. “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ” అర్థాన్ని విస్మరించిన క్షణం . అతడు భర్తగా ఓడిపోతున్న క్షణం నేను భార్యగా మరణించిన క్షణం.
ఒక స్త్రీగా గెలిచిన క్షణం కు ముందు. వేధ మంత్రాలు సాక్షిగా. పెద్దల ఆశీస్సులు అందుకుంటూ నా మెడలో తాళి కట్టిన భర్త. అదే తాళిని అవహేళన చేస్తూ.. బలంగా నా చెంపలు మీద కొట్టాడు. ఓర్చుకున్నాను.
నా తల్లిదండ్రులను తూలనాడాడు,సహించాను. కానీ! వైవాహిక జీవితాన్ని ఎగతాళి చేస్తున్నాడు. తట్టుకోలేక పోతున్నాను. నా సహనం అతని దృష్టిలో చేతకాని తనం అనిపిస్తుందేమో. చేతిలోని సిగరెట్ తో అంటించాడు. మెడలోని తాళి తీసి పక్కన పడేయమన్నాడు నిగ్రహించుకున్నాను కానీ! అతన్లోని మృగ తృష్ణను భరించలేక పోయాను. చివరిగా అతని అహః పైనే దెబ్బకొట్టాను . నువ్వు చేసింది తప్పు అంటుంది నా చుట్టూ ఉన్న సమాజం. కాదు !న్యాయమే అనిపిస్తుంటుంది నా అంతరాత్మకు.
గత వారం రోజులుగా ఒక్క నిముషం పాటు ప్రశాంతంగా కూర్చునే అవకాశం దొరకట్లేదు అంటే నమ్మండి. ఇంటి నిండా బంధువులు. అందరికి అన్నీ అమర్చాలాంటే మాటలా!. ఒకరికి టీ మాత్రమే కావాలి. ఒకరికి షుగర్ లేకుండా.మరొకరికి స్ట్రాంగ్. ఒక్కరికి కాఫీ కావాలి.మరొకరికి హర్లిక్స్.ఇలా రకరకాలుగా అందరిని ఒక కంట కనిపెడుతూ,వారి జిహ్వచాపల్యంను తృప్తి పరచడంలో తలమునకలు అవుతున్న నాకు ,భగవంతుడు మరో రెండు చేతులు అదనంగా అందించి ఉంటే నే బాగుండేదని అనిపిస్తుంటుంది. ఒకరికి కుక్కర్లో వంట నచ్చలేదు. మరొకరికి రోటిపచ్చడ్లు మాత్రమే కావాలి,ఇలా కండీషన్స్ పడుతూనే, నాలోని సహనాన్ని ఎంతవరకు పరీక్షించాలో! అంతవరకు పరీక్షించి,వారం రోజులుగా మూడు చెరువులు నీళ్లు నాచేత తాగించి, ముఖస్తుతి కోసం వెళుతూనే ఓ చిరునవ్వును కానుకగా బలవంతాన నాపై విసిరేసి,ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తను మాత్రం ఎందుకు నన్ను వదలాలి అనుకుంటుందో ఏమో! పలకరించేందుకూ వొచ్చింది నెలసరి తగుదునమ్మా అనేలా.. వారం రోజులుగా విశ్రాంతి లేకుండాపోయింది.
ఇంటి పనిలో నలిగిన నాకు ,ఇది మరో సమస్యగా మారింది ఇంటి నిండా చిందరవందరగా పడవేసిన బట్టలు. తాగి పడవేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్. కొబ్బరి బొండాలు. అవన్నీ సర్దుకుని కూర్చున్న నాకు తెలియకుండానే కునుకు కౌగలించుకుంది. తన ఒడిలోకి లాగేసుకుంది *****
కన్నులు తెరిచే సరికి సాయంత్రంపూట దీపాలు ముట్టించే వేళ్ళైంది. బయటకు వెళ్ళి ఫ్యాడ్స్ తెచ్చుకునే ఓపిక కూడా లేదు.వస్తూ వస్తూ ఏ మెడికల్ షాపులోనో ఫ్యాడ్స్ తీసుకు వస్తారని ఫోన్ చేసా. ప్రపంచంలోనే చేయకూడని తప్పిదం ఏదో నేను చేసాననేలా అటువైపు నుండి మావారి గొంతు. "అవి కూడా నేనే తీసుకురావాలా?" "ఇంట్లో ఉండి నువ్వు చేసేది ఏముంది.?" "అంతగా తీరిక దొరికలేనంత బిజీనా.!" "మీ ఆడవాళ్లకు ఇరుగు పొరుగున వాళ్ళ ముచ్చట్లు,టీవీ సీరియల్స్ మీద ఉండే శ్రద్దా కాస్తా తగ్గించుకుంటే మంచిది." "సర్లే ఫోను పెట్టేయ్". అంటూ.హుంకరించి ఫోన్ కట్ చేసాడు మా శ్రీవారు. ******
రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తప్పతాగి తూలుతూ ఇంటికి వచ్చిన మా వారిని చూస్తూ, మౌనంగా తలుపు తీయక తప్పలేదు. లోపలకు అడుగు పెడుతూనే ... ఆఫీసుకు తీసుకువెళ్ళిన క్యారియర్ మూలకు విసిరేసి బెడ్ రూం లొకి వెళ్లి మంచం పైన వాలిపోయాడు చేసేది ఏముంది. ఎప్పటిలాగానే క్యారియర్ కడిగేందు ఓపెన్ చేసా!. కనీసం తిన్న గిన్నెలు కడగాలి అనే ఆలోచనే రాని పురుష పుంగవుల్లో మా వారు ఒకరు అనేది వాస్తవం క్యారియర్ నుండి వస్తున్న వాసనకు కడుపులో దేవినట్లు అనిపించింది. లోపలినుండి మా వారు వాంతి చేసుకుంటున్న శబ్దం. క్యారియర్ తో పాటు గది కూడా శుభ్రంగా కడిగేసరికి రాత్రి పది దాటింది. అసలే అలసట.దానికి తోడు నెలకోసారి వచ్చే సమస్యా. ఏమీ తినాలి అనిపించాక పోవడంతో వంటగదిలోకి అడుగు పెట్టే అవసరం రాలేదు. *****
ఉదయమే వేసిన ఉల్లి దోసెలు ఆరగించి, ఆఫీసుకు బయలు దేరిన మావారికి మరోసారి గుర్తు చేయక తప్పలేదు. ఈ రోజైనా వస్తూ వస్తూ ఫ్యాడ్స్ ".అనే లోగా "నీ కంటికి నే ఎలా కనిపిస్తున్నా! షాపుకు వెళ్ళి ఫ్యాడ్స్ తీసుకురావాలా.! అది ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా! షాపు అతను నన్నో వెదవ లా చూస్తాడు తెలుసా!. నాకెంత అవమానం నీ మట్టి బుర్రకు అర్దం కాదు?". అంటూ విసురుగా తలుపు నెట్టుకుని వెళ్ళిపోయాడు. అవమానమా! భార్యకు ఫ్యాడ్స్ తీసుకురావడంలో అవమానం ఏముందో నాకర్ధం కాలేదు. *****
నా పని నేను చేసుకోని పోక తప్పదు గా,. ఎప్పటిలాగానే ఇంటి పని వంటి పని ముగించుకొని, పెరట్లో మొక్కలకు నీళ్లు పట్టి , బట్టలన్ని ఉతికి ఆరేసి, మూడోవ రోజు కావడంతో తల స్నానం చేసీ అన్ని సర్దుకుని నా గదిలోకి వెళ్ళి నడుము వాల్చాను. ఓ అర్థరాత్రి వేళ నన్ను ఎవరో తడుముతున్నాడు అనిపించడంతో దిగ్గున లేచి కూర్చున్నా. తీరా చూస్తే పక్కన మావారు. "ఇవ్వాల మూడవ రోజు, అరవకుండా వెళ్ళి పడుకోండి" అన్నాను. "అది కాదు."..అంటూ కాస్త చొరవతో దగ్గరకు తీసుకోబోయాడు. "మీకేమైనా పిచ్చా..ఒక వైపున మూడవ రోజుని చెపుతూనే ఉన్నాను కదా..వినరేంటి "అన్నాను. పగలంతా పని చేసీ విసిగిన మనసులో ఎక్కడో నిస్సహాయత. వెకిలిగా నవ్వుతూ.. మృగంలా నాపైకి చేరి తనకు కావాల్సింది దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని చేతులు ఎక్కడెక్కడో తడుముతుంటే నాలో కోపం కట్టలు తెంచుకుంది దూరంగా నెట్టివేస్తున్న ను మరింతగా నలిపేస్తూ "నువ్వు ఏమైనా అనుకో నాకు అనవసరం." అంటూ మరి కాస్త చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. "మూడవ రోజుని చెపుతున్నా ను కదా?"..అన్నాను "అయితే ఎం"అన్నాడు. "మూడవ రోజు కలవకూడదు.నొప్పి తట్టుకోవడం నావలన కాదు. పోండి మీ గదిలోకి "అన్నాను కోపంగా. అతని చేయి విసురుగా నా చెంపను తాకింది. భార్య దగ్గర భర్తగా ప్రవర్తించండి. మనం భార్యాభర్తలం భార్య మనసు అర్దం చేసుకోండి అన్నాను. "అయితే తాళి తీసి పక్కన పడేస్తే సరి. ఈ రోజుకు మనం భార్యాభర్తలం కాదనుకో.అన్నాడు. మనసు చివుక్కుమంది. బలవంతంగా దూరంగా జరుగుతున్న నా చెంపల మీద కొట్టాడు. నిగ్రహించుకున్నాను. కాలే సిగరెట్ తో నడుముపైన అంటించాడు. భర్తతో ఎలా కాపురం చేయాలో నీ తల్లిదండ్రులు నీ నేర్పలేదా?. అంటూ అదోలా నవ్వాడు . నాలో ఎక్కడో స్తబ్దత గా ఉన్న ఆత్మగౌరవం మేల్కొంది. తాళి తీసి అతని మొఖం మీద కొట్టాను.. మా మధ్యన నిశబ్దం, నిశబ్దంగా చూస్తుంది. అతను భర్తగా ఓడిపోయాడు. నేను భార్యగా మరణిస్తున్నాను. కానీ స్త్రీగా గెలిచాను అనిపిస్తుంది. **** వారం తిరిగే సరికి అతని నుండి నాకు విడాకులు నోటీసు అందింది. అది నేను ఊహించిందే. అంతకు మించి ఏం చేయగలడు అనుకున్నాను. అత్తా మామలు నుండి ఫోన్ "సర్దుకుపోవాలమ్మా" అంటూ నా తల్లిదండ్రులు నుండి మరో రకమైన హితబోధ. కుటుంబ గౌరవం, కట్టుబాట్లు,అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను. ఉచ్చితాలనే సలహాలకు నా ఫోన్ "అవుట్ ఆఫ్ కవరేజ్ "గా మిగిలిపోయింది. "నాకు నేనుగా ... కాస్త స్వేచ్చగా.. ఆత్మగౌరవం కాపాడుకుంటూ.. కొత్త జీవితం ప్రారంభించేందుకు ముందుకూ అడుగు పెడుతున్నా. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడగలను అనే నమ్మకంతో. అతడు మరో పెళ్లి కోసం వేట మొదలెట్టాడు.