"బావా! ఏం చేస్తున్నావ్ రా? 'సత్యం' లో కొత్త సినిమా వచ్చింది, పోదామా?" హుషారుగా వచ్చిన సమీర్, శశాంక్ వాలకం చూసి, విస్తుపోయాడు.
పేపర్లు, పెన్ను పట్టుకొని, డాబా మీద ఈజీచెయిర్లో కూర్చున్న శశాంక్, శూన్యంలోకి చూస్తూ దీర్ఘంగా నిట్టూర్పులు విడూస్తూంటే ఆశ్చర్యంగా అనిపించింది. చైతన్యానికి మారురూపులా ఉండే శశాంక్ అంత విచారంగా ఉండడం ఎప్పుడూ చూడలేదతడు. "ఏమిట్రా, ఏమైందీ?" అడిగాడు, కంగారుగా...
"హు... నా జీవితమే సినిమా అయిపోయింది... బావా" అన్నాడు, శశాంక్ దీనంగా...
"అసలేం జరిగింది బావా? నన్ను టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పు..." ఆదుర్దాగా అడిగాడు, సమీర్.
"చాలా పెద్ద సమస్య బావా, అసలీ గండం ఎలా గట్టెక్కాలో నాకు అర్ధం కావటం లేదసలు..."
"అబ్బ, విషయం చెప్పరా, చంపక..." గట్టిగా విసుక్కున్నాడు, సమీర్.
"అదేరా, ఎల్లుండి, కౌముది పుట్టినరోజు..."
"వావ్... చక్కగా కలిసి సెలబ్రేట్ చేసుకోండి ఇద్దరూ... దానికి ఇంత దీనంగా ముఖం పెట్టుకుని కూర్చోవటం దేనికి? తనకి గిఫ్ట్ ఏమివ్వాలా, అనా?" నవ్వేసాడు, సమీర్...
"కాదురా... నేనేం గిఫ్ట్ ఇవ్వాలో తనే చెప్పేసింది... ఒక ప్రేమలేఖ వ్రాసివ్వాలట!"
"మరింకేం? సరియైన కానుకే అడిగింది... నువ్వు భావకుడివి కదా, ఒకటేమిట్రా, వంద మధురమైన లేఖలు వ్రాసివ్వగలవు... అసలు నీ కథలు చదివే కదరా, కౌముది మొదట నీకు ఫాన్, ఆ తర్వాత ఫ్రెండూ అయింది... అందుకే, నీ ప్రేమనంతా రంగరించి, అక్షరాలలో పొదిగి, ఓ లేఖగా మార్చి ఇస్తావని ఆశిస్తోంది. ఎంత మెసేజ్ ల లోనూ, మెయిల్స్ లోనూ మాట్లాడుకున్నా, కాగితం మీద నీ మనసును పరచి వ్రాసిన ప్రేమలేఖను చదువుకోవటంలో ఉండే థ్రిల్లే వేరు కదా... మంచి కోరికే కోరిందిరా, మా చెల్లాయ్..."
"అబ్బ, ఇంకాపరా, చిరాగ్గా ఉంది..." అసహనంగా అన్నాడు, శశాంక్.
"ఏమైందిరా, ఎందుకంత చిరాకూ?"
"నా మేనత్త కొడుకువీ, చిన్నప్పట్నుండీ నా నేస్తానివీ... నా చేతివ్రాత గురించి తెలుసుండీ అలా మాట్లాడతావేమిట్రా?"
"అరె, నిజమే... నీ చేతివ్రాతతో వ్రాసిన ప్రేమలేఖ అందుకుంటే మాత్రం ఆ అమ్మాయి డ్రాప్ అయిపోయే ప్రమాదం ఉందిరోయ్..."
"అర్ధం చేసుకున్నావ్ గా, అదే, నా భయం..."
"ఐడియా! నువ్వు చేత్తో వ్రాసివ్వకుండా, డీటీపీ చేసి ఇవ్వచ్చుగా?"
"ఆహ, అలా కుదరదట... నా చేత్తో స్వయంగా, అందంగా వ్రాసిస్తేనే కానీ తనకు తృప్తి కలగదట..."
"అబ్బ, భలే అగ్నిపరీక్ష! అసలు ఎందుకురా నీ రాత అలా తగలబడింది?"
"చిన్నప్పుడు కాపీ రైటింగ్ సరిగ్గా వ్రాయక..."
"నేననేది, నీ చేతిరాత గురించి కాదులే, నీ తలరాత గురించి... సరే, పుట్టినరోజంటున్నావుగా, ఆ అమ్మాయిని నువ్వు ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి... బ్యాక్ డ్రాప్ లో మంచి పూల డిజైనున్న లెటర్ ప్యాడ్ కొనుక్కొచ్చి, జాగ్రత్తగా అర్థమయ్యేలాగా పట్టి పట్టి లెటర్ వ్రాయి... పాయసంలో జీడిపప్పు, కిస్ మిస్ ల్లా మధ్యమధ్యలో నీ చిరుకవితలు, అందమైన పదాలు వెయ్యి... ఫైనల్ గా మంచి పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసి, దాన్ని కవరులో పెట్టి అందించు... నచ్చిందా, ఎంతో సంతోషపడుతుంది... లేదా నీ రాత గురించి అర్ధమైపోయి సర్దుకుపోతుంది.
రేపు మీ పెళ్ళయ్యాకైనా తనకి విషయం తెలియాల్సిందేగా?"
"అంతేనంటావా?"
"అంతే మరి! సరే, నువ్వు కూర్చుని ప్రేమలేఖ తయారుచేసుకో, నేను మా ఫ్రెండ్స్ తో పోతాను, సినిమాకి... బై రా..." అంటూ వెళ్ళిపోయాడు, సమీర్.
***
సమీర్ చెప్పినట్టే, ఆ సాయంత్రం తాను వ్రాసిన ప్రేమలేఖను అందమైన కవర్ లో ఉంచి, దాన్ని అరవిరిసిన గులాబీపూల గుచ్చంలో అమర్చి, బెరుగ్గా కౌముదికి అందించాడు శశాంక్. అపురూపంగా దాన్నందుకొని, ఆరాటంగా అక్కడే తెరచి చూడబోతున్న కౌముదిని వారించి, 'ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొమ్మని' కోరాడు. ఆమెతో కాసేపు గడిపి ఇంటికి వచ్చాడేకానీ అతని మనసు మనసులో లేదు... ఆ లేఖ చదివిన తరువాత ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అంచనా వేయలేక, ఆలోచనలతో సతమతమవసాగాడు. నిద్రపట్టక ఆ రాత్రంతా పక్కమీద దొర్లుతూనే గడిపాడు, చివరికి ఎప్పుడో తెల్లవారుఝామున నిద్ర పట్టిందతనికి.
అక్కడ కౌముది ఇంట్లో, ఏకాంతంగా ఏవేవో మధురోహలతో సమీర్ ఇచ్చిన కవర్ తెరచి చూసి కంగారు పడింది. అది ప్రేమలేఖో, లేక శత్రుస్థావరాల గురించి మిలటరీవాళ్ళు వేసిన వ్యూహరచనో అర్ధం కాలేదు. అందులోనివి అక్షరాలో, సంకేతాలో తెలియలేదు. మొదటి నాలుగు అక్షరాలనూ కష్టపడి, 'ప్రియమైన' గా పోల్చుకొంది. ఆ తర్వాత అన్నీ, గీతలు, చుక్కలు, ముద్దలు, పాములు, వంకరటింకర వరుసలు... అసలు ఆ అక్షరాలు అర్ధమైతే ఒట్టు. అంత భయంకరమైన చేతివ్రాతను ఇప్పటిదాకా అసలెక్కడా చూసి ఉండలేదామె. 'అసలిది చేతివ్రాతా? శశిది ఇంత దారుణమైన దస్తూరీయా? అదే నిజమైతే. అంత మంచి రచయిత ఎలా అయాడతను? కాదు, ఇందులో ఏదో తమాషాగా ఉంది... ప్రాక్టికల్ జోక్ చేస్తున్నట్టున్నాడు...' ఇలా అనుకున్నాక, హృదయం తేలికై హాయిగా నిద్రపోయిందామె.
ఉదయం ఏడున్నరకు సెల్ ఫోన్ ఆగకుండా మ్రోగుతుంటే బద్ధకంగా దానిబటన్ నొక్కి, చెవిదగ్గర పెట్టుకొని 'హలో?' అన్నాడు శశాంక్, మత్తుగా. "గుడ్మాణింగ్, శశీ! నేను... కౌముదిని... ఇంకా నిద్రపోతున్నావా?" హుషారుగా వినిపించింది, కౌముది గొంతు.
"హలో, కౌమూ..." అన్నాడు మెల్లగా. అటువైపు నుంచి కౌముది జలతరంగిణిలా నవ్వుతోంది. "యు ఆర్ వెరీ నాటీ శశీ... భలే మిస్చీఫ్ చేసావే, మీ ఇంట్లో అంత చిన్నపిల్లలెవరున్నారు?"
"చిన్న పిల్లలా?" అయోమయంగా అడిగాడు.
"అదే... ఆ హాండ్ రైటింగ్... నీ ప్రేమనంతా ఏ పిల్లలకు డిక్టేట్ చేసి రాయించావమ్మా?" గోముగా అంది.
"అది కాదు కౌమూ, అదీ... అదీ... నేనే వ్రాసాను... ఆ దస్తూరీ నాదే..."
"ఉదయమే నేనే దొరికానా, చెవిలో పువ్వు పెట్టడానికి? నీ ఆకతాయితనం ఇక చాల్లే..." నవ్వేస్తూ ఆమె ఫోన్ పెట్టేస్తే, ఏం చేయాలో తెలియక ఉక్రోషంతో జుట్టు పీక్కున్నాడు శశాంక్.
అయితే ఆ సాయంత్రం కలిసినప్పుడు ఎవరికీ అర్ధంకాని తన చేతివ్రాత గురించి వివరంగా, నిజాయితీతో చెబుతున్న శశాంక్ మాటలు విన్న కౌముదికి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏమనాలో తెలియక జుట్టు పీక్కోవడం ఈసారి ఆమె వంతయింది.
" ఏమిటి శశీ ఇది? ఇదేం పిచ్చి రైటింగ్? ఇది డీకోడ్ చేయటం నిపుణుల వల్ల కూడా కాదు తెలుసా?" అంది కోపంగా.
"అదే కౌమూ, నా సమస్య... అదేమిటో చిన్నప్పటినుండీ నాకు ఎందుకో మంచి చేతివ్రాత అలవాటు కాలేదు. అందుకే సబ్జెక్ట్ ఎంత బాగా వ్రాసినా, ఎంత చురుగ్గా ఉన్నా, లెక్కల్లో తప్ప, పరీక్షల్లో ఎప్పుడూ మార్కులు తక్కువే వచ్చేవి..."
"అవునులే, అసలు అర్ధమై ఛస్తేగా మీ మాష్టర్లకు... ఇంతకూ, ఆఫీసులో ఎలా మేనేజ్ చేస్తున్నావో?"
"ఆఫీసులో పెద్దగా వ్రాసే పని ఉండదుగా, నా పని అంతా సిస్టమ్స్ మీదనే ఉంటుంది... అలాగే అలవాటైపోయింది. ఇంక రాసే అవసరం ఏముంటుంది? మరీ కోడి గీతల్లా ఉన్నాయా నా అక్షరాలు?" దీనంగా అడిగాడు.
"గట్టిగా అనకు, కోడి వింటే ఆత్మహత్య చేసుకుంటుంది... మరి నీ కథలూ, కాకరకాయలూ ఎలా వ్రాస్తావు?"
"మొదట్లో కాగితాల మీదనే వ్రాసి పంపించేవాడిని. అయితే అవి, వెంటనే తిరుగుటపాలో వెనక్కి వచ్చేసేవి. పాపం వాళ్ళ తప్పేం ఉందిలే, ఏం వ్రాసానో, అసలది కథో, కవితో వాళ్ళకు అర్ధం అయితేగా? పైగా, పేజీలో లైన్ మొదలుపెట్టాక, 45 డిగ్రీల కోణంలో వంకరగా వెళ్ళిపోయేది. ఒక్కోసారి ఏం వ్రాసానో నాకే సరిగ్గా అర్ధం అయ్యేది కాదు. ఆరునెలలు గడిచాక, స్ఫురించింది, నేను ఏం చేయాలో... తెలుగు ఫాంట్స్ లో టైప్ చేయటం నేర్చుకొని, డీటీపి చేసి, నా రచనలు పత్రికలకు పంపించటం మొదలుపెట్టాను. అప్పట్నుండీ అవి అచ్చవటం మొదలయింది" వివరించాడు, శశాంక్.
"శశీ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు మంచి హాండ్ రైటింగ్ నేర్చుకొని, తెలుగు, ఇంగ్లీష్ బాగా వ్రాయటం ప్రాక్టీస్ చేయి. అలా అయితేనే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను..." ఖండితంగా చెప్పేసింది, కౌముది.
"ఏయ్, నీకిదేం పిచ్చి? అసలు, నా దస్తూరీకీ, మన పెళ్ళికీ సంబంధం ఏమిటి కౌమూ, చాదస్తం కాకపోతే..." విసుక్కున్నాడు శశాంక్.
"ఏమో, నాకు తెలియదు. ఈ పిచ్చి వ్రాతను నేనుమాత్రం భరించలేను. దానిని సంస్కరించుకోవటానికి నేను నీకిచ్చే గడువు మూడునెలలే... వస్తాను..." కండీషన్ పెట్టేసి వెళ్ళిపోయింది, కౌముది.
"హతవిధీ..." మళ్ళీ తలపట్టుకున్నాడు, శశాంక్.
సమీర్ సలహాతో మూడు నెలల్లో ముత్యాల్లాంటి దస్తూరీ నేర్పుతామని బోర్డ్ పెట్టుకున్న 'క్యూట్ హాండ్ రైటింగ్ కోచింగ్ స్కూల్ లో చేరాడు కానీ అది తన ఆఫీసుకు చాలా దూరం కావటం వల్లా, తన ఆఫీసు టైమింగ్స్ తో ఆ స్కూల్ టైమింగ్స్ మ్యాచ్ కాకపోవటం వల్లా ఆ కోర్స్ మధ్యలోనే మానేయవలసి వచ్చింది.
మూడు నెలల తర్వాత ఎంతో ఆశగా తన దగ్గరకు వచ్చిన కౌముదికి ఏం జవాబు చెప్పాలో తెలియక పేలవంగా నవ్వాడు, శశాంక్. పరిస్థితి ఇంకా అలాగే ఉందని గ్రహించిన కౌముది, తన ఆశలన్నీ అడియాసలయాయని బాధ పడినా, శశాంక్ అంటే ఉన్న ప్రేమ వల్లను, అతని మంచితనం ముందు ఇది ఓ లోపం కాదని తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితురాళ్ళతో పాటు సమీర్ కూడా నచ్చజెప్పిన మీదట, శశాంక్ ను క్షమించేసింది, కౌముది. ఆ తర్వాత ఇరువైపుల పెద్దల ఆశీర్వచనాలతో ఝామ్మని పెళ్ళయిపోయింది.
***
రెప్పవేయకుండా దీర్ఘంగా ఆ కాగితం వైపే చూస్తూ, సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వెంకట్.
అతనివైపే ఆందోళనగా చూస్తోంది, ఎదురుగా ఒడిలో పసివాడితో కూర్చున్న కౌముది.
"ఊ..." భారంగా నిట్టూర్చాడతను... "అసలేమైంది మేడమ్? మీవారు మీతో ఏమైనా గొడవ పడ్డారా?" అన్నాడు, గంభీరంగా.
"అబ్బే, అదేం లేదే, అసలు ఏం వ్రాసారాయన ఆ కాగితంలో?" ఆరాటంగా అడిగింది.
వెంకట్ ఏమీ అనకపోవటంతో, మళ్ళీ తనే, "నేను వీడిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లివచ్చేసరికి, సాయంత్రం ఆరు దాటింది. సాధారణంగా ఆ టైముకి ఆయన ఆఫీసునుంచి వచ్చేస్తారు. అయితే, రాత్రి తొమ్మిదయినా రాలేదు. మొబైల్ కి ఫోన్ చేస్తే, 'అవుటాఫ్ కవరేజ్ ఏరియా' అని వస్తోంది. నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళరాయన. తర్వాత చూస్తే, డ్రెసింగ్ టేబుల్ మీద, పౌడర్ డబ్బా కింద ఈ చీటీ పెట్టి ఉంది. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఎంత చదివినా, ఏమీ అర్ధం కాక - మీ మెడికల్ షాప్ వాళ్లకు డాక్టర్ల ప్రిస్కిప్షన్లు ఈజీగా చదవటం అలవాటు కదా, ఇందులో ఆయన ఏం వ్రాసారో చదివి చెబుతారని తెల్లవారాక, మీ దగ్గరకు తెచ్చాను..."
"అదే, మేడమ్, డాక్టర్లు వ్రాసిన చీటీలు ఎలా అయినా సరే, చదివి అర్ధం చేసుకోగలం. కానీ ఇందులో వ్రాసింది మాత్రం ఏమాత్రం బోధపడటం లేదు..." నిస్సహాయంగా పెదవి విరిచాడు మెడికల్ షాపతను వెంకట్.
"ఇంతలో, ఇదేమిటి చెల్లాయ్, ఇక్కడున్నావ్?" అంటూ బయట బైక్ పార్క్ చేసి ఆ షాప్ లోకి వచ్చాడు, సమీర్.
"అన్నయ్య, దేవుడిలా వచ్చావన్నాయ్... శశీ కలిసాడా నిన్ను? ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు... నిన్నట్నుంచీ కనబడటం లేదు..." కంగారుగా మాట్లాడసాగింది,
కౌముది.
"మామూ మామూ" అంటూ సమీర్ మీదకి ఉరికాడు, బన్నీ.
వాడిని అందుకుంటూ, "అదేమిటి కౌముదీ, అంత కంగారు పడిపోతున్నావు? వాడు నిన్న అర్జెంటుగా ఆఫీసు పనిమీద బెంగుళూర్ వెళ్ళాడుగా? నాకు ఫోన్ చేసి చెప్పాడు... నీకు తెలియదా?" అన్నాడు, సమీర్.
"అదేమిటీ, నాకు ఫోన్ చేయలేదే..." ఆలోచనలో పడిన కౌముదికి అప్పుడు గుర్తుకొచ్చింది. ముందురోజు తన మొబైల్ ని బన్నీగాడు నీళ్ళలో పడేయటంతో అది పనిచేయటం లేదన్న సంగతి. అందుకే తనకు చెప్పటం కుదరక చీటీ వ్రాసి, బయలుదేరి వెళ్ళిపోయినట్టున్నాడు. కౌముది మనసు కాస్త కుదుటపడింది.
"ఆ... మేడమ్... ఇందులో అదే ఉంది... అర్జెంట్ పని మీద బెంగుళూర్ వెళుతున్నానని వ్రాసారు..." అమెరికాని కనిపెట్టిన కొలంబస్ లా చూస్తున్న వెంకట్ ను అదోలా చూస్తూ, "సర్లెండి, మీ సహాయానికి చాలా థాంక్స్..." అని చెప్పేసి, "రా చెల్లాయ్, నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను..." అంటూ ముందుకు కదిలాడు, సమీర్.
ఇంటికి చేరాక, ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ, "ఏమిటమ్మా ఇది? వాడి రాతలు మనకి అర్ధం కాకపోవటం కొత్తేమీ కాదుగా? అంత గాబరా పడిపోయావేమిటి?" అన్నాడు, సమీర్.
"అదికాదన్నయ్యా, ముందు రోజు, ఏదో చిన్న విషయానికి ఇద్దరమూ కొద్దిగా ఘర్షణ పడ్డాం. శశీ మనసు చాలా సున్నితం కదా, అంచేత నా మీద అలిగి, ఈ చీటీ పెట్టేసి, ఇంట్లోంచి వెళ్ళిపోయాడేమోనని భయం వేసింది..." తలొంచుకొని చెప్పింది, కౌముది.
"వాడి మొహం... వాడు వీడిని, నిన్నూ వదిలి ఎక్కడికి వెళతాడు?" నవ్వేసి, నిద్రలోకి జారుకున్న బన్నీ బుగ్గలు నిమిరి వెళ్ళిపోయాడు, సమీర్.
***
కాలచక్రం వేగంగా తిరుగుతోంది.
మూడు సంవత్సరాలలో శశాంక్ మంచి పేరున్న రచయిత అయిపోయాడు. ఏ పత్రిక చూసినా అతని పేరే... అతని సీరియల్సే... అతని రెండు నవలలు సినిమాలుగా వచ్చాయి.
బాసర క్షేత్రంలోని జ్ఞానసరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం జరిపించి, బన్నీని ప్లేస్కూల్ లో వేసారు, కౌముది, శశాంక్.
ఆ రోజు ఆదివారం. స్కూల్ లో వాడికి నేర్పించిన అక్షరాలను పలకమీద వ్రాసి, వాడితో దిద్దించటానికి శతవిధాలా ప్రయత్నించసాగింది, కౌముది. వాడు దిద్దకుండా, తల్లికి దొరక్కుండా పరుగులు తీస్తూ ఆమెను ఆటపట్టించసాగాడు. 'అంతా తండ్రి పోలికే, దిద్దమంటే దిద్దకుండా నా ప్రాణం తీస్తున్నాడు...' శశాంక్ కి వినబడకుండా పళ్ళునూరుతూ వాడి వెంటబడి మరీ పట్టుకొని బలవంతంగా అక్షరాలు దిద్దించసాగింది, కౌముది.
అరగంట తర్వాత,
కంప్యూటర్ లో కథ వ్రాసుకుంటున్న శశాంక్, అక్కడే నేలమీద కూర్చుని పలక మీద గీస్తున్న బన్నీని చూసి ముచ్చటపడ్డాడు.
కాఫీ తెచ్చిచ్చిన కౌముదితో, "కౌమూ, వాడెంత అందంగా బొమ్మలు గీస్తున్నాడో చూసావా... చూడు, పలక మీద ఆ ఎగిరే పక్షుల్ని ఎంత బాగా వేసాడో... మంచి చిత్రకారుడౌతాడు సుమా!" అన్నాడు మురిసిపోతూ.
"నా మొహం... అవి పక్షులు కావు...' ఎ, బి అక్షరాలు..." అంత అందంగా వచ్చాయి బుల్లిదొరగారికి... వారసత్వం ఎక్కడికి పోతుందీ?" సాగదీసింది, కౌముది.
ఒక్కసారిగా కళ్ళుతిరిగినంత పనయింది, శశాంక్ కి.
"ఆ, అక్షరాలా అవి?" అని విపరీతంగా ఆశ్చర్యపోయి, తమాయించుకుంటూ, "పోనీలేవోయ్, వాడు నన్ను మించిన రచయిత అవుతాడులే చూడు..." అన్నాడు, శశాంక్...
అతని వైపు కోపంగా చూడబోయినా, బిక్కమొహం పెట్టిన భర్తను చూస్తుంటే కౌముదికి నవ్వాగలేదు.
తానూ నవ్వేస్తూ, కొడుకును ఒడిలోకి తీసుకుని, రెండు బుగ్గలమీదా ముద్దులు కురిపించాడు శశాంక్. అమ్మా నాన్నా నవ్వుతుంటే, ఘనకార్యం చేసిన వాడిలా పలకను శశాంక్ కు చూపిస్తూ తాను కిలకిలా నవ్వసాగాడు చిన్నారి బన్నీ...
***