"అమ్మా, దయచేసి ఒక్కసారి నా మాట వినిపించుకుంటారా"
అన్న కేక గేట్ కు ఆవలనుంచి వినిపించి –
వంటగది లోపల పనిచేసుకుంటున్న కమలమ్మగారు చేయి కడుక్కొని పమిటతో తుడుచుకుంటూ వస్తూ 'రాత్రి 9 గంటలప్పుడు ఎవరదీ' అని స్వగతంలో అనుకుంటూ --
"ఏం కావాలి నాయనా" అని అడిగింది ఎదురుగా గేట్ దగ్గర నుదుటన తిరునామం, ఒంటిన కాషాయ వస్త్రాలు, భుజాన వేలాడుతూన్న ఒక సంచీతో నిలబడ్డ సుమారు 30 ఏళ్ల వయసున్న అబ్బాయిని.
"కాలి నడకన అయోధ్య వెళుతున్నా తల్లీ. ఈ రాత్రికి మా ఇద్దరికీ మీ ఇంట్లో తలదాచుకోనిస్తారా, ఉదయమే వెళ్ళిపోతాము"
"ఒక్క నిమిషం ఉండు" అని లోపలికి వెళ్లి --
"ఏమండీ ఎవరో అబ్బాయి మన గేట్ దగ్గర నిలబడి ‘కాలి నడకన అయోధ్య వెళుతున్నాము, ఈరాత్రికి మా ఇద్దరికీ మీ ఇంట్లో తలదాచుకోనిస్తారా’ అని అడుగుతున్నాడు. ఏం చెప్పమంటారు"
"ఉండు నేను వస్తాను" అని కామేశ్వర శాస్త్రిగారు బయటకు వచ్చి ---
"ఎవరు నువ్వు, మా ఇంట్లో తలదాచుకుంటాము అంటున్నావట ఎందుకు, ఏదో లాడ్జిలో ఉండవచ్చు కదా"
"అయోధ్యారాముడిని దర్శించుకోవాలని కాలినడకన బయలుదేరేనండీ. ఈ నియమాల్లో నేను లాడ్జిలో ఉండదలచుకోలేదు. ఈరోజు ఇప్పటికి పది ఇళ్లవారిని అడిగేను. కొందరు చీదరించుకున్నారు, కొందరు వీల్లేదన్నారు. వారి కారణాలు వారివి. చివరగా మిమ్మల్ని అడుగుదామని కేక వేసేను. మీరూ కాదంటే బస్సు స్టాండ్ కి పోయి అక్కడే ఒక చోట ఈ రాత్రి గడిపేద్దామని అనుకుంటున్నాను"
"ఈ చలిలో అలా ఎలా ఉంటావు కానీ, లోపలికి రా"
గేట్ తీసుకొని వచ్చిన అతని చేతిలో ఒక సంచీ తప్ప అతనితో మరెవరూ లేకపోవడంతో చూసిన శాస్త్రిగారు--
"మా ఇద్దరికీ మీ ఇంట్లో తలదాచుకోనిస్తారా అని అడిగేవట, మరి నువ్వొక్కడివే లోపలికి వస్తున్నావు”
అప్పుడతను తన దగ్గర ఉన్న సంచీలోంచి ఫోటోఫ్రేమ్ తీసి అందులో ఉన్న శ్రీరాముని చూపించి "నాతో పాటూ నాకు రక్షణగా శ్రీరాముడు కూడా నాతోనే ప్రయాణం చేస్తున్నాడండీ. అందుకే, అలా అడిగేను"
"చిన్నవయసులో ఎంత ఉదాత్తమైన ఆలోచన బాబూ. నువ్వు నాకు బాగా నచ్చేవు. ఈ ఒక్క సంచీతోనే అయోధ్యవరకూ ప్రయాణం చేస్తావా, ఇంకా ఏమిటున్నాయి ఆ సంచీలో, నీ పేరేమిటి ?"
"నా పేరు రఘురామ్ అండీ. ఈ సంచీలో రెండు పంచెలు, రెండు చొక్కాలు, తువ్వాలు, దంతధావనానికి స్నానానికి కావలసిన సామగ్రి ఉన్నాయండీ" అని చెప్తూ లోపలికి వచ్చేడు.
"అలాగా. ఈ గదిలోకి వెళ్ళు, లోపల స్నానాల గది ఉంది. వేడి నీళ్లతో శుభ్రంగా స్నానం చేసి రా, భోజనం చేద్దువుగాని. తరువాత ఈ గదిలో మంచం మీద పడుకుందువుగాని"
-2-
"మీ దంపతులకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు చన్నీళ్ళ స్నానం మరియు భూశయనం నియమాల్లో ఉన్నాను. అందుకే క్రిందనే పడుకుంటాను. రాత్రి తినడానికి నాలుగు అరటిపళ్ళు నా సంచీలో ఉన్నాయండీ, అవి చాలు నాకు. అయోధ్యరాముడి దర్శనం అయేవరకూ అన్నం ముట్టనని నియమం పెట్టుకున్నానండీ"
"సరే. నీ నియమాలు మేమెందుకు కాదంటాము కానీ, స్నానం చేసి రా. నీ దగ్గరున్న అరటిపళ్ళు రేపు నీకు అవసరం పడినప్పుడు తినవచ్చు. మా ఇంట్లో ఈ రాత్రికి ఫలహారం పాలు తీసుకో"
"అలాగేనండీ, నాకు ఈరాత్రికి ఆశ్రయం ఇచ్చిన మీ మాట ఎలా కాదనగలను" అని స్నానం చేయడానికి వెళ్ళేడు రఘురామ్.
రఘురామ్ ఫలహారం చేస్తూన్నప్పుడు పక్కనే కూర్చున్న కామేశ్వర శాస్త్రిగారు --
"ఏమిటి చేస్తున్నావు నాయనా నువ్వు? చదువుకుంటున్నావా లేక ఉద్యోగం చేస్తున్నావా?"
"కాకినాడలో మాకు బంగారం వెండి సామానులు నవరత్నాలు అమ్మే దుకాణం ఉందండీ. మా నాన్నగారికి కాన్సర్. అన్నయ్య నాన్నని దుకాణాన్ని చూసుకుంటూంటే, నాన్నగారి ఆరోగ్యం బాగుపడాలని కోరుతూ నా రాముడు నా విశ్వాసాన్ని వమ్ముచేయడని గట్టి నమ్మకం తో నేను ఈ యాత్ర చేస్తున్నాను"
"మంచి పని చేస్తున్నావు నాయనా. శ్రీరాముడు నీకు తప్పకుండా అండగా నిలబడతాడని, మీ నాన్నగారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తాడని నేను కూడా నమ్ముతున్నాను. పాలు త్రాగి విశ్రాంతి తీసుకో" అని రఘురామ్ కి చెప్పి ---
"కమలా, బిడ్డకి రేపు ఉదయం ఏదేనా తినడానికి పెట్టి, దారిలో కూడా తినడానికి ఇచ్చి పంపు"
"ఎందుకండీ అమ్మగారిని శ్రమ పెడతారు. నేను రేపు ఉదయం ఆరోగంటకే బయలుదేరిపోతాను" అన్న రఘురామ్ మాటలు విన్న కమలమ్మగారు --
"ఇందులో శ్రమ ఏముంది నాయనా. మేమిద్దరమూ ఉదయం నాలుగో గంటకే లేచిపోతాం. నీకు ఆమాత్రమేనా చేస్తే నీద్వారా శ్రీరాముడిని మేము కూడా సేవించుకున్నట్టు అవుతుంది కదా"
"మీ ఇష్టం అమ్మా" అని రఘురామ్ తనకు కేటాయించిన గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రిమించేడు.
బ్రహ్మముహూర్తంలోనే లేచిన ముగ్గురూ కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాదికాలు జపాలు ముగించుకొని మధ్యగదిలో కూర్చొని ముందు కాఫీ సేవించేరు. తదుపరి, కమలమ్మగారు రఘురాంకి తినడానికి ఇడ్డెన్లు పెట్టి, దారిలో తినడానికి పులిహోర పెరుగుతో బాటూ కొన్ని పళ్ళు కూడా ఇచ్చేరు.
వారి ఆతిధ్యానికి పులకించిన గుండెతో కళ్ళనిండా నీళ్లు పెట్టుకున్న రఘురామ్ శాస్త్రిగారి దంపతులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొంది అతను అనుకున్నట్టుగానే ఆరోగంటకు తన పాదయాత్ర పునః ప్రారంభించేడు.
శాస్త్రిగారి దంపతులు రఘురామ్ వెళ్లిన వేపే చూస్తూ ఒక విధమైన భావోద్వేగంతో నిలబడిపోయేరు.
-3-
కానీ, రఘురామ్ ను, శాస్త్రిగారి దంపతులను, ముందు రోజు రాత్రినుంచే గమనిస్తున్న మరొక ఆసామి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ ఆ పరిసరాలలోనే తచ్చాడుతున్న సంగతి ఎవరూ గమనించలేదు.
మరొక పది రోజుల తరువాత --
ఆ ఆసామి రఘురామ్ లాగే శాస్త్రిగారి ఇంటికి వచ్చి ‘నారాయణ’ అన్న పేరుతో ఆశ్రయం పొంది శాస్త్రిగారి దంపతుల ఆతిధ్యం అందుకొని –
శాస్త్రిగారి దంపతులు గాఢనిద్రలో ఉన్నప్పుడు శాస్త్రిగారి ఇంట్లో ఉన్న విలువైన సామానులు మూటగట్టుకొని మరుసటి రోజు బ్రహ్మముహూర్తం సమయం ముందే మెల్లిగా చీకటిలో కనుమరుగైపోయేడు.
మూర్తీభవించిన మంచితనంతో అందరిలోనూ మంచితనం చూసే శాస్త్రిగారి దంపతులు, జరిగిన దొంగతనం తెలియక, తెలివి వచ్చిన తరువాత నారాయణ కనబడకపోతే –
‘మనల్ని ఇంకా శ్రమ పెట్టడం ఎందుకు అనుకున్నాడేమో పాపం మనల్ని లేపకుండా కూడా వీధి తలుపు దగ్గరగా వేసి త్వరగా వెళ్ళిపోయేడు’ –
అని తలపోస్తూ దైనందిన కార్యక్రమాల్లోకి ఉపక్రమించేరు.
*****