ఇద్దరమ్మలు - తిరువాయపాటి రాజగోపాల్

Iddarammalu

పోలీసు జాగిలాలు వాటి పని అవి సమర్ఠంగా చేశాయి.

నేరస్తుడు దొరికాడు.

ఇరవైమూడో, ఇరవై నాలుగో యేళ్ళుంటాయి వాడికి. వాడి పేరు రాజు. పెళ్ళైంది, పిల్లలు కూడా. ఇద్దరితోనో ముగ్గురితోనో వివాహేతరసంబంధమూ ఉందని పోలీసు విచారణ వెల్లడించింది. తాగుడుకి బానిస.

సుగుణమ్మ మీద దాడి చేసి, అరవై దాటిన ఆ వృద్ధ వనిత ప్రతిఘటిస్తే తాగిన మైకం లో ఆవిడని చంపి , ఆమె వొంటిమీద ఉన్న నగలు దోచుకున్న నేరానికి వాడిమీద కేసు నమోదైంది.

సుధీర్ తల్లి సుగుణమ్మ . ఈ ఘాతుకం జరిగినప్పుడు ఆమె ఒంటి మీద 100 గ్రాముల బంగారు నగలున్నాయి. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కిటికీ చువ్వలు విరిచి ఆమె నిద్రిస్తున్న గదిలోకి దూరి ఆమె మీద దాడిచేసి బంగారు నగలతో బైటపడ్డాడు.

తెల్లారాక పని మనిషి వెళ్ళినప్పుడు తలుపు తీయకపోవడం, కిటికీ కమ్మీలు విరిచేసి ఉండడం తో నేరం లోకానికి తెలిసింది.

దొంగిలించిన నగలు వాడితో దొరికాయి. వాటిని గుర్తుపట్టి అవి ఆమె వొంటి మీదవే అని సుధీర్ నిర్ధారించాడు . నాలుగు గాజులూ, ఒక వొంటిపేట గొలుసూ.

హతురాలి కొడుకు గా సుధీర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసు వాళ్ళు కేసు కట్టారు.

జిల్లా కోర్టు లో కేసు విచారణకొచ్చింది. కోర్టు హాలు బైట సుధీర్ పేరు పిలిస్తే లోనికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు .

"సుధీర్ ... సుధీర్ ...సుధీర్..." అని పేరు పిలిచాడు కోర్టు హాలు తలుపు బైటకి వచ్చి అమీనా.

కోర్టు లోకి వెళ్లేందుకు కదిలాడు సుధీర్.

ఉన్నట్టుండి దాదాపు యాభైయేళ్ళున్న ఒక ఆడ మనిషి సుధీర్ ముందుకొచ్చి కాళ్ళు పట్టేసుకుంది. ఎవరో పేద వనిత అని స్పష్టంగా కనబడుతుంది కట్టూ బొట్టూ చూస్తే.

" న్యాదర పిల్లోల్లు ఉండారయ్యా వానికి ...ఈడు జైలుకు బోతే ఆ పసి బిడ్డలు పచ్చులు జావాల్సిందేనయ్యా .. వాడు దొంగతనం జేసి మీయమ్మను జంపినాడని సాచ్చెమ్ జెప్పగాకు సామీ " ... గద్గదస్వరం తో బతిమాలుకుంటూ అంది.

యెదురుచూడని ఈ ఘటన కు బిత్తరపోయాడు సుధీర్.

చుట్టూ జనం ఈ నాటకీయ దృశ్యం అదోలా చూశారు.

కోర్టు బోను లో చెప్పాల్సిన సాక్ష్యం పొల్లుపోకుండా చెప్పాడు సుధీర్ . సాక్ష్యం గా ప్రవేశపెట్టబడిన నగలు తన తల్లి సుగుణమ్మ ఒంటిమీద వే నని.

నేరస్తుడి గతం వెల్లడిస్తూ పోలీసులూ వాళ్ళ కథనం వాళ్ళూ ముందుకు తెచ్చారు.

మూడో నాలుగో వాయిదాలయ్యాక వాణ్ణి దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఆ దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఇదంతా జరిగి ఎన్నేళ్లయినా సుధీర్ స్మృతిని వీడి ఆ నాటి ఘటనలు మటుమాయం కావడం లేదు. బహుశా ఎన్నటికీ కావేమో కూడా .

కాళ్ళు పట్టుకుని బతిమలాడి యేడ్చిన ఆవిడ హంతకుడి కన్న తల్లి. వాణ్ణి కాపాడాలని ఆవిడ తాపత్రయం.

ఇవతల దారుణంగా హత్యకు గురైంది సుధీర్ ని కన్న తల్లి.

చంపిన నేరస్తుడికి శిక్ష పడే ప్రస్ఠానం లో చెప్పల్సిన సాక్ష్యం చెప్పడం ఒక కొడుకు విధి.

అదే చేశాడు సుధీర్ .

***

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి