నీలి కళ్ళ సుందరి - హేమావతి బొబ్బు

Neeli kalla sundari

ఆరోజు యధా ప్రకారం తెల్లవారింది. కాలేజీ కి వెళ్లడానికి టైం అవుతుందని నేను ఉరుకులు పరుగులతో రెడీ అయ్యి ఇంటి బయటకు రాగానే కొంచెం కూడా ఆగలేకపోతున్నారు... ఈయన అంటూ విసుక్కుంటూ మా ఆవిడ లంచ్ బాక్స్ తెచ్చి నాచేతికి ఇచ్చింది. ఆవిడ మొహం నిండా విసుగు. నాకేమో మనసులో తను నవ్వుతూ ఎదురు రావచ్చు కదా అనిపించింది. అసలు తను నా వైపు చూస్తే కదా! లంచ్ బాక్స్ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ ఇంట్లోకెళ్ళింది. ఇక తను మాధవ్ మాధవి లను కూడా రెడీ చేయాలి కదా. అటు చూస్తే దగ్గరలో స్కూల్ బస్సు వస్తూ కనిపించింది. మరి సినిమాల్లో లాగా కోరికలు కోరుకోకూడదా? అనుకుంటూ నేను నా చేతక్ పైన కూర్చున్నా. నా స్కూటర్ ఇరవై ఏండ్ల పాతదైన అది యమా స్పీడ్ లో క్షణాల్లో నన్ను కాలేజీకి చేరింది. స్కూటర్ పార్క్ చేసి చేయంగానే అటెండర్ సుబ్రహ్మణ్యం పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలో ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని నాకంటే ముందు వెళ్లి నా ఆఫీస్ రూమ్ లో నా టేబుల్ పైన పెట్టాడు. నేను ఆఫీసులోకి అడుగు పెట్టగానే నాతో ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని కలవాలి అంటున్నారు అని చెప్పాడు. వచ్చేవారం ఎలాగో కోర్స్ అప్రూవల్ ఇవ్వడానికి జె ఎన్ టి యు నుండి మెంబర్స్ రాబోతున్నారు. మేము పూర్తిగా ఈ వారం అంతా బిజీగా ఉండబోతున్నాము. ప్రిన్సిపల్ రూమ్ లోకి నేను అడుగు పెడుతూ ఉండగా ఒక అమ్మాయి విసురుగా రూమ్ లో నుండి బయటకు వస్తూ నాకు ఢీ కొట్టింది. తనకు సారీ చెప్పబోతుండగా తనే నాకు నా వైపు చూస్తూ సారీ చెప్పింది. నేను ఆ అమ్మాయి వైపు చూడగానే నీలి కళ్లతో ఎంతో కాన్ఫిడెంట్ గా నా వైపు చూస్తూ ఇట్స్ ఓకే సార్. ఐ యాం ఆల్సో సారీ అనింది. నేను అటు చూడగానే అంతలో ప్రిన్సిపాల్ మా దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి ఈరోజు మన కాలేజీలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ గా చేరింది. తన పేరు పరిమళా శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంతకుముందు పులివెందుల జేఎన్టీయూలో పనిచేసింది. ఇప్పుడు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని మన దగ్గర చేరింది అని చెప్పాడు. నేను హాయ్ అని విష్ చేయగానే తను కూడా హలో సార్ అంటూ పలకరించింది. ఇక ఆ వారం అంతా మా స్టాఫ్ కు ఒక్క క్షణం ఆలోచించుకోవడానికి కూడా టైం లేనంతగా మేమందరం బిజీ అయిపోయాం. అప్పటికే మా ఇంట్లోని స్వాతి నక్షత్రం నన్ను దెప్పుతూ ఉంది....నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? మీ కాలేజీ ని పెళ్లి చేసుకున్నావా? చూడబోతే కాలేజే నీ మొదట పెళ్ళాం! నేను నీకు రెండే పెళ్ళాన్ని! అని ఒకటే నసుగుడు. అర్థరాత్రి కి కానీ ఇల్లు నీకు కనిపించడం లేదు. మళ్ళీ పొద్దున్నే బయలుదేరడం అని ఒకటే నస. తను ప్రేమతో అనే మాటలకు పైకి నేను మొహం విసుగ్గా పెట్టాను....కానీ లోపల చెప్పలేని ఆనందం. మొత్తానికి ఎలాగో మేము జేఎన్టీయూ విజిట్ సక్సెస్ చేసాము. కాలేజీ లోని కోర్సెస్ కి మరొక ఐదేండ్లు అప్రూవల్ వచ్చేసింది. మా ప్రిన్సిపాల్ ఆరోజు మాకందరికీ పార్టీ ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్, స్టాప్ అందరమూ కలివిడిగా నవ్వుకుంటూ స్టూడెంట్స్ పాటలు డాన్స్ తో హోరెత్తిస్తుంటే మా ప్రిన్సిపల్ మా కోసము ఏర్పాటు చేసిన ప్రముఖ మయూరి హోటల్ బఫే కడుపునింపేసింది. ఆ టైంలో ఎందుకో ఆ నీలి కళ్ళ సుందరి నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది. బఫే లో నేను ఎక్కడ నిలిచి ఉంటే నాకు ఒక అడుగు దూరంలో నిలుచుని అటు ఇటు చూస్తూ ఉండడం. లేదంటే ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం. నేను క్యాజువల్ గా తీసుకున్నా. ఎలాగైనా ఈ వారం లీవ్ పెట్టి మా ఫ్యామిలీని స్మాల్ టూర్ తీసుకెళ్లాలి అనుకున్నాను. అదే మాట ప్రిన్సిపాల్తో చెప్పి తర్వాత నాలుగు రోజులు లీవ్ పెట్టాను. ఆ నాలుగు రోజులు మా స్వాతి నక్షత్రం సంతోషము మా పిల్లలు ఆనందం పట్టలేకపోయాను. అందరం కలిసి అమ్మమ్మ ఇల్లు, నానమ్మ ఇల్లు, మామయ్యలు అత్తమ్మలు ఇక దూరపు చుట్టాల ఇండ్లు అన్ని చుట్టేసి ఆనందం మూట కట్టుకొని ఇంటికి వచ్చాము. తర్వాత రోజు నేను కాలేజీకి వెళ్ళగానే స్టాఫ్ రూమ్ లోకి అడుగు పెట్టగానే నీలి కళ్ళ సుందరి వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చుంది. ఎప్పుడో ఏదో పోగొట్టుకున్నట్టు నన్ను ఆపకుండా చూడడం మొదలు పెట్టింది. నాకెందుకో ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చొని నన్ను అలాగే చూస్తూ ఉంటే ఎంతో ఇబ్బంది తో.... "అమ్మా క్లాస్ కి వెళ్లకుండా ఇక్కడ ఉన్నావు. మీ క్లాస్ కు టైం అయింది " అని చెప్తున్నా.... ఆమె వినిపించుకోకుండా "నేను మీతో మాట్లాడాలి" అని అంది. నా వైపు సూటిగా చూస్తూ చెప్పింది...."నేను మా తల్లి తండ్రులకు ఏకైక సంతానాన్ని. మా నాన్నగారు రెండు నెలల క్రితం చనిపోయారు. మా అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు మా తాతయ్య నా పేరు మీద పెట్టిన ముప్పై లక్షలు ప్రాపర్టీ ఉంది. నా దగ్గర ఐదు లక్షలు క్యాష్ ఉంది. మా అమ్మ నాకోసం ముప్పై తులాలు బంగారం కొని పెట్టింది". నేను నీలి కళ్ళ సుందరి వైపు చూసి "ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అమ్మ" అన్నాను. ఆమె వెంటనే స్ట్రెయిట్ గా నా వైపు నా కళ్ళల్లోకి చూస్తూ "నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అనింది. వెంటనే తల పైన పిడుగు పడినట్టు భయపడిపోయారు. ఏంటమ్మా అలా అంటున్నావు? నాకు పెళ్లయింది.నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా ప్రవర్తన ఏమైనా నీ పట్ల నీకు అలా అనిపించేటట్టు చేసిందా అని అంటూ....ఆమె వైపు చూసి... "నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కుటుంబంతో " అన్నాను. " అది కాదు సార్ . మీరు చాలా డీసెంట్. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయి వెనక ఉన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కాలపు అబ్బాయిల మీద నాకు నమ్మకం లేదు. మొదటి రోజు మిమ్మల్ని చూడగానే నాకు మీ మీద ప్రేమ పుట్టింది. మిమ్మల్ని రెండో పెళ్లి అయినా చేసుకుంటాను సార్. మీ కుటుంబానికి ఏ విధమైన ఇబ్బంది కలిగించను. నాకు మీరు అంటే ఇష్టము" అనింది వెంటనే. "ఏం అంటున్నావు అమ్మా. నువ్వు చాలా చిన్న పిల్లగా ఉన్నావు. నీకు లోకజ్ఞానం లేనట్టుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? మనిద్దరికీ చాలా వయస్సు తేడా ఉంది. నాకు పెళ్లి అయ్యి బిడ్డలు ఉండేవాడిని. నేను నా భార్య బిడ్డలకి అన్యాయం చేయను . నీ వయసుకు తగ్గ వారిని చూసి పెళ్లి చేసుకో అమ్మ" అన్నాను. నేను అలా అంటూ ఉంటే ఆమె నా వైపే దీనంగా చూస్తూ కన్నీరు కారుస్తూ "నేను అందంగా లేనా" అని అడిగింది. "అయ్యో అమ్మ. నీకేం అమ్మ.... నువ్వు చాలా అందంగా ఉన్నావు. మంచి చదువు ఉంది. ఆరోగ్యంగా ఉన్నావు.ఆస్తి ఉంది. నీవు పసి బిడ్డవు. నీకు మంచి కుర్రాడు వచ్చి నీ భవిష్యత్తు బాగుంటుంది అమ్మ" అన్నాను.....అప్పుడు చూసాను ఆ నీలి కళ్ళల్లో క్రోధం. కోరి వచ్చిన వనిత. కాదనగానే ఆమెలో కోపం. "నేను వేరొకరిని చేసుకోను. నేను మిమ్మల్నే చేసుకుంటాను" అంటూ ఉంటే, నేను భయపడి అటు వెళ్తున్న మా అటెండర్ సుబ్రహ్మణ్యాన్ని కేకేసి పిలిచాను. అప్పుడు నీలి కళ్ళ సుందరి ఇంకేం మాట్లాడాలో తెలియక సుబ్రహ్మణ్యం నా దగ్గరకు రాగానే లేసి వెళ్లిపోయింది. సుబ్రహ్మణ్యం కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. చూడు సుబ్రహ్మణ్యం నా ఆఫీస్ రూమ్ ముందు నువ్వు స్టూల్ వేసుకుని కూర్చో. నేను ఎవరిని లోపలకు పంపమంటే వాళ్ళ ను మాత్రం నా దగ్గరికి పంపు..... నా పర్మిషన్ లేక ఎవరు నన్ను కలవడానికి లేదు అని అంటూ ఉంటే సుబ్రహ్మణ్యం నాకేం జరిగిందో అర్థం కాకుండా....ఎప్పుడు కోపం రాని సార్ కి ఎందుకు కోపం వచ్చిందో అనుకుంటూ, సరే సార్ అని తలూపుతూ మాస్టాఫ్ రూమ్ ముందు స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. నీలి కళ్ళ సుందరి నన్ను వదిలిపెట్టమ్మా తల్లి అనుకున్నాను ఆ రోజు. ఆమె మరుసటి రోజు కూడా నన్ను కలవాలని వచ్చినా....సార్ బిజీగా ఉన్నారు అని సుబ్రమణ్యం పంపించేసేది చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత రోజు మా స్వాతి నక్షత్రాన్ని పుత్ర పౌత్రిక సమేతంగా నేను కాలేజీకి తీసుకెళ్లి మా స్టాఫ్ అందరికీ పరిచయం చేశాను.... నీలి కళ్ళ సుందరి కి ప్రత్యేకంగా. తర్వాత వారం నుంచి నీలి కళ్ళ సుందరి మా కాలేజీకి రావడం మానేసింది. నాకు మొహం చూపలేక లేక ఆమెను వరించడానికి నీల మేఘశ్యాముడు వచ్చాడో? ఏదైతేనేం నా ఏకపత్ని వ్రతానికి భంగం కలగకుండా నన్ను నేను కాపాడుకున్నాను.ఏమైనా ఆ అమ్మాయిది స్వచ్ఛమైన ప్రేమ. ఎక్కడున్నా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని నేను కోరుకున్నాను. -- డా. బొబ్బు హేమావతి

మరిన్ని కథలు

Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్
Jeevinchu
జీవించు
- B.Rajyalakshmi