సుగుణ తన ముఫైఐదో ఏట తొలిసారిగా డైరీ వ్రాయాలని కూర్చుంది. పెన్ను కంటే త్వరగా తన ఆలోచనలు అలలు అలలుగా తన్నుకొస్తుంటే, ఏ జ్ఞాపకానికి తొలి అక్షర రూపం ఇవ్వాలా అని ఆలోచిస్తూ -- తన జీవితాన్నిసింహావలోకనం చేసుకుంది. అందుకు తగ్గట్టు ఆమె చేతిలో పెన్ను పరుగిడసాగింది.
అందరూ నన్ను ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టిన ఒకే ఒక వారసురాలు, అదృష్టవంతురాలు, తల్లితండ్రుల గారాలపట్టీ అని మెచ్చుకుంటూంటే -- అవేవీ నాకు రుచించేవి కావు. ఎందుకంటే - మాట్లాడేందుకు, పోట్లాడేందుకు, ఆడుకునేందుకు సహోదరులు లేని ఒంటరి బ్రతుకు నాది.
అప్పటికీ అమ్మతో ఒకసారి నాన్నతో ఒకసారి - "నాతో ఆడుకుందుకి ఇంట్లో ఎవరూ లేరెందుకు” అంటే -
కూడబలుక్కొన్నారా అన్నట్టు ఇద్దరూ చెప్పిన సమాధానం - "యు అర్ అవర్ ఏంజెల్. వుయ్ లవ్ యు సో మచ్ అండ్ డోన్ట్ వాంట్ టు షేర్ విత్ అనదర్ చైల్డ్, యు నో".
అప్పుడు నేను నవ్వలేక లోపల ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చానో వాళ్లకు తెలియదు.
బడి సమయం తరువాత ఇంటికి వచ్చిన నన్ను పలకరించడానికి అమ్మా ఉండేది కాదు నాన్న ఉండేది లేదు. మొక్కుబడిగా ఆయా ఇచ్చింది తిని త్రాగి చదువుకొని తన గదిలో నిద్రపోయిన ఎంత సేపటికి వచ్చేవారో అమ్మా నాన్నా, నాకు తెలిసేది కాదు.
బడికి తప్ప, ఇల్లు వదిలి బయటకు వెళ్ళడానికి కానీ ఇతర పిల్లలతో ఆడుకునేందుకు కానీ వీల్లేదని అమ్మా నాన్నల ఆంక్షలు, వాటిని అతిక్రమించడానికి వల్లకాదనే పనివారు.
ఆవిధంగా బాల్యమంతా బంగారు పంజరపు బ్రతుకైపోయింది.
నా పుట్టినరోజున కూడా అమ్మానాన్నలకు నామీద కంటే అతిథులకు తమ స్టేటస్ చూపించుకోవాలనే తాపత్రయమే ఎక్కువ. ఒక కేకు ముక్క తినిపించిన అమ్మానాన్నలకు, తరువాత నేను ఏమైనా తిన్నానా లేదా అని అడిగే సమయం లేకపోవడంతో –
ఆకలితో నిద్రపోయిన పుట్టినరోజు రాత్రులెన్నో గడిచేయి నా చిన్నతనంలో.
సంగీతం నేర్పాడానికొకరు, నాట్యం నేర్పాడానికొకరు, చిత్రలేఖనం నేర్పాడానికొకరు, షటిల్ నేర్పాడానికొకరు, లాన్ టెన్నిస్ నేర్పాడానికొకరు, టేబుల్ టెన్నిస్ నేర్పాడానికొకరు, చదరంగం నేర్పాడానికొకరు -
ఇలా రోజుకొకరు వచ్చి సుగుణకు అన్నీ నేర్పించే ఏర్పాటు చేసిన తల్లితండ్రులు ఎంతమందికి ఉంటారు, సుగుణ లాంటి అదృష్టజాతకులు ఎంతమంది ఉంటారు అని నలుగురూ పొగుడుతూంటే అమ్మా నాన్నలకు ఎవరెస్టు ఎక్కినంతగా సంబరపడిపోతుండేవారు.
కానీ, అవన్నీ వారంలో ఒక్క రోజు మాత్రమే నేర్చుకుంటూ –
‘ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ ' అన్న ఆంగ్ల సామెతకు నేనే ప్రతిరూపం అని అమ్మా నాన్నలతో సహా ఎవరికీ తెలియదు.
పంజరంలోనే ఎగురుతూ బొంగరంలా తిరుగుతూ నేను కాలేజీ చదువులోకి అడుగుపేట్టేను.
అప్పటినుంచీ, అమ్మా నాన్నా నాకు ఒక కారు, ఆ కారుకి ఒక డ్రైవరు, లెక్కకు మించిన పాకెట్ మనీ సమకూర్చి పెట్టేరు.
వాళ్ళతో పాటూ నాకూ స్టేటస్ సిమ్బల్ తెచ్చి పెడుతుందన్న ధోరణితో, నేను చదివే కాలేజీకి మస్తుగా డొనేషన్ కూడా ఇచ్చేరు. దాంతో, కాలేజీలో నేను ఆడిందే ఆట పాడిందే పాట. నేను కాలేజీకి వెళ్లినా వెళ్లకపోయినా, తరగతులకు వెళ్లకపోయినా నాకు అటెండన్స్ వేయవల్సిందే. నా మీద ప్రిన్సిపాల్ గారికి ఎటువంటి పిర్యాదు చేయడానికి ఎవరికీ దమ్ములుండేవి కావు.
ఆ డ్రైవర్ సహాయంతోనే కారు నడపడం నేర్చుకొన్న నేను – కాలేజీకి వెళ్లేందుకే ఆ డ్రైవేరుని వాడుకుంటూ, కాలేజీకి చేరుకోగానే కారు నా స్వాధీనంలో ఉంచుకొని డ్రైవేరుకి సెలవు ఇచ్చేదాన్ని.
ఆ విషయం అమ్మా నాన్నలకు నేను తెలియచేయనని అతనికి భరోసా ఇవ్వడంతో అతను నేను చెప్పినట్టే నడచుకొనే వాడు.
ఒక్కసారిగా ప్రపంచంలో ఉండే స్వేచ్ఛా స్వతంత్ర గాలులు నన్ను చుట్టిముట్టి, చిన్నప్పుడు నేను పోగొట్టుకున్న స్వేచ్ఛను పూర్తిగా ఆస్వాదిస్తూ అమ్మా నాన్నల మీద అప్పటివరకూ నాలోనే అణచుకున్న కోపం కసితో –
ఆడ మగ స్నేహితులతో కలిసి తినడం, తిరగడం, సినిమాలు, షికార్లు, సిగరెట్టు కాల్చడం, మందు త్రాగడం, పబ్బుల్లో నాట్యం చేయడం, అప్పుడప్పుడు మత్తుపదార్ధాలు సేవించడం కూడా చేస్తూ - నాకు నేనే ఏదో సాధించినట్టు తృప్తి పడేదాన్ని.
అలా త్రాగిన మత్తులో ఒకసారి కారు నడుపుతూ ఒక చిన్న పిల్లాడి మరణానికి కారణం అయ్యేను.
ఆ సంఘటనతో నామీద పోలీసులు కేసు పెడతామంటే, నాన్న వచ్చి డ్రైవరుకు అతను ఊహించలేనంత డబ్బు ఇచ్చి అతన్ని ఆ కేసులో ఇరికించి నన్ను తప్పించేరు.
నా వైపు చూస్తూ కటకటాల వెనుకకు వెళుతున్న డ్రైవరు చూపు ఇప్పటికీ నా మనోనేత్రానికి కనిపిస్తూ, అతని భార్యా పిల్లల అప్పటి రోదన నా చెవుల్లో ఇప్పటికీ గింగురుమంటూనే ఉన్నాయి.
అప్పుడు ఒక విధమైన భయం కమ్ముకున్న నాకు, ఇప్పటికీ ఏ బండీ నడిపే ధైర్యం కానీ ఆసక్తి కానీ లేదు.
నా వలన డ్రైవరుకు అతని కుటుంబానికి జరిగిన అన్యాయంతో నా స్వేచ్చని నేను ఎంత దుర్వినియోగం చేసుకున్నానో అర్ధం చేసుకున్న నేను, సుమారుగా ఐదు సంవత్సరాల కాలం ఇంటిలోని నాలుగు గోడలకు పరిమితమై పోయేను.
సరిదిద్దుకోలేని తప్పు చేసేను అన్న ఆలోచనతో నేను ఎవరితోనూ మాట్లాడలేక ఆ సమయంలో పూర్తిగా మూగ బ్రతుకే అనుభవించసాగేను.
నన్ను మామూలు మనిషిని చేయాలన్న తాపత్రయంతో పెళ్లిచేసిన నాన్న, పైసా మహిమతో ఇల్లరికం అల్లుడిని సంపాదించేరు.
నాకు పెళ్ళైన ఐదేళ్లకు ఎప్పుడూ లేనిది ఒకరోజు నాన్న నన్ను తనగదిలోకి పిలిచేరు. ఆశ్చర్యంతో ఆనందంతో వెళ్లిన నేను అక్కడ అమ్మ కూడా ఉండడంతో ఇద్దరూ కలిసి నాదో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారు అని ఊహించేను.
"సుగుణా నీ భర్త రమేష్ తో దాంపత్య జీవితం ఎలా ఉందమ్మా" అమ్మ అడిగింది.
"ఆ డబ్బు మనిషితో ఇప్పటివరకూ అదెలా ఉంటుందో నాకు అనుభవంలోకి రాలేదమ్మా" కొంచెం సిగ్గుపడుతూ నిష్టూరంలాంటి నిజం చెప్పవలసి వచ్చింది నాకు.
"అతను మన కంపెనీలో దొంగ లెక్కలు వ్రాసి కోటి రూపాయల పైనే దోచుకోవడమే కాక ఆ ప్రయత్నంలో మనకి విశ్వాసపాత్రులుగా ఉండే నలుగురిని ఇరికించే ప్రయత్నం చేసేడు అని నాకు నిన్న సాయంత్రమే తెలిసిందమ్మా. డబ్బు సంగతి ఎలా ఉన్నా, ఆ మనిషి ఇలాంటివాడు అని తెలిసిన తరువాత నీకు చెప్పాలా వద్దా, చెప్పకపోతే రేపు నీతో కూడా ఎలా వ్యవహరిస్తాడేమో అన్న భయంతో నేను అమ్మా నిన్న రాత్రంతా
ఆలోచించి అతను ఈరోజు కంపెనీకి వెళ్లిన తరువాత నీతో చెప్పాలనే నిర్ణయించుకొని నిన్ను ఇప్పుడు పిలిచేనమ్మా"
"ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారు నాన్నా"
"నీకు అభ్యంతరం లేకపోతే అతన్ని పోలీసులకు అప్పగించి అతని మీద కేసు వేయాలన్న ఆలోచనలో ఉన్నారమ్మా నాన్న" అమ్మ నాకు బోధపరచడానికి చేస్తున్న ప్రయత్నం.
"ఇదే పని మన కంపెనీలో మరెవరైనా చేస్తే ఏమి చేసేవారు"
"తక్షణం పోలీసులకు అప్పగించేవాడిని"
"మీ అల్లుడైనంత మాత్రాన మనం వేరుగా వ్యవహరించడం తప్పు కదా నాన్నా"
"చాలమ్మా. నేను ఇప్పుడే వెళ్లి నా కర్తవ్యం నెరవేరుస్తాను" అంటూ నన్ను తొలిసారిగా దగ్గరకు తీసుకొని నా నుదిటి మీద ముద్దు పెట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్లి పోయేరు నాన్న"
నాన్న నాతో అలా వ్యవహరించిన సంఘటన తెచ్చిన ఆనందంతో కంఠం గద్గదమై నోటి వెంట మాట రాకుండా ఉన్న నన్ను అక్కున చేర్చుకుంది అమ్మ"
'ఈ డైరీలో ఇక రేపటి నుంచి నేను ఏమి వ్రాయవలసివస్తుందో' -
అని అనుకుంటూ అలసిన చేయికి కళ్ళకు విశ్రాంతినిస్తూ నిద్రలోకి జారుకుంది –
భాగ్యవంతుల అమ్మాయైనా విధి విలాసంలో నిర్భాగ్యురాలుగా మారిన సుగుణ.
*****