బెగ్గింగ్నోమియా(కామెడి కథ) - ఓదెల వెంకటేశ్వర్లు

beggingnomia

రా జారావు చిరాకుగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఈమధ్య సుజన రాజారావు ప్రవర్తనను గమనిస్తోంది. తరచూ ఊరులు తిరిగే రాజారావు ఊరు వెళ్లి వచ్చిన తరువాత రెండు మూడు రోజులు ఈ లోకంలో ఉండడు. ఏదో ఆలోచిస్తూ, దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. అదీ గాక అప్పుడప్పుడు గోనుక్కోవడం కూడా కద్దు. పాపం సుజనకు ఇతని ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. కాని అదేమిటో తేల్చుకోలేక పోయింది . ఎందుకైనా మంచిది డాక్టర్లకు చూపిద్దామనుకొని కూడా ప్రయత్నం చేసింది. దాంతో రాజారావు ఇంతెత్తున ఎగిరిపడ్డాడు.

" నాకేం మాయ రోగం నిక్షేపంగా ఉన్నాను. అలాంటి నన్ను డాక్టరుకు చూపిస్తానంటావేంటీ. ముందు డాక్టర్లకు నిన్ను చూపించాలి. నీకే ఏదో అయ్యింది." అంటూ విరుచుకు పడ్డాడు. దాంతో పాపం సుజన కూడా ఏమనలేకపోయింది. కాని చూస్తూ ఊరుకోలేక పోయింది. ప్రయాణం చేసి వచ్చిన తరువాత అలా ఎందుకు ఉంటున్నాడో మాత్రం అర్ధం కాలేదు. అలాగని చెప్పి ప్రయాణం చేసి వచ్చిన తరువాత అతనిలో మార్పు మాత్రం రాలేదు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్ధం కావడం లేదు. రాను రాను అతని ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. ప్రయాణం చేసి వచ్చిన తరువాతే కాదు అప్పుడప్పుడు బయటకువెళ్లి వచ్చిన తరువాత కూడా అలాగే ఉంటున్నాడు. ఏమిటి విషయం అని అడిగితే చెప్పడు. చిరాకు పడతాడు. అంతేకాని అసలు విషయం తెలియక కంగారుగా ఉంది.

విషయం వాళ్ళ ఇంట్లో చెప్పింది. వాళ్ళ నాన్న గారు వచ్చి కూడా అల్లుడి ప్రవర్తనను పరీక్షగా చూశారు. ఏదో తేడా కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ఇతనికి తెలియకుండా మాంత్రికుని కూడా తీసుకువచ్చి చూపించారు. అంతా ఆర్భాటం చేసి అతను ఇంట్లో గాలి సోకిందని చెప్పాడు. ఇంట్లో గాలి సోకితే అతని ఒక్కడికే అలా కావడం ఏమిటో మిగతా వాళ్ళు బాగానే ఎలా ఉన్నారో అడగడానికి నోరు రాలేదు పాపం సుజనకి. తన మొగుడు బాగుండాలి అంతే. అతను చెప్పినట్లు చేశారు. ఇంటి చుట్టూ గుమ్మడికాయలను బలిచ్చి, కోడిని కోసి రక్తంతో ఇల్లంతా చిలకరించారు. ఇంకా అనేక హంగామాలు చేశారు. కాని వాడు చెప్పినట్లు అతనికి సోకిన గాలి మాత్రం పోలేదు కాని ఇంకా హెచ్చిందనే చెప్పవచ్చు. నాటు మంత్రాలకు యంత్రాలకు లొంగే రోగంలా కనిపించడం లేదు. తన మానాన తనుండడమే. ఏదో కోల్పోయిన వాడిలా ఆలోచిస్తూ ఉంటాడు, అంతే... మాట్లాడ్డంలో గాని, పని చేయడంలో గాని ఎటువంటి తేడా లేదు. మరి ఎందుకు అలా ఉంటున్నాడో అర్ధం కాని పరిస్థితి. కొంపదీసి రెండో సెటప్ గాని పెట్టాడా? దాని గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడా? ఇదే అనుమానాన్ని తమ్ముడితో చెప్పింది.

"నువ్వేం కంగారు పడకు అక్కయ్యా! దాన్ని నేను ఛేదిస్తాను" అంటూ డిటెక్టివ్ అవతారం కూడా ఎత్తి రాజారావును వెంబడించి చూశాడు. కాని అక్క చెప్పినట్లు ఎలాంటి సెటప్ లు లేవు. తిన్నగా ఆఫీసుకు వెళ్ళడం, ఇంటికి రావడం తప్పించి అనుమానించదగ్గ అంశాలు ఏమీ కనిపించలేదని తేల్చిపారేశాడు.

"మరైతే కారణం ఏమిటై ఉంటుందంటావు ?" అడిగింది తమ్ముడిని.

"నాకూ అదే అర్ధం కావడం లేదే అక్కయ్యా...!" అన్నాడు.

"పోనీ మంచి డాక్టరుకు చూపిద్దామంటే నన్నే తిడుతున్నాడు. ఎలాగైనా ఆయన మళ్ళీ మామూలు మనిషి చెయ్యాలిరా తమ్ముడూ.." అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

"ఛ..ఛ.. ఏంటక్కయ్యా, నువ్వు ఏడవకు. దీని సంగతేంటో తేల్చిపారేస్తాను. " అన్నాడు తమ్ముడికి కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.

అతనికి స్నేహితుడైన హిప్నాటిస్ట్, సైక్రియాటిస్ట్ అయిన మనోజ్ గుర్తుకు వచ్చాడు. ఓసారి వెళ్లి తీరుబడిగా అతన్ని కలిశాడు. పలకరింపులు, కుశల ప్రశ్నలు అయ్యాక, మెల్లిగా బావగారి విషయం చెప్పాడు.

"డాక్టర్ల దగ్గరికి రానంటాడు. విషయమేమిటో అర్ధం కాక కొట్టుమిట్టాడుతున్నాం" చెప్పాడు.

"నో... నో.. పేషంటును చూడకుండా రోగ నిర్ధారణ చేయడం కుదరదు" అన్నాడు.

"ఏడ్చినట్టే ఉంది. అందుకేగా నీ దగ్గరకు వచ్చింది. నువ్వేమైనా పరిష్కారం చెబుతావని" అన్నాడు.

"అయితే నన్ను ఏం చెయ్యమంటావు. అతన్ని తీసుకురాకుండా లక్షణాలు చెపితే సరిపోతుందా? ఏం ట్రీట్ మెంట్ చేస్తాం"

"ఓరేయ్ ఇంత పెద్ద డాక్టరు ఎలా అయ్యావో నాకు అర్ధం కావడం లేదు. అతను రాక పొతే అతని దగ్గరకు మనమే వెళ్దాము"

"గుడ్ అయిడియా! బట్ నేను చాలా బిజీ. రావడం కుదరదుగా. ఇదంతా ఎందుకు, ఎలాగోలా ఆయన్ని తీసుకువస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ చేయవచ్చు"

"ఆయనే ఉంటే నువ్వెందుకన్నట్టుగా ఉంది. ఆయన రాకే కదా! ఇదంతా.. రమ్మంటే మమ్మల్నే తిడుతున్నాడు. పిచ్చాసుపత్రిలో మమ్మల్ని చూపించుకోమంటున్నాడు."

"ఓ ఐసీ. సరే ఆదివారం సెలవు కాబట్టి నేను వీలుచేసుకుని వస్తాను. మీ బావని ఇంటి దగ్గర ఉండేట్టు చూడాలి" అన్నాడు.

"మరీ మంచిది ఆదివారం ఆయనకు కూడా సెలవు. నువ్వు మాత్రం నా స్నేహితుడిగానే రావాలి. ఓ డాక్టరుగా కాదు."

"నాకు అర్ధమయ్యిందిరా "

"థాంక్స్ రా, బాబు..!"


*************** ***************

ఆదివారం రోజున పదకొండు గంటల ప్రాంతంలో డాక్టరు మనోజ్ వచ్చాడు స్నేహితుడిగా.

ఇంట్లోకి ఆహ్వానించాడు స్నేహితుడిని. అక్కకు ఈ విషయం ముందుగానే చెప్పడంతో, పాపం డాక్టరు దగ్గరికి వచ్చి వేడుకుంది."నువ్వే ఆయన్ని మామూలు మనిషి చెయ్యాలి" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

"అయ్యో.. ఇదంతా ఏమిటి? ముందు పేషంటును చూపించండి. " అన్నాడు.

ఇంతలో వీళ్ళ ముందుకు వచ్చాడు రాజారావు.

"బావా వీడు నా స్నేహితుడు. మంచి డా... " అంటూ ఆగిపోయాడు.

"అదే డాలర్ సంపాదించే ఉద్యోగం చేస్తున్నాను" చెప్పాడు

షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోబెట్టారు.

"మీరేం చేస్తుంటారు" మాటల్లో దించాడు మనోజ్.

"నేను ప్రభుత్వ ఉద్యోగిని" అంటూ అన్ని వివరాలు చెప్పసాగాడు.

ఇంతలో మీరంతా బయటకి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు స్నేహితుడికి. అక్క తమ్ముడు వీళ్ళిద్దరిని వదిలేసి బయటికి వెళ్ళిపోయారు.

తలుపు దగ్గర వేసి దాదాపు గంట పైగా బయట కాపలా ఉన్నారు.

డాక్టర్ మిత్రుడు తలుపులు తీసుకుని గంభీరంగా బయటకి వచ్చాడు.

అతన్ని అలా చూసిన వాళ్ళకి ఏమైంది అని అడగడం కూడా మరిచిపోయారు. ఏం చెబుతాడోనని ఎదురు చూస్తున్నారు.

"ఓరేయ్! నువ్వు నాతో రారా" అంటూ బయటికి దారి తీసాడు.

ఇది చాలా సీరియస్ విషయం కావచ్చని పాపం సుజన ఏడ్వడం మొదలు పెట్టింది.

"అబ్బా నెత్తి మీద గంగను పెట్టుకుంటావు. నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉండు ఏంటో విషయం తెలుసుకువస్తాను." అంటూ మనోజ్ వెంట బయటికి వెళ్ళిపోయాడు.


*************** ***************

"ఏంట్రా విషయం" అడిగాడు కొద్దిగా భయంగానే.

"పెద్ద ప్రాబ్లెమ్ కాదు. సాల్వు చేయవచ్చు. కాని... "

"కాని... ఏమిట్రా"

"కుటుంబ సహకారం కావాలి"

"దానికేం భాగ్యం మా బావ కోలుకోవడానికి మేమందరం ఏం చెయ్యడానికైనా రెడీ" చెప్పాడు.

"అంత సులువైన విషయం కాదు"

"అంటే అర్ధం కాలేదు."

"బెగ్గింగ్నోమియా అనే వ్యాధి పట్టుకుంది."

"ఏమిటి. దీని పేరు ఎప్పుడు విన్లేదు. చదవలేదు" అన్నాడు ఆశ్చర్యంగా.

"నేనే పెట్టాను. ఎలా వింటావు. ఇప్పుడే పెట్టాను."

"నువ్వు పెట్టావా? ఇంతకీ జబ్బు లక్షణాలు ఏమిటో చెప్పు. నీ పేర్లు నిన్ను తగలెయ్య, అసలే ఏ వ్యాధితో భాదపడుతున్నాడని మేం భయపడిచస్తుంటే. నువ్వేమిటో కొత్త పేర్లు, కొత్త వ్యాధులు కనిపెడుతున్నావ్" కొద్దిగా కోపం కలిపిన చిరాకుతో కసురుకున్నాడు

"రేపు నా పేరు వైద్య చరిత్రలోనే మారుమోగబోతుంది. మీ బావ దయవల్ల" సంబ్రంగా చెప్పండి.

"రేయ్ ముందు జబ్బు లక్షణాల్లేంటో చెప్పు" గట్టిగా అరిచాడు.

" ఓ.కే. ఓ.కే. అదే చెబుతున్నాను. ఇతనికి బిచ్చగాళ్ళు తనను అడుక్కోవడం ఇష్టం. అదీ ఎలాగంటే బ్రతిమాలి బ్రతిమాలి, కసురుకున్నా, చీదరించుకున్నవిడవకుండా ఇతన్ని బిచ్చం అడుక్కోవాలి. కాని పాపం ఎవరు కూడా ఇతన్ని అలా అడుక్కోవడం కాదు కదా కనీసం ఇతని ముఖం కూడా చూడట్లేదు. అదీ ఈయన బాధ. దాంతో మానసికంగా కుంగి పోతున్నాడు. బిచ్చగాళ్ళు ఎందుకు తనను అడుక్కోవడం లేదన్నదే ఇతని సమస్య ."

"ఆ.. " నోరు తెరచి వింటున్నాడు.

"అవును అంతకు మించి పెద్ద జబ్బు ఏం లేదు మీ బావకి. బిచ్చగాళ్ళు ఇతన్ని చూసీ చూడనట్టు వెళ్ళిపోతున్నారట. అదే పక్కవాడిని మాత్రం అడుక్కొని వెళ్తున్నారట. దాంతో తనని ఎందుకు అడగటం లేదు. మొదట్లో పొరపాటుగా వెళ్ళిపోయారనుకొని ఊరుకున్నాడట. ఆ తరువాత బిచ్చగాళ్ళని చూడగానే ఇతనే అలర్ట్ అయిపోయేవాడు. కాని ఇతని దగ్గరకు వచ్చినట్టే వచ్చి అడక్కుండానే వెళ్లి పోయేవారట. దీంతో మానసికంగా దెబ్బ తిన్నాడు. ఒక్కరు కాదు, ఎంతోమంది బిచ్చగాళ్ళని పరీక్షించి చూశాడట. కాని ఎవ్వరు కూడా ఇతని మొహం వైపు చూడకుండానే వెళ్ళిపోయారు. అది మీ బావ బాధ" చెప్పి ఆగాడు.

"దీనికి పరిష్కారం...?" అడిగాడు.

"ఆయన దగ్గరికి వెళ్లి బిచ్చగాళ్ళని అడుక్కోమని చెప్పడమే పరిష్కారం. క్రమంగా ఇది చేస్తూ పోతే ఆయనలో గుణం కనిపిస్తుంది. ఆయనకీ మనిషిగా తనలో లోపం ఉందని అనుకుంటున్నాడు. అదీ పోవాలంటే మానసికంగా దెబ్బతిని పిచ్చి వాడుగా కూడా మారే ప్రమాదం వుంది."

"అవునా..?"

"అవును, అందుకే కుటుంబ సభ్యుల సహకారం కావాలని చెప్పింది. గంటసేపు నేను హిప్నాటైజ్ చేసి ఈ వివరాలన్నీ రాబట్టాను. అంతకు మించి ఏ సమస్యా లేదు."

"ఇంతకీ కుటుంబ సభ్యుల సహకారం అన్నావు,ఏం చెయ్యాలో అది కూడా చెప్పు" అన్నాడు

"బిచ్చగాళ్ళని తీసుకువచ్చి ఇతన్ని బిచ్చం అడిగించడం, అది కూడా అతను చీదరించుకున్నా, అసహ్యించుకున్నా, బ్రతిమాలి బ్రతిమాలి మరీ అడుక్కోవాలి. అలాంటి వారిని ఏర్పాటు చేయాలి. లేకపోతే మీలో ఎవరైనా బిచ్చగాడి వేషం వేసి అతణ్ణి అడుక్కోవాలి. అలా దాదాపు అతను మామూలు మనిషి అయ్యే వరకు. అంటే అతడు మూడ్ ఆఫ్ లో వున్నప్పుడు ఇలా చేస్తే గుణం కనిపిస్తుంది." అదీ విషయం అన్నట్టుగా చెప్పాడు.

ఒక్కసారి బిత్తరపోయాడు. ఏమిటి బిచ్చగాళ్ళు దొరక్కపోతే తమే బిచ్చగాళ్ళ వేషం వేయాలా? ఈయనకు ఇదేం పాడు జబ్బు, తిట్టుకున్నాడు బావని. బిచ్చగాళ్ళకు వేయకపోతే డబ్బు మిగులుతుంది అని ఆలోచించడం లేదు. ఈయన అడగనందుకు ఆలోచిస్తున్నాడు. లేని రోగాలు తెచ్చుకుంటున్నాడు. అక్కకు విషయం చెప్పాడు.

"ఏమిటీ?" సుధీర్ఘంగా ఆశ్చర్యపోయింది. "అయితే మనం బిచ్చగాళ్ళ వేషం వేయాలా?" అంది

"అదే కదా నేను చెప్పేది. ఏంటో కలికాలం కాకపోతే మనుషులకు ఎలాంటి రోగాలు వస్తున్నాయి. నువ్వేం బాధపడకు. నేను బిచ్చగాళ్ళను బావ దగ్గరికి పంపించే ఏర్పాటు చేస్తాను."

"తమ్ముడివి కాబట్టి నీకు నమస్కారం చేయలేకపోతున్నాను. నువ్వు నా తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం" అంది కన్నీళ్ళతో.

పాపం తమ్ముడి కళ్ళల్లో కూడా తడి కదలాడింది.

బిచ్చగాళ్ళని పట్టుకుని ఆయన్ని దీనంగా అడుక్కోవాలి అని చెబితే.. "ఏమిటండి? మీరు చెప్పేది మేము చేసేది అదే కదా? ఇందులో కొత్తేముంది? కాని మీరు అడుక్కోమన్నవాళ్ళని మేమెందుకు అడుక్కోవాలి? మా ఇష్టం వచ్చిన వాళ్ళని అడుక్కొనే హక్కు మాకు ఉంది. ఇష్టం లేకపోతే మానేస్తాం. అంతే కాని మీరు ఇలా ఆయన్నే అడుక్కోమంటే మేము అడుక్కోం" అంటూ బిచ్చగాళ్ళు క్లాసు పీకారు.

చేసేది లేక పాపం సుజన తమ్ముడే బిచ్చగాడిలా మారక తప్పలేదు.

బావ దగ్గరకెళ్ళి "బావా.. ధర్మం చేయి బావా" అన్నాడు.

రాజారావు ఆశ్చర్యపోయాడు. వీడెవడు నన్ను బావా అని పిలిచి ఆడుకుంటున్నాడు. అసలు నన్ను అడుక్కొనే బిచ్చగాళ్ళు ఉంటారా? తనను కాదన్నట్టు చూస్తుండిపోయాడు.

"బావా.. ధర్మం బావా"

"ఏంట్రా.. నేను నీకు బావనా? నన్ను బావ అని పిలుస్తున్నావు అడుక్కుతినే అంట్ల వెధవ" గట్టిగా తిట్టాడు.

అప్పటికి తను చేసిన పొరబాటు కనిపెట్టాడు సుజన తమ్ముడు.

"లేదు బాబు.. నేను అలా పిలవలేదు బాబూ .. ధర్మం చేయి బాబూ.. మా బావ కి అనారోగ్యం డాక్టర్ కి చూపించాలి. అంతే కాదు నాలుగు రోజులయ్యింది అన్నం తిని. ఆకలిగా వుంది" దీనంగా వేడుకున్నాడు.

రాజారావు కు ఎక్కడలేని ఆనందం తన్నుకు వచ్చింది. బిచ్చగాడు తనను అడుక్కుంటున్నాడు. గ్రేట్.. "ఎహె.. ముందుకు వెళ్లు" కసురుకున్నాడు.

"అలా అనకండి బాబయ్యా.... ధర్మం చేయండి" కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు. అందరూ తననే చూస్తున్నారు. గర్వంగా ఫీలయ్యాడు. రూపాయి బిళ్ళ తీసి అతని మీదికి విసిరాడు. రూపాయి చేతిలో పడకుండా కింద పడింది. వెంటనే దాన్ని అందుకొని "థాంక్యూ బావా... థాంక్యూ.. " అంటూ అలుముకొని చెప్పాడు.

"ఏయ్ ఏంటయ్యా వదులు నేనేమన్నా నీకు చుట్టాన్నా పక్కన్నా, వదులు.. " వాడు బాబు అన్నాడు తనే అనవసరంగా తప్పుగా వింటున్నాడు. కాని ఎంతో తృప్తిగా ఫీలయ్యాడు. మొదటిసారిగా తను మనిషేనన్న విషయం నిర్ధారించుకున్నాడు.


*************** ***************

"ఒరేయ్ తమ్ముడూ.. ఏం మందేసావురా.. మీ బావ గారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. మొహం కళకళ లాడిపోతుంది. నేను మీ బావ మొహంలో ఆనందం ఇలాగే చూడాలిరా" ఆనంద భాష్పాలు రాలుతుంటే చెప్పుకు పోతుంది సుజన.

"అయితే నేను బిచ్చగాడిలా ఎన్ని రోజులు నటించాలో" అనుకున్నాడు

కాని అక్క మొహంలో ఆనందం చూసి తనకు ఈ వేషం ఇప్పట్లో తప్పేలా లేదు. నీరసంగా అనుకున్నాడు. పాపం సుజన తమ్ముడు

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