ది పోస్ట్ - వెంకట నాగేంద్ర మాగంటి

The post

రాఘవయ్య ఆరోజు ఉదయమే లేచాడు. స్నానాదులు చేసి భోజనం చేశాడు.ఆరోజు ఆయన ముఖం మీద ఆందోళన తాండవం చేసింది. ఆయన ఎందుకు అంత ఆందోళనలో ఉన్నాడో ఆయన సతీమణి సావిత్రికి అర్థం కాలేదు. రాఘవయ్య ఏదో విషయం మీద అనర్గళంగా ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో సావిత్రికి అర్థం కావట్లేదు. అలా కొంతసేపు దీర్ఘాలోచన తర్వాత ఆయన బీరువా సరుగులోని ఉత్తరాన్ని తీసుకున్నాడు. అప్పుడు అర్థమైంది సావిత్రి కి విషయం. ఆయన ఆ ఉత్తరాన్ని, మళ్లీ అదే ఉత్తరం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం రాసిన ఉత్తరం అది. ఐదు సంవత్సరాలుగా దాచిన ఉత్తరం అది. ఆ ఉత్తరాన్ని ఇప్పటికీ పోస్ట్ చేయలేదు. నెలకోసారైనా ఆ ఉత్తరాన్ని తీసి రాఘవయ్య చదువుకుంటాడు. ఆరు మాసాలకోసారైనా ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయడానికి పోస్టాఫీసు వరకు వెళ్లి, పోస్ట్ చేయకుండానే తిరిగి వస్తాడు. “ఇలా అప్పుడప్పుడు జరిగే తతంగమే ఇది” అనుకొని వంటగదిలోకి పోయి పనులు చేసుకుంటుంది సావిత్రి. ఆ ఉత్తరాన్ని పట్టుకొని బయటికి వచ్చాడు రాఘవయ్య. బయట నుండి వంటగదిలోకి వినిపించేలా “ఏమెవ్ నేను అలా వెళ్లి వస్తా” అని రాఘవయ్యా గట్టిగా అరుస్తాడు. దానికి సావిత్రి “సరే జాగ్రత్తగా వెళ్ళిరండి” అని రాఘవయ్య అంత గట్టిగా కాకపోయినా బయటకి వినబడేలా చెబుతుంది. గేటు దాటి రోడ్డు మీద అడుగులు వేస్తూ నడుస్తున్నాడు రాఘవయ్య. అటుగా వెళుతున్న ప్రసాదరావు ఉత్తరం పట్టుకుని నడుస్తున్న రాఘవయ్య పలకరిస్తాడు. “ఏమండోయ్ రాఘవయ్య గారు ఎటువైపు నడక ?” “ఇక్కడికే చిన్న పని ఉండి బయలుదేరా” “అయ్యబాబోయ్ చిన్న పనంటారేంటండి ? పోస్ట్ చేయడానికి వెళ్తుంటే” ప్రసాదరావు వ్యంగ్యంగా ఆ మాట అన్నకూడా ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయటం రాఘవయ్యకు చాలా పెద్ద విషయం. దానికి కారణం ఆ ఉత్తరం పైన ఉన్న చిరునామా, ఆ ఉత్తరం లోపల ఉన్న విషయం. ఐదు సంవత్సరాల నుండి రాఘవయ్యను ఇవే పోస్ట్ చేయకుండా ఆపుతున్నాయి. ఏదోకటి చెప్పి ప్రసాదరావు నుండి తప్పించుకోగలిగాడు రాఘవయ్య. దారిలో ఇంకెవరికి ఆ ఉత్తరం కనబడకుండా తలపాగ లో పెట్టుకుని తలకు చుట్టేసుకున్నాడు. మెల్లగా నడుచుకుంటూ పోస్టాఫీసుకు వచ్చేసాడు. అక్కడ పోస్ట్ బాక్స్ ఈసారైనా ఉత్తరం వెయ్యి అన్నట్టు జాలిగా చూస్తుంది. ఆ ఉత్తరాన్ని తలపాగా ఉండి తీశాడు. అక్కడే కూర్చొని ఉన్న పోస్ట్ మాన్ ఈసారైనా ఉత్తరం వేస్తాడేమో అని ఆశగా చూస్తున్నాడు. రాఘవయ్య మదిలో ఆలోచనలు తరంగాలల