పండగ మామూలు - M chitti venkata subba Rao

Pandaga maamoolu

ఉదయం 6:00 అయింది అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి గట్టిగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఆ గొంతు ప్రెసిడెంట్ గారిది లా ఉంది అనుకుంటూ బాల్కనీ నుంచి కిందకు తొంగి చూశాను. సాక్షాత్తు మా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ముక్కోపి. ఇండియాకు ప్రెసిడెంట్ గా ఫీల్ అయిపోతుంటాడు ఇంత పొద్దున్నే ఎవరబ్బా ఆయనకు బలి అయిపోయింది అనుకుంటూ చూస్తే ఎదురుగుండా మున్సిపాలిటీ వాళ్ళ ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అపార్ట్మెంట్ ఎదురుగుండా రోడ్డుమీద రోజు వ్యర్థ పదార్థములు తీసుకువెళ్లే ట్రాక్టర్ నిలిపి ఉంది. ఓహో అయితే ఈ మనిషి ప్రతాపం ఈవేళ పాపం రోజు వ్యర్థ పదార్థాలు తీసుకుని వెళ్లే మున్సిపాలిటీ వాళ్ళ మీద అన్నమాట. మా అపార్ట్మెంట్లో మొత్తం యాభై ప్లాట్లు ఉంటాయి. మాది భాగ్యనగరంలో ప్రగతి నగర్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ కట్టి పదిహేను ఏళ్లయింది. ప్రతిరోజు మన శరీరం లాగే మనం నివసించే ఇల్లు కూడా వ్యర్థ పదార్థాలను ఇంట్లో ఉంచుకోదు. కాదు కాదు మనం ఆ ఇంట్లో ఉండలేం. కంపు భరించలేక అనారోగ్యాలు తెచ్చుకోలేక. ప్రతిరోజు ప్రతి ప్లాట్ నుంచి సుమారుగా రెండు డబ్బాలు చెత్త వస్తుంది. ప్రతిరోజు రాత్రి ఆ డబ్బాలను ఎవరి గుమ్మం ముందు వాళ్ళు పెడితే వాచ్ మెన్ కలెక్ట్ చేసుకుని వెళ్లి కింద మూడు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి ఆ డ్ర మ్ములలోపోసేస్తాడు. అలా మొత్తం రోజు మూడు పెద్ద డ్రమ్ములు చెత్త వస్తుంది. ప్రతిరోజు ఉదయం ఏడుగంటలు అయ్యేటప్పటికి ఆ మున్సిపాలిటీ బండి మైక్ లో స్వచ్ఛభారత్ సూచనలు వినిపిస్తూ మా అపార్ట్మెంట్ ముందు అగుతుంది. అందులో ఉండే మున్సిపాలిటి ఉద్యోగస్తులు ఆ మూడు డబ్బాలు ఎత్తుకుని ట్రాక్టర్లో పోసేసి యధా స్థానంలో డబ్బాలు ఉంచుతారు. ఇది మా అపార్ట్మెంట్ చెత్త కధ కమామేషు. ప్రభుత్వం ఈ రకమైన వ్యవస్థ పెట్టిన తర్వాత నగరంలోని అన్ని ప్రదేశాలు ఎక్కడో తప్పితే మిగిలిన చోట్లు చాలా అందంగా ఉంటున్నాయి. లేదంటే ఈ పదార్థాలను ఏం చేయాలో తెలియక రహదారి మీద పోసేవారు. అక్కడ ఈగలు దోమలు కుక్కలు పందులు పశువులు విహరిస్తూ ఆకలి తీర్చుకునేవి. ఇప్పుడు ఇటువంటి రహదారి మీద చెత్త వేసే కార్యక్రమాలకు స్వస్తి చెప్పించి మంచి పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతిరోజు సేకరించిన వ్యర్థ పదార్థాలని నగరానికి దూరంగా పారబోయడం వీళ్ళ విధి. ఎండైనా వానైనా మంచు కురిసే రోజుల్లోనైనా క్రమం తప్పకుండా వీళ్ళు చేసే సేవ నిజంగా మర్చిపోలేనిది మనసుపెట్టి చూస్తే ఆ మధ్య ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేశారు. చూసుకోండి మా కష్టాలు డబ్బాలన్ని నిండిపోయి ,చెత్త బయట పోయడానికి వీల్లేదు అపార్ట్మెంట్లోనే లోపల మూలగా పోసేవాడు వాచ్ మెన్. రోజు భరించలేని కంపు ఈగలు దోమలు ఒకటి కాదు నరకం చూసేసాం. వాచ్ మెన్ అయితే నేను ఉద్యోగం మానేసి వెళ్లిపోతానని బెదిరించాడు. అలాగని రోజు ట్రాక్టర్ బాడుగకు తీసుకుని చెత్త బయటకు తీసుకువెళ్దామంటే ఎక్కడ పోయించాలో తెలియలేదు. చాలామంది ప్లాట్ లో ఉండేవాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్లిపోయారు. మొత్తానికి వాళ్లు వారం రోజులు సమ్మె చేసి కోరికలు తీరేయో లేదో తెలియదు గాని మళ్లీ డ్యూటీలో జాయిన్ అయిపోయారు. మర్నాడు గుమ్మం ముందు ట్రాక్టర్ ఆగగానే ప్రాణం లేచి వచ్చింది. వాళ్లయితే పాపం ఓవర్ టైం చేసి నగరాన్ని అద్దంలా చేసేసారు. ఒక వారం రోజులకే మేము ఇంత తల్లడిల్లిపోతే రోజు దానితోటే ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి ఏమిటి? తలుచుకుంటే జాలేస్తుంది. ఉదయమే సూర్యుడుతోపాటు డ్యూటీలో జాయిన్ అయిపోతారు. సూర్యుడు లోకానికి అంతటికి వెలుగు పంచితే పాపం వీళ్ల మొహం దుమ్ము కొట్టుకుపోతున్న మన నగరానికి వెలుగు తీసుకొస్తారు. నగరాన్ని చంటి బిడ్డలా సాకుతారు. ఆత్మస్థైర్యంతో నగరానికి సుందర నగరంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చేది వీళ్లే. బిడ్డ మలమూత్రాలను అమ్మ అసహ్యించుకోదు. అది పేగు బంధం. నగరం విసిరేసిన నిర్మాల్యాన్ని సరిహద్దులు దాటించడమే వీరి వృత్తి ధర్మం. మన ఆరోగ్యాలన్నీ వాళ్ల వృత్తి తోనే ముడిపడి ఉన్నాయి. ఇంతలో హఠాత్తుగా కేకలు ఆగిపోయాయి. ప్రెసిడెంట్ గారు లిఫ్ట్ లో వెళ్లి పోతు కనబడ్డారు. ఆ మున్సిపాలిటీ బండి వాడు వాచ్ మెన్ తోఏదో చెబుతున్నాడు . ఏమిటా అని క్రిందకి వెళ్లి ఆసక్తిగా విన్నాను " మాలాంటి వాళ్ళ మీదే వీళ్ల ప్రతాపాలన్నీ మేము అడిగింది వందలు వేలు కాదు . మేం గవర్నమెంట్ ఉద్యోగస్తులం కానీ మాకొచ్చే జీతాలు ఎంత . ఏదో పండక్కి మామూలు అడుగుతుంటాం. వీళ్ళు ఒక సినిమాకి ఖర్చు పెట్టినంత కాదు. మేము చేసే పని ఏమిటి. ఒక్కసారి ఆలోచించండి. ఎంత కష్టతరమైన ఉద్యోగం. రోజు అన్నం తినడం కూడా కష్టంగా ఉంటుంది మాకు. రోజు ఆ చెత్త తోటే చేసే ఉద్యోగం మాది. ఏ రకమైన అనారోగ్యాలు వస్తాయో ఎవరికి తెలుసు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిజంగా. నాక్కూడా నిజమే అనిపించింది. ఒకసారి అపార్ట్మెంట్ ఎదురుగుండా ఉన్న మురికి కాలువ బ్లాక్ అయిపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేతికి ప్లాస్టిక్ కవర్ పట్టుకుని చేతితోటి ఆ బ్లాక్ అంతా క్లియర్ చేశారు. అందులో దొరికిన మాణిక్యాలను చూస్తే అసహ్యం వేసింది. చిన్నపిల్లలు తెలిసో తెలియకో చేతికి అందినవి అన్ని విసిరేస్తుంటారు మురికి కాలువలోకి .కానీ జ్ఞానం తెలిసిన పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అయిపోయి చిన్నపిల్లలకు వాడే డైపర్స్ అందులోకి విసిరేస్తున్నారు. ఇంకా చెప్పకూడనివి ఎన్నో. వాళ్లు చేస్తున్న సేవ ప్రత్యక్షంగా చూసిన నాకు నిజంగానే ఆ బండి వాడు చెప్పిన మాటలు నిజమే అనిపించింది. చాలామంది వాళ్లు పొగరుగా సమాధానాలు చెప్తారండి మనం చెప్పిన మాట అసలు వినిపించుకోరు అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి వృత్తిపరమైన ఒత్తిడి వల్ల అలా మాట్లాడుతుంటారేమో అని అనిపించింది. నిజానికి ప్రెసిడెంట్ గారికి కూడా ఒక సమస్య ఉంది. అందరూ ఈ మామూలు ఇవ్వడానికి ఒప్పుకోరు. మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందని ఇప్పటికీ గొడవ పెడుతున్నారు. అందుకనే అలా అని ఉంటారని ఊహించుకుని పైకి వెళ్లి ప్రెసిడెంట్ గారి ఫ్లాట్లోకి అడుగుపెట్టాను. ఆయన నన్ను చూడగానే చూడండి ఆ చెత్త వాడు గొడవ పెట్టేస్తున్నాడు అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు .అంతా విన్న నేను *చూడండి ప్రతి పండక్కి మన వాచ్ మెన్ దగ్గర నుంచి అందరూ మామూలు అడుగుతూనే ఉన్నారు .ఇదివరలో అయితే ఒక దసరాకు మాత్రమే అడిగారు. ఈమధ్య అన్ని పండగలకి అడగడం మొదలుపెట్టారు. మన జీవితాలు అన్నీ వాళ్లతోనే ముడిపడి ఉన్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. ఎవరి అవసరం వస్తుందో తెలియదు. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఏది వచ్చినా అందరూ మీ మీద పడతారు. కాబట్టి ఇవన్నీ రేపు ఆదివారం ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ తప్పనిసరిగా హాజరు అవ్వాలని మరీ మరీ చెప్పి నెలకు ఒక యాభై రూపాయలు మెయింటెనెన్స్ పెంచుదాం. నెలకు యాభై అంటే ఎవరికీ కష్టం కాదు. ఇక్కడ అపార్ట్మెంట్ల వాళ్ళందరూ ఉద్యోగస్తులే. అర్థమయ్యేలా మనమే చెప్దాం. ఒకవేళ ఎవరు ఈ దీనికి ఒప్పుకోకపోతే పండగ మామూలు అడిగిన వాళ్ళని ప్రతి ప్లాట్ కి వెళ్లి అడిగి తెచ్చుకోండి అని చెబుదాం అంటూ ప్రెసిడెంట్ గారిని ఈ సలహా ఇచ్చి ఒప్పించి బయటికి వచ్చాను. ఇంతకు నేను ఎవరిని అనే సందేహం అందరికీ రావచ్చు. నేను కూడా అసోసియేషన్ సెక్రెటరీ. పండగ మామూలు అడగడం తప్ప రైటా అనేది పక్కన పెడితే ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఏదో ఒక సమస్య కామన్ ఏరియా కి సంబంధించింది వస్తూనే ఉంటుంది. లిఫ్ట్ పని చేయకపోవడం లైట్లు వెలగకపోవడం వాచ్ మెన్ సమస్య చెత్త పట్టుకెళ్లేవాళ్ళు రాకపోవడం ఇంట్లో కరెంటు పోవడం నల్లాలు పని చేయకపోవడం ఇలా ఒకటేమిటి ఏది ఎప్పుడు వచ్చి మీద పడుతుందో మనకు తెలియదు. అందుకునే ఇటువంటి వారితో మంచిగా ఉంటూ అవసరమైనప్పుడు చేయి విదుల్చుతూ ఉంటే మనం ఫోన్ చేయగానే సమస్య చెప్పగానే అర్ధరాత్రి అయిన చేసి పెడుతుంటారు. అంటే అందరికీ మామూలు ఇవ్వమని కాదు. అందులో మన ఆపద్బాంధవులు వాచ్ మెన్ ,ఈ చెత్త బండి వాళ్లు ముఖ్యులు. ఇప్పటికే ఏ వాచ్ మెన్ వచ్చిన రెండు నెలల మించి ఉండట్లేదు ఏమిటి కారణం అని అడిగితే ఆ వాటర్ ట్యాంక్ మీద నుంచి దూకి చనిపోయిన అమ్మాయి దెయ్యం అయిందని అందరూ చెప్పుకుంటున్నారని. ఇదొక కొత్త సమస్య. వాచ్ మెన్ లేకపోతే ఒక గంట గడవదు. మన పదవులకి డబ్బులు ఎవరు ఇవ్వరు కానీ రోజు ఈ తలకాయ నొప్పులు పడలేము అంటూ ప్రెసిడెంట్ గారికి నచ్చజెప్పి బయటకు వచ్చేసా. అనుకున్న మీటింగ్ రోజు ఆదివారం రానే వచ్చింది. సాధారణంగా మీటింగుకి ఎవరూ రారు. అందులో ఆదివారం టైం వేస్ట్ అయిపోతుంది అని వాళ్ల ఉద్దేశం.సమస్య ఉన్నవాళ్లు తప్పితే . ఈసారి విచిత్రంగా మొగుడు పెళ్ళాలు కలిసి వచ్చారు. ఈలోగా పండగ మామూలు సంబంధించిన సమస్య గురించి ఎత్తితే అందరూ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుందని గొడవ పెట్టారు. మళ్లీ అపార్ట్మెంట్ సమస్యలన్నీ ముక్తకంఠంతో ఏకరువు పెడుతూ ప్రస్తుతం ఉన్న కమిటీ వల్ల సమస్యలు ఏమి తీరటం లేదని గొడవలు ఎక్కువ అవుతున్నాయని కాబట్టి కొత్త కమిటీని ఎన్నుకొందామని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకేముంది చేసేదేమీ లేక మేము కూడా అందుకు ఒప్పుకున్నాం. అందులో కొత్తగా వచ్చిన యువకులు అంటే రెండు ఫ్లాట్ల యజమానులు ముందుకు వచ్చారు. ఒకరు సెక్రటరీ ఒకరు ఒకరు ప్రెసిడెంట్ గా ఉంటామని. అందరూ దానికి అంగీకరించారు. ఎవరు నో చెప్పలేదు. మేం కూడా తలనొప్పి తగ్గిపోయిందని లోపల సంతోషపడ్డాం. మొత్తానికి కొత్త కమిటీకి బాధ్యతలని అప్పజెప్పేసి చెక్ బుక్ కూడా ఇచ్చేసి తప్పుకున్నాము. ఈలోగా ఉగాది పండుగ వచ్చింది. యధావిధిగా పండగ మామూలు అడగడం మొదలుపెట్టిన వాడి పరిస్థితి అరణ్యరోదనమే. నేను మటుకు నా వంతు వంద రూపాయలు వాళ్లకి ఇచ్చి మాట్లాడకుండా ఊరుకున్నా. ఉగాది రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం మరియు ఉగాది సంబరాలు అంటూ పెద్ద ఫంక్షన్ చేసి ఆ మరుసటి నెల నుంచి వంద రూపాయలు మెయింటినెన్స్ పెంచింది కొత్త కమిటీ. హంగులకి ఆర్భాటాలకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కానీ మానవత్వంతో ఆలోచించి చూస్తే మనం చేసే పని మనం మాట్లాడే ప్రతి మాట ఏది తప్పు ఒప్పు అది మనకే తెలుస్తుంది. ఈమధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వారి దగ్గర బేరం ఆడకండి అంటూ కూరగాయలు అమ్ముతున్న ముసలి తాతని రోడ్డు పక్కన పువ్వులు అమ్ముతున్న ముసలమ్మని చంకలో బిడ్డను పెట్టుకుని ఒక చేత్తో బొమ్మను పట్టుకుని అమ్ముకుంటున్న ఒక యువతని చూపిస్తున్నారు. నిజమే ఇది ఫేస్బుక్ లైకులు కోసం కాకుండా మానవత్వంతో చేస్తే మంచిదే.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు