అందమె ఆనందం - వెంకటరమణ శర్మ పోడూరి

Anandame anandam

మనోహర్ పార్క్ లో వాకింగ్ ప్రారంభించే టప్పటికి జనం పలచ గా ఉన్నారు. రోజు అతను ఆనందం గా తన ఆస్థిత్వాన్ని తానే గమనించు కుంటూ గడిపే సమయం ఆ పార్క్ లోనే. వాకింగ్ పూర్తి చేసుకుని రోజు కూర్చునే బొగడ చెట్టుకింద బెంచి మీద కూర్చున్నాడు. ఆలోచనలు లేని నిశ్చల ఆనందం లో ఉండగా ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో అతని మిత్రుడు నారాయణ వచ్చి కూర్చుని, అతని సెల్ ఫోన్ లో పాత పాటలు ఆన్ చేయడం మనోహర్ గమనించలేదు. ఇద్దరికీ ఇష్టమయిన ఘంటసాల పాటలు వస్తున్నాయి. 'అందమే ఆనందం ' పాట ఇద్దరు కలిసి చాలా మాట్లు విన్నారు. ఇప్పుడు కూడా అదే వస్తోంటే సైలెంట్ గా వింటున్నాడు మనోహర్. అంతవరకు లేని ఆలోచనలు 'అందం' మీదకి పోయాయి. అందం అనగానే అందమయిన ఆడవాళ్లే కదా మనసుకు వస్తారు. అందమయిన ఆడవాళ్లు అందరు ఆనందం కలిగిస్తారా? అన్న ఆలోచన వచ్చి. ఇదేమి ఆలోచన అనుకున్నాడు. సరే వచ్చిన ప్రశ్న ఎలాగూ వచ్చింది, మన అనుభవం తో పరిశీలించు కుందాం అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఈమె అందం గా ఉంది అని తనకి అనిపించిన వాళ్ళు వరస గా గుర్తుకు వచ్చారు. మొదట గుర్తుకు వచ్చింది రంగనాయకి. మునిసిపల్ స్కూల్ లో అప్పుడు సెకండ్ ఫారం చదువు తున్నాడు. ఒక రోజు ప్రొద్దుట మునిసిపల్ ఆఫీస్ బంట్రోత్ ఒక అమ్మాయిని వెంటపెట్టుకుని, క్లాస్ కి వచ్చాడు "కమిషనర్ గారి అమ్మాయండి. హెడ్ మాస్టారు ఈ క్లాస్ కి పంపరండీ "అన్నాడు అప్పుడు క్లాస్ లో ఉన్న తెలుగు మాష్టారు తో. ఆయన హడావిడి గా మొదటి బెంచి లో కూర్చున్న సుబ్బలక్ష్మి ని వాళ్ళని జరగమని అక్కడ కూర్చోమని చెప్పాడు ఆ అమ్మాయి తో. ఆయన ఆమె పేరు అడిగినప్పుడు అందరికి తెలిసింది' రంగనాయకి' అని. ఆమె రాగానే వచ్చిన సెంటు వాసన, మగ పిల్లల బెంచి లో మొదట కూర్చున్న మనోహర్ కి ఇప్పటికి గుర్తే. ఆతరవాత చల్లారావు మొదలయిన మిత్ర బృందం అంతా కలిసి, అంతవరకూ అమ్మాయిలకి ఇచ్చిన ర్యాంకింగ్స్ మార్చేసి, మొదటి ర్యాంక్ నుండి కుసుమ ని తప్పించి రంగనాయకి ఇచ్చారు. ఆమె అందం అందరిని అంత ప్రభావితం చేసింది. కాని మనోహర్ దృష్టిలో లో ఆమె అందం విలువ కోల్పోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆమె ఖరీదయిన పెన్నులు, అవీ క్లాస్ కు పట్టుకు రావడం, మిగతా వాళ్ళ కి చూపించడం జరిగేది. ఒక రోజు పార్కర్ పెన్ అని క్లాస్ కి తెచ్చిన పెన్ ఇంటికి వెళ్లే సమయం లో కనపడక పోతే, మాస్టర్ల కి కంప్లైంట్ చేసి మిగతా వాళ్లని ఇంటికి వెళ్ళ నీయక చాలా హడావిడి చేసింది. మరునాడు స్వీపర్ తెచ్చి ఇచ్చిందని స్కూల్ బంట్రోతు పట్టుకు తెచ్చిఇవ్వడం తో ఆప్రహసనం ముగిసినా, మనోహర్ మనసు లో రంగనాయకి అందం మసి బారింది. ఆ తరువాత అతనికి పెళ్లి వయసు వచ్చేదాకా చాలా అందం గా ఉన్నవాళ్లు నలుగురు, అయిదుగురు తారస పడ్డా, అందరిలోనూ ఎదో సందర్భంలో అతనికి నచ్చని లక్షణం బయట పడడం తో, అమ్మాయిని ఎంచుకోవడంలో అందానికి ప్రాముఖ్యత తగ్గింది. ఆ అయిదారుగురులో అతనికి తరుచు గుర్తుకు వచ్చేవాళ్ళు డిగ్రీ క్లాస్మెట్ కరుణ, మిత్రుడు నారాయణ వదిన గారు శ్యామల. కరుణ చాలా అందగత్తె. చాలా సేపుమేకప్ చేసుకుని వచ్చేది కాలేజీ కి. తాను అందకత్తెనని తనకి తెలుసు. అక్కడితో ఆగితే పరవాలేదు. ఎంతసేపు తన అందాన్ని మిగతా వారు గమనిస్తున్నారా లేదా అనేది స్పష్టం అయ్యేది. అదే మనోహర్ కి నచ్చేది కాదు. ఇక నారాయణ వదిన గారు, శ్యామల గారి గురించి నారాయణ ద్వారా తెలిసిందే. ఉమ్మడి కుటుంబం లోకి వచ్చి, తన శరీరం కష్ట పడిపోతుందేమో అన్నట్టు ఇంట్లో అందరు ఆమె సేవకే ఉన్నట్టు ప్రవర్తన. వేరే కాపరం పెట్టుకోమని నారాయణ తండ్రి చెప్పేదాకా వచ్చి, వేరే ఇంటికి మారాడు అతని అన్నగారు కామేష్. తనకి తెలిసిన కొద్ది మంది అందమయిన వాళ్ళ తో ఇలా జరగడం వల్ల, అతనికి ఎక్కడ అంద మయిన వాళ్ళ ని చూసినా, దగ్గర గా తెలిస్తే వీళ్ళు కూడా అంతే కదా అనుకునే దాకా వచ్చింది. నారాయణ పెట్టిన పాట ఆగి పోవడం, మనోహర్ ఆలోచనలు ఒకే మాటు ఆగాయి. దానికి కారణం, మనోహర్ దృష్టి ఎదురుగా వస్తున్న ఒక అందమయిన యువతి మీద పడటం. ఆమెని ఎప్పుడు ఈ పార్క్ లో చూడలేదు. ఆమె వెనకాలే నడిచి వస్తున్న అయిదేళ్ల పిల్లవాడు, ఆమె కొడుకేమో అనుకున్నాడు. వాళ్లిద్దరూ వీళ్ళు కూర్చున్న బెంచి దాటి ముందుకు వెళ్లే దాకా చూశారు. " చాలా అందం గా ఉంది కదూ అన్నట్టు చూశాడు మనోహర్ నారాయణ కేసి. " నీకు తెలుసా? ' అన్నాడు పైకి " లేదు నేను ఎప్పుడు చూడ లేదు " అన్నాడు నారాయణ జవాబు గా. " ఆపేసావేం పాటలు పెట్టు " అన్నాడు మనోహర్ యేసు దాసు పాడిన ' జానకి రమణ ' అన్న పాట శుద్ధ సీమంతిని రాగం లోది పెట్టాడు నారాయణ. ఆ పాట మనోహర్ కి ఇష్టం అని అతనికి తెలుసు. కళ్ళు మూసుకుని వింటున్నాడు మనోహర్. స్వర ప్రస్థానం తారాస్థాయిలో ఉండగా ' అమ్మా ' అన్నఒక పిల్లవాడి అరపు విని హటాత్తు గా కళ్ళు తెరిస్తే వాళ్ళ కి దగ్గరగానే ఇందాక వాళ్ళ ముందునుంచి వెళ్లినావిడ కొడుకు కాబోలు పరిగెడుతూ వచ్చి పడ్డాడు. వీళ్ళు ఇద్దరూ అక్కడికి వెళ్ళి పిల్లాడిని లేవతీశారు , ఇంతలో తల్లి పరిగెత్తుకు వచ్చింది. నారాయణ ఎత్తు కున్న పిల్లవాడు, కోసు గా ఉన్న ఎదో రాయి తలకి గుచ్చుకుని కళ్ళు తెలేశాడు. ఆ క్షణం లో కొడుకుని చూసిన తల్లి తల్లడిల్లి పోయింది. ఆ క్షణం లో ఆమె ముఖం లోకి చూసిన మనోహర్ ఆశ్చర్య పోయాడు. ఆమె అందం గురించి ఇంత క్రితం వచ్చిన ఆలోచన ఏమీ రాక పోగా, కొడుకు గురించి ఆమె ముఖం లో ప్రస్పుటించిన ఆందోళన కి అతను అబ్బుర పడిపోయాడు. తల్లి భావన మూర్తీభవిస్తే ఎలా ఉంటుందో ఆ క్షణం లో చూశాడు. ఆమెని, పిల్లవాడిని ఎక్కించుకుని, స్కూటర్ మీద నారాయణ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. మనోహర్, ఇంకా తేరు కోకుండానే బెంచి మీద కూల బడ్డాడు. ఆ తల్లి ముఖం లో కనపడ్డ ఒక తల్లి ఆందోళన గుర్తుకు వచ్చి, అంతకు ముందు తాను ఆలోచించిన అందగత్తెలు, కానీ, కాని వాళ్ళు కానీ, స్త్రీలు అందరిలో కామన్ గా ఉన్న ఒక అద్భుత లక్షణం స్పురించి, గౌరవం తో మనసు నిండి పోయింది మనోహర్ కి.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు