స్పెషల్ - ఇందుచంద్రన్

Special

“అన్నా రెండు స్పెషల్ హాఫ్ బాయిల్ ఎగ్ ఇంకా చికెన్ రోస్ట్ అంతే కదా ? అన్నాడు బార్ లో పని చేసే అబ్బాయి నోట్ చేసుకుంటూ.

అతను వెళ్ళిపోగానే రెండు గ్లాసుల్లోకి మందుని పోస్తూ

“ఇక్కడ మందుకన్నా మందులోకి స్టఫ్ బావుంటుంది రా...అందుకే ఇక్కడికి రమ్మన్నా అన్నాడు కార్తీక్ నవ్వుతూ

వాడెప్పుడూ అంతే ఒక పెగ్ కే రెండు ప్లేట్ల స్టఫ్ ఖాళీ చేసేస్తాడు.

హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ని సగం అరిటాకులో ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చాడు దాని మీద పలచగా చల్లిన మిరియాల కారం పొడి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.గార్నిష్ చేయడానికి కొన్ని కొత్తిమీర కాడలు ఒకటి అర టమాట ముక్కలు పైన వేసి ఉన్నారు అదేనేమో బహుషా స్పెషల్ అంటే !

స్పెషల్ అంటూ ఏం ఉండదు, అది స్పెషల్ అని మనం ఫీల్ అవడంలోనే అంతా ఉందన్నట్టు అనిపించింది.

మందు మధ్యలో స్టఫ్ కూడా అయిపోయింది కాని నాకెందుకో అంత స్పెషల్ గా అయితే అనిపించలేదు.

స్పెషల్ అన్న పదం విన్నప్పటి నుండి అక్కలిద్దరి గొంతు నాకు చెవిలో ఎక్కడో వినిపిస్తుంది.

“వాడికి మాత్రమెందుకు స్పెషల్ ? వాడు కొడుకని రేపు నిన్ను వాడే చూసుకుంటాడానా..?” అని అమ్మతో ఎప్పుడూ వాదులాడుతూ ఉంటారు.

ఆ మాటలు గుర్తు రాగానే నా మొహం మీద అనుకోకుండా చిరునవ్వు విరిసింది.

అమ్మ కి నేనంటే ఎప్పుడూ స్పెషలే మరి !

రూమ్ కి వెళ్ళి పడుకున్నాను. ఎందుకో ఏవేవో గుర్తొస్తున్నాయి.

కళ్లు అవంతట అవే మూసుకుని పోతున్నాయి.

******

అక్కోళ్లొచ్చే టైమ్ అయ్యింది రా....నువ్వు గబానీ తిను అంటూ అమ్మ గరిటలో చేసిన కోడి గుడ్డు ఆమ్లెట్ ని ప్లేట్ లో పెట్టింది.

మూడు మడతల్లోఆమ్లెట్ నోట్లో కి కుక్కేసాను. అప్పటికే వాళ్ళిద్దరూ ఆమ్లెట్ వాసన ని పసిగట్టేసారు.

లోపలికొస్తూ “పొదుగులో ఉండాల్సిన గుడ్లన్ని వీడి పొట్టలోకి వెళ్తున్నాయి అంటూ పెద్దక్క నా వైపు చూస్తూ.

“నాయనొచ్చాక చెప్తా ఉండూ అని చిన్నక్క అమ్మ వైపు చూసింది.

అది కాదే మొన్న వీన్ని డాక్టరు దగ్గరికి తీస్కపోతే ఏం చెప్పినాడో తెలుసా?వాడికి బలమొచ్చేదానికి కోడి గుడ్లు పెట్టమన్నేరు, ఈక్ గా ఉండాడంట అని చెప్తూ ఉంది.

వాలిద్దరూ నమ్మినమ్మనట్టు చూస్తున్నారు.

నిజానికి డాక్టర్ అలా ఏం చెప్పలేదు. కాని వాళ్ళిద్దర్నీ ఒప్పించడానికి మా అమ్మ అలా చెప్పిందంతే.

అమ్మ కి అక్కలంటే కూడా ఇష్టమే కాని నేనంటే ఎందుకో ఇంకొంచెమెక్కువ అన్నట్టు అందరికీ స్పష్టంగా కనిపించేస్తూ ఉంటుంది.

అలా అని అతి గారాబం కూడా కాదు. అప్పుడప్పుడు చింత బరికెలతో వీపు చిట్లిపోయేది. అది దొరకనప్పుడు చేత్తోనే వీపు విమానం మోత మోగించేసేది.

మనకెప్పుడు ఏది ఇవ్వాలో అమ్మలకి బాగా తెలుసనుకుంటా !

ఇంకోసారి కూడా అలానే జరిగింది.

దోశ పిండి తక్కువయితే నాకో రెండు దోశలు ముందే చేసి నాకు పెట్టి మిగిలిన పిండిలో రవ్వ నూక వేసి దోశలు వేసింది.

చిన్నక్క ఎలాగోలా కనిపెట్టేసి తిననని మొండి కేసి కూర్చుంది.

చెప్పాలంటే ఆ రోజు నాన్న కూడా ఇంట్లో ఉన్నారు.

"చేస్తే ముగ్గురికి ఒకేలాగా చేసి పెట్టలేవా అని నాన్న కసురుకున్నాడు.

అంతటితో ఆగలేదు.ఆ తర్వాత కూడా ఇలాంటివి అపుడప్పుడూ ఇంట్లో జరుగుతూ ఉండేవి. కాని అమ్మ ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పి అక్కలిద్దరిని ఒప్పించేసేది.

మేం పెరుగుతున్న కొద్ది అక్కలిద్దరికీ అలవాటయిపోయిందో ఏమో గాని అమ్మతో వాదులాడే వాళు కాదు. కొన్నాళ్ల కి వాళ్లు అమ్మ లాగా మారిపోయారనిపించింది.

అక్కలిద్దరి పెళ్లిళ్లయ్యాక ఇంక ఇంట్లో మిగిలింది నేనొక్కడినే. అప్పుడప్పుడూ అక్కలిద్దరూ ఇంట్కొచ్చినప్పుడు అమ్మ ని ఓ కంట గమనిస్తూనే ఉంటూ

“అంతేలే.....మేం అడిగితే గాని చేసి పెట్టవు ఆ ఎదవ అడగకపోయినా చేసి పెడతావు? అని అంటూ ఉండేవాళ్ళు.

“మీకు కావాలంటే చేసి పెడతా గా, దానికెందుకే ఇంత రచ్చ అని అమ్మ ఏదో విధంగా వాళ్ళ నోర్లు మూయించేస్తుంది.

సిటీ కి వెళ్లాక కొన్ని రోజులు స్వయం పాకం తప్పలేదు. రోజు బయట ఫుడ్ తినలేక అప్పుడప్పుడూ రూమ్ లో చేసుకుని తినడం అలవాటు చేసుకున్నా. అమ్మ చేసినంత రుచిగా కాకపోయినా సమయానికి పొట్ట నిండిపోయేది అంతే.

ఇప్పుడు ప్రత్యేకించి తినాలన్న ఆసక్తి లేదు. ఆఫీస్ లోసమయానికి దొరికింది తినేయడమే లేదంటే వినడానికి స్టయిల్ గా ఉండా కొత్త రుచుల్ని ఆర్డరిచ్చి రుచి చూడటమే.

ఇప్పటికీ ఇంటికెళ్ళినప్పుడు అమ్మ నా కోసం స్పెషల్ గా చేసి ఎదురు చూస్తూ ఉండేది. తాగి ఇంటికెళ్తే దొరికిపోతానని ఆలస్యంగా వెళ్లి అందరూ పడుకున్నాక మిగిలింది తినేవాడికి. ఇంకొన్ని సార్లు ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ని కలుస్తాం కదా అన్నట్టు వాళ్లతో బయట తినేసేవాడిని.

అమ్మని చూసిన ప్రతి సారి ఏదో వెలితిగా అనిపించేది.

చిన్నప్పుడు రోజు రాత్రి ఆ రోజు చేసిన పనులన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్పేవాడిని.

అమ్మ ఆ కథలన్ని వింటూ నిద్రలోకి జారుకునేది. ఇప్పుడు అమ్మ అవసరాలు కొన్ని అక్క వాళ్లు చెప్పే వరకూ కూడా నాకు తెలిసేవి కాదు.

ఎప్పుడు అమ్మతో గడిపే సమయం లేదని అనుకునేవాన్ని కాని నేనే సమయాన్ని కేటాయించుకోలేదని చాలా రోజుల తర్వతా అర్థమయ్యింది.

ఇంతలో ఫోన్ మోగడంతో బలవంతంగా కళ్లు తెరిచి చూసాను.

"రే..చిన్నోడా అమ్మకి...అంటూ ఎక్కిళ్లతో ఏడుస్తూ మాట్లాడుతున్న అక్క మాటలు అసలు చెవిలోకి ఎక్కడం లేదు.

కొన్ని గంటల్లో హాస్పిటల్ కి చేరుకున్నాను.అక్కలిద్దరూ నాన్న పక్కన కూర్చుని ఉన్నారు.

డాక్టరొచ్చారు.

“సర్ అమ్మకి ? అన్నాను మెల్లగా

“నథింగ్ టు వర్రీ.....వయస్సైపోతుంది కదా ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆలోచించాలి అన్నాడు ఆయన వెళ్లిపోతూ.

*******

“ఇది అమ్మకి కారం దోశ విత్ నెయ్యి...నా స్పెషల్ దోశ అంటూ ప్లేట్ లో పెట్టి చేతికి అందిస్తున్నాడు జయ్.

“మరి మాకు... ? అంటూ వాళ్ల అక్క ఆటపట్టిస్తూ వచ్చింది.

“చూసావే...నా కొడుకు స్పెషల్ గా చేసినాడు అంది వాళ్ళమ్మ మురిసిపోతూ తింటూ

నిజం చెప్పాలంటే ఆ దోశ అంత రుచిగా ఏం అనిపించలేదు కాకపోతే తనకోసం చేసాడన్న ఆ ఆనందం అంత వల్ల స్పెషల్ గా అనిపించింది అంతే !

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు