‘ ఏమి జరిగినా అంతా మంచికే ’ - మద్దూరి నరసింహమూర్తి

Emi jariginaa antaa manchike

చిన్న సూది పడినా వినపడేంతగా ఒక్కసారి హాలంతా నిశ్శబ్దమైపోయింది. అక్కడున్న న్యాయనిర్ణేతలకు సభికులకు అంతవరకూ బ్రహ్మాండంగా పాడుతున్న కృష్ణ మధ్యలో సాహిత్యం మరచిపోయి తడబడం ఏమిటి' అని ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూస్తున్నారు.

పాటల పోటీలు ప్రారంభించినప్పుడు జరిగిన ఆడిషన్స్ తరువాత వడపోతలో నిలిచిన 30 మంది ఔత్సాహిక గాయకులతో అసలైన పోటీ ప్రారంభమైంది.

వారిలో 16 మందికి 'గోల్డెన్ మైక్' ఇచ్చి, వారితో అసలైన పోటీ ముందుకు నడపాలని, చెన్నైలోని తెలుగు సంఘం నిర్వాహకులు తెలుగు పాటల పోటీకి తొలిసారిగా తెరతీసేరు. అయితే, ఆ పోటీలో పాల్గొనేందుకు ఆంద్ర రాష్ట్ర వాసులకు మాత్రం ప్రవేశం లేదు అన్న నిబంధన విధించేరు.

అలా ప్రారంభమైన పోటీలో 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయి' అన్న పాట కృష్ణ కి అందరికంటే ముందుగా 'గోల్డెన్ మైక్' తెచ్చిపెట్టింది. ఆ పాట పాడుతూంటే అతని గొంతుకలో కీ.శే. ఘంటసాలగారి కంఠమాధుర్యం వినిపిస్తూ కీ.శే. నాగేశ్వరరావుగారి అభినయ కౌశలం కూడా అంతర్లీనంగా వెల్లివిరిసింది.

అలా నిర్వహింపబడిన పోటీకి ఈరోజు కడపటి రోజు. ఇద్దరు గాయకులు - కృష్ణ మరియు అర్జున్ - మధ్యన కడపటి పోటీ ఆరంభమై సాగుతూండగా జరిగిన సన్నివేశం అది.

నిమిషం పాటు వినిపించిన సభికుల కరతాళ ధ్వనులతో అభినందన పొందిన అర్జున్ పాడడం అయిపోయి విశ్రాంతి తీసుకుంటూండగా –

సభావేదిక మీదకు కృష్ణ వస్తూనే సభికుల హర్ష ధ్వనాలతో ఆ హాలు దద్దరిల్లింది.

పాటల పోటీ ప్రారంభమైన తొలి రోజునే అభ్యర్ధులలో తొలి సారిగా 'గోల్డెన్ మైక్' అందుకున్న కృష్ణ అన్నా అతని పాట అన్నా అందరికీ ఎంతో ఇష్టం. తన కంఠమాధుర్యంతో అంతకుమించిన సంస్కారంతో వినయ విధేయలతో కృష్ణ అందరి మనసులు చూరగొన్నాడు. పోటీలో అతనే విజయం పొందుతాడన్న నమ్మకం సభికులకే కాక న్యాయనిర్ణేతలకు కూడా పుష్కలంగా ఉంది.

-2-

అలాంటిది, అతి ముఖ్యమైన ఘట్టంలో కృష్ణ తడబడి పాట సాహిత్యం మరచిపోతే, అందరికీ గుండెలు పిండేసినంత బాధ కలిగింది. ఆ పరిస్థితిలో తప్పనిసరిగా అర్జున్ విజేతగా ఎన్నుకొనబడ్డాడు.

పోటీ ఆరంభం అవడానికి ముందర కృష్ణ మాత్రమే విజేతగా నిలుస్తాడనుకున్నవారికి అతన్ని విజయం వరించకపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.

పోటీ ఫలితాలు వెలువడి అర్జున్ విజేతగా ఘోషింపబడిన తరువాత, వయసుకు అతీతంగా సంగీత అభిమానులు చాలామంది వేదిక దగ్గరకు దూసుకొనివచ్చి కృష్ణను చుట్టుముట్టి "బాబూ కృష్ణా ఏమైంది ఈరోజు, నువ్వు పాట మధ్యలో తడబడడమేమిటి సాహిత్యం మరచిపోవడమేమిటి" అని వాపోయారు.

వారితో కృష్ణ –

"నిన్న రాత్రి టెన్షన్ తో నిద్ర పట్టక ఇప్పుడు ఇక్కడ పాడుతున్నప్పుడు కొన్ని క్షణాలు నా కళ్ళు మూతపడి గొంతు తడబడడంతో అలా జరిగింది. అయినా ఇప్పుడేమైపోయింది. మీరనుకున్నట్టు నేను కాక అర్జున్ ఈసారి విజేతగా నిలబడ్డాడు. అంతేకదా. అలనాడే ఘంటసాల మాస్టారు పాడేరు కదా - 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయి' అని. ఏమి జరిగినా అంతా మంచికే. మరోసారి నేను విజేతగా నిలబడతాను. నాకు ఆ నమ్మకం ఉంది. నా మీద మీకు కూడా నమ్మకం ఉందని నాకు తెలుసు. విజేతగా నిలిచిన అర్జున్ మీ అభినందనలకు అర్హుడు. మీరంతా వెళ్లి అతన్ని అభినందించండి" అనడంతో –

అతని విశాల హృదయానికి సంస్కారానికి ముగ్ధులైన ఆ అభిమానులు కొంతమంది కౌగలించుకుంటే, కొంతమంది ముద్దాడితే, కొంతమంది ఆశీర్వదించేరు.

అందరి మనసులు చూరగొన్న కృష్ణ ‘విజేత’ గా నిలబడలేదన్న నిజం భరించలేకపోతూ, ఈ పరిస్థితికి ఏమైనా కారణం ఉందా అన్న అనుమానం కొందరికి కలగకపోలేదు.

వారి అనుమానం నిరాధారమైనది కాదని ఎవరికీ తెలియకపోయినా –

‘రవి కాంచని చోట కవి కాంచును’ అన్నట్టుగా నాకు మాత్రమే తెలిసిన నిజం వివరాలు ఏమంటే --

పోటీ నిర్వాహకులు పోటీకొచ్చిన అభ్యర్థులను ఒక హోటల్ లో ఇద్దరికి ఒక గది చొప్పున వసతి ఏర్పరచి సకల సదుపాయాలూ కలగచేసేరు.

పోటీ ఆఖరు రోజుకి చేరుకునేసరికి మిగిలిన కృష్ణ అర్జున్ వేరు వేరు గదులలో పోటీకోసం సాధన చేస్తున్నారు.

-3-

కన్యాకుమారికి చెందిన కృష్ణ అరుణాచలంకి చెందిన అర్జున్ ఇద్దరూ చెన్నైలో ఒకే కళాశాలలో చదువుకుంటూ కళాశాలవారు వారి విద్యార్థులకు ఏర్పర్చిన వసతిగృహంలో ఒకేగదిలో ఉంటున్నారు.

ఇద్దరి మాతృభాష తెలుగు కావడంతో, అచిరకాలంలోనే వారిద్దరూ ఘనిష్ఠ స్నేహితులుగా మారి 'నువ్వు ' అని పిలుచుకొనేంత చనువుతో మెలగసాగేరు.

ఇద్దరూ తమిళనాడులోనే నివసిస్తూండడంతో ఇద్దరికీ తమిళం వస్తూ తమిళ సినిమా పాటలు పాడే ప్రావీణ్యం కూడా ఉంది. కళాశాలలో జరిగే సంగీత పోటీల్లో పాటలు పాడి బహుమతులు గెలుచుకుంటూ అందరి మన్ననలకు పాత్రులైన వారిని, ప్రస్తుతం జరుగుతున్న ఈ పాటల పోటీలో పాల్గొనేందుకు కళాశాలలోని ఇతర విద్యార్థులు అధ్యాపకులు కూడా ప్రోత్సాహించేరు. పోటీల చివరి తేదీకి వారు చదువులో జరిగే పరీక్షలకు సుమారు నాలుగు నెలలు గడువు ఉండడంతో కృష్ణ అర్జున్ కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేసేరు.

అయితే, కళాశాల యాజమాన్యం వారు, ఎందుకైనా మంచిదని, వారి దగ్గరనుంచి ఈ పోటీలో పాల్గొనేందుకు ‘వినతి పత్రం’ తీసుకొని, ఈ పోటీలో పాల్గొనడం వలన వారి చదువుకు సంబంధించిన పరీక్షలలో వచ్చే ఫలితాలకు వారే బాధ్యులు అన్న నిబంధనతో, ఈ పోటీలో పాల్గొనేందుకు ‘అనుమతి పత్రం’ ఇచ్చేరు.

రెండు రోజులు పొతే ఆఖరు పోటీ ఉందనగా రాత్రి భోజనాలైన తరువాత కృష్ణ గదికి అర్జున్ వచ్చి "కృష్ణా, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి"

"చెప్పు అర్జున్, నేను నీకే సహాయం చేయాలో. నేను చేయదగ్గది నా చేతిలో ఉన్నదైతే తప్పక చేస్తాను"

"అలా అంటే కాదు, తప్పకుండా చేస్తానని నాకు ప్రమాణం చేస్తేనే చెప్తాను"

"ప్రమాణం అంటున్నావంటే ఏదో పెద్ద విషయమయే అయిఉంటుంది. నేను చేయలేనిది నా చేతిలో లేనిది అయితే ఎలా"

"నీ చేతిలో లేనిదీ నువ్వు చేయలేనిది నేను ఎందుకు అడుగుతాను కృష్ణా"

"అలా అయితే, తప్పక చేస్తానని ప్రమాణం చేస్తున్నాను" అంటూ అర్జున్ చేతిలో కృష్ణ తన చేయి వేసి ఉంచేడు.

-4-

తన చేతిలో ఉన్న కృష్ణ చేతిని గట్టిగా పట్టుకొన్న అర్జున్ –

"మన పాటల పోటీ ఆరంభం అయిన వారం రోజులకు –

‘నాకొక పెళ్ళి సంబంధం వచ్చిందని, అందరికీ అన్నీ నచ్చి నన్ను వారి అల్లుడిగా చేసుకుందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, అమ్మాయికి అయితే నేను బాగా నచ్చేవని, నేను కూడా అమ్మాయిని నచ్చుకుంటే పెళ్లి ఖాయం చేసుకొని, నిశ్చయ తాంబూలం తీసుకొని, నాకు ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేయడానికి నిర్ణయించేమని’ –

పదిరోజుల క్రిందట మా నాన్నగారు నాకు అమ్మాయి ఫోటో పంపేరు. నేను కూడా ‘ఆ అమ్మాయి నచ్చింది’ అని మా నాన్నగారికి ఆరోజే తెలియచేసేను”

"కంగ్రాట్యులేషన్స్ అర్జున్. ఇప్పుడు ఇందులో నేను నీకు చేయవలసిన సహాయం ఏమిటి"

"నిన్న మధ్యాహ్నం ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది కృష్ణా"

"ఓహో, అప్పుడే మీమధ్య ఫోన్ లో సంభాషణలు ఆరంభం అయేయన్నమాట. మరింకేం, డబుల్ కంగ్రాట్యులేషన్స్”

"ఫోన్ చేసి ఏమందో తెలుసా"

"నాకెలా తెలుస్తుంది"

"ఈ పాటల పోటీలో నేను గెలుస్తేనే నన్ను పెళ్లిచేసుకుంటాను లేకపోతే లేదు అని చెప్పింది"

"మంచిదే. ఆమె మాట నీతో ఇంకా కఠినంగా సాధన చేయిస్తుంది. నువ్వు ఈ పాటల పోటీలో గెలిచి ఆమెని పెళ్ళాడు"

"ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లంటూ చేసుకుంటే, ఆ అమ్మాయినే చేసుకోవాలి. లేకపోతే పెళ్లే చేసుకోను. ఎంత సాధన చేసినా నేను ఈ పోటీలో నీ మీద గెలవలేను కనుక, నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొనేందుకు నాకు సహకరించమని నీ సహాయం అర్ధిస్తున్నాను. నువ్వు నాకు ఈ సహాయం ఎలాగైనా చేయాలి కృష్ణా. ఇప్పుడు నా గెలుపు నా పెళ్లి రెండూ నీ చేతిలో ఉన్నాయి. ఏమంటావు"

-5-

ఒకపక్క తననే నమ్ముకొని వేడుకుంటున్న స్నేహితుడు, మరొకపక్క పేరు పైకం తెచ్చిపెట్టే పాటలపోటీ. తాను ఎటుపక్క మొగ్గాలి, స్నేహితుడికిచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి అనుకున్న కృష్ణ -- మరొక నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించి –

‘ ఏమి జరిగినా అంతా మంచికే ’ అన్న నిశ్చయానికి వచ్చేడు.

"సరే అర్జున్, నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. ఎటువంటి ఆలోచన ఆందోళన పెట్టుకోక, నీకు నచ్చిన ఆ అమ్మాయితో పెళ్ళికి తయారవు. నీ పెళ్ళికి నన్ను పిలవడం మరచిపోకేం" అని ఆందోళనకరమైన అర్జున్ మనసుని ఆహ్లాదపరచేడు. ఆనందం పట్టలేని అర్జున్ కృష్ణని గట్టిగా కౌగిలించుకొన్నాడు.

"అర్జున్ నీ కౌగిలిలో ఊపిరాడక బంధించపడుతున్న నేను ఆ అమ్మాయిని కాను" –

అని కృష్ణ ఛలోక్తి చేయగానే, తేలిక పడిన మనసుతో అర్జున్ –

"కృష్ణా, వేదిక మీద ఎలా చేస్తావు ఏం చేస్తావు మరి"

"ఆ విషయం నాకొదిలేసి వెళ్లి నువ్వు నీ సాధన కొనసాగించు" అని అర్జున్ ని పంపించిన కృష్ణ తన ఓటమికి ఏమి చేయాలా ఎలా చేయాలా అన్న ప్రణాళికలో పడ్డాడు.

ముగిసిన పోటీలో విజయం వరించిన అర్జున్, ఓటమిని తెచ్చిపెట్టుకున్న కృష్ణ వెనక్కి కళాశాలకు వచ్చి చేరేరు.

పాటల పోటీలో గెలుపు సహజంగా తెచ్చి పెట్టిన సాధారణ మానవనైజమైన గర్వంతో, వెల్లువగా వస్తున్న అభినందనలతో, చదువులో వెనకపడిన అర్జున్ ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణత కాలేకపోయేడు.

పాటల పోటీ విషయాన్ని తన మెదడులోంచి పూర్తిగా తొలిగించి, చదువులో ఏకాగ్రతతో, కృష్ణ ఆ సంవత్సరం జరిగిన పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించేడు.

మరుసటి ఏడాది జరిగిన పాటల పోటీలో విజయం కూడా వరించిన కృష్ణకు పేరు పైకం లభించేయి.

కళాశాల చదువు తరువాత వచ్చిన ఉద్యోగం చేస్తూనే, ఉదయం రెండు గంటలు రాత్రి రెండు గంటలు ఔత్సాహిక గాయకులకు లలిత సంగీతం లోని మెలకువలు పాఠాలుగా నిర్వహిస్తూ కృష్ణ రెండు చేతులా ఆర్జించసాగేడు.

-6-

కృష్ణ దగ్గర లలిత సంగీతం పాఠాలు నేర్చుకొన్న వారిలో కొందరు పాటల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు సంపాందించుకొని వేదిక మీద ‘కృష్ణగారు తమకు లలిత సంగీత గురువు’ అని గర్వంగా చెప్తూ ఉండేవారు. ఆ మాటలు కృష్ణకు ‘లలిత సంగీత గురువు’ గా పేరు ప్రఖ్యాతలు సమకూర్చేయి.

ముందునుంచే సంగీతంలో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణకు ఇప్పుడు వచ్చిన ‘లలిత సంగీత గురువు’ అన్న పేరుతో అమెరికాలోని తెలుగు సంఘాలు ఆహ్వానం పలికేయి.

అక్కడున్న తెలుగు కుటుంబాలవారు కృష్ణకు రానూ పోనూ ఖర్చులు భరించి మంచి వసతి సదుపాయం కలగచేసి, అతనిచేత తమ బాల బాలికలకు లలిత సంగీతంలో పాఠాలు నేర్పించే ఏర్పాటు చేసేరు.

ఆవిధంగా అతనికి అంతర్జాతీయంగా కూడా ‘లలిత సంగీత గురువు’ అన్న పేరు మారుమ్రోగింది.

కృష్ణకు వచ్చిన ఇంతటి అభివృద్ధికి పేరు ప్రఖ్యాతలకు అతనిలో ఉన్న వినయ విధేయతలు ఉత్తమ సంస్కారంతో పాటూ అతని ఆలోచనా సరళి – ' కుడి ఎడమైతే పొరపాటు లేదోయి ' మరియు ' ఏమి జరిగినా అంతా మంచికే ' – ముఖ్యమైన కారణం.

*****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు