ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎంతగానో తపించింది అనూష… ఇన్నాళ్ళకు ఆ అవకాశం వచ్చింది… అఫ్ కోర్స్! భాద్యతలు కూడా పెరుగుతాయి… మహిళలకు ఉద్యోగాలే ఇంటిని దూరం చేస్తాయి… అందులో పెళ్ళి, పిల్లలు, ఇంకో ప్రక్కన అత్తవారింటి బాధ్యతలు, తనను ఊపిరి తీసుకోనివ్వలేదు ఇన్నాళ్లు… ఇప్పుడు పిల్లలు స్కూలుకు వెళుతున్నారు… లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న భర్త మాధవ్ కు ఇలాంటి ప్రమోషన్లకు అవకాశం లేదు… అందుకని తానే అర్థం చేసుకుని ప్రమోషన్ కు దూరంగా వున్నది అనూష… తన బాస్ ఎన్నో సార్లు తన పేరు రికమెండ్ చేసాడు… కాని తనకే ధైర్యం చాలలేదు… ఒక ప్రక్క అత్తగారి వ్యంగపు బాణాలు, మరో పక్క ఆడపడుచు అసూయా ఈసడింపులు, అన్నీ కనిపెట్టిన అనూష, తను జీవితంలో ప్రశాంతత కొరకు, ఎదగకూడదు అనుకుంది…
ఆ రోజు ఆఫీసులో చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది… తన కంటే సర్వీసులో జూనియరయిన బాసుకు సలహా ఇవ్వటానికి, వయసు అడ్డు వచ్చింది… అయినా చిన్న వయసులోనే ఆఫీసరయిన అతనికి అహంభావం ఎక్కువ… క్రింది వాళ్ళ సలహాలు వినడు… దానివలన తామందరూ అర్థ రాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది… ఇంటి నుండి పది ఫోన్లు… ఎవరికి చెప్పాలి?.. ఏమని చెప్పాలి?.. హాయిగా తానే (తన భర్త) ప్రమోషన్ తీసుకుంటే ఇటువంటి సమస్యలు ఉండేవి కాదు కదా అనుకుంది అనూష…
ఎప్పుడైనా లేట్ అయితే భర్తే వచ్చి తీసుకెళతాడు… ఎవరైనా దింపుతాము అన్నా, అత్తగారు దుర్భిణి వేసి వెతుకుతుంది ఏదో ఒకటి అనడానికి… “ఏంటమ్మాయ్ ఇంత లేట్ అయింది… ఆడవాళ్ళు ఇంతసేపు ఉండకూడదు… రకరకాల కేసులు వింటున్నాం…” మామగారి హెచ్చరిక గుమ్మంలోనే మొదలౌతుంది…
లోపలికి రాగానే అత్త గారు “ఇవేమి ఉద్యోగాలు… అర్థరాత్రి వరకు ఉంటాయా… పిల్లలు నీ కోసం ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకున్నారు… అన్నం కూడా సరిగ్గా తినలేదు… ఈ రోజు నా ఒంట్లో కూడా బాగాలేదు… కాళ్ళల్లో మంటలు…” అంటూ సోఫాలో కూలబడింది…అనూషకు లేట్ అయిన రోజే ఆమెకు తన రోగాలు గుర్తుకు వస్తాయి…
పిల్లలు అన్నం తినలేదు అనగానే తల్లి మనసు విలవిల్లాడింది… తను వంట చేసి అన్నీ సదిరి వెళ్తుంది రోజూ… పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూసుకోవడానికి మనిషిని పెట్టింది… వాళ్ళకు నీళ్ళుపోసి ఆడించి తరువాత హోమ్ వర్క్ చేయిస్తుంది… అన్నం కూడా వండుతుంది… వాళ్ళకు మంచి కబుర్లు చెపుతూ అన్నం తినిపిస్తుంది… ఆమె చదువుకుంటూ పార్ట్ టైమ్ గా ఇలా పని చేస్తోంది… ఆమెకు పరీక్షలు ఉన్నాయని నాలుగు రోజులు రానని చెప్పింది…
మామగారికి, అత్తగారికి తానే చపాతీలు చేసి హాట్ ప్యాక్ లో పెడుతుంది అనూష… అసలు అత్త గారికి అంతగా పని ఏముంటుంది… కూర్చుని టివి సీరియల్స్ చూడటం తప్ప… కాస్త నడిస్తే కాళ్ళ మంటలు ఉండవు… ఎన్ని సార్లు చెప్పినా వినదు…
అందరూ తమ సమస్యలు తనకు చెపుతారు… మరి తనెవరికి చెప్పుకోవాలి?.. తల్లి ముందు భయపడుతూ తనకి సపోర్ట్ ఇవ్వని భర్త… ఇటువంటి పరిస్థితుల్లో తనకెందుకీ ఉద్యోగం ఎవరి కోసం?.. అయినా ఆయన సంపాదన సరిపోకనే కదా తను ఈ ఉద్యోగం పట్టుకుని వేలాడేది… ఆ పురుషపుంగవుడికి అన్నీ తెలుసు, అయినా నోరు మెదపడు… తల్లిని కానీ తండ్రిని కానీ అలా మాట్లాడవద్దని చెప్పడు… గుడ్డిలో మెల్ల అన్నట్టు, వచ్చి, తనను తీసుకువస్తాడు…
బెడ్ రూములోకి వెళ్ళగానే పిల్లలిద్దరూ చెరొక పక్కన పడుకుని ఉన్నారు… బాగా అల్లరి చేసినట్లున్నారు… కొట్టుకున్నారేమో… కన్నీటి చారికలు బుగ్గలపై కనిపించాయి…
డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు సదిరి కాసిని మంచి నీళ్ళు త్రాగి బాత్ రూములోకి వెళ్ళింది… వేడి నీళ్ళతో స్నానం చేసి మాక్సీ వేసుకుని మంచం మీద వాలింది… మాక్సీ వేసుకుని మామగారి ముందు తిరగ కూడదు… అత్తగారి ఆంక్షలు… అడుగడుగునా ఆడదానికి అన్నీ కట్టుబాట్లే…
కాసేపు బయటనే నిల్చొని సిగరెట్ త్రాగి అప్పుడు లోపలికి వచ్చాడు మాధవ్… తల్లి అరికాళ్ళకు మందు రాసి ఆమెను నెమ్మదిగా లేపి పడుకోబెట్టి వచ్చాడు… అలసిపోయి ఇంటికి వచ్చిన భార్యను మాత్రం ఎలా ఉన్నావు అని అడగడు ఈ మహానుభావుడు…
తల్లిని ప్రేమించిన వాడు భార్యను ప్రేమిస్తాడట… కానీ ఏదీ?.. ఇదెప్పుడూ తనకు అనుభవంలోకి రాలేదు… పడుకునే ముందు సిగరెట్ త్రాగవద్దు అని పెళ్ళి అయినప్పటి నుంచీ చెపుతోంది… ఎన్నో సార్లు మానేస్తానని ఒట్టు వేసేవాడు… కానీ అతగాడు ఏమీ మారలేదు… చివరకు విసుగుపుట్టి తనే అడగటం మానేసింది…
ఎంత ఆలస్యంగా పడుకున్నా ఐదు గంటలకల్లా లేస్తుంది తను… తన కార్యక్రమాలు ముగించుకుని స్నానం కూడా చేసి చీర కట్టుకుని బయటకు వస్తుంది… పాలు కాచడం కాఫీ ఫిల్టర్ వెయ్యడం చేస్తుంది… దేవుడి గది శుభ్రపరిచి అత్తగారి కోసం పూజకు రెడీ చేస్తుంది… ఈలోగా మాధవ్ లేచి వస్తాడు… తల్లి చూడకపోతే వంటింట్లో అనూషకు కూరలు తరగడం, ఇడ్లీ కుక్కర్ వెయ్యడం, వీలైతే పచ్చడి కూడా చేస్తాడు…
తల్లి ముందు ఎందుకు భయం?.. ఆమె కూడా ఆడదే కదా… తను కూడా ఇలాంటి ఫేస్ దాటి ఉంటుంది… కొడుకంటే ఎందుకు అంత ఉన్నత భావం… ఇదే తల్లులు చేస్తున్న పొరపాటు… మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పనులు నేర్పాలి… అది లేకనే ఈ మధ్య అమ్మాయిలు పెళ్ళి వద్దంటున్నారు… లేదా విడిపోతున్నారు…
అప్పుడే చెప్పింది అనూష… “నాకు ఆఫీసులో నచ్చడం లేదు… ప్రమోషన్ తీసుకుందామను కుంటున్నాను… లేదా ఉద్యోగం రిజైన్ చేస్తాను” అన్నది…
“అలాగే అనూ” ప్రేమంతా ఒలకబోసాడు…
“మీ సహకారం ఉంటేనే నేను ముందుకు సాగగలను” మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పింది…
“అనూ… నువ్వు జరిగినవన్నీ మరచిపో… అమ్మ నాన్నల మాటలు పట్టించుకోకు… నేను అంతా చూసుకుంటాను… సరేనా!” అభయహస్తం ఇస్తున్నట్లుగా నవ్వుతూ చెప్పాడు మాధవ్…
“ఈ మాత్రం భరోసా మీరు ఇస్తే చాలు… నాకు ఇక ఏ అడ్డూ కనిపించదు…” మనసులో వున్న దిగుల్ని పక్కకు నెట్టి వేస్తూ ముఖంపైకి చిరునవ్వు తెచ్చుకుని, తామిద్దరికి కప్పులో కాఫీ పోసుకుని ఇద్దరూ చెరొక కప్పు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నది అనూష…
మహిళకు ఆత్మవిశ్వాసంతో పాటు ఆమెకు అండగా తన జీవిత భాగస్వామి నిలబడితే ఆటంకాలు అధిగమిస్తూ గమ్యం చేరుకోగలదు…