'నా పరిశోధన సక్సెస్ అయ్యింది..! హిప్ హిప్ హురే!!! ' అని ఆనంద్ ఆనందంతో కేకలు వేస్తున్నాడు..
"ఏమైందండీ! అంత ఆనందంగా ఉన్నారు ఈ రోజు..?" అడిగింది భార్య రాధ
"ఇన్నేళ్ళ నా శ్రమ ఫలించింది రాధా..!"
"మీ పరిశోధనలు ఏమిటో నాకు బొత్తిగా అర్ధం కావు..ఈసారి పిల్లిని ఎలుక చేసే ప్రయోగం ఏమైనా చేసారా..?"
"తర్వాత చెబుతాను..ముందు ఈ ఫార్ములాని బాగా టెస్ట్ చెయ్యనీ.."
"నాకు వంటింట్లో పనుంది..మీరు ఏదో చేసుకోండి.." అని చెప్పి వెళ్లిపోయింది రాధ
****
ఆనంద్ చాలా తెలివైన అబ్బాయి. ఎప్పుడూ స్కూల్ లో టీచర్స్ ని తరగతికి మించిన ప్రశ్నలు అడిగేవాడు. దానికి టీచర్స్ కుడా చాలా ఆశ్చర్యపోయేవారు. ఆనంద్ కి ఊహ తెలిసినప్పటినుంచి తన ఊరిలో ఎవరైనా చనిపోవడం చూసినప్పుడు చాలా బాధ పడేవాడు. మనిషి ఎందుకు చనిపోవాలి..? ఎంతో ఆనందంగా ఉన్నవారు సడన్ గా చనిపోతున్నారు..? దీని గురించి తన తాతయ్య దగ్గరకు ఒక రోజు వెళ్లి అడిగాడు..
"తాతయ్య! నాకు ఒక సందేహం ఉంది.."
"చెప్పు ఆనంద్.."
"మనిషి చనిపోవడం తప్పదా..?"
"పుట్టిన ప్రతి జీవీ..గిట్టక తప్పదు ఆనంద్.."
"మరి..కొంతమంది చిన్న వయసులోనే చనిపోతున్నారు కదా.."
"అది వారి పూర్వజన్మ కర్మఫలం ఆనంద్.."
"చనిపోయిన మనిషిని మళ్ళీ బతికించడం అవుతుందా..?"
"ఇప్పటివరకు మానవులకు సాధ్యపడలేదు ఆనంద్..!"
****
అప్పటినుంచి ఆనంద్..ఎలాగైనా.. చనిపోయిన మనిషిని బతికించే ఆ ఫార్ములాని కనిపెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. చదువుతో పాటు తన ప్రయోగాలను వదలలేదు. ఎప్పుడూ ఏవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక సక్సెస్ వచ్చింది. ఒక ఫార్ములాను తయారు చేసాడు. కానీ, తెలిసిన విషయం ఏమిటంటే, సహజ మరణం పొందిన వారిపై మాత్రమే అ ఫార్ముల పనిచేస్తుంది..అది కుడా ఒకే సారి.
దేవుడు వరం ఇచ్చినా..ఒకే వరం దొరికింది. దానిని ఎవరికోసం ఉపయోగించాలో ఆనంద్ కి అర్ధం కాలేదు. చాలా రోజులు ఆలోచించాడు. ఒక రోజు తన భార్య రాధ చాలా డల్ గా ఉండడం గమనించిన ఆనంద్..
"రాధా..! ఎందుకు అంత డల్ గా ఉన్నావు..?"
"ఏమీ లేదండీ! ఈ రోజు మా అమ్మ చనిపోయిన రోజు. ఆమె గుర్తుకు వచ్చింది. మనకి కొత్తగా పెళ్ళయ్యింది కదా..నా జీవితంలో విషయాలు మీకు ఇంకా పూర్తిగా తెలియవు.."
"ఎందుకు బాధపడతావు రాధా..! నీకు నేను ఉన్నాను కదా.."
"అవునండీ..నన్ను బాగా అర్ధం చేసుకునే మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మీలాంటి మంచి అల్లుడుని చూస్తే, మా అమ్మ ఎంతో మురుసిపోయేది. చిన్నప్పుడు మా అమ్మ నాకు గోరింటాకు పెట్టినప్పుడు..బాగా పండిందని, నాకు మంచి మొగుడు వస్తాడని చెప్పేది. 'అయితే నా మొగుడు ఈ అత్తగారిని కుడా బాగా చూసుకుంటాడు కదా అయితే..!' అని అమ్మతో అనేదానిని. దానికి మా అమ్మ చిన్నగా నవ్వి..నాకు ఒక మొట్టికాయ ఇచ్చేది.. "
"ఇంతకీ మీ అమ్మ, నాన్న ఎలా చనిపోయారు రాధా..?"
"మా నాన్న చిన్నప్పుడే ఆక్సిడెంట్ లో పోయారు. అప్పటినుంచి అమ్మే నాకు అన్నీ అయి పెంచింది. నేను కాలేజీ లో చదువుతున్న రోజుల్లో అమ్మకు ఒక రోజు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళే లోపే చనిపోయింది..." అని చెబుతూ చిన్నపిల్లలాగా ఏడుస్తోంది రాధ..
"రాధా..! నాకు తల్లిదండ్రులు లేరు. నీకూ ఎవరు లేరు..నీకు నేను, నాకు నువ్వు హ్యాపీ గా ఉండాలి..." అని చెప్పి భార్యను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు ఆనంద్.
ఆ రోజు రాత్రంతా ఆనంద్ మెదడులో అవే ఆలోచనలు. నా కంటూ జీవితంలో ఉన్నది నా భార్య మాత్రమే. ఆమె ఆనందంగా ఉండడం కన్నా..నాకు ఇంకేంకావాలి..?
ఆనంద్ అత్తగారు అనారోగ్యం తో చనిపోయారు. అమ్మ అంటే రాధ కు చాలా ప్రేమ. ఎలాగైనా.. తన భార్య కోసం తన ఫార్ములా ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు ఆనంద్.
రాధ అమ్మ ని ఎక్కడ దహనం చేసారో తెలుసుకుని..అక్కడ నుంచి తీసుకుని వచ్చిన మట్టిని తన ఫార్ములా తో జోడించి ప్రయోగం చేసాడు. కొంతసేపటికి అత్తగారి ఆకారం ఎదురుగా తయారైంది. చివరిగా ప్రాణం పోయడానికి రాధ 'డిఎన్ఏ' తో ప్రయోగం చేసాడు. ఆమె కు ప్రాణం వచ్చింది.
మెల్లగా కళ్ళు తెరిచిన అత్తగారు.."రాధా..!రాధా..!రాధా..!" అంటూ పిలిచింది.
వంటింట్లో ఉన్న రాధ..అది తన అమ్మ గొంతేనని గ్రహించి ఆనందంతో..భర్త టీవీ లో పాత వీడియో ఏమైనా పెట్టడేమోనని హాల్ లోకి వచ్చి చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఎదురుగా అమ్మ ఉంది!!!
"అమ్మా..!" అంటూ వెళ్లి గట్టిగా కౌగలించుకుంది రాధ. ఆ తర్వాత ఆనంద్ ని అమ్మకి పరిచయం చేసింది..
"హ్యాపీ బర్త్ డే మై డియర్ రాధా...! ఇదే నీ కోసం నా గిఫ్ట్..ఎలా ఉంది..?"
"ఇంతవరకూ..ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వని అపురూపమైన కానుక నా కోసం మీరు ఇచ్చారు.." అని భర్త ను తెగ మెచ్చుకుంది రాధ..
******