సతీ సావిత్రి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Satee savitri

పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించే వాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీ దేవిని పదునెనిమిది సంవత్సరాలు భక్తితో సేవించాడు. సావిత్రీ దేవి ప్రత్యక్షమయింది. అతను సావిత్రీ దేవితో పుత్రుడు కావాలని కోరాడు. కానీ సావిత్రీ దేవి ఒక కన్య జన్మిస్తుందని వరం యిచ్చింది. కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి, ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని, ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కలుగుతారని వరం ప్రసాదించింది. కొన్ని రోజుల తరువాత ఆశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధ మానంగా పెరుగుతుంది.

అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాడు. సావిత్రి తన చెలికత్తెల వలన ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైనవాడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కాని సిగ్గుపడి ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఒక రోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేసాడు. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి " రాజా! నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చెయ్యలేదు " అని అడిగాడు. ఆశ్వపతి " అమ్మా! నారదుడు చెప్పినది విన్నావుగా నీకు తగిన భర్తను నీవే ఎంచుకో " అని అడిగాడు. సావిత్రి " తండ్రీ! సాళ్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. కాని ఆ సాళ్వ భూపతి విధి వశాత్తుగా అతను కళ్ళు పోగొట్టు కున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవులలో నివసిస్తున్నారు. అయినా నేను సత్యవంతునే వివాహం చేసు కుంటున్నాను " అన్నది. ఆశ్వపతి నారదునితో "

మహర్షీ ! సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి " అని అడిగాడు. నారదుడు. రాజా అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాశ్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. శౌర్యంలో దేవేంద్రుని మించిన వాడు. తేజస్సులో చంద్రుడు అందంలో అశ్వినీదేవతల వంటి వారు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కాని అతడు అల్పాయుష్కుడు . వివాహం అయిన ఒక సంవత్సరంలో మరణిస్తాడు " అన్నాడు. అశ్వపతి కుమార్తెతో " అమ్మా నీకు అల్పాష్కుడైన భర్త ఎందుకు వేరొకరిని వరించు " అన్నాడు. సావిత్రి " తండ్రీ ! త్రికరణములలో మనను ప్రధానం కదా. ఆ మనసులో నేను సత్యవంతుని వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరు వరుని వరించాను " అని పలికింది. నారదుడు " నీ కుమార్తె గుణ వంతురాలు. ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు " అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంభారాలతో అడవిలో ఉన్న ద్యుమత్సేనుని వద్దకు వెళ్ళాడు. ద్యుమత్సేనుడు అశ్వపతిని తగురీతిని సత్కరించాడు. అశ్వపతి " ద్యుమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి. ఈ మెను నీకోడలిగా

స్వీకరించుము " అన్నాడు. ద్యుమత్సేనుడు " అయ్యా! మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా " అన్నాడు. అశ్వపతి "రాజా! సంపదలు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కొరకు దు;ఖించరు. నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. కాదనకండి " అన్నాడు. ద్యుమత్సేనుడు కాదనలేక పోయాడు. సావిత్రీ సత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతోపాటు నార చీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సంవత్సరం గడవటానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది. సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నాదికాలు ముగించి అత్త మామలకు నమస్కరించింది. యదావిధి అందరికి సేవ చేసింది. సావిత్రితో భర్త " సావిత్రీ! నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకు వస్తాను " అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తునే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. కొంత సేపటికి సత్యవంతుడు స్పృహకోల్పోయాడు.

ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడు చేతిలో పాశం ధరించిన వాడు అయిన దేవతా మూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి " అయ్యా ! మీరెవరు? " అని అడిగింది. " సావిత్రీ! నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్య పురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చను " అని పలికి యమధర్మ రాజు తన పాశమును సత్యవంతునపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. సావిత్రి తన భర్త దేహమును ఎవరికి తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మ రాజుని అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి " అమ్మా! నీవు ఎందుకు నా వెంట వచ్చావు. ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు " అని పలికాడు. సావిత్రి " యమ ధర్మరాజా! భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మమార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను " అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమ ధర్మరాజు ఆశ్చర్యపోయి " అమ్మా! నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా ! నా మామగారు సాళ్వరాజుకు కంటి చూపులేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి " అని కోరింది. యమధర్మరాజు " అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను దీనితో తృప్తి పడి మరలి పో " అన్నాడు. సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది. " కాని యమధర్మరాజా ! మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియును కదా. నీవు ధర్మదేవతవు నీకు తెలియనిది ఏమున్నది. అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తీ అంటారు కదా నిన్ను యముడు, శమనుడు అని పిలుస్తారు కదా " అని పలికింది సావిత్రి. యమ ధర్మరాజు " అమ్మా! సావిత్రి నీ మాటలు అమృతోపమానము ఇకొంక వరం కోరుకొనుము " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి " అని కోరింది. యమ ధర్మరాజు " అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంక నిలువుము ఇక్కడి నుండి నీవు రావటానికి లేదు " అని అన్నాడు. సావిత్రి " ఓ ధర్మరాజా! నీకు తెలియనిది ఏమున్నది. ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది " అని పలికింది. యమధర్మరాజు " సావిత్రీ ! నీ ధర్మ బుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణములు తప్ప " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా! నా తండ్రి అశ్వపతికి పుత్రసంతతి లేదు. ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహింపుము " అని కోరింది. మధర్మరాజు " అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసి పోయావు ఇక వెనుకకు మరలుము " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా! సతికి భర్త సేవయే పరమార్ధం. నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్య చంద్రులు క్రమంగా సంచ రిస్తున్నారు. ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు ఔతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాటలాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను. కనుక నా కోరికను మన్నించుము " అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి " సావిత్రీ! నీకు మరొక వరం ఇచ్చెదను కోరుకొనుము " అని చెప్పాడు. అందుకు సావిత్రి " యమధర్మరాజా! ఇప్పటి దాకా నువ్వు ఏ వరం కోరుకొమ్మన్నా నీ పతి ప్రాణములు దక్క అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా! సతికి పతియే దైవము . పతి లేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభ కార్యానికి ఆమెను పిలువరు. కనుక సాళ్వభూపతి తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుని చేయుము " అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశ పెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో " సావిత్రీ! నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. నీకు నూరుగురు కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలవు ఔతావు " అని చెప్పి వెడలి పోయాడ

సావిత్రి వెను తిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు. సత్యవంతుడు " ఏమిటి సావిత్రీ! ఇంతసేపు నిద్రపోయాను లేపలేదా. కాని ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది. అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు " అన్నాడు. సావిత్రి " నాధా! ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మీ తల్లి తండ్రులు మనకోసం ఎదురు చూస్తుంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి " అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటికే ద్యుమత్సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. సావిత్రి " మహారాజా! నా భర్త సత్యవంతునికి ఈ రోజు మరణం అని చెప్పారు కదా. అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడి పోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకు పోవుచుండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణములు. మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట. నాల్గవది నా భర్త ప్రాణములు " అన్నది. సాళ్వభూపతి " అమ్మా! ఆపత్సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు. నీ పుణ్య చరితము కీర్తినీయము " అన్నాడు. ఆ తరువాత సాళ్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకుని మరణించారని ద్యుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు. ద్యుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి