కురుక్షేత్ర సంగ్రామం .13.
పదమూడవ రోజు యుధ్ధంలో సైంధవునిది ప్రముఖ పాత్ర. ఇతను కౌరవులకు చెల్లెలైన దుస్సలకి పతి. జయధ్రదుడు .సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు.ఇతనికి దస్సల తోపాటుగా మందాకిని ( గాంధార రాజకుమారి), కుముద్వతి, (కాంభోజ రాజకుమారి)అనే భార్యలు ఉన్నారు.సురధుడు అనేకుమారుడు,రోహిణి అనే కుమార్తె కలదు.
సైంధవుడు సింధుదేశపు రాజు. దుర్యోధనుని చెల్లెలు అగు దుస్సల భర్త. ఇతని తండ్రి వృద్ధక్షత్రుఁడు.
జయద్రధుడు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒకనాడు అశరీరవాణి, ఇతను యుద్ధంలో ఏమరుపాటులో ఉండగా వీనికి శిరచ్ఛేధం జరుగుతుంది అని పలికింది. అది అతని తండ్రియైన వృద్ధక్షత్రుఁడు విని ఎవరైతే వీని తలను భూమిమీద పడవేస్తారో అట్టివాని తల వేయి ముక్కలగుగాక అనే శాపం పెడతాడు.
పాండవులు జూదంలో ఓడి పోయి మాట ప్రకారం వనవాసం చేస్తుంటే
సైంధవుడు పాండవులు వనవాసం చేసే చోటికి వెళ్ళి పాండవులు లేని సమయం లోద్రౌపదిని చేబట్ట ప్రయత్నిస్తాడు. అప్పుడు భీముడు వాడిని
చూసి వాడితో యుద్ధం జరిపి ఓడించి చంపబోతాడు. కాని యుధిష్టరుడు మాట ప్రకారం భీముడు జయధ్రదుని చంపకుండా వదిలి వేసి పరాభవం క్రింద గుండు గొరిగిస్తాడు.
పరాభవించబడ్డ సైంధవుడుడి చాలా దుఃఖించి పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడు అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుని తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు.
మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరపు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని ప్రక్కకి తప్పించడానికి ఒక ప్రణాళిక వేసి ఇద్దరౌ రాజులను అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు
తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు (జయధ్రదుడు) శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు
అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు.
యుద్దప్రారంభంలో అర్జునుడు యుద్ద రంగంలో దూరంగా సంశప్తకులతో, సంగ్రామం చేస్తున్నసమయంలో,ధర్మరాజు కోరిక మేరకు పద్మవ్యూహంలో ప్రవేసించిన అభిమన్యుడు ద్రోణుని తన శరాలతో నొప్పించి పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుని,కృపుడు, అశ్వత్ధామ,కర్ణ, శల్య,దుశ్యాసన,దుర్యోధనులతోద్రోణుడుచేరి,అభిమన్యుని చుట్టుముట్టారు.తన శర పరంపరలతో వారిని నిలువరిస్తూ ,'అశ్మికుని' శిరస్సు ఖండించి,కర్ణునినొప్పించి,శల్యుని మూర్చపోయేలాచేసి, శల్యుని తమ్ముని యమపురికి పంపాడు. అలా యుధ్ధంచేసే అతని వీరత్వానికి రణభూమి దధ్ధరిల్లింది. పాండవులు,వారిసేనలు ఎవరు పద్మవ్యూహం లోకి రాకుండా సైంధవుడు శివుని వరంతొ అడ్డుకున్నాడు.
నేలకొరిగే వారి హాహాకారాలు,గాయపడిన వారి మూలుగులు,దాహార్తుల కేకలు,విరిగే విల్లులు, ఒరిగే రధాలు, తునిగే ఖడ్గలు,నలిగే డాలులు,తూలే సారధులు,కూలే ఏనుగులు,వాలే రథికులు,పడే కాల్బలము,చెడే గుర్రాలు ,అలల తరంగాలుగా తన శరాలతో విజృభిస్తున్న అభిమన్యుని చూసి ద్రోణుడు ఆశ్చర్యచకితుడుఅయ్యాడు. " ఇతన్నినిలువరించడం ఎలా " అన్నాడు కర్ణుడు. " కవచ విద్య తన తండ్రివద్ద నేర్చాడు ఇతని శరీరంపై అది ఉన్నంతవరకు ఏమిచేయలేం " అన్నాడు ద్రోణుడు.''వంచనమార్గంలో విల్లుతుంచి,విరథుని చేసి,కవచాన్నిఛేదిద్దాం''అన్నాడు శకుని .
దూరంగా అర్జునుని దేవదత్తం,శ్రీకృష్ణుని పాంచజన్యం శంఖారావాలు విజయ సూచికంగా వినిపించడంతో,ఉత్సహభరితుడైన అభిమన్యుడు
దుర్యుధనుని కుమారుడైన లక్ష్మణ కుమారునితో తలపడి అతని తల తుంచాడు.అది చూసిన కౌరవసేనలు భయంతో ఆహాకారాచేసాయి. వెనువెంటనే శల్యుని కుమారుడు రుక్మాంగదునితోతలపడి అతనికి మరణాన్ని ప్రసాదించాడు.
అభిమన్యుని రధం వెనుకకు వెళ్ళిన కర్ణుడు,తన బాణంతో అభిమన్యుని ధనస్సు ఖండించాడు.అదేసమయంలో ఆచార్యుడు అశ్వాలను కూల్చాడు.కృపుడు సారధిని సంహారించాడు.శకుని దొంగచాటుగా అతని కవచాన్ని ఛేదించాడు.అలా నిరాయుధుడు,విరథుడు అయ్యడు అభిమన్యుడు.కత్తి డాలు చేతబట్టి కనిపించిన వారిని యమపురికి పంపుతున్న అభిమన్యుని దొంగదెబ్బతీస్తూ కత్తి డాలు వెనుకనుండి ఛేదించారు.అందుబాటులోని రథ చక్రంతో అందినవారిని హతమారుస్తున్న అభిమన్యుని,శకుని,కర్ణుడు,కృపుడు,కృతవర్మ,శల్యుడు ఆ రధచక్రాన్ని ఛేదించారు. అందుబాటులోని కత్తితో ఇరవై ఏడుమంది గాంధార వీరులను,పదిమంది వసతీయులును,ఆవేశంగా ముందుకు వచ్చిన దుశ్యాసనుని కుమారుడను సంహరించి క్షణకాలం అలసటగా నిలబడిన అభిమన్యుని కౌరవ దుష్టచతుష్టయం మూకుమ్మడిగా దాడిచేసారు.మంకెనపూవ్వు వర్ణంలోఉన్న అభిమన్యుడు అలా వీర మరణం పొందాడు.ఆదారుణాన్ని చూడలేక సూర్యుడు పడమటి కనుమల్లోకి వెళ్ళిపోయాడు.
ఆనాటి యుధ్ధం ఆగిపోయింది.
పాండవులను పద్మవ్యూహం లోనికి రానివ్వకుండా శివుడు తనకు ఇచ్చినవరంతో సైంధవుడు అడ్డుకున్నాడు.యుధ్ధనంతరం రాత్రి అభిమన్యుని మరణవార్త విన్న అర్జునుడు చింతిస్తుదీనికి సైంధవుడు కారణంఅని తెలుసుకుని 'రేపు సూర్యాస్తమం లోపు సైంధవుని సంహరించకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను 'అని ప్రతిజ్ఞ చేసాడు.అతని ప్రతిజ్ఞవిన్న సైంధవుడు డేగకుచిక్కిన పావురంలా గిజగిజలాడాడు.కౌరవ వీరులంతా అతనికి మేమందరంలేమా అని ధైర్యంచెప్పి ఓదార్చారు.