అందరి బంధువులు - భానుశ్రీ తిరుమల

Andari bandhuvuluu

"ఏరా దామోదరం ఈ మధ్య బొత్తిగా నల్లపూసవైపోయావు, మీ అయ్యగారింటిలో అంత పని ఉందేమిటిరా, రా ఇలా కూచో " అంటూ దామోదరాన్ని చోటు చూపించాడు నీలం.

"అదేం లేదురా ! కృష్ణయ్యగారి పెద్దకొడుకు విదేశాలనుండి వచ్చాడు కదా, వాళ్ల మంచి చెడ్డలు చూసుకోవడంతోనే సరిపోయింది. ఇదిగో ఈ రోజు వాళ్లంతా కలసి సిటీకి వెళ్లారు. అందుకే నాకు కొంచెం తీరుబడి దొరికింది" అంటూ అరుగు అంచున నడుము వాల్చాడు దామోదరం. దామోదరం,నీలం ఇద్దరూ చిరకాల స్నేహితులు. ఆ ఇద్దరూ, ఓ ఇద్దరు అన్నదమ్ముల ఇంట్లో సహాయకులుగా చాలా ఏళ్ల నుండి ఉంటున్నారు. ఆ ఇద్దరి అన్నదమ్ముల పేర్లు రామస్వామి(రామయ్య),కృష్ణస్వామి(కృష్ణయ్య).

ఆ ఊరికే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో కూడా పేరున్న పెద్ద రైతులు వాళ్లు. వారిద్దరివీ పక్క పక్కనే కట్టబడ్డ లంకంత కొంపలు. వారికి అవి వారి పూర్వీకులనుండి వారసత్వంగా వచ్చిన ఇళ్లు. వాటికి కాలనుగుణమైన సౌకర్యాలతో మార్పులు చేస్తూ ఆ ఇళ్లలోనే కొన్ని తరాలుగా ఆ కుటుంబాలు ఉంటున్నాయి. ఒకప్పుడు ఆ రెండిళ్లు వచ్చిపోయేవాళ్లతో కళ కళ లాడుతూ ఉండేవి. పదుల సంఖ్యలో పనివాళ్లతో, రోజుకు కనీసం పదిమందైనా భోజనాలు, టీ,కాఫీలు తిని తాగి వెళ్తుండే వారు. ఇప్పుడైతే అంత అలకిడి కనిపించదు. అయితే దామోదరం, నీలం మాత్రం వారింటిలో చిన్నప్పటినుండీ సహాయకులుగా అలా ఉండిపోయారు. వాళ్లిద్దరికి తీరుబడి దొరికినప్పుడల్లా ఆ ఇళ్లకు ఎదురుగా ఉన్న ఓ వేప చెట్టుకింద ఉన్న అరుగు మీద కలుస్తూ ఉంటారు. ఏవో పిచ్చాపాటీ మాట్లాడుకొని ఎవరిదారిన వారు పోతుంటారు. రామస్వామి, కృష్ణ స్వాములకు ఇద్దరేసి కొడుకులు. విస్తారంగా భూములు ఉన్నా, వారి పిల్లలకు వ్యవసాయం అంటే అంత మక్కువ లేకపోవటంతో బాగా చదువుకొని మంచి ఉద్యోగాలతో విదేశాల్లో స్థిరపడ్డారు. సంవత్సరానికొక్కసారి సొంత ఊరు వస్తూ ఉంటారు. కొన్ని రోజులు ఉండి పోతుంటారు. ఓ రోజు దామోదరం, నీలం కలుసుకున్నప్పుడు దామోదరం, నీలంకి అడిగాడు. "ఏరా నీలం , మీ రామయ్యగారు ఎవరితో అంతగా మట్లాడడు. ముభావంగా ఉంటాడు. పైగా మా అయ్యగారికన్నా పలుకుబడీ తక్కువే. కానీ మీ ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు బంధువులు వస్తునే ఉంటారు. అన్ని స్థాయిలు వారు వచ్చినా ,ఎక్కువగా సామాన్యులే వస్తుంటారు. కార్లమీదా వస్తుంటారనుకో, కానీ తక్కువ మంది. ఏదేమైన మీ ఇంటికి బంధువుల తాకిడి ఎక్కువే సుమా!" అంటూ తన మాటలకు చిన్న విరామం ఇస్తూ మళ్లీ " అదెరా నీలం మా కృష్ణ్యయ్యగారు అందరితో సరదగా ఉంటాడు,ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్లతో బాగానే మాట్లాడతాడు. కానీ మా ఇంటికి బంధువుల తాకిడి తక్కువనే చెప్పాలి. కార్లమీద వచ్చేవారే ఎక్కువనుకో, కారణం ఏమయ్యుంటుందంటావు?" అడిగాడు దామోదరం. " అవునురా దామోదరం నీవు చెప్పినది నిజమేననిపిస్తుంది. కారణం ఏమయ్యుంటుందంటావు? నేనెప్పుడు దాని గురించి ఆలోచించలేదురా! అయినా మనకెందుకురా ఎవరింటికి ఎంతమందొస్తే, మనకీ ఈ కూపీలు తీయడం అవసరమా చెప్పు" అంటూ మాట దాటవేయబోయాడు నీలం. "అది కాదురా నీలం, నీవు ఏ విషయాన్నెనా లోతుగా ఆలోచించి చెబుతావు, అందుకే నీకడిగాను"అన్నాడు దామోదరం. "సరే నాకు అనిపించినది చెబుతాను విను"అంటూ ప్రారంభించాడు నీలం.

"ఏం లేదురా ,రామయ్య గారు ఆదే మా అయ్యగారు కొంచెం ముభావంగా ఉన్నా ,మా ఇంటికి వచ్చిన వారి బాగోగులు చూస్తాడు. అమ్మగారైతే సరేసరి, అందరి కష్టసుఖాలను అడిగితెలుసుకుంటారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు" "ఇంటికి వచ్చిన వాళ్లందరూ భోజనం చేసి వెళ్లాల్సిందే. మావాళ్లు కూడా మేము గొప్పవాళ్లం అనే భావన లేకుండా అందరితో కూచొని సహ పంక్తి భోజనం చేస్తారు" పండగ పబ్బాలకి కొందరికైనా బట్టలు పెడతారు. ఎంత మందికో చదువు విషయంలో గానీ, పిల్లల పెళ్లిళ్ల విషయంలో గానీ తగిన సహాయం చేస్తునే ఉంటారు. వారి పిల్లలు మాత్రం, విదేశాల నుండి వచ్చిన ప్రతి సారి వీలు కల్పించుకుని బంధువలందరి ఇంటికీ వెళ్తారు. అలాగే బంధువులందరికి తమ ఇంటికి వస్తుండమని ,మేము లేనప్పుడు తలిదండ్రుల అవసరాలు, బాగోగులు చూడమని చెబుతారు. అందుకే తరచూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు" ఆగాడు నీలం. "అంటే ఎదో ఒకటి ఇస్తేనే అందరూ వస్తారంటావు" అన్నాడు దామోదరం.

"అలా అని కాదుగాని, కొందరైతే మా అయ్యగారి సాయం అవసరం లేని స్థితిలో ఉన్నా వీలు కుదిరినప్పుడల్లా వచ్చి చూసి పోతూ ఉంటారు. అది కేవలం మా అయ్యగారి పిల్లలు వారందరికి తమ ఇంటికి వచ్చి పోతూ ఉండండడని చెప్పడం వలన,అలాగే మా అయ్యగారి ,అమ్మగారి మంచితనం వల్లే సుమా! "ఏది ఏమైనా దామోదరం ఇతరుల అవసరాలు తెలుసుకొని సహాయం చేయడం గొప్ప విషయం రా, అందరూ నోరువిడిచి నాకిది కావాలని అడగలేరు కదా! అవకాశం ఉన్న వాళ్లు, అందరికి సహాయం చేయలేక పోయిన , కనీసం తమ అనుకునే వారికి సహాయం చేస్తే అదే పదివేలు. ఆ లక్షణాలు మా వాళ్లకి నిండుగా ఉన్నాయి. అందుకే మా ఇంటికి తరచూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు,మా వాళ్లు అందరి బంధువులు సుమీ!" అంటూ ముగించాడు నీలం. "నాకిప్పుడు అర్థమైందిరా నీలం , ఇంక మావాళ్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మీ అయ్యగారింటిలో జరిగే దానికి పూర్త వ్యతిరేకం మా వాళ్ల యవ్వారం. ఏదైనా నీవు అదృష్టవంతుడివిరా నీలం. సరే మా అయ్యగారొచ్చే వేళయింది వస్తాను " అంటూ బయలుదేరాడు దామోదరం

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి