పదవీవిరమణ కానుక - బామాశ్రీ

Padavee viramana kanuka

పదవీవిరమణ సభ పూర్తయిన తర్వాత కారులో ఇంటికి వచ్చి, దిగుతున్న రామం చేతిలో పూలదండ వుంది. “వసంతా! జాగ్రత్తగా దిగు!” అనగానే అతనితో పాటు వచ్చిన ఆమె కూడా చేతిలో పూలదండతో నెమ్మదిగా దిగుతుంది. వెంటనే ఇద్దరూ చెరోదండ పట్టుకుని అడుగులో అడుగువేసుకుంటూ నెమ్మదిగా వస్తున్న వాళ్ళను చూడగానే కాంతమ్మ మనసు ఏదోలా అయిపోయింది.

అది చూసిన కాంతమ్మ ఎప్పుడూ, ఎవరో ఒకరిని తీసుకువస్తాను అంటే ఏదో అనుకున్నాను గాని నిజంగా ఇలా తీసుకు వస్తాడని అనుకోకపోవడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలిన కాకిలా విలవిలాడిపోయింది. అయినా వెంటనే తేరుకుని “ఎవరీ టక్కులాడీ! ఎక్కడ దొరికింది? ఈ వయసులో నా ముసలాడితో దండలతో దిగావు. ఎవరివే నువ్వు?” అని పూనకాలు లోడింగ్ చేసింది.

“నువ్వే కదా! ఉదయం నీ ఇష్టం వచ్చిన వారిని తీసుకు రమ్మనావు. నేను తీసుకువచ్చాను” అన్నాడు రామం.

“ఏదో మాటవరసకి అన్నంత మాత్రాన ఇలా చేసేస్తారా!” అని ఏడుపు ముఖంతో అంది.

“ఏ రోజైనా భర్తను భర్తగా చూసావా. నాకు కావలసిన మంచి చెడులు పట్టించుకున్నావా?”

“అంత మాత్రానికే మీ ఇష్టం వచ్చిన వారిని తీసుకొస్తే, వూరుకుంటాననుకున్నావా?”

“ఊరుకొనకా ఏమి చేస్తావు?” అన్నాడు.

“ఏమి చేస్తానో చూడు! మా తమ్ముడ్ని, మా చిన్నాన్నను రమ్మని వెంటనే పిలుస్తాను. వాళ్ళు వచ్చి మీకు ఈ వయసులో ఇలాంటివేంటోనని కడిగేస్తారు” అని చేతిలో నున్న సెల్ ఫోన్ తీసి తమ్ముడుకి ఫోన్ చేసి “వెంటనే నువ్వు, చిన్నాన్న రా!” అని ఏడుస్తూ కోపంగా అంది.

“ఇంతకీ ఏమయ్యింది” అన్నాడు వాళ్ళ తమ్ముడు.

“ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. మీ బావ ఎవరో బజారుదాన్ని దండలతో తీసుకువచ్చాడు”

“కంగారు పడకు, ఇప్పుడే చిన్నాన్న, నేను బయలుదేరుతాము” అని అయిదారు కిలోమీటర్ల దూరంలో వున్న తమ్ముడు బంగర్రాజు, వాళ్ళ చిన్నాన్న సాంబయ్యను వెంటపెట్టుకుని బయలుదేరాడు. ఇంతలో ఆమెకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటీ కళ్లముందు కనిపించాయి.

౦ -

రామాపురంలో రామం అనే పోస్ట్ మేన్ వున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవితం ఓ మాదిరిగా సాగిపోతుంది. భార్య అయినదానికి కానిదానికి సతాయిస్తూ, ప్రతిదానికి పెడార్థలు తీస్తూ విసిగిస్తూ వుంది. అలా వారి కాపురం మూడు గొడవలు, ఆరు పరిష్కారాలుగా సాగుతూ వుంది. వయసుతో పాటు చాదస్తం పెరిగిపోయి భర్తను పట్టించుకోకుండా తన ఆలోచనలతో తాను బ్రతికేస్తుంది. చాలాకాలంగా ఓపికగా ఉన్నాడు రామం. ఎన్నిచెప్పినా తనలో మార్పు రాలేదు.

ప్రతిసారి వేళాకోళంగా “నిన్ను విడిచి పెట్టేసి, వేరే ఎవరొకరితో సహజీవనం చేస్తాను లేదా తీసుకువస్తాను” అనేవాడు. “ఎవరొస్తారంటా ఈ సొగ్గాడికి!” అని సాగదీస్తూ అనడమే కాకుండా “తీసుకు తెచ్చుకోండి” అని అనడం వారిద్దరి మధ్య అలవాటుగా మారింది.

పదవీవిరమణ రోజు తనతో పాటు రామం రిటైర్మెంట్ కార్యక్రమానికి రమ్మని బ్రతిమాలాడు. రానని మొండికేసింది. దానితో ఎప్పుడులాగే “అయితే ఈ రోజు ఎవరొకరిని ఆ మీటింగుకు తీసుకువెళ్ళి సాయంత్రం తీసుకువస్తాను” అని కోపంగా అన్నాడు. “ఈ వయసులో ఎవరొస్తారు?” అని సాగదీసింది కాంతమ్మ.

“వయసు చూసి కాకపోయిన, నా పెన్షన్ చూసైనా ఎవరో ఒకరూ వెంటపడకుండా వుంటారంటావా?” అని ఉక్రోశంగా అన్నాడు రామం. “ఎపుడూ ఇలాగే అంటాడు, ఏం చేస్తాడులే” అని తలచి, తనకు ఎవరువస్తారలే అని నమ్మకంతో “అలాగే” అంది కాంతమ్మ. “అయితే ఈ రోజు నీవు జీవితంలో మరచిపోలేని కానుక తెస్తాను” అని ఆఫీసుకు వెళ్ళిపోయాడు రామం.

-౦-

ఇంతలో రామానికి కూడా జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటీ కళ్లముందు కనిపించాయి. పదవీవిరమణ రోజు గురించి ముందు నుంచి భార్యభర్తలు మధ్య జరుగుతున్న సంభాషణలతో రామంకు మనస్సు నొచ్చుకుంది. అందరిలో పరువు పోతుందని బాధ పడుతున్న రామంకు, ముందు రోజు వసంత ఓ సలహా ఇచ్చింది. ఉదయం నుండి వస్తుందని చెప్పు, సాయంత్రం అయిన తర్వాత ఆమె తరుపు బంధువులు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందని దానితో ఆమె అక్కడికి వెళ్ళి పోయిందని చెప్పమని సలహా ఇచ్చింది. అలా చేయడం వలన వారు కార్యక్రమాన్ని వాయిదా వేయరు. మీకు మర్యాద పోదు అంది. అలాగే చేద్దామని నిశ్చయించుకున్నాడు రామం.

కొద్దికాలం క్రితం నడివయస్సులోనున్న వసంత కలిసింది. ఆమె కూడా అలసిన మనసుతో విసిగి వేసారిపోయింది. ఎందుకంటే తాగుడుకు బానిస అయిన భర్త రోజు శారీరకంగా హింసిస్తూ, ఎంతో వేదనకు గురిచేసేవాడు. ఓ రోజు మందు ఎక్కువయ్యి రోడ్డు దాటుతూ ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళిన మూడు నెలల తర్వాత తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. దానితో ఆమె ఒక్కగానొక్క కూతురు కోసం బ్రతకడం నేర్చుకుంది. భర్త లేకపోవడంతో, అమ్మాయే ప్రపంచమయ్యి జీవనం సాగిస్తూ వుంది. పెళ్ళీడు వచ్చిన తర్వాత కూతురుకు పెళ్ళి చేసి ఒంటరిగా వుంటుంది. ఈ మధ్య కాలంలో వసంత అల్లుడుకు ఇక్కడకు ట్రాన్సఫర్ అవడంతో వసంత, రామంల మద్య స్నేహం ఏర్పడింది.

అయినా ఆమె జీవితాన్ని ఆరోగ్యంగా వుంచుకుంటూ, ఉల్లాసంగా బ్రతకడం నేర్చుకుంది. ఇద్దరూ ఈవినింగ్ వాక్ లో కలుసుకోవడం, నెమ్మదిగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవడము జరిగింది. దానితో ఒకరి సమస్యకు మరొకరు పరిష్కారం చూపుకుంటూ అరమరికలు లేని స్నేహంతో వుంటున్నారు. ఎందుకటే రామం కూడా మంచి మనిషి, సహాయం చేసే గుణమున్న వాడు. ఆమెను ప్రత్యేకంగా పదవీవిరమణ కార్యక్రమానికి రమ్మని పిలిచాడు రామం. అంతమందిలోకి రావడం బాగోదని తర్వాత కలుస్తానని మర్యాదగా చెప్పింది. అలాగేనని అనుకున్నరు ఇద్దరు.

-౦-

ఈ లోపు రామం “కాంతం ! ఓ సారి ఇలారా! కొంచెం టీ గాని, కాఫీగాని వసంతకు ఇవ్వు!” అన్నాడు.

“మీ ఇద్దరికీ సేవ చేయడానికి నేను వున్నానా!” అంది

“ఉదయం నీవే కదా! పర్మిషన్ ఇచ్చి, నీకు ఇష్టమైన వారిని తీసుకురమ్మన్నావు” అని ఉడికిస్తూ అన్నాడు.

“ఏదో బుద్ది తక్కువై అన్నాను.” అని కన్నీరు మున్నీరు అయ్యి అంది.

“రాము! కాంతము గారిని ఏమనకు. ఆమె బాధ పడుతుంది” అంది వసంత.

“వాత పెట్టేలా పెట్టేసి, పూత పూస్తున్నావే వగలాడి!” అని మరింత కోపంగా వూగిపోతూ అంది.

“కాంతంగారూ! ఇందులో నా తప్పు ఏమీ లేదు!”

“నీ తప్పు ఏమీ లేదమ్మా! అంతా నా ప్రారబ్ధం!” అని తలబాదుకుంది కాంతం.

“నీలో మార్పు కనిపిస్తునట్టుంది” అని వెటాకారం ఆడాడు రామం.

“ఎక్కడో సంతలో నుండి వచ్చిన వసంతా వెళ్ళిపోతే మిమ్మల్ని బంగారంలా చూసుకుంటాను!” అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది.

“అలాగే!” అని ఆమె తలమీద చేయి వేసి రామం నిమురుతున్న సమయంలో కాంతం తమ్ముడు, చిన్నాన్న వచ్చారు.

వచ్చి రాగేనే చిన్నాన్న “ఏమ్మా! కాంతం ఏమిటీ! గొడవ” అన్నాడు.

“ఏముంది చిన్నాన్న! ఇదిగో ఇది ఎవర్తో వసంత అంటా! ఎక్కడో ఏ సంతలో దొరికిందో, మీ అల్లుడుగారు దీనిని తీసుకువచ్చారు” అని భోరున విలపించసాగింది.

ఇంతలో చిన్నాన్న సాంబయ్య వసంతను చూసి, “ఏమ్మా! బాగున్నావా! ఎన్నాళ్ళయ్యింది. నిను చూసి” అని ఆశ్చర్యంగా అన్నాడు.

“బాగానే వున్నాను మావయ్యగారూ!” అంది.

వెంటనే కాంతం కలుగజేసుకుని “చిన్నానా! ఈ టక్కులాడి వసంత నీకు కూడా తెలుసా!” అని సాగదీసింది.

“ఇంతకూ నీకు ఈమె ఎవరో తెలుసా?” అని సాంబయ్య అన్నాడు.

“ఎవరంటా?” అని వెటకారంగా అంది.

“ఈమె నీకు వదిన అవుతుంది”

“వదినా!” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, “ఎలాగా?” అంది.

“బొంబాయి బాబయ్ గారి కోడలు”

“ఏమిటి! బొండం బాబయ్ గారి కోడలా!”

“అవును, బొండం బాబయ్ గారి అబ్బాయి అదే నీకు అన్నయ్య అవుతాడు గదా! వాడు ఈ వసంతా లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో మీరెవరూ ఆ పెళ్ళికి రాలేదు. అయితే నేను మధ్యలో వెళ్ళడంతో నాకు వసంత తెలుసు. మీ అన్నయ్య వ్యసనాలు పాలయ్యి, ఈ అమ్మాయి జీవితం నాశనం చేశాడు.”

“అయ్యో! పాపం! అలాగా!” అని ఓదార్పుగా అంది కాంతం.

“మావయ్య గారు! వసంత నాకు చెల్లెలు అవుతుందని ఈ విషయాలన్ని తెలుసు” అన్నాడు రామం.

“అయితే మరి గొడవ ఏమిటీ! రాము!” అన్నాడు సాంబయ్య.

“ఏమిలేదు మావయ్య గారు! ఉదయం ఎవరినైనా తీసుకుతెచ్చుకోమంది కాంతం. నా రిటైర్మెంట్ రోజు కదా అని శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చింది సోదరి వసంత. నాతో ఈమె రావడముతో నిజంగా ఎవరినో తీసుకువచ్చాను అని ఏడుస్తూ, నానా హడావిడి చేసింది” అన్నాడు రామం.

“అయితే?”

“సరదాగా ఆట పట్టిదామని నా సోదరిమణితో కలిసి చిన్న నటన చేశాను”

“ఏమిటీ! నాటకము ఆడరా!” అని మురిసిపోయింది కాంతం.

నిజంగా మేము నాటకం ఆడాలని అనుకోలేదు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలుపుదామని ఆమె మన ఇంటికి నడిచి వస్తూ, రోడ్డు చివర టర్నింగ్ లో వసంత కనిపించింది. తెలిసినామె కదాని కారు ఎక్కమన్నాను. మమ్మల్ని ఇద్దర్ని చూసి కంగరు పడడంతో కాస్తంత బెట్టు చేసాను. అంతే” అన్నాడు రామం.

“నీలో ఈ కళ కూడా వుందా బావ” అన్నాడు బావమరిది బంగర్రాజు.

“మనిషి అన్నాక కాస్తంతా కళాపోషణ వుండాలి. లేకుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది, అని ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు అన్నాడు కదా! రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఏదో కళాపోషణ చేస్తే బాగుంటుందేమో!” అన్నాడు రామం.

“ఓరి! నాయనో! మీలో ఈ కళ కూడా వుందా!” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “వదిన తెలియక కంగారులో ఏదో మాటలు జారాను. నన్ను క్షమించు” అని వసంత చేతులు పట్టుకుంది కాంతం.

“రాము అన్నయ్యా! కాంతం వదినలో మార్పు వచ్చింది. నీవు తెచ్చిన అసలు పదవీవిరమణ కానుక వదినకు అందించు” అంది వసంత.

ఎప్పటి నుండో కాంతం వెండితాళాల గుత్తు కావలని కోరుకోవడంతో వజ్రాల పొదిగిన తాళం చేతి గుత్తిని, రాము తన జేబులో నుండి తీసి ఇస్తూ “ముఖ్యమైన విలువైన వస్తువులన్నీ భద్రంగా వుంచేవి తాళాలు. అటువంటి తాళాలను ఓ చోట గుప్తంగా వుంచే, తాళంగుత్తి నీచేతిలో పెడుతున్నాను. ఇకపై ఇంటిపరువును, బాధ్యతలను జాగ్రత్తగా కాపాడు. అందుకో నా పదవీవిరమణ కానుక” అని అందించాడు.

“భార్యభర్తలు ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకుని, సంసారం హాయిగా గడపాలి, చిన్న చిన్న గొడవలు ఒక్కొక్కసారి చిలికి చిలికి గాలివాన కావచ్చు. ప్రతిదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే సంసారంలో ప్రశాంతత వుండదు. కాబట్టి ఇద్దరూ ప్రశాంతంగా వుండండి” అని హితబోధ చేసి, “ఈ వయస్సులో మీకు చెప్పవలసిన అవసరం లేదు గాని పెద్దవాడిని కాబట్టి చెబుతున్నాను. జాగ్రత్తగా వుండండి. వెళ్ళొస్తాను” అన్నాడు సాంబయ్య.

“వుండండి మావయ్యగారు, అందరూ భోజనాలు చేసి వెళ్ళండి”అన్నాడు రామం.

ఆనందభాష్పాలను తుడుచుకుంటూ భర్త ఒడిలో చంటిపిల్లలా ఒదిగిపోయింది కాంతం. “ఇక మేమెందుకు వెళ్ళొస్తామని” అందరూ అంటుంటే “ఈ రోజు మా వారి రిటైర్మెంట్ కదాని నేను చేసిన వంటలు అన్నీ తినివెళ్ళవలసిందే” అంది కాంతం. అందరూ అలాగేనని తలూపి నవ్వుకున్నారు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు