మార్చురీలో ముచ్చట్లు - మద్దూరి నరసింహమూర్తి

Marchery lo muchhatlu

"ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్" అన్న మాటలు వినబడిన వెంటనే –

అందరూ వారి వారి స్థానాలలోకి చేరుకున్నారు.

మరు నిమిషంలో ఆ గది తలుపులు తెరుచుకోవడం, పది నిమిషాల తరువాత ఆ గది తలుపులు మూసుకోవడం జరిగిపోయింది.

మరో ఐదు నిమిషాల తదుపరి -- సభ్యులందరూ మరలా కలుసుకున్న వెంటనే --

"ఇప్పుడే మన బృందం సభ్యుల సంఖ్యకు మరొక సంఖ్య పెరిగింది. రండి అందరూ వెళ్లి స్వాగతం పలికి నూతన సభ్యునికి మన బృందంలోనికి ఆహ్వానిద్దాం" --

అన్న '515' మాటలకు సభ్యులందరూ కొద్దిగా ముందుకు కదిలి -

"ఇప్పుడే నూతనంగా ఈ గదిలోనికి వచ్చిన '606' కి ఈ బృందంలోనికి స్వాగతం" --

అని గట్టిగా సభ్యులందరూ చప్పట్లు చరుస్తూ ఆహ్వానం పలికేరు.

ఉలిక్కిపడిన ఆ నూతన సభ్యుడు "నా పేరు శ్రీమన్నారాయణ అయితే నన్ను మీరంతా '606' అని సంభోదిస్తున్నారేమిటి"

ఆ నూతన సభ్యుడి మాటలకు నవ్వు వచ్చినా, ఆపుకొన్న '515' --

"మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంతవరకే మనకి మన పేర్లతో పని, గుర్తింపు. ఈ గదిలోకి రావడానికి సిద్దమవగానే, వచ్చిన తరువాత మరియు ఈ గదిలోంచి బయట పడేవరకూ మన పేర్లు మరుగునపడి, మన కాలి బొటనవేలికి తగిలించిన నెంబర్ తోనే మనకు గుర్తింపు. ఇది మీరు తెలుసుకోవలసిన మొదటి పాఠం"

"మీరంతా ఎవరు"

"ఎవరిని వారు ఈ ' 606 ' కి పరిచయం చేసుకోండి" అన్న ' 515 ' మాటలకు –

అక్కడ ఉన్న మిగతా ఐదుగురు --

"నేను 412, నేను 307, నేను 514, నేను 604, నేను 312” అంటూ పరిచయాలు ముగించేరు"

"అసలు ఈ నెంబరు గొడవ ఏమిటి"

"ఈ ఆసుపత్రిలో వైద్యానికి మనం ఏ గదిలోకి చేరేమో, ఆ గది నెంబరే మన కాలి బొటనవేలికి తగిలించిన నంబరు. నేను చేరిన గది నెంబరు 515. అదే ఇప్పుడు నా నంబరు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నవారందరి నంబర్లు"

-2-

"ఈ బృందానికి నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరెవరు"

"ఇక్కడ ఉన్నవారిలో అందరికీ ముందుగా వచ్చిన నన్ను అందరూ నాయకుడిలా చూస్తున్నారు. అందరూ అలా గౌరవం ఇస్తూంటే, ఇక్కడ నేనుండే రెండు మూడు రోజులూ ఎందుకు కాదనాలని ఈ బృందానికి నాయకుడిలాగే వ్యవహరిస్తున్నాను”

"బ్రతికి ఉన్న రోజుల్లో మీరేమి చేసేవారు, అలాగే వీరంతా కూడా ఏమి చేసేవారు"

"నేను రెవిన్యూ శాఖలో హెడ్ అసిస్టెంట్ గా చేయగా -

412 ఈ ఆసుపత్రిలోనే గుండె శస్త్రచికిత్స వైద్యుడిగా చేస్తూనే అతని ఆఖరి ఊపిరి కూడా ఈ

ఆసుపత్రిలోనే వదిలేసేరు.

307 జూనియర్ ఇంజనీర్ గా రోడ్లు మరియు భవనాల శాఖలో పనిచేసేవారు.

514 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నీటి పారుదల శాఖలో పనిచేసేవారు.

604 భవనాలు కట్టడానికి కావలసిన ప్లాన్ అనుమతించే కార్యాలయంలో ప్యూన్ గా పనిచేసేవారు.

312 జంతువుల బాగోగులు చూసే శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవారు.

ఇంతకీ మీరేమి చేసేవారు”

“ఈ దేశంలో అతి పెద్ద బ్యాంకులో చీఫ్ జనరల్ మేనేజర్ గా చేసేవాడిని. అంటే, నేను మీ అందరికంటే గొప్ప అన్నమాట”

"మనం ప్రాణాలు పోగొట్టుకొని ఆత్మలగా మిగిలిన తరువాత అందరం ఒకటే. ఆ మాత్రం తెలియదా" అన్న 515 మాటలకు మిగతా ఐదుగురు పొర్లి పొర్లి నవ్వసాగేరు.

ఆ నగ్న సత్యం వినగానే తన తెలివితక్కువతనానికి 606 సిగ్గుపడ్డారు.

"మీరంతా ఇక్కడ ఎన్నాళ్ళై ఉన్నారు, ఎందుకు ఉన్నారు"

"మా సంగతి తరువాత చెప్తాము. ఎంతో గొప్పవారని అనుకుంటున్నమీరెందుకు ఇక్కడ ఉన్నారు"

"నేను చేసిన పెద్ద ఉద్యోగంతో నావలన లాభం ఆశిస్తారేమో అని నా బంధువులెవరినీ నా దరిదాపులలోనికి రానివ్వలేదు. నా సతీమణి రెండేళ్ల కిందట స్వర్గస్తురాలైంది. నా పిల్లలు ముగ్గురూ మూడు ఇతర దేశాల్లో ఉన్నారు. నా పిల్లలు ఇక్కడికి వచ్చేవరకూ నా సన్నిహితులు నన్నిక్కడ ఉంచేరు"

-3-

"మీలాగే ఇక్కడ ఉన్న ఆరుగురం కొంచెం అటూ ఇటుగా అదే అవస్థలో ఉన్నాము. మన ఏడుగురిలో నేనే అందరికంటే ముందునుంచి ఇక్కడ ఉన్నాను. అందుకే నా తరువాత వచ్చిన వీరు నన్ను నాయకుడిగా వ్యవహరిసున్నారు. ఇంకా అంత్యక్రియలు కాలేదు కాబట్టి, ఆ నాయకత్వ ఆలోచనలు వ్యవహారం నాకు ఒక రకమైన తృప్తి ఇస్తున్నాయి. నా పిల్లలు ఎప్పుడు వస్తారు, అసలు వస్తారా రారా అన్నది నాకు తెలియదు. ఆ లెక్కన నేను ఇంకా ఎన్నిరోజులు ఈ మార్చురీలో ఉండాలో తెలియదు. నేను ఇక్కడకి వచ్చిన తరువాత నలుగురు వచ్చి, అదృష్టవంతులు కాబట్టి, ఒకటి రెండు రోజుల్లో బయటకు వెళ్ళిపోయేరు"

"ప్యూన్ గా పని చేసిన 604 తాలూకా పిల్లలు కూడా విదేశాల్లోనే ఉన్నారా"

"ఎందుకు ఉండరు, అతనికి జీతం కంటే గీతం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేదట"

"ఒకవేళ ఏదైనా కారణానికి మన పిల్లలు అసలు రాకపోతే మనం ఇక్కడే ఉండిపోవాలా"

"అక్కరలేదు. ఒక నియమిత కాలపరిమాణం అయిపోతే, పోలీసుల సహాయంతో పురపాలక కార్యాలయం వారికి మనల్ని అప్పచెప్తారు. వారు మనకి అనాధ ప్రేత సంస్కారం చేసి, గొప్ప పుణ్యం సంపాదించుకుంటారు. అయితే చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్టు -- దినవారాలు, అంత్యక్రియలు మరియు అస్తిక నిమజ్జనం అంటూ ఏమీ ఉండవు"

“అంటే, ఇక్కడకి వచ్చిన తరువాత ఒకరు పెద్ద ఒకరు చిన్న అన్న తేడాలేమీ లేకుండా అందరూ ఒకే స్థితిలో వారి వారి కర్మ ఫలితంగా అంత్యక్రియలకు నోచుకుంటారన్నమాట"

"ఆధ్యాత్మిక అంతరార్ధాన్ని ఇక్కడికి వచ్చిన కొద్ది సేపట్లోనే తెలుసుకున్న మీరు ఇప్పుడు నిజంగా చాలా గొప్పవారు అనిపించుకున్నారు"

అందరూ పెద్దగా నవ్వుకుంటుండగా చిన్న అలికిడి విన్న 515 –

"ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్" అనగానే ఆ ఏడు ఆత్మలు వారివారి శరీరాల్లోకి త్వరగా లీనమైపోయేయి"

కొద్దిసేపు తదుపరి అక్కడున్న ఆత్మలన్నీ - 412 కి - ఈర్షతో వీడ్కోలు పలికేయి.

*****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు