అభిమానం ఖరీదు - మద్దూరి నరసింహమూర్తి,

Abhimanam khareedu

"సర్, నేను ‘అమృతం ఆసుపత్రి’ నుంచి మాట్లాడుతున్నాను. మా MD గారు మీతో మాట్లాడతారట"

"ప్రస్తుతం నేను సెలవు మీద ఇంట్లో ఉన్నాను"

"ఆ సంగతి MD గారికి తెలుసు, మీరు మాట్లాడగలరంటే లైన్ కలుపుతాను"

"ఇంతకీ ఏమిటి విషయం"

"అది ఆయనే మీతో మాట్లాడాతారట"

"సరే ఇవ్వండి"

కొన్ని సెకెన్ల తరువాత ..

"హలో మాధవరావుగారూ, నేను ప్రసాదరావుని"

"నమస్కారం ప్రసాదరావుగారు. ఇలా మీరే ఫోన్ చేసేరంటే ఏదో ముఖ్యమైన పనే అయిఉంటుంది. నేను సెలవులో ఉన్నాను. అయినా ఆ పనేమిటో చెప్తే నేను వెంటనే జరిగే ఏర్పాటు చేస్తాను"

"నాకు తెలుసండీ మీరంతటి సమర్ధులని. మరేమీలేదూ, మీ బ్యాంకులో నావి మా ఆసుపత్రివి అన్ని ఖాతాలు మరో బ్యాంకుకి బదిలీ చేయాలని ఆలోచిస్తున్నాము. ఎన్ని రోజుల్లో ఆ పని అయిపోతుందో తెలుసుకోవాలని మీతో మాట్లాడక తప్పలేదు"

"అదేమిటి ప్రసాదరావుగారూ అంత మాటనేసేరు. మీరు మీ ఆసుపత్రి మా బ్యాంకు ఖాతాదారులతో చాలా ముఖ్యమైనవారు. నావల్ల కానీ మా స్టాఫ్ ఎవరివలన కానీ ఏదేనా పొరపాటు జరిగితే, నేను క్షమాపణ అడుగుతున్నాను. అంతేకానీ, మీరు దయచేసి అలాంటి ఆలోచన చేయకండి"

"మేము కానీ, మా అవసరం కానీ మీకు అక్కరలేదు అని వ్యవహరిస్తున్న మీతో మీరు కానీ మీ అవసరం కానీ మాకెందుకు అనిపిస్తూంది"

"మా బ్రాంచ్ లో ఎవరండీ అలా వ్యవహరించి మిమ్మల్ని అవమానించింది. వెంటనే ఆ స్టాఫ్ మీద చర్య తీసుకుంటాను నేను"

"ఎవరో ఏమిటి, మీరే"

"నేనా ! అదేమిటి ప్రసాదరావుగారూ నాలుగు రోజులై నేను జ్వరంతో సెలవులో ఉండి బ్యాంకు కి వెళ్లనేలేదు. అలాంటిది నేను అలా వ్యవహరించేనని మీరెలా అనుకున్నారు, మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు"

"నాకెవరూ తప్పుడు సమాచారం ఇవ్వలేదు. నాలుగు రోజులై జ్వరంతో మీరు సెలవులో ఉన్నారని నాకు తెలుసు"

"అలాంటప్పుడు మరి నామీదే మీరు నింద వేస్తున్నారు"

-2-

"మీకు జ్వరం వచ్చి నాలుగు రోజులై బాధపడుతూంటే - నేను కానీ, నా ఆసుపత్రి కానీ గుర్తుకు రాలేదు, అవసరం పడలేదు అంటే మీరు నన్ను అవమానించినట్టు కాదా మరి"

"హమ్మయ్య. అంతేనా. మీ మాటలతో నన్ను గాభరా పెట్టేసేరు. నేనిప్పుడేమి చేయాలో సెలవివ్వండి"

"వెంటనే మీరు మా ఆసుపత్రికి వచ్చేయండి. మీరంటే నాకుండే ప్రత్యేకమైన అభిమానంతో ఇప్పుడే నేను ఆంబులెన్సు పంపుతాను. మీకోసం నేను ప్రత్యేకమైన గది ఏర్పాటు చేస్తున్నాను. మీ వైద్యం విషయం నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీ ఒక్కరి కోసమే ప్రత్యేకంగా 24 గంటలూ ఒక నర్స్ ని ఏర్పాటు చేస్తున్నాను. మీకు మీ కుటుంబానికి క్షేమకరం కాదు కాబట్టి ఎవరినీ ఇప్పుడు మీతో తీసుకురాకండి. మీకెప్పుడు కావలసిస్తే అప్పుడు మీవాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకుందురుగాని."

"చాలా ధన్యవాదాలు. ఆంబులెన్సు ఎందుకులెండి. ఇప్పుడే బయలుదేరి నేనే మిమ్మల్ని కలుస్తాను"

"నో నో. నేను మీరేమి చెప్పినా వినదలచుకోలేదు. పావుగంటలో ఆంబులెన్సు మీ ఇంటి ముందర ఉంటుందంతే"

"సరే. వెంటనే నా ఇంటి అడ్రస్ మీకు పంపేదా"

"జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేల మాధవరావుగారూ” అని ఆయన నవ్విన నవ్వుతో మాధవరావు గారి మనసు తేలిక పడింది.

మాధవరావుగారింటికి ఆంబులెన్సు రాగానే అందులో ఉన్న జూనియర్ డాక్టర్ ఆయన మొఖానికి మాస్కు పెట్టి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి నేరుగా ‘అమృతం ఆసుపత్రి’ లో ఆయనకి ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన గదిలో పక్కమీద పడుకో పెట్టి MD గారికి కబురు పెట్టేరు.

పది నిమిషాల్లో వచ్చిన ప్రసాదరావుగారిని చూసిన మాధవరావుగారు పక్కమీంచి లేవబోతూంటే –

"వద్దు వద్దు, మీరు పక్కమించి లేవొద్దు. ఎప్పటినుంచి మీకు జ్వరంగా ఉంటూంది, టెంపరేచర్ ఎంత ఉంటూంది, మీరేమేమి మందులు వాడేరు అన్ని వివరంగా చెప్పండి" అని --అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్ తో "మాధవరావుగారు చెప్పేవన్నీ జాగ్రత్తగా వ్రాసుకోండి" అని చెప్పేరు.

మాధవరావుగారు చెప్పనారంభించేరు.

“నాలుగురోజుల క్రితం ఉదయం తెలివి రాగానే ఎందుకో చాలా నీరసం అనిపించింది. బుర్ర తిరుగుతున్నట్టుగా అనిపించింది. నడుస్తూంటే ఒళ్ళు ఊపేస్తూండేను. ఒకసారి పెద్ద వాంతి అయింది. తరువాత మూడు సార్లు పలచగా విరోచనం అయింది. టెంపరేచర్ చూసుకుంటే 103 దగ్గరగా ఉండెను. అప్పటినుంచి ఇప్పటివరకూ టెంపరేచర్ 102 - 103 మధ్యలోనే ఉంటూ వచ్చింది. రాత్రి నిద్ర పట్టడంలేదు. తిండి పెద్దగా సాయించడం లేదు. అసలు తినాలనే అనిపించడం లేదు. కొబ్బరి బొండం నీళ్లు మాత్రమే రోజుకి రెండు మూడు సార్లు తీసుకొనేవాడిని. ఈ జ్వరం ఎందుకో ఏమిటో తెలీదు కనుక మందులు ఏవీ వేసుకోలేదు. విశ్రాంతిగా ఉండడానికి సెలవు పెట్టి ఉన్నాను”

-3-

“చూడండి మాధవరావుగారూ, జ్వరం తగ్గిందా లేదా అన్నది ముఖ్య విషయం కాదు. అసలు ఏ కారణానికి వచ్చింది అన్నది తెలుసుకోవడమే ముఖ్యం. అందుకే, ఆ కారణం తెలుసుకొనేందుకు మీకు పరీక్షలు చేయిద్దాం. ఇప్పుడు సాయంత్రమైంది కదా విశ్రాంతి తీసుకోండి. మీ పరీక్షలన్నీ రేపు ఉదయం నుంచి ప్రారంభిస్తాం. ప్రతీ ఉదయం పరీక్షల నిమిత్తం బహుశా ఖాళీ కడుపుతో ఉండవలసి వస్తుంది. మా వాళ్ళు మీకు ముందు రోజు రాత్రి ఎప్పటికప్పుడు ఆ సంగతి చెప్తూ ఉంటారు. మీకు తినడానికి త్రాగడానికి ఏమిటి ఇవ్వాలో ఎప్పుడెప్పుడు ఇవ్వాలో మా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధతో మిమ్మల్ని చూసుకుంటారు. మీరు మావాళ్లతో పూర్తిగా సహకరిస్తే చాలు" అని –

జూనియర్ డాక్టర్ ని ఆవల వేచి ఉండమని పంపించి, కొంచెం గొంతుక తగ్గించి --

"కొద్దిసేపట్లో మావాళ్ళు వచ్చి అలవాటు ప్రకారం మీకు ఇన్సూరెన్సు ఉందా అని అడిగితే, లేదని చెప్పండి. ఎందుకంటే, ఇన్సూరెన్సు లేదంటే మావాళ్ళు బిల్లులలో వేసే ధరల కంటే, ఉందంటే వేసే ధరలు ఎక్కువగా ఉంటాయి. మీకు డబ్బుకు కొదవ ఉంటుందని కాదు, మీరంటే నాకుండే ప్రత్యేకమైన అభిమానంతో ఈ రహస్యం చెప్తున్నాను. ఇక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయిన తరువాత ఆసుపత్రి బిల్లులు మీద బ్యాంకు నుంచి మీకు రావలసిన సొమ్ము వాపసు తీసుకుందురుగాని. "ఇంకొక మాట. ఆసుపత్రి బిల్లులు ఏరోజుకారోజు వేసి ఇమ్మని చెప్పండి. ఎందుకంటే, అవి ఏరోజుకారోజు చెల్లించేస్తూంటే మీకు తేలికగా ఉంటుంది. లేకుండా అంతా ఒక్కసారి ఇవ్వడం అంటే, తడిసి మోపుడు అనిపిస్తుంది కదా"

“మీరు నాగురించి ప్రత్యేకంగా చూపిస్తున్న అభిమానం చూస్తూంటే నా నోట మాట రావడం లేదు”

"ఇప్పుడు నేను చెప్పినవి మీ మనసులో పెట్టుకోండి. ఎవరితోనూ పొరపాటున కూడా అనకండి"

అని, జూనియర్ డాక్టర్ ని లోపలికి పిలిచి ---

"బీపీ & టెంపరేచర్ నాలుగేసి గంటలకోసారి చేస్తూండండి. రేపుదయం ఈయనకి పూర్తి రక్తపరీక్షలు, మలమూత్రపరీక్షలు చేయించి ఫలితాలు రేపు సాయంత్రం ఐదుగంటలకల్లా నాకు అందేటట్టు ఏర్పాటు చేయండి" అని "నేను రేపు సాయంత్రం ఆరైతే వస్తాను మాధవరావుగారూ" అని MD గారు వెళ్ళిపోయేరు.

మరుసటి రోజు :

మాధవరావుగారికి ఈరోజు జరగవలసిన పరీక్షలన్నీ జరిగిపోయి, వాటి ఫలితాల వివరాలన్నీ సాయంత్రం ఐదుకు పది నిమిషాలుండగానే MD గారి టేబుల్ మీదకు చేరిపోయేయి.

MD గారు చెప్పిన సలహా ప్రకారం, ఈరోజు పరీక్షలకు సంబంధించి మరియు ఉంటున్న గది అద్దె సంబంధించిన ఖర్చు మొత్తం పదివేలరూపాయలు మాధవరావుగారు చెల్లించేసేరు.

MD గారు సాయంత్రం ఆరుగంటలకు వచ్చి "మాధవరావుగారూ ఈరోజు జరిగిన పరీక్షలలో మీకు ఇప్పుడు వచ్చిన జ్వరానికి ఏమీ ప్రత్యేకమైన కారణం అంటూ కనపడలేదు. అయితే, మీరు రెండు విషయాలు నిన్నను చెప్పలేదు"

-3-

"ఏ రెండు విషయాలు"

"మీకు రక్తపోటు చక్కరవ్యాధి ఉన్నాయని నిన్న చెప్పలేదే"

"ఆ రెండూ నాకు లేవు కదా, అందుకే నేను చెప్పలేదు"

"కానీ, ఈరోజు మీకు జరిపిన రక్తపరీక్షలో మీకు చక్కరవ్యాధి ఉంది అని తెలిసింది. బహుశా మీరు ఎప్పుడూ పరీక్ష చేయించుకోలేదేమో"

"అవును, ఎప్పుడూ చేయించుకోలేదు"

"మీరు ఎక్కువగా తీపి తింటారా"

"రోజూ రాత్రి మిఠాయి తినడం ఎప్పటినుంచో అలవాటు"

"మీ ఇంట్లో ఎవరికైనా చక్కరవ్యాధి ఉండేదా"

"మా నాన్నగారికి ఉండేది"

"అలాగే, మీ రక్తపోటు ఎలా ఉండేదో ఎప్పుడూ చూసుకోలేదా"

"లేదండి"

"ఒక పెద్ద బ్యాంకు నడపడం అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది కదా, అందుకే మీ రక్తపోటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబోలు. నిన్న మీరు వచ్చిన దగ్గరనుంచి మా వాళ్ళు చూసిన పరీక్షలో తెలుస్తూంది"

"ఎక్కువ అంటే ఎంత ఉందేమిటి"

"అవన్నీ మీరు ఆలోచించకండి. ఈరోజు పరీక్షలో మాత్రమే ఆ రెండింటి గురించి తెలిసినందున మీకు ఇప్పుడు చెప్పడమైంది. ఈరోజు నుంచి మావాళ్లు ఆ రెండింటికీ మందులు ఆరంభిస్తారు. "మీ గుండె చప్పుడులో మరియు ఆక్సీజన్ లెవెల్ రెండింటిలో కొంచెం తేడా కనిపిస్తోంది. అందుకే, రేపు మీకు Chest X-Ray, ECG, 2D ECHO, Echocardiography, TMT పరీక్షలు చేయించి, ఆ ఫలితాలు చూసిన తరువాత అవసరమైతే, రేపే CT Coronary Angiogram కూడా చేయించే ఏర్పాటు చేయిస్తాను. ఏమీ ఆలోచన పెట్టుకోకుండా, మీకు ఆహ్లాదం కలిగించే కార్యక్రమాలు టీవీ లో హాయిగా చూస్తూ విశ్రాంతి తీసుకోండి. రేపు సాయంత్రం ఇదే సమయానికి కలుస్తాను" అని MD గారు వెళ్ళిపోయేరు.

మూడోరోజు :

మాధవరావుగారికి జరగవలసిన పరీక్షలన్నీ జరిగిపోయి, వాటి ఫలితాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు వెంటవెంటనే MD గారి టేబుల్ మీదకు చేరిపోయేయి. ఆయన సలహా మీద CT Coronary Angiogram పరీక్ష కూడా జరిగి ఫలితం వెంటనే ఆయన టేబుల్ మీదకి చేరిపోయింది.

ఈరోజు పరీక్షలకు సంబంధించి మరియు ఉంటున్న గది అద్దె సంబంధించిన ఖర్చు ముప్ఫయిఐదువేల రూపాయలు మాధవరావుగారు చెల్లించేసేరు.

సాయంత్రం ఆరుగంటలకు వచ్చిన MD గారు –

-4-

“మాధవరావుగారూ ఈరోజు జరిగిన పరీక్షలలో కూడా మీకు ఇప్పుడు వచ్చిన జ్వరానికి ఏమీ ప్రత్యేకమైన కారణం అంటూ కనపడలేదు. అయితే, మీ గుండె కొంచెం నీరసంగా ఉంది అని తెలుస్తూంది. ఈరోజు నుంచే మందు ఆరంభించమని మావాళ్లకి చెప్పేను. రేపు మీకు ఊపిరి తిత్తుల సామర్ధ్యం మీద మరియు ఎండోస్కోపీ పరీక్ష చేస్తారు. విశ్రాంతి తీసుకోండి. రేపు సాయంత్రం ఇదే సమయానికి కలుస్తాను" అని వెళ్ళిపోయేరు.

నాలుగోరోజు :

మాధవరావుగారి ఊపిరి తిత్తుల సామర్ధ్యం మరియు ఎండోస్కోపీ పరీక్ష ఫలితాలు MD గారికి చేరిపోయాయి.

ఈరోజు పరీక్షలకు సంబంధించి మరియు ఉంటున్న గది అద్దె సంబంధించిన ఖర్చు ఇరవైవేల రూపాయలు మాధవరావుగారు చెల్లించేసేరు.

సాయంత్రం ఆరుగంటలకు వచ్చిన MD గారు “మాధవరావుగారూ ఈరోజు జరిగిన పరీక్షలలో కూడా మీకు ఇప్పుడు వచ్చిన జ్వరానికి ఏమీ ప్రత్యేకమైన కారణం అంటూ కనపడలేదు. రేపు Total Body Scanning చేయించి అవసరమైతే రేపే మీ మెదడుకి వేరుగా Scanning కూడా చేయిస్తాను. విశ్రాంతి తీసుకోండి. రేపు సాయంత్రం ఇదే సమయానికి కలుస్తాను" అని వెళ్ళిపోయేరు.

ఐదో రోజు :

మాధవరావుగారికి Total Body Scanning, మెదడుకి Scanning కూడా జరిగి పరీక్షల ఫలితాలు వెంట వెంటనే MD గారి టేబుల్ మీదకి చేరిపోయాయి.

ఈరోజు పరీక్షలకు సంబంధించి మరియు ఉంటున్న గది అద్దె సంబంధించిన ఖర్చు ముప్ఫయివేల రూపాయలు మాధవరావుగారు చెల్లించేసేరు.

సాయంత్రం ఆరుగంటలకు వచ్చిన MD గారు “మాధవరావుగారూ ఈరోజు జరిగిన పరీక్షలలో కూడా మీకు ఇప్పుడు వచ్చిన జ్వరానికి ఏమీ ప్రత్యేకమైన కారణం అంటూ కనపడలేదు. చివరిగా మీకు రేపు కార్డియోవాస్క్యూలర్ పరీక్ష చేయించి ఇప్పటి మీ జ్వరానికి కారణమేమేనా దొరుకుతుందేమో చూద్దాం. విశ్రాంతి తీసుకోండి. రేపు సాయంత్రం ఇదే సమయానికి కలుస్తాను" అని వెళ్ళిపోయేరు.

ఆరో రోజు :

మాధవరావుగారికి కార్డియోవాస్క్యూలర్ పరీక్ష జరిగి, ఫలితం వెంటనే MD గారి టేబుల్ మీదకి చేరిపో యింది.

ఈరోజు పరీక్షకు సంబంధించి మరియు ఉంటున్న గది అద్దె సంబంధించిన ఖర్చు పదిహేనువేల రూపాయలు మాధవరావుగారు చెల్లించేసేరు.

సాయంత్రం ఆరుగంటలకు వచ్చిన MD గారు –

-6-

“మాధవరావుగారూ ఈరోజు జరిగిన పరీక్షలో కూడా మీకు ఇప్పుడు వచ్చిన జ్వరానికి ఏమీ ప్రత్యేకమైన కారణం అంటూ కనపడలేదు. అన్ని పరీక్షల తరువాత ఇప్పటి మీ జ్వరానికి ఎటువంటి గంభీరమైన ఆందోళకరమైన కారణం లేకపోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి జ్వరానికి ‘DOLO 65’0 మాత్ర రోజూ ఆరుగంటలకొకసారి మూడురోజులు వేసుకుంటే సరిపోతుంది. మీకిప్పుడు ఇస్తున్న prescriptionలో తెలియచేసిన విధంగా నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉండండి. మీరు ఇప్పుడు మాదగ్గరకు రావడంతో మీకు రక్తపోటు చక్కరవ్యాధి ఉంది అని తెలియడం మంచిదైంది. ఆ రెండింటికి సంబంధించిన మందులు ఇకమీదట రోజూ క్రమం తప్పకుండా వాడాలి. ఇంక మీరు మిఠాయిలు తినడం పూర్తిగా మానివేయాలి. పనిలో కానీ ఇంకా ఏవిధంగా కానీ ఎటువంటి ఒత్తిడి పెట్టుకోక ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే మీ రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇప్పుడు Dietician వచ్చి ఆహారంలో మీరు పాటించవలసిన నియమాలు చెప్తారు. తప్పకుండా వాటిని పాటిస్తూ మీరు ఎప్పుడూ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఇకమీదట ఎప్పుడేనా అనారోగ్యసమస్య వస్తే, నేను నా ఆసుపత్రి మీ సేవలో ఉంటుందని గుర్తుంచుకోండి చాలు. నా కారులో మిమ్మల్ని మా డ్రైవర్ ఇంటి దగ్గర దింపుతాడు. సెలవు" అని వెళ్ళిపోయేరు.

జరిగిన ఆరోగ్య పరీక్షలు మరియు ఆసుపత్రిలో ఆరు రోజులు ఉండేందుకు ఏర్పాట్లు బాగా ఖరీదు అనిపించినా, తనపట్ల తన ఆరోగ్యం పట్ల MD గారు తీసుకున్న శ్రద్ధకి అభిమానానికి మాధవరావుగారి కంట్లో నీళ్ళొచ్చేయి, ఆయన పట్ల కృతజ్ఞతతో హృదయం నిండిపోయింది.

చివరి మొత్తం పదహారువేల అయిదువందలు చెల్లించేసిన మాధవరావుగారు –

తనతోనే ఆసుపత్రికి వచ్చిన జ్వరాన్ని తన వెంట తీసుకొని ఇంటికి చేరుకున్నారు.

మూడు రోజులకు జ్వరం పూర్తిగా తగ్గడంతో –

మాధవరావుగారు బ్యాంకులో చేరినరోజే తాను ఆసుపత్రికి చెల్లించిన మొత్తం సొమ్ము (రూ.126500) వాపసు ఇమ్మని కోరుతూ బ్యాంకు వారు నిర్ధారించిన ఇన్సూరెన్సు కంపెనీవారికి అర్జీ పంపించేరు.

‘సత్వర సేవయే మా లక్ష్యం’ అన్న నినాదంతో పనిచేస్తున్న ఇన్సూరెన్సు కంపెనీవారు వారం లోపలే, ‘మీరు బాధపడిన సాధారణ జ్వరానికి సంబంధించి మాకు మీ బ్యాంకు వారికి మధ్యన జరిగిన ఒప్పందం ప్రకారం మీకు చెల్లించవలసిన సొమ్ము (రూ.1500) ఏమాత్రం కోత లేకుండా పూర్తిగా చెల్లిస్తున్నాము’ అని తెలియచేస్తూ, ‘దీనిపై ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలు పరికిరావు’ అని కూడా తెలియచేసేరు.

మాధవరావుగారికి అప్పుడు తెలిసింది ఆసుపత్రి MD గారు తనపట్ల చూపిన అభిమానం ఎంత ఖరీదైనదో.

*****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు