తన దగ్గరకి వచ్చిన దావా కాగితాలు చదివిన న్యాయమూర్తి గారు వాదిని ఉద్దేశించి --
"నారాయణమూర్తిగారూ మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు"
"ప్రభుత్వఉద్యోగిగా పనిచేసిన నేను పదవీవిరమణ చేసి ఆరేళ్ళయింది. స్వంతఇంట్లో ఉంటున్న నేను నాభార్య నాకు వచ్చే పింఛనుతో హాయిగానే ఉన్నందువలన నేను వేరే ఏ పని చేయవలసిన అగత్యం లేదు”
"మీ ఆర్ధిక పరిస్థితి బాగున్నా లేకున్నా మీ అబ్బాయిలు ఇద్దరూ ప్రతీ నెలా మీకు ఆర్ధిక సదుపాయం కలగచేయవలసిన బాధ్యత ఉంది అని మన న్యాయశాస్త్రం నియమాలున్నాయి. కనుక, మీ అబ్బాయిలు ఇద్దరూ మీకు ప్రతీ నెలా మీకు ఆర్ధిక సదుపాయం కలగచేయాలని మీ అబ్బాయిలిద్దరి మీద మీరు వేసిన దావా చెల్లుతుంది. మీ వాదనలు ప్రతివాదులైన మీ అబ్బాయిలిద్దరి వాదనలు పూర్తిగా విన్న తరువాత నా నిర్ణయం తెలియచేస్తూ న్యాయపరమైన తగిన ఉత్తర్వులు ప్రకటించడం జరుగుతుంది. ప్రతివాదులైన మీ ఇద్దరి అబ్బాయిల తరపున కలిపి వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాది వకాలతనామా నాకు సమర్పించేరు. కానీ, మీ తరపున వాదన వినిపించేందుకు ఏ వకాలతనామా నాకు ఇంతవరకూ అందలేదు. కారణం ఏమిటి? ఏ న్యాయవాదిని మీరు నియమించలేదా లేక ఎవరూ ముందుకు రాలేదా? మీకు అవసరమనిపిస్తే, మీ తరపున వాదించేందుకు ఒక న్యాయవాదిని నియోగిస్తూ ఉత్తర్వులు ఇప్పుడే ప్రకటిస్తాము"
"మంచిదే, కానీ మీరు అనుమతిస్తే నా వాదన నేనే వినిపించుకుంటాను"
"అలా చేయగలనని మీకు నమ్మకం ఉంటే అందులకు మీకు అనుమతి ప్రదానం చేస్తున్నాను"
"ధన్యవాదాలు"
"మీరు వాది కనుక మీ వాదనే ముందు వినాలి. మీరు ఈ దావా ద్వారా మీ అబ్బాయిల దగ్గరనుంచి మీరు ఆశించే ఆర్ధిక సదుపాయం ఏమిటి"
"నా అబ్బాయిలిద్దరూ ప్రతీ నెలా చెరో వంద రూపాయలు నాకు నా భార్యకి కలిపి ఇచ్చుకోవాలి అన్నది నా కోరిక. అది కూడా ఎలా అంటే - ప్రతీ నెలా ఒకటవ తేదీ నుంచి పదో తేదీ లోపల పెద్ద అబ్బాయి, ఇరవై తేదీ నుంచి నెలాఖరు లోపల చిన్న అబ్బాయి మా ఇద్దరికీ కలిపి ఇచ్చుకోవాలన్నదే నా కోరిక"
"అంటే మీ ఇద్దరు అబ్బాయిలు వేరు వేరుగా ప్రతీ నెలా మీరు చెప్పిన తేదీల ప్రకారం ఒక్కొక్కరూ కేవలం వంద రూపాయలు చొప్పున మీ ఇద్దరికీ కలిపి ఇచ్చుకోవాలన్నదే మీ అభిమతం అంటారు. అంత తక్కువ అడుగుతున్నారేమిటి, పైగా వేరు వేరుగా వారు రావాలి, వచ్చి మీ ఇద్దరికీ కలిపి ఇవ్వాలి అనడంలో మీ వాదన వివరంగా తెలియచేయగలరా"
"తప్పకుండా. నేను పదవీ విరమణ చేసిన ఆరు వత్సరముల ముందర చివరి సారిగా మా ఇద్దరి అబ్బాయిలను చూసేము. అప్పటి నుంచి ఈ రోజు వరకూ వారు మాకు కనిపించలేదు, కనీసం ఫోన్ లో కూడా వారి గొంతుక వినే భాగ్యం కూడా మాకు కలిగించలేదు. కాబట్టి, నా కోరికకి మీరనుమతిస్తే, ప్రతీ నెలా ఇద్దరు అబ్బాయిలను చూడగలం వారి గొంతుక వినగలం. ఇద్దరూ ఒకే సారి వచ్చే బదులుగా నేను కోరినట్టు వేరే వేరే వస్తే ఆ ఎడబాటు దూరం తగ్గుతుంది అన్న ఆశ. ఇక వంద రూపాయలు మాత్రమే ఎందుకు అంటే, నా ఆర్ధిక వనరులు నాకు తృప్తిగా ఉన్నప్పుడు వారి దగ్గరనుంచి ఎక్కువగా కోరి, వారికి ఆర్ధికంగా నష్టం కష్టం ఒక తండ్రిగా నేను కలిగించలేను" అంటూ కళ్ళ వెంట కారుతున్న అశ్రువులకు తన చేతిరుమాలుతో అడ్డుకున్నారు నారాయణమూర్తిగారు.
అంతే. ఒక్కసారిగా అబ్బాయిలిద్దరూ తండ్రి కాళ్ళ మీద పడి "క్షమించు నాన్నా" అని కన్నీరు మున్నీరుగా విలపించసాగేరు.
వారిని పైకి లేపిన నారాయణమూర్తిగారు ఇద్దరినీ అక్కున చేర్చుకొని "న్యాయమూర్తిగారూ, నాకు కావలసిన న్యాయం దొరికింది, ఇక నాకు ఏ తీర్పూ అవసరం లేదు. క్షమించండి" అంటూ న్యాయమూర్తిగారికి నమస్కారం చేసి, చాలా రోజుల తరువాత దొరికిన ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు అబ్బాయిలిద్దరి భుజాలమీద చేతులు వేసి తృప్తిగా బయటకు నడవసాగేరు.