అనగనగా ఒక దేశంలో చాలా రోజుల వరకు వర్షాలు కురవలేదు. ప్రజలు చాలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేసే రైతులు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంక కరువు తప్పదేమోనని అందరూ భయపడుతున్నారు. మహారాజు చనిపోవడంతో..తప్పక సింహాసనం ఎక్కాడు యువరాజు. యువరాజు చాలా బద్ధకస్తుడు ఎప్పుడూ విలాసాలలో మునిగి తేలుతూ..ప్రజల కష్టాలు అంతగా పట్టించుకోలేదు. ప్రజలందరూ తమ కష్టాలు ఎన్ని చెప్పుకున్నా..పట్టించుకోలేదు. ఇక లాభం లేదని..ఆ రాజ్యంలో ఒక తెలివైన, అనుభవం ఉన్న రామన్న దగ్గరకు వెళ్లి తమ కష్టాలు తీరే ఉపాయము చెప్పమని కోరారు అక్కడ రైతులు. మహారాజు గారు ఉన్నప్పుడు తమని చాలా బాగా పాలించేవారని...అతని తర్వాత ఆ బాధ్యత తీసుకున్న యువరాజు..ఎప్పుడూ విలాసాలు తప్ప, ప్రజల కష్టాలు పట్ల ధ్యాస లేదని అన్నారు. ఇలాంటి కరువు సమయంలో అప్పట్లో..మహారాజు గారు హోమం చేసేవారు. అప్పుడు వరుణ దేవుడు కరుణించి వర్షం కురిపించేవాడు. అదే విషయం యువరాజుకు చెప్పినా..ఫలితం లేదని అంతా విన్నవించుకున్నారు. ప్రజల మాటలు విన్న రామన్న...విషయం గ్రహించి, యువరాజు కు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన దాకా వస్తే గానీ, ఎవరికీ విషయం అర్ధం కాదని..దాని కోసం ఏం చెయ్యాలో అందరికీ వివరించాడు రామన్న.. యువరాజు కు అనుభవం లేదు, పైగా కుర్రతనం చేత అతను ఎవరి మాట వినడు. కావున..మీరు పడుతున్న కష్టం యువరాజు కు ఎదురైతే..అప్పుడు అతను ఏదో పరిష్కారం కోసం ముందుకు వస్తాడు. అప్పుడు మీ మాట వింటారు. కరువు చేత..పంటలు పండలేదని..తాగడానికి నీళ్ళు కూడా లేవని..యువరాజుకు తెలిసేలాగా చెయ్యండి. తినడానికి అన్నం లేదని అతనికి దుంపలు పెట్టండి. అప్పుడు యువరాజుకు మీ బాధ తెలిసి..పరిష్కారం కోసం ఆలోచిస్తాడు. కొన్ని రోజుల తర్వాత...నిత్యం విందు భోజనం చేసే యువరాజుకు దుంప కూరలతో భోజనం వడ్డించడం చూసి.. చాలా కోపం వచ్చింది. అప్పుడు రాజు కు రాజ్యం లో నెలకొన్న కరువు పరిస్థితులు గురించి మంత్రి వివరించాడు. స్వయం అనుభవం తో, విషయం పరిష్కరించాలని నిర్ణయించుకుని..దానికి ఏమిటి చెయ్యాలో అందరినీ అడిగి తెలుసుకుని..రాజ్యంలో హోమం కోసం ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించాడు. హోమం అనంతరం..వరుణ దేవుడు సంతోషించి ఆ సంవత్సరం పుష్కలంగా వర్షం కురిపించాడు. ప్రజలందరూ చాలా ఆనందించారు. రాజు తను చేసిన తప్పు తెలుసుకుని..ఇక పై ప్రజలు కష్టాలు పడకుండా..రాజ్యాన్ని పాలించాడు.
****