పరిగెడుతున్నాయి. మితిమీరిన ఆలోచనలకు సంకేతంగా చమటలు శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. అసలు ఆ ఉత్తరంలో ఏముందో పోస్ట్ మాన్ కు అర్థం కాలేదు. “ఎందుకు అతను పోస్టు చేయలేకపోతున్నాడు ? ఎందుకు అతను పోస్ట్ చేయలేకపోతున్న చేయడానికి ప్రయత్నిస్తున్నాడు” అన్నది పోస్ట్ మాన్ కు అంతు పట్టని విషయం. అక్కర్లేని విషయం కూడాను. రాఘవయ్య ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లో వేయకుండా అక్కడే పక్కనున్న బల్లమీద కూర్చున్నాడు. ఆ ఉత్తరాన్ని పక్కనే పెట్టుకుని దాని వంక చూస్తున్నాడు. అదంతా దూరం నుండి చూస్తున్న పోస్ట్ మాన్ కు ఆ బల్ల బరువు తెలిపే కాటాలాగా అనిపించింది. ఆ ఉత్తరం బరువుకు రాఘవయ్య తేలిపోతున్నట్టు కనిపించింది. రాఘవయ్య ఆలోచనల పరంపర ఇంకా ఆగలేదు. మనిషి నవ్విన తెలిసిపోతుంది, ఏడ్చిన తెలిసిపోతుంది. ఇలా మనిషి ఏం చేసినా తెలిసిపోతుంది. మానవుడు రహస్యంగా చేయగలిగేది ఆలోచించడం మాత్రమే. ఆరోజు అది కూడా తెలిస్తే బాగుండు అనుకున్నాడు పోస్ట్ మాన్. రాఘవయ్య ఉత్తరాన్నే చూస్తున్నడు. ఎలాగో ఎటు చూసినా తనకు అదే కనబడుతుంది. రాఘవయ్యకు మెల్లగా తలపోటు మొదలైంది. ఈ తలపోటు రాఘవయ్య టైం టేబుల్ లో ఒక భాగం అయిపోయింది. చదువుకునే సమయం, వ్యాయామం చేసే సమయం అలాగే తలపోటు తెచ్చుకొని భరించే సమయం. ఇలా ఐదు సంవత్సరాల నుండి తలపోటు టైం టేబుల్ లో భాగం అయింది. పోస్ట్ మాన్ కు విషయం అర్థమైంది. ఇంకా ఆ ఉత్తరాన్ని ఆయన పోస్ట్ చేయడు అని నిశ్చయించుకుని రాఘవయ్యా దగ్గరకు వచ్చాడు. “అయ్యా రాఘవయ్య గారు ఉత్తరాలన్ని తీసేసే టైం అయింది. మీరు ఉత్తరం వేయాలి అనుకుంటే వేసేయండి” అని పోస్ట్ మాన్ అన్నాడు. దానికి ఎం సమాధానం చెప్పాలో రాఘవయ్య కి తెలియలేదు. వేయలేకపోతున్నాడు. వెయ్యలేను అని చెప్పలేకపోతున్నాడు. పోస్ట్ మాన్ బాక్స్ తీసి అందులో ఉన్న ఉత్తరాలన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన గంటసేపటి తర్వాత మళ్ళీ ఆ ఉత్తరాన్ని తలపాగాలో పెట్టుకుని తలకు చుట్టుకుని ఇంటిముఖం పట్టాడు. రిక్తహస్తాలతో రాఘవయ్య రావడం చూసి ఆశ్చర్యపడింది సావిత్రి. కలియుగంతములో కల్కిని చూసినంత ఆశ్చర్యపడింది. “ఏంటండీ పోస్టు చేశారా ?” అని అడగగానే రాఘవయ్య తలపాగా నుండి ఉత్తరం తీసి ఇచ్చి బీరువా సరుగులో పెట్టు అన్నాడు. అప్పుడు విషయం అర్థమైంది సావిత్రి కి. బీరువా తలుపు తెరచి ఉత్తరన్ని భద్రంగా పెట్టేసింది. మరుసటి రోజు సావిత్రి సమేతంగా రాఘవయ్య అమ్మవారి గుడికి వెళ్ళాడు. లావుగా ఉన్న కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ప్రార్థించాడు. దక్షిణ కింద 116 రూపాయలను తీసి హుండీలో వేయబోయాడు. ఆ హుండీ పోస్టు బాక్సు లాగా ఉంది. వెంటనే ఆ ఉత్తరం తాలూకు ఆలోచనలు వచ్చేసాయి. దక్షిణ కూడా ఇవ్వకుండా వెనక్కి వచ్చేసాడు. ఉత్తరం దేని గురించి, ఎవరికోసమో తెలుసు గాని అసలు ఆ ఉత్తరంలో పూర్తిగా ఏముందో సావిత్రికి కూడా తెలియదు. ఆ ఉత్తరం ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి వివరణ, క్షమాపణ. మరి దాన్ని పోస్ట్ చేయడానికి రాఘవయ్యను ఏమాపుతుంది ? మర్యాద, స్థాయి, ప్రతిష్ట ఇంకా ఎన్నో. అందరూ తప్పు చేయడానికి ఆలోచించరు గాని క్షమాపణ కోరడానికి మాత్రం ఆలోచిస్తారు. తప్పు చేస్తే స్థాయి తగ్గిపోదు గాని, క్షమాపణ కోరితే స్థాయి తగ్గిపోద్ది అనుకుంటారు. రాఘవయ్య కూడా ఇలానే అనుకుంటున్నాడు. క్షమాపణ కోరితే తాహతు తగ్గిపోద్ది అని భావిస్తున్నాడు. క్షమాపణ కోరలేని వారు తాము చేసిన తప్పు చిన్నదని అనుకుంటారు. ఎవరికి ఏం అవ్వలేదని, ఏం పర్లేదు అని అనుకుంటారు. కానీ రాఘవయ్య అలా అనుకోవడానికి లేదు. తాను చేసిన తప్పు చిన్నది అనుకుంటే హిందూ మహాసముద్రం కూడా చిన్నదే. ఎవరెస్ట్ పర్వతాలు కూడా చిన్నవే. ఆఖరికి ఆకాశం కూడా చిన్నదే. రాఘవయ్యకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆడపిల్ల లేదని, మూడేళ్ల ఆడపిల్లలని దత్తత తీసుకుంది రాఘవయ్య తల్లి సీతమ్మ.ఆ చిన్నపిల్లలకి యశోద అని పేరు పెట్టుకుంది. రాఘవయ్య అతని చెల్లి యశోద కలిసి పెరిగారు. ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఇద్దరూ కలిసి చదువుకునేవారు. వారి మధ్య ఉన్న బంధాన్ని, ఆప్యాయతను చూసి సీతమ్మ మురిసిపోయేది. కానీ వయసు పెరిగేకొద్దీ బంధం భారం అయింది. ఆప్యాయత తగ్గిపోయింది. ఆస్తినంతా యశోద తన్నుకు పోతుందని భయం వేసింది రాఘవయ్యకి. పేగు తెంచుకుని పుట్టిన తనకు, పక్కింటి నుంచి వచ్చిన యశోదకు ఒకే రకమైన ప్రాధాన్యత ఇవ్వడంతో యశోద మీద ద్వేషం పెరిగింది రాఘవయ్యకి. సొంత తోబుట్టువులకే ఆస్తి గొడవలు సహజం. అలాంటిది వీరి విషయంలో ఆస్తి గొడవలు రావడం విచిత్రం కాదు. మెల్లగా యశోదన దూరం పెట్టడం మొదలుపెట్టాడు రాఘవయ్య. కొన్ని సంవత్సరాలకి రాఘవయ్య యశోదకు పెళ్లి కుదిరిచ్చాడు. ఈ పెళ్లి కుదిరిచ్చింది చెల్లి మీద ప్రేమతోనో, అన్నయ్యనే బాధ్యతతోనో కాదు. వేరేవాడైతే కట్నం కింద సగం ఆస్తి ఇవ్వాలని, కట్నం తీసుకొని, మానసిక పరిస్థితి సరిగలేని యువకుడ్ని తెచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి పేరుతో యశోదను చాలా దూరం పంపించేశాడు. తల్లి కూతుర్లను