ఇద్దరూ ఇద్దరే - M chitti venkata subba Rao

Iddaroo iddare

" అమ్మ వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు కనీసం ఈ పుట్టినరోజుకి అయినా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత. వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు అందుకే మళ్లీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది .అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్లు అన్నయ్య చదువు అయిపోతో oది. క్యాంపస్ లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది. అన్నయ్య అంది వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబం ఒక దారిలో పడుతుంది . పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తోంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య. వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగి. అనుకూలవతి అయిన భార్య తో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు. రాజారావు పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించేవారు. అలాంటి కుటుంబానికి దిష్టి తగిలింది ఏమో హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు. రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. అయినా గవర్నమెంట్ వారు దయ తలచి రికార్డ్ కీపర్ గా ఉద్యోగం ఇచ్చారు. రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత పెద్ద ఇంటికి అద్దెలు కట్టలేక మూడు గదుల పోర్షన్ ఒకటి తీసుకుని పిల్లలతో కాలక్షేపం చేస్తోంది వసంత. ముందు గదిలో పిల్లలు చదువు, మధ్య గదిలో పడక ,చివర గది వంటిల్లు అదే భోజనాలు గది కూడా. మొదట్లో వసంతకి ఇరుకు గదిలో జీవితం చాలా కష్టంగా అనిపించినా నెత్తి మీద ఉన్న బాధ్యతలు వసంత చేతులు కట్టేసాయి. మగవాడు లేని సంసారం ఎంత కష్టమో అనిపించింది వసంతకి. ఇప్పుడు ఆ కుటుంబానికి యజమాని మరియు ఆర్థిక మంత్రి కూడా వసంతే. ఇదివరకు భర్త జేబులో ఎంత ఉందో చూసుకోకుండా కావాల్సినవన్నీ కోరి తెప్పించుకునేవారు . భర్త రాజారావు ఎలా మోసుకొచ్చాడో ఈ సంసారాన్ని ఖర్చులకి ఆదాయానికి ఎక్కడ పొంతన ఉండట్లేదు అనుకుంటూ రోజు బాధపడుతోంది వసంత. రాజారావు బతికున్న రోజుల్లో ఒకరోజు వంట చేయలేకపోతే హోటల్ నుంచి తెప్పించమని పిల్లలు అడిగితే వెంటనే మారు మాట్లాడకుండా తెప్పించేవాడు రాజారావు. అది అనవసరం ఖర్చు అని రాజారావు పోయిన తర్వాత తెలిసింది వసంతకి. ఉదయం పూట ఒక కూరతో సరిపెట్టుకుని రాత్రిపూట పిల్లలకు మటుకే కూరలు వండి పచ్చడితో సరిపెట్టుకుంటోంది. అమ్మ చేస్తున్న ఈ త్యాగం అనేకసార్లు గమనించింది రమ్య. ఎన్నోసార్లు రమ్య కూడా తినకుండా చెరిసగం పంచుకు తిందామని చెప్పిన వసంత వినేది కాదు. మీరు చదువుకునే పిల్లలు. రాత్రిపూట ఎక్కువ తింటే నాకు అరగదు అంటూ అబద్ధం చెప్పేది. రాజారావు పోగానే పనిమనిషి కూడా మానిపించి ,రాత్రిపూట భోజనాలు అయిన తర్వాత సామాన్లు కూడా తోముకొని అప్పుడు పడుకుంటుంది. రోజు ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్తుంది. రమ్య నాకు రోజు వాకింగ్ చేయక్కర్లేదే హాయిగా ఇది సరిపోతుంది అంటూ తల్లి చెప్పిన మాటలకి దాని వెనుక ఉన్న భావం అర్థమైంది రమ్యకి. కుటుంబ పోషణలో ఎంత పొదుపుగా ఉన్నా పిల్లల ఫీజులకి ఎక్కడ లేని డబ్బు ఖర్చు అయిపోతోంది పాపo వసంతకి. అయినా బాధ్యత కదా. చదువు చెప్పించకుండా వదిలేస్తే తండ్రి లేని పిల్లలు కదా అని అలా వదిలేసింది అనుకుంటారు. వసంత అదృష్టం కొద్దీ పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే పిల్లలే. ఇంకేముంది ఒక సంవత్సరం కష్టపడితే పిల్లాడు అంది వస్తాడు అనుకుంటూ ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తోంది వసంత. పాపం చిన్న వయసులోనే వసంత భర్త పోయాడుగా ఎంతోమంది పెళ్లి చేసుకుంటామని ఆఫీసులోనూ బయట తెలిసిన వాళ్ళు కబుర్లు పంపారు . ఒంటరిగా ఉన్న ఆడదంటే అందరికీ లోకువే. రోజు ఎన్నో ఆకలి చూపులు. ఇవన్నీ తట్టుకుంటూ బాధ్యత కోసం బ్రతుకు వెళ్ళదీస్తోంది వసంత. "అమ్మా ఇవాళ అమెజాన్ కంపెనీ వాళ్ళు మా కాలేజీ క్యాంపస్ సెలక్షన్ కి వస్తున్నారు , సాయంకాలం బాగా లేట్ అవుతుంది అంటూ కొడుకు రాజేష్ చెప్పిన మాటలకి ఆనందపడిపోయింది వసంత. కొడుకుకు ఉద్యోగం వచ్చినంతగాసంబరపడిపోయింది. రాజేష్ ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలు అయ్యింది. సీరియస్ గా మొహం పెట్టి ఇంట్లో వచ్చాడు రాజేష్. అదేమిటి రాజేష్ ఏ విషయం చెప్పడు శుభవార్త చెప్తాడు అనుకుంటే ఇలా వచ్చాడు ఏమిటి అనుకుంటూ మనసులో మధన పడసాగింది. ఇంతలో రమ్య వెనకాల నుండి వచ్చి వసంత నోట్లో స్వీట్ పెట్టి గట్టిగా కౌగిలించుకుంది. ముగ్గురు తండ్రిని తలుచుకొని ఏడ్చారు. ఆ రాత్రి ఆనందంతో వసంతకి నిద్ర పట్టలేదు. ఇన్నాళ్ళకి తన కష్టం నెరవేరింది. తను నారు పోసి నీరు పోసి పెంచి పెద్ద చేసిన మొక్క ఇన్నాళ్ళకి మధుర ఫలాలని ఇవ్వబో తోంది అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. కానీ రాజేషు రాత్రంతా ఆలోచనలో ఉండిపోయాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మను ఉద్యోగం మానిపించాలి. తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలి. చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇవి రాజేష్ ఆలోచన లు. అలా సంవత్సరం గడిచిపోయింది. బీటెక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి పూణేలో అమెజాన్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు రాజేష్. ఆరు నెలల పాటు ట్రైనింగ్. ఆ తర్వాత ఉద్యోగం . వసంత ఆనందానికి హద్దు లేదు. హమ్మయ్య ఒక బాధ్యత తీరింద ని హాయిగా ఊపిరి పీల్చుకుంది. రమ్య కూడా ఈ సంవత్సరం కష్టపడితే దేవుడి దయ వల్ల క్యాంపస్ వచ్చేస్తుంది అనుకుంటూ పనిలో పడిపోయింది. కానీ ఎందుకో అలసటగా అనిపించింది. ఈ మధ్య ఎక్కువగా నడవలేకపోతోంది. ఈ విషయం పిల్లలకిచెప్పలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్లీ డబ్బులు ఖర్చు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది . ఈలోగా బంధువుల ఇంట్లో పెళ్లిలో రమ్యను చూసి తమ కోడలుగా చేసుకుంటామని కబురు పంపారు దూరపు బంధువులు. కుర్రాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. మంచి సంబంధం. ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఆఫీసులో పిఎఫ్ లోను పెట్టి రమ్య పెళ్లి ఘనంగా చేసింది వసంత. అమ్మ నేను కూడా ఆఫీసులో లోన్ పెడతాను అని చెప్పిన రాజేష్ మాటలు విని సంతోషించి సున్నితంగా తిరస్కరించింది. ఇన్నాళ్ళు పిల్లల తనతో ఉన్నారు కాబట్టి రాజారావు పోయిన బాధ ఉన్నప్పటికీ ఒంటరితనం పెద్దగా బాధించలేదు వసంత ని. ఇప్పుడు రమ్య కాపరా నికి వెళ్ళిపోయింది. రాజేష్ ఉద్యోగానికి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భర్త పిల్లలు మాటిమాటికి గుర్తుకొస్తున్నారు. దానికి తోడు వయసు కూడా పెరుగుతోంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే గానే ఉంటోంది. పైగా ఒక రిటైర్మెంట్ ఆరు నెలలే ఉంది. ఈలోగా రాజేష్ పెళ్లి చేయాలని అనుకుంటూ సంబంధాలు చూడడం ప్రారంభిం చింది. ఇదే విషయం రాజేష్ తో చెప్తే "చూడమ్మా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇన్నాళ్లు నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచుకుంటూ వచ్చావు. ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ వచ్చిన అమ్మాయి నిన్ను చూసుకుంటుందని గ్యారెంటీ లేదు. నాన్నగారు పోయిన తర్వాత నువ్వు తిని తినక కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచిన విధానం మర్చిపోలే ము. ప్రతి తల్లి అలాగే చేస్తుంది అని నువ్వు చెప్పొచ్చు. అందరి తల్లులు పరిస్థితి వేరు. నీ పరిస్థితి వేరు. నాకు పెళ్లి పిల్లలు వంశం అనే వాటి మీద నమ్మకం లేదు. నా బాధ్యత నువ్వే. ఇది నేను బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నా అంటూ చెబుతున్న రాజేష్ మాటలు విని బోరున ఏడ్చింది. ఎంత చెప్పినా రాజేషు తల్లి మాటలు వినిపించుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఇంతవరకు పిల్లలు తల్లి చెప్పిన మాట బుద్ధిగా విని చదువుకుని ప్రయోజకులు అయ్యారు కానీ ఈ ఒక్క విషయం తల్లి మాటకి అంగీకరించకపోవడంతో కొంత అసంతృప్తితో కాలం గడుపుతున్న వసంత్ కి రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. "ఈ కార్యాలయంలో ప్రతి ఏడాది ఎవరో ఒకరు రిటైర్ అవుతూనే ఉంటారు. అందరి పరిస్థితి వేరు. ఈ ఉద్యోగి పరిస్థితి వేరు. చేసినది చిన్న ఉద్యోగమైన తన బాధ్యత ఏమిటో తను తెలుసుకొని సక్రమంగా నిర్వర్తించి ఈ కార్యాలయానికి మంచి పేరు తీసుకొచ్చిన వసంత గారి గురించి మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది. వసంత గారి భర్త రాజారావు మన కార్యాలయంలోనూ పనిచేసి గుండెపోటుతో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజారావుకి అంతకుముందే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోయింది. ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. వసంత గారి భర్త రాజారావు నాకు బాల్య స్నేహితుడు. ఇద్దరం ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యా ము. వసంత గారికి కడుపున పుట్టిన పిల్లలు ఎవరూ లేరు. చిన్నప్పటినుంచి సవితి పిల్లల్ని తన కడుపుని పుట్టిన పిల్లల్లాగా రాజారావు గారు పోయిన తర్వాత కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసింది. ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ముందుకు వచ్చారు. నాతో కూడా చెప్పారు. కేవలం ఇద్దరు బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ వసంత గారు అందుకు ససే మీరా ఒప్పుకోలేదు. అటువంటి మహాతల్లి పెంపకంలో పెరిగిన రాజేష్ కూడా కేవలం తన తల్లి కోసం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు. కన్న తల్లిదండ్రులని అనాధ శరణాలయాల్లో పారేస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి కొడుకు ఉండడం వసంత గారు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పుకొస్తున్న ఆ కార్యాలయం ప్రధాన అధికారి మాటలు విని అందరి కళ్ళు చమర్చాయి. రాజేష్ కి రమ్యకి ఒకసారి బుర్ర తిరుగుతున్నట్టు అనిపించింది. కన్నతల్లి కూడా అంత ప్రేమగా చూస్తుందో లేదో కానీ ఈ సవితి తల్లి కాదు కాదు సొంత తల్లి ఎంత బాగా చూసుకుంది అనుకుంటూ తల్లిని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుని పూనే బయలుదేరి వెళ్ళిపోయాడు రాజేష్. ఈ కథలోని ఇద్దరు పాత్రధారులు త్యాగమూర్తులే. ఒకరి కోసం ఒకరు జీవితం త్యాగం చేసిన వాళ్లే. ఇద్దరి నుండి నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు