లై చేసి రాత్రి బస్సు కి బయల్దేరాడు .రామం ఆలోచనల్లో అన్నయ్య రాఘవ మెదిలాడు .కవలపిల్లలు యిద్దరు ,అమ్మాయి ,అబ్బాయి .ఇద్దరికీ అయిదు సంవత్సరాలు నిండాయి .రాఘవ జిల్ల్లాపరిషత్ బళ్లో తెలుగుపంతులు .వదిన వైదేహి బాధ్యతలు నేర్పుగా. సమర్ధవంతం గా నిర్వహిస్తూ సంసారం తీర్చిదిద్దుకుంది .మానవ సమాజాన్ని కుటుంబ బంధాలను సర్వనాశనం చేసిన కరోనా అన్నయ్య రాఘవను రెండేళ్ల క్రిందట కబళించింది .వదిన సీత,పిల్లల్లో అన్నయ్యను చూసుకుంటూ గడుపుతున్నది .ఇప్పుడు వదిన సిరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది !ఏమైందో ??
రామం తలుపులు తట్టగానే అమ్మ తలుపుతీసింది ,రాత్రి పదయ్యింది.నిశ్శబ్దం గా వుంది .
“రామం వచ్చావా ! పిల్లలు నిద్రపోతున్నారు ,వదిన కు గుండెపోటు వచ్చింది ,కానీ అదృష్టం కొద్దీ మనకు దక్కింది .ఇంటికి తెచ్చాను .కానీ వదిన ఆరోగ్యం సున్నితం అయ్యిందిట .డాక్టరుగారు యేమన్నారంటే వదిన యిప్పుడు గాజుబొమ్మ .మనసుకు కానీ శరీరానికి కానీ లవలేశమైనా విఘాతం కలిగితే ప్రాణాలకు ముప్పుట “అమ్మ కన్నీళ్లు రామానికి కళ్లు చెమ్మగిల్లాయి .ఇద్దరూ సీత పడుకున్న గదిలోకి వెళ్లారు .వదిన ముఖం లో అలసట ,కంటిక్రింద నల్లటిచారలు ,కళావిహీనంగా వున్న శరీరం .
అమ్మగదిలో పిల్లల్ని చూసాడు .తలనిమిరి ముద్దు పెట్టుకున్నాడు .వాళ్ల ప్రక్కనే పడుకున్నాడు .చంటిపాపాయి అర్ధరాత్రి సడ్డెన్ గా లేచి ‘అమ్మా అమ్మా ‘అంటూ యేడుస్తూ లేచింది .వెంటనే రామం జోకొట్టాడు అది రామం మెడచుట్టూ చేతులు వేసి కాళ్లు రామం. పొట్టమీద వేసి నిద్ర పోయింది .
తెల్లారక రామం దంతధావనం చేసుకుని ముందుగదిలో పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు .అమ్మ కాఫీ యిస్తూ “రామం ,వదిన పరిస్థితి చూసి భయం వేసి. టెలిగ్రామ్ యిచ్చాను .పిల్లలకు వదిన కు జ్వరం వచ్చిందనీ ,విసిగించవద్దనీ చెప్పాను “అన్నది .
“బాబాయ్ బాబాయ్ “అంటూ పిల్లలిద్దరూ రామం.వొళ్లో వచ్చికూర్చున్నారు .హడావిడిలో పిల్లలకు యేమి తేలేదు అప్పుడు గుర్తుకొచ్చింది రామానికి .గబగబా డ్రెస్ మార్చుకున్నాడు .”అమ్మా యిప్పుడే వస్తాను “అంటూ పిల్లల్ని తీసుకుని ప్రక్కవీధిలోని కొట్టుకెళ్లి వాళ్లకిష్టమైనవి తినడానికి కొన్నాడు .అలాగే పళ్లు కూడా కొన్నాడు .”స్వీటీ ,పిడుగూ సాయంత్రం మనం షికారు వెళ్దాం సరేనా “అన్నాడు రామం .
“ఓ బలే బలే “అంటూ ఆ పసికూనలు చప్పట్లు కొట్టారు .వాళ్ల ఆనందం చూస్తుంటే రామానికి ముచ్చటేసింది .చప్పున రేఖ గుర్తుకొచ్చింది .ఆ సాయంత్రం వూహించని సంఘటన ! సీత నిద్రలోనే ప్రాణం విడిచింది .అమ్మ నిద్రపోతుందనుకుని పిల్లలు “అమ్మా అమ్మా నీకోసం బాబాయ్ జిలెబీలు తెచ్చాడు లేమ్మా “లేపుతున్నారు !
“అమ్మ నిద్రపోతున్నది లేపకండి “అంటున్న అమ్మ మాటలు వింటున్న రామం. పిల్లల్ని గుండెలకు హత్తుకున్నాడు .
రామం దగ్గరే పడుకుంటారు .రామం వాళ్లకు అన్నం కలిపి ముద్దలు పెడతాడు .అనుకోకుండా వాళ్లతో అనుబంధం పెరిగింది . తన సెలవులను పొడిగించుకున్నాడు .రామం. తల్లి కూడా వంట చేస్తుంది .రామం పిల్లలకు. స్నానాలు చేయించడం వాళ్లకు కథలు చెప్పడం ,వాళ్ల కళ్లల్లో కన్నీటిబొట్టు రాలకుండా బంధాన్ని పెంచుకున్నాడు .నెల రోజులు గడిచిపోయాయి .సెలవులు అయిపోయాయి .రామం తల్లినీ పిల్లల్నీ తన వెంట తెచ్చుకున్నాడు .ఒకరోజు బజార్లో రేఖ కనపడింది .రామం. పలకరించి పిల్లల్ని చూపించాడు .
“నన్ను క్షమించు రేఖా ,బంధాల విలువలు అనుభూతులూ స్వయం గా అనుభవిస్తేనే కానీ ఆ తీయని మాధుర్యం తెలియదు “అన్నాడు రామం .రేఖ కళ్లల్లో సంతోషం తొణికిసలాడింది .పిల్లలు రేఖను చూస్తూ “బాబాయ్ పిన్ని భలేబావుంది బలే బలే “ నవ్వేసారు .
“అవునమ్మా మీ పిన్ని నచ్చిందా ? “అన్నాడు రామం ఓరకంట చూసాడు . రేఖను .రేఖ నవ్వింది .