విడదీశాడు. సంక్రాంతికో దీపావళికో యశోద వచ్చిన, ఇష్టం లేనట్టు ప్రవర్తించి అగౌరపరిచేవాడు. వచ్చినప్పుడు నీరసంగా స్వాగతించేవాడు. వెళ్లేటప్పుడు ఉత్సాహంతో సాగనంపేవాడు. భోజనం కూడా వేళదాటాకే వడ్డించేవాడు. ఇక మర్యాద సంగతి చెప్పనక్కర్లేదు. అన్న ఉద్దేశం యశోదకు అర్థమయి అప్పుడప్పుడు రావడం కూడా మానేసింది. అలా యశోద రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. కూతురు రాకపోయినా సీతమ్మ మాత్రం కూతురింటికి నెలకొసారైనా వెళ్ళేది. వెళ్లేటప్పుడు మామిడి పండ్లు, కూరగాయలు బుట్టలు బుట్టలు తీసుకువెళ్లేది. రాఘవయ్య ఏదో కారణం చెప్పి తల్లిని ఆపడానికి ప్రయత్నించేవాడు. కాని సీతమ్మ ఆగేది కాదు. రాఘవయ్యా ఎంత చెప్పినా వినకుండా కుతురుంటికి వెళ్ళేది. కూతురితో గంటలు గడిపేది. సీతమ్మకు కొడుకు ఇంట్లో అసలు నిద్ర పట్టేది కాదు. కూతురింట్లో మాత్రం ప్రశాంతంగా నిద్రపోయేది. చాలా సంవత్సరాల తర్వాత ఓ రాత్రి రాఘవయ్య ఇంట్లో సీతమ్మ నిద్రపోయింది కాకపోతే శాశ్వతంగా. ఆరోజు ఉదయపు కాంతి సీతమ్మ మీద పడలేదు. ఆరోజు చల్లని గాలి సీతమ్మకు తగల్లేదు. సీతమ్మ మరణ వార్త ఊరంతా వ్యాపించింది. రాఘవయ్యా ఇంటి ముందు ఎర్రటి టెంట్లను వేయించాడు. సీతమ్మను చివరిసారి చూడటానికి చాలామంది వచ్చారు. కొంతమంది సీతమ్మ ఎలా బతికిందో చెబుతున్నారు. ఇంకొంతమంది సీతమ్మ ఎందుకు చనిపోయిందో అడుగుతున్నారు. ఒకవైపు ఏడుపులు, మరోవైపు పూర్తిగా నిశ్శబ్దం. ఇలా ఒక చావు ఇల్లు ఎలా ఉండాలో అలానే ఉంది. సీతమ్మ మరణ వార్త యశోదకు చేరింది. ఆ వార్త విన్న వెంటనే యశోద గుండె ఆగిపోయింది. వెంటనే సీతమ్మని చూడడానికి బయలుదేరింది. యశోద ఉన్న ఊరి నుండి రాఘవ ఇంటికి చేరాలంటే ఆరు గంటలు ప్రయాణం చేయాలి. యశోద రాఘవయ్యకి ఫోన్ చేసి సాయంత్రం కల్లా వచ్చేస్తాను అని ఏడుస్తూ చెప్పింది. తన తల్లిని యశోద చివరిసారి చూడటం రాఘవయ్యకు నచ్చలేదు. సీతమ్మ యశోద దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఆపడానికి ప్రయత్నించేవాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా వారిద్దరూ కలవడాన్ని ఆపలేకపోయాడు. ఈసారి మళ్లీ అతనికి వారిద్దరిని కలవకుండా ఆపే అవకాశం వచ్చింది. ఈసారి ఆపగలిగితే ఇంకా ఎప్పటికీ విజయం తనదే అనుకున్నాడు. సాయంత్రానికి ముందే దహన కార్యం చేయాలని సంకల్పించాడు. ఊరి వారందరూ ఇంకా యశోద రాలేదు అని వారించిన వినిపించుకోకుండా అంత్యక్రియలు జరిపించేసాడు. కొంతసేపటికి యశోద బండి దిగింది. ఎటు వారు అటు వెళ్లిపోవడం చూసింది. అక్కడ ఉన్న పాలేరుని “అమ్మ ఎక్కడుంది ?” అని పైకి కూడా సరిగ్గా రాని మాటలతో అడిగింది. జరిగిందంతా చెప్పాడు పాలేరు. అప్పుడు యశోదకి కోపం వచ్చింది. కోపం కాదది బాధ. తన తల్లిని కడసారి కూడా చూసుకోలేకపోయాను అనే బాధ. ఆ బాధతో నేరుగా రాఘవయ్య దగ్గరికి వెళ్లి “ఎందుకిలా చేశావ్ ?” అని కన్నీళ్ళ కళ్ళతో అడిగింది. దానికి రాఘవయ్య ఏం మాట్లాడలేదు. అప్పుడు యశోద “నువ్వు కావాలనే చేశావ్. అమ్మని చివరిసారి చూడకుండా చేసావ్. అమ్మని చివరిసారి ముట్టుకోకుండా చేసావ్. అమ్మ స్పర్శ తగలకుండా చేసావ్. ఆవిడతో నేను చివరిగా చెప్పాలనుకున్నది చెప్పకుండా చేసావ్. ఆవిడకి చివరిసారి కృతజ్ఞత చెప్పకుండా చేసావ్. నా చూపులో ఆమె రూపం నిలిచే చివరి అవకాశం లేకుండా చేసావ్” అని రాఘవయ్య కాలర్ పట్టుకుని ఏడుస్తూ మాట్లాడింది. రాఘవయ్యకు తన కాలర్ పట్టుకున్నందుకు కోపం ముంచుకొచ్చింది. యశోదను “అసలు ఎవరు నువ్వు ? ఎవరికి పుట్టావు ?అసలు నువ్వెందుకు మా అమ్మని చివరిసారి చూడాలి ? నువ్వు బజార్లో పుట్టిందనివి. వెళ్లి మీ అమ్మ ఎవరో తెలుసుకో, తెలుసుకొని చివరిసారి కాదు జీవితాంతం చూసుకో” అని అనరాని మాటలు అన్నాడు. ఆ మాటలకు యశోద మనసు విరిగిపోయింది. ఇంకో మాట మాట్లాడకుండా వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. యశోద వెళ్ళిపోతుంటే అందరూ యశోదనే చూస్తున్నారు. రాఘవయ్యా కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలకు రాఘవయ్యకు తప్పు చేశానన్న పశ్చాతాపం పుట్టింది. రాఘవయ్య చెల్లి చేసిన త్యాగాలను అప్పుడే గుర్తించాడు. మానసిక పరిస్థితి బాలేని వాడ్ని తెచ్చి చేసుకో అంటే మరోమాట మాట్లాడకుండా చేసుకుంది. ఆస్తిలో పావు వంతు కూడా ఇవ్వకపోయినా ఊరుకుంది. అలాంటి యశోదకు తల్లి ఆఖరి చూపుని కూడా దూరం చేశాడని, నలుగురిలో బజార్లో పుట్టావు అన్నాడని తనలో తాను బాధపడ్డాడు. తను చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి రాఘవయ్య యశోద ఊరు వెళ్లాడు. కానీ బస్సు దిగలేకపోయాడు. తనలో ఉన్న అహం, తన స్థాయి, తన ప్రతిష్ట “తప్పు చేశాను” అని చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. తప్పు చేసినంత సులభం కాదు కదా తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం. రాఘవయ్య తప్పు ఒప్పుకోలేక అదే బస్సులో వెనక్కి వచ్చేసాడు. ఇంటికి వెళ్ళాక ప్రత్యక్షంగా చెప్పలేకపోయినా రాతపూర్వకంగా అయినా చెప్పాలని క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి ఇప్పుడు ఐదేళ్లు. రాఘవయ్య ఇప్పటికే తప్పు ఒప్పుకోలేకపోతున్నాడు. అలా అని మర్చిపోలేకపోతున్నాడు. కొన్ని రోజులకి రాఘవయ్యకు పట్టణం నుండి కాల్ వస్తుంది. తన కొడుక్కి యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది. రాఘవయ్య కంగారుపడుతూ భయపడుతూ బాధపడుతూ ఏమైందని ఆలోచిస్తూ అతి కష్టం మీద పట్టణం చేరుకుంటాడు. రాఘవయ్యా కొడుక్కి పెద్దగా దెబ్బలు తగల్లేదు. బానే ఉన్నాడు. అది చూసి ఊపిరి పీల్చుకుంటాడు రాఘవయ్య. కొడుక్కి ఏమైందో అని క్షోభతో చేసిన ప్రయాణం తలుచుకుంటే భయం వేసింది అతనికి. మనవాళ్ళకి ఏమైనా అయినప్పుడు వాళ్ళని చూడడానికి మనం చేసే ప్రయాణం చాలా దారుణమైనది. బాధ ఓవైపు, ఏం జరిగిందో అని భయం మరోవైపు, ఏం జరగకూడదని ప్రార్ధన ఇంకోవైపు. “అలాంటి ప్రయాణం ఎంతో దారుణమైనది” అని అనుకున్నాడు రాఘవయ్య. అప్పుడే రాఘవయ్యకి గుర్తొచ్చింది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం యశోద కూడా ఇలాంటి ప్రయాణమే చేసింది. 6 గంటలసేపు తల్లి గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ ప్రయాణించింది. కానీ తల్లిని చివరిసారిగా చూసుకోలేకపోయింది. ఎంతో క్షోభను అనుభవించింది. యశోద పడిన కష్టాన్ని రాఘవయ్యా ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు. వారం రోజులకు రాఘవయ్యకు తిరిగి ఉత్తరం వచ్చింది. సమాధాన ఉత్తరం వచ్చింది అనుకున్నాడు. యశోద తన క్షమాపణను అంగీకరించిందో తిరస్కరించిందో అని ఆలోచిస్తూ ఉత్తరాన్ని తీసుకున్నాడు. కానీ చూస్తే అది రాఘవయ్య రాసిన ఉత్తరమే. అడ్రస్సు తప్పు అవడంతో ఉత్తరం వెనక్కి వచ్చింది. అడ్రస్సు తప్పు అవడం ఏంటో రాఘవయ్యకు అర్థం కాలేదు. ఈసారి ఉత్తరాన్ని తానే స్వయంగా ఇద్దామనుకొని బస్సు ఎక్కాడు. యశోద ఊరు వెళ్లి బస్సు దిగాడు. యశోద ఇంటివరకు నడిచాడు. అక్కడ యశోద ఇల్లు సగం కూలిపోయి ఉంది. పక్కింటి వాళ్ళని “ఏవండీ ఇక్కడ యశోద అని” అడిగాడు. “ఆవిడ చనిపోయి మూడు సంవత్సరాలయింది గా” అని సమాధానం వచ్చింది. రాఘవయ్యకి మాట రాలేదు. యశోద చనిపోయి మూడు సంవత్సరాలయింది. యశోద బతికున్నప్పుడు క్షమాపణ చెప్పలేకపోయాడు. ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. జీవితాంతం తప్పు చేశాను అనే భారాన్ని మోస్తూ బతకాలి రాఘవయ్య. తప్పు చేస్తే అది తప్పని తెలిసిన వెంటనే క్షమాపణ కోరడం మంచిది. ఎందుకంటే తర్వాత వారికి ఏదైనా అయితే జీవితాంతం ఆ విచారాన్ని మోయాలి. ఆ ఉత్తరం పట్టుకుని వెనక్కి వచ్చేసాడు రాఘవయ్య. సీతమ్మని చూడకుండా యశోదని అపలనుకున్నడు రాఘవయ్య కానీ ఇప్పుడు సీతమ్మ యశోదలు ఒకే చోట ఉన్నారు ఎవరు విడదీయలేని చోట.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు