నిశ్శబ్దంగా ఉన్న కార్లో ఆ ప్రకంపనలతో కూడిన ఆ శబ్దం ఏమిటో అర్థం కాలేదు నాకు.
సమయం దాదాపు రాత్రి పదకొండు దాటి ఉంటుంది. నగరం శివార్లలో ఉన్న ఓ రిసార్ట్ లో మిత్రుడి సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ అనివెర్సరీకి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్నాం నేను నమ్రత.
వెళ్ళేటప్పుడు సాయంకాలపు వెలుతురు ఉండటం వల్ల తెలియలేదు కానీ, నిజానికి ఇక్కడ చాలా భీతి గొలిపేలాగా ఉంది బయటి వాతావరణం. నిర్మానుష్యమైన అడవి, కాటుకపులిమినట్టు చీకటి, మబ్బులు కమ్ముకుని ఉండటం వల్ల నక్షత్రాలు సైతం కనిపించడం లేదు.
ట్రాఫిక్ అన్న మాటే లేదు. ఆ రిసార్ట్‌కి తప్ప ఆ మార్గం ఎక్కడికి దారి తీయదు కాబట్టి ఇక ట్రాఫిక్ ఉండే ప్రసక్తే లేదు.
వాస్తవానికి మిత్రుడు ఆ రాత్రి అక్కడే ఉండిపొమ్మన్నాడు, క్యాంప్ ఫైర్, ఆటపాటలు, కూడా ఉన్నాయి. కానీ నేను ఉదయాన్నే అర్జంటుగా మీటింగ్‌లలో పాల్గొనాల్సి ఉంది, అందుకుఏ ఆగకుండా వచ్చేశాం.
ఏకాగ్రతతో కార్ నడుపుతున్న నేను ఊహించని ఆ శబ్దానికి ఒక్క సారిగా ఉలిక్కిపడి నమ్రత వంక చూశాను.
రోడ్దు వారగా కార్ ఆపి, బ్లింకర్స్ వేసి, కార్ లోఫల దీపాలని వెలిగించి కార్ మొత్తం చూపులతోనే కలియ చూశాను.
క్రమంగా అర్థం అయింది అది సెల్ ఫోన్ తాలూకూ రింగ్ టోన్ అని. చౌకబారు ఫోన్ కావటం వల్ల దాని రింగ్ టోన్ కర్ణ కఠోరంగా ఉంది.
గేర్ రాడ్ వెనుక ముందు రెండు సీట్లకి మధ్య ఇరుకు స్థలంలో పడి ఉంది ఆ ఫోన్. చౌకబారు ఫోన్ ఏదో అది.
ఒక్కసారిగా పై ప్రాణాలు పైనే పోయాయి. అలా గుర్తు తెలియని సెల్ ఫోన్ రింగ్ అవుతుండగా ఎత్తి బాంబు పేలుడులో ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఉదంతాలు గుర్తు వచ్చాయి. అయినా ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోయాయి కద.
అయినా ఇలాంటి 'ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెశ్ ఏదైనా రద్దిగా ఉన్న పబ్లిక్ ప్లేసెస్ లో పెడతారు గానీ, మా ఇద్దర్నీ హతమార్చటానికి ఎవరు పెడతారు?
నమ్రత కూడా అంతే అయోమయంగా నా వంక చూసింది.
అవతల నుంచి ఎవరో పదే పదే ప్రయత్నం చేస్తున్నారు, విపరీతంగా మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. పూర్తి రింగులు అయ్యేదాకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అవతల నుంచి.
చివరికి ఏమైతే అదయిందని ఆ ఫోన్‌ని చేతిలోకి తీసుకున్నాను.
'అమ్మ ' అన్న పేరుతో కాల్ వస్తోంది.
నేను కాల్ లిఫ్ట్ చేశాను.
"అరే రంగా, ఎక్కడ పోయావు రా! ఎన్ని సార్లు రింగ్ ఇచ్చినా ఎత్తవే? తమ్ముడి ఫీజ్ కట్టాలి, రేపే లాస్ట్ డేట్, కట్టకుంటే వాడిని పరీక్షకి కూర్చోనివ్వరు. నేను ఎలాగో వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బు కూడగట్టుకోగలిగాను, ఒక్క రెండు వేలు తక్కువ పడింది రా, పంపమని అడిగితే మీ ఓనర్ వద్ద అడ్వాన్స్ తీస్కుని పంపుతానన్నావ్, పొద్దున నుంచి నీ ఫోన్‌కై ఎదురు చూసి, చూసి ఇప్పుడు చేస్తున్నాను '
ఆమె మాట్లాడిన తర్వాత నిదానంగా చెప్పాను.
"అమ్మా మీరెవరో నాకు తెలియదు. ఈ ఫోన్ నా కార్‌లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. మీరు ఎవరు, ఇది ఎవరి ఫొన్?"
"అయ్యో భగవంతుడా ! ఇది మా అబ్బాయి రంగా ఫోన్. వాడు నగరంలో ఏదో కార్ షో రూంలో పని చేస్తుంటాడు అని తెలుసు కానీ, చదువుకున్నదాన్ని కాదు. నాకు మిగతా వివరాలు తెలియవు. ఓరి భగవంతుడా నాకు ఎంత కష్టం వచ్చి పడింది?"
అవతల నుంచి వెక్కిళ్ళతో కూడిన ఏదుపు వినిపించింది.
నేను నా బుర్రకి పదును పెట్టాను. ఉదయం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళానో ఆలోచించాను.
కాసేపటికి నాకు తట్టింది. ఉదయం నా కార్‌ని మా వీధి చివర ఉన్న కార్ వాష్ కి తీసుకు వెళ్ళాను.
అక్కడ ఓ హెల్పర్‌ని వాళ్ళ ఓనర్ తిడుతూ కనిపించాడు.
"పని సక్రమంగా చేయటం రాదు కానీ, మీకు వేలకి వేలు అడ్వాన్సులు కూడానా. ఇష్టం ఉంటే పని చేయవచ్చు. లేదా నిరభ్యంతరంగా వెళ్ళీపోవచ్చు"
నాకు వేరె కాల్స్ వస్తూ ఉండటం వల్ల ఇక నేను ఆ సంభాషణ మీద ఏకాగ్రత చూపలేదు.
ఆ తరువాత ఆ తిట్లు తిన్న కుర్రాడే నా కార్ లో ఇంటీరియర్ క్లీనింగ్ చేశాడు వాక్యూం క్లీనర్ తో.
వంగి వంగి సీట్లు తుడవటంలో అతని జేబులో ఉన్న ఫోన్ నా కార్‌లో పడి ఉంటుంది.
"అమ్మా! గుర్తు వచ్చింది. మీ అబ్బాయి రంగా నాకు తెలుసు. ఈ ఉదయమే అతని ఫోన్ నా కార్‌లో మర్చిపోయాడు .
మీరు కంగారు పడకండి. మీకు ఇప్పుడే రెండు వేలు నేను పంపుతున్నాను.
మీది గూగుల్ పే నెంబర్ గానీ, ఫోన్‌పే నెంబర్ గానీ చెప్పండి"
"బాబూ....."
ఆమె నోట మాట రావడం లేదు.
"ఫర్వాలేదు చెప్పండమ్మ"
"ఒరే చిన్నోడా! రంగా వాళ్ళ ఫ్రెండ్ అంటరా డబ్బు పంపుతున్నడంట. ఏ నెంబర్‌కి పంపాలో కాస్త చెప్పరా" ఆవిడ అవతల వైపు నుంచి కేకలు వేస్తోంది.
బయట ఎంత చీకటిగా ఉన్నా, ఈ రాత్రి రెండు మనసులలో వెలుతురు నింపాను కద అన్న తృప్తితో కార్ స్టార్ట్ చేశాను.
రేపు ఉదయాన్నే రంగాకి ఈ ఫోన్ ఇవ్వాలి.
---