సెకండ్ హ్యాండ్ - బొబ్బు హేమావతి

Second hand

మా సొంత ఊరు హైదరాబాద్ అయినా మేము తెలుగు వాళ్ళమైనా ఉద్యోగ పరిస్థితుల వలన నేను ముంబై లో ఉంటున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని పిల్లలు ఒకటే గోల చేస్తా ఉంటే ఈ సంవత్సరం తప్పని పరిస్థితిలో ఎన్ని పనులు ఉన్నా మానుకొని నేను హైదరాబాదుకు వచ్చాను. ఫ్లైట్ దిగంగానే హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. హైదరాబాదు ఈ 20 ఏళ్లలో చాలా మారిపోయింది. ఎప్పుడు అమ్మ నాన్న నా దగ్గరికి ముంబైకి వచ్చి నాకు సహాయంగా ఉన్నారు. అందుకే నాకు హైదరాబాద్కు రావాల్సిన పని పడలేదు. కొత్తగా గేటెడ్ కమాండ్ లో ఫ్లాట్ కొన్నాను... తమ్ముడు కూడా అమెరికా నుంచి గృహప్రవేశానికి వస్తున్నాడు . ఈసారి మీరు తప్పనిసరిగా వచ్చి మాతోనే ఉండాలి అని అనడంతో అందర్నీ కలిసినట్టు ఉంటుందని ఫ్యామిలీ మొత్తం వచ్చాం. వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, బిర్లా టెంపుల్ విజిట్ చేసాము. నాలుగో రోజు మేమందరం కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళాము. దర్శనం పూర్తి చేసుకుని బయట వస్తున్నాను అంతలో నాకు అక్కడ గుడి బయట చెప్పులు కొట్టు దగ్గర అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. మా తమ్ముడు చింటూ కి చూపించి అడిగాను.... ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది. మా తమ్ముడు అటువైపు చూసి... అవునక్కా... అది తను మన రచన అక్కా అనేటంతలో... ఆ అమ్మాయి మా వైపు చూసి మమ్మల్ని గుర్తు పెట్టినట్టు మా దగ్గరకు వచ్చి...శ్రీజ అక్క ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి నన్ను గుర్తుపట్టారా....నేను రచనను అనింది. వెంటనే మా తమ్ముడు రచన తో.... నువ్వు.... ఆంటీవి అయిపోయావు అనగానే... మరి ఇద్దరు పిల్లలు తల్లిని ఆంటీ ని కాక పదహారు ఏండ్ల అమ్మాయినా... అని నవ్వుతూ చింటూ తో...చింటూ ఇప్పుడు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వాడు నవ్వుతూ.... పక్కనే ఉన్న తన భార్య మాధవి ని చూపించి నా భార్య పర్మిషన్ ఇస్తే ఓకే అన్నాడు. తన భార్యకు పరిచయం చేస్తూ ఈమె పేరు రచన. నాకంటే నాలుగేళ్లు పెద్దది కానీ నా ఫస్ట్ క్రష్. చిన్నప్పుడు తనకు ఒక లవ్ లెటర్ రాసి తనకు ఇచ్చాను. వెంటనే ఆ లెటర్ ని తను మా అక్కకి ఇచ్చింది. ఇద్దరు కలిసి నన్ను చాలా ఆట పట్టించారు.... అంటూ.... మా ఇద్దరి వైపు చూపిస్తూ....వీళ్ళిద్దరూ కోతులు.... అనగానే ఆ... ఆ... నాక్కూడా గుర్తుంది. అప్పుడు నీకు కోపం వచ్చి నీ గోళ్ళతో మమ్మల్ని రక్కేసావు. నేను ఇంటికి వెళ్లి అమ్మకు చెప్తానంటే వెంటనే నన్ను అడుక్కున్నావు గుర్తుందా అని... ఏదో చిన్న పిల్లాడు అని ఊరుకున్నాము కానీ...లేకపోతే ఆ రోజు నీకు నాన్న దగ్గర బడిత పూజ తప్పేది కాదు. పోనీ ఆ లవ్ లెటర్ ఏమన్నా సరిగ్గా ఉందా. అన్ని అక్షర దోషాలు. ఇప్పుడేమో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్. నువ్వు అక్కడ పిల్లలకి ఏం పాఠాలు చెపుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని నవ్వాను. చింటూ ఉడుక్కుంటూ.... ఎంత సోపు మన గొడవ లేనా... అని రచన వైపు చూసి "రచన ఎలా ఉన్నావు. పిల్లలు ఏం చేస్తున్నారు" అని అడిగాడు. ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న బిసినెస్ లో దివాళ తీసేశానని బాధలో సూసైడ్ చేసుకున్నాక, నాకు మంచి చెప్పేవాళ్ళు లేక ఆకర్షణను ప్రేమ అనుకుని పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మన కేబుల్ ఆపరేటర్ తమ్ముడు మధుసూదన్ ని. నేను వెంటనే అన్నాను...మధుసూదనా.... అప్పట్లో నీ వెంటపడేవాడు. కానీ అప్పటికే వాడికి పెళ్లి అయ్యిందని నువ్వు దూరం పెట్టే దానివి. మనిద్దరం కలిసి వాడికి ఒకసారి బుద్ధి కూడా చెప్పాము.... అనగానే ఆ...వాడే మనిద్దరం కలిసి వాడ్ని వెధవ కూడా అన్నాము. తర్వాత మేము ఇల్లు మారిపోయాం కదా. అక్కడ కూడా వెంటపడేవాడు. నాన్న పోయిన బాధలో ఉన్న నేను, ఎందుకో ఉన్నట్టుండి నా బుద్ధి మారిపోయి, ఆకర్షణ ను ప్రేమ అనుకుని, వాడికి లొంగిపోయాను. ఇప్పుడు నేను వాడికి రెండో భార్యను... అని నవ్వలేక నవ్వింది. నీకు తెలుసు కదా... అతని మొదటి భార్య అతని అక్క కూతురే. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకు రచనను చూస్తే ఎంతో బాధేసింది. రచన ఎంత అందమైన పేరు. కానీ తన జీవితాన్ని తాను రచించు కోలేకపోయింది. వెంటనే నేను రచనను అడిగాను.... మరి ఇక్కడ ఎందుకు ఉన్నావ్. రచన నా వైపు చూసి చెప్పింది....కర్మ అక్కా . మా అన్న కూడా నా పెళ్లి కి ఒప్పుకోలేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, అమ్మ కు, అన్నకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా. అతను తన ఇంట్లో ఏం చెప్పుకున్నాడో కానీ అతని భార్య నా మీదకు రాలేదు. వారంలో రెండు రోజులు ఆ ఇంటికి వెళ్తాడు. మిగిలిన రోజులు నాతోనే ఉంటాడు. నేను నా కష్టంతోనే బతుకుతున్నాను. అతను ఏమీ నాకు సంపాదించి పెట్టట్లేదు. మా అమ్మ మాత్రం నాకు కొంచెం సహాయం గా ఉండేది అతనితో నేను మొదట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో అతను అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నాకు ఫోన్ కాల్ చేసి నన్ను వేధించాడు. నేను చాలా భయపడ్డాను. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఏదో కొద్ది రోజులు నేను అతనితో రిలేషన్ షిప్ లో ఉంటే నన్నే పెళ్లి చేసుకో అంటూ పీడించాడు. అతనికేమో పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, అని నాకు అప్పటికే తెలుసు . వయస్సు ఆకర్షణలో ఉన్న నన్ను సినిమాకి వెళ్దాం రా అని తీసుకెళ్లాడు ఒకరోజు. అక్కడినుండి ఒకరోజు మనిద్దరం ట్రిప్ కి వెళ్దాము అని నేను వద్దంటూ ఉంటే కూడా నన్ను వరంగల్ తీసుకెళ్లాడు. అక్కడ కాటేజ్ తీసుకున్నాడు మా ఇద్దరి పేరు మీద భార్యాభర్తలము అని చెప్పి. శరీరం కొవ్వెక్కి ఎవరి మాట వినే స్థితిలో లేనప్పుడు నేను . మొత్తం అతనికి సమర్పయామి అయిపోయింది. అక్కడ మేము గడిపిన తియ్యటి క్షణాలన్ని పదిలంగా చూసుకోవాలని నేను ఎన్నెన్నో ఫోటోలు తీసుకున్నాను. ఆ ఫోటోలన్నీ చూపించి నన్ను బెదిరించాడు. ఊరంతా వాల్ పోస్టర్ లేపిస్తాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నేను ఊరుకోను అన్నాడు. చెడ్డపేరు వస్తుంది అని ఒప్పుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నది. సరే వాడితోనే తిరిగాను కదా అని వాడినే పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన కొత్తలోనే మస్తుగా తినడం, బాగా తాగడం, నిద్రపోవడం. ఎలా సంపాదించాలి అనే ఆలోచన కొంచెం కూడా లేదు. వాడి పెళ్ళాం బిడ్డలకి ఏం కొరత లేదు. వాడి అక్క అంతా చూసుకుంటుంది. నేనేమో వాడిని నమ్ముకుని వచ్చి పెళ్లి చేసుకున్నాను. నా బతుకు ఎటు కాకుండా అయిపోయింది. నేను ప్రశ్నించానని నా గొంతు పిసికాడు. ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. లేచిపోయి వచ్చిందాన్ని నాకెవరు సపోర్ట్ ఇస్తారు. మా అమ్మ దగ్గర ఏడిస్తే... మా అమ్మ మా అన్నకి చెప్పి గుడిలో నాకు ఈ ఉద్యోగం ఏపించింది. పురుడు పుణ్యాలు అన్నీ కూడా మా అమ్మే చూసుకుంది. గవర్నమెంట్ ఖాతాలో ఇల్లు కూడా ఇప్పించింది. ఆమె బంగారం అంతా నాకే పెట్టింది. వాడు నా మొగుడు మంచోడా లేక చెడ్డోడా నాకు అర్థం కాలేదు. నీతోనే ఉంటాను అని నన్ను వదిలిపెట్టి వెళ్ళకుండా నాతోనే ఉంటాడు. కానీ రూపాయి సంపాదించడం చేతకాదు. ఏదో చేస్తున్న అంటాడు గాని ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కాదు. ఒక్కోసారి 50వేలు, లచ్చ తెస్తాడు. ఆ పెళ్ళాం చేతిలో అంతా పెట్టి నాకు కొంచెం ఇంటికి కావలసింది తెచ్చేస్తాడు. నేను ఎవరితో మాట్లాడినా నా మీద అనుమానము. ఇప్పటికే రెండు మూడు సార్లు నా గొంతు పిసికినాడు. వాడు ఉట్టి వెధవ మేడం... కానీ పెళ్లి చేసుకున్నాను అని కట్టుబడి ఉన్నాను. రేషన్ కార్డులో ఆ భార్య బిడ్డల పేర్లు. ఆధార్లో వాళ్ల పేర్లు. నేను నా బిడ్డలు సపరేటు. మొగుడు ఉండి కూడా లేని దాన్ని. మేడం నేను సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీని అని కళ్ళ నీళ్లు పెట్టుకునింది. పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటా బతుకుతున్నాను. ఈ మధ్య అమ్మ కూడా సచ్చిపోయింది. ఇప్పుడు నా బాధ చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరు నాకు. అమ్మ చచ్చిపోయినప్పుడు పోర్లి పోర్లి ఏడ్చినాను. శ్రీజ వెంటనే రచన వైపు చూసి... బాధపడకు, నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే నేను నీకోసం నిలబడతాను. పిల్లలను బాగా చదివించు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్లను నిలబడేటట్టుగా చెయ్యి. చింటూ భార్య మాధవి వెంటనే అన్నది..... మా ఇండియన్ బిజినెస్ స్కూల్ తరపున హైదరాబాద్ లో మేము ఒక ఉమెన్ హెల్ప్ గ్రూప్ నిర్వహిస్తున్నాము. అందులో నిన్ను కూడా చేర్పిస్తాను. మెంబర్స్ కి ఎటువంటి ఫైనాన్షియల్ గా కష్టం వచ్చినా లోన్ ఇస్తారు. అదేవిదంగా ఎప్పుడైనా ఎవరైనా హరాస్ చేస్తా ఉంటే మేమంతా కలిసి వచ్చి ఒకరికి ఒకరు సపోర్టుగా నిలబడతాము అనగానే... చింటూ... డన్... అంటూ బొటన వేలెత్తి చూపాడు. రచన మొహంలో చిరునవ్వు మొలకెత్తింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు