(అతి) జాగ్రత్తపరుడు - మద్దూరి నరసింహమూర్తి

Athi jagrattaparudu

రాష్ట్ర ఉద్యోగి అయిన వామనమూర్తి పేరుకే వామనుడు. కానీ బుద్ధికి మాత్రం బృహస్పతి కాదండోయి, శుక్రాచార్యుడే – శుక్రాచార్యుని ‘సర్వ శాస్త్ర ప్రవక్తారం’ అని సంబోధిస్తారు కదా.

ఎడమ చేయి అలవాటు ఉన్న వారికి కల్పవృక్షంలాంటి కుర్చీని అంటిపెట్టుకొని, సర్కారు వారి కొలువు వెలగబెడుతున్న వామనమూర్తి (అతి) జాగ్రత్తపరుడు.

చాలా దూరం అలోచించి – ఒక చిన్న బ్యాంకులో భార్య పేరు మీద మాత్రమే ఖాతా తెరిపించి జాగ్రత్తపడ్డాడు.

అన్నీ బోధపరచి భార్యను ఒక్కదాన్నే బ్యాంకుకు పంపి, తాను ఆ సమయంలో ఆ బ్యాంకులో ఉండకుండా జాగ్రత్తపడి, బ్యాంకులో భార్య చేత ఖాతా తెరిపించేడు.

వామనరావు భార్య కపిల – పతిభక్తికి ప్రతీక. భర్త మాటకు ఎదురుచెప్పి ఎరుగని దొడ్డ ఇల్లాలు. భర్త ఏమి చెప్పినా అది ఎలా చెప్తే అలా ఆచరించే ఆదర్శపత్ని. అందుకే, తాను కోరుకున్నవిధంగా వామనరావు ఆమె చేత బ్యాంకు ఖాతా తెరిపించగలిగేడు.

అంత జాగ్రత్త పడడానికి కారణం – అతను కార్యాలయంలో ఉన్నప్పుడు మాత్రం ఎడమచేయినే వాడుతూ ఉంటాడు.

వామనరావుకి ఎడమచేయి బాగా దురద వేసినప్పుడు రాసుకున్న ‘ధనలక్ష్మీ మలాం’ ఇగిరిపోకుండా తన భార్య పేరు మీదన ఉన్నబ్యాంకు ఖాతాలో జమచేయించి వస్తూంటాడు.

అలా జమ చేయడానికి –

ఆ బ్యాంకులో ఒక ఉద్యోగిని చేరదీసి, తాను బ్యాంకులోనికి వెళ్ళేటప్పుడు, బ్యాంకులో ఉన్న సౌచాలయంలో మాత్రమే ఆ ఉద్యోగిని కలిసి, జమచేయడానికి తెచ్చిన మూట అతనికి ఇచ్చి, రసీదు సంపాయించుకొని త్వరగా వచ్చేసేవాడు. సొమ్ము జమచేయడానికి వాడవలసిన బ్యాంకు వారి కాగితం పూర్తి చేయడం సంతకం చేయడం కూడా అతని చేతనే చేయించేవాడు.

ఆవిధంగా సహాయం చేయడానికి, వామనరావు ఆ ఉద్యోగికి కొంత ముట్టచెప్పేవాడు. దాంతో వామనరావు ఎవరో తెలియకపోయినా, ఆ ఉద్యోగి కూడా మరలా ఈ ఆసామి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉండేవాడు.

బ్యాంకులో సొమ్ము జమ చేసేందుకు ---

ఇల్లు దాటగానే భార్యని తలనిండా ముసుగు కప్పుకొని కేష్ బేగ్ తో బ్యాంకుకు వెళ్ళనిచ్చి, మారు వేషంలో తాను ఆమె వెనుక వేరుగా వెళ్లి, కేష్ బేగ్ బ్యాంకులో ఉన్న సౌచాలయం ద్వారం దగ్గర భార్య నుంచి తీసుకొనే వాడు. జమచేసి రసీదు అందిన తరువాత తాను బయటకు వెళ్లిన కొద్ది సమయం తరువాత, భార్య వేరుగా ఖాళీ అయిన కేష్ బేగ్ తో ఇంటికి వెళ్ళేది.

ఖర్మకాలి తన అక్రమ ఆర్జనతో ఎప్పుడైనా ఎవరికయినా దొరికిపోయినా, తాను ఎడమ చేతితో అంతవరకూ ఆర్జించి భార్య ఖాతాల్లో జమ చేయించిన సొమ్ముకి తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకొనేందుకు, ఇంత జాగ్రత్తగా నడుచుకుంటూ, తన అక్రమ ఆర్జనని బాగానే పెంపొందించుకున్నాడు.

ప్రతీ బ్యాంకు వెలుపల డబ్బుతో వచ్చే వారి దగ్గరనుంచి ఆ డబ్బును ఏదో విధంగా హరించి కాజేసుందుకు దొంగలు తిరుగాడుతూ ఉంటారన్నది జగద్విదితమైన సత్యం.

ఒకరోజున – బ్యాంకులో జమచేయవలసిన సొమ్ము పెరిగిపోయింది. నాలుగు రోజులై సుస్తీగా ఉన్న భార్యని జమ చేయడానికి పంపేందుకు మనసు ఒప్పక, మారు వేషం వేసుకొని వామనరావు తానే కేష్ బేగ్ తో బయలుదేరేడు..

తన పద్దతిలో ఎప్పటిలాగే జమ చేయడం అయిన తరువాత, కేష్ బేగ్ ఖాళీగా ఉన్నదైనా -- అచ్చొచ్చిన సంచీ కదా అని -- జాగ్రత్తగా పట్టుకొని రాసాగేడు.

అప్పుడు హఠాత్తుగా 'హలో బ్రదర్' సినిమాలో ‘గిరిబాబుకి బాబూమోహన్ ఇచ్చిన సలహా’ గుర్తుకు వచ్చి ఆ కాష్ బాగ్ స్టైల్ గా ఊపుకుంటూ బయటకు వచ్చి తన స్కూటీ దగ్గరకు వెళ్లి ఆ కాష్ బాగ్ ని స్కూటీ కొక్కేనికి తగిలించి స్కూటీని తాపీగా బయలుదేరదీసేడు.

వామనరావు కాష్ బాగ్ తో బ్యాంకు లోపలనుంచి వస్తూంటే – అప్పడే ఒక వ్యక్తి -- 'వీడెవడో ఇప్పుడే బ్యాంక్ నుండి బయటికి వచ్చాడు, చేతిలో కేష్ బేగ్ కూడా ఉందని గమనించి, వామనరావుని – ఫాలో అవసాగేడు.

బ్యాంకు నుంచి బయటకు వచ్చి తాపీగా స్కూటీ నడుపుకుంటూ వెళుతున్న వామనరావుకి, స్కూటీకి రెండు వైపులా ఉన్న అద్దాలలో వెనక కొంత దూరంలో స్కూటర్ మీద ఒక వ్యక్తి కనిపించి తనని ఫాలో అవుతున్నాడని అనుమానం కలిగింది.

స్కూటీ అద్దాలలో అతన్నే గమనిస్తూ జాగ్రత్తగా ట్రాఫిక్లో స్కూటీ నడుపుతూంటే స్కూటర్ మీద ఆ వ్యక్తి ఇంకా తన వెనకే వస్తూండడంతో వామనరావుకి అనుమానం కాస్త బలపడింది.

వామనరావుని ఫాలో అవుతున్న వ్యక్తికి, తన దృష్టిపథం లోంచి వామనరావు జనసందోహంలో తప్పిపోకుండా, ఆ జనం మధ్యలోనే ఎలాగైనా వామనరావు దగ్గరున్న కేష్ బేగ్ కాజేయాలని - తపన.

కానీ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడంతో అతను వామనరావును అందుకోలేకపోతూ కొంచెం దూరంలోనే ఉండవలసివస్తోంది.

తనని ఫాలో అవుతున్న వ్యక్తి – ‘ఆదాయపన్ను శాఖకు సంబంధించిన వ్యక్తి’ కానీ, ‘పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తి’ కానీ, ‘అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన వ్యక్తి’ కానీ, ‘డబ్బులు కొట్టేసే దొంగ వెధవ’ ఎవడైనా – అయిఉండవచ్చన్న భయంతో, వామనరావుకు గొంతుక ఎండిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టసాగేయి.

ఆ వ్యక్తికి ఏవిధంగా టోకరా ఇచ్చి తప్పించుకోవడమా అని ఆలోచిస్తున్న వామనరావు తన బుర్రకి చురుకుగా పదును పెట్ట సాగేడు.

వామనరావుకి అదే రోడ్డులో కుడి వైపు పెద్ద బహుళ అంతస్తుల సముదాయం ఆపద్బాంధవిలా అంత ఎత్తుగా అభయం ఇస్తూ కనపడింది అప్పుడు.

ట్రాఫిక్ సిగ్నల్ కొద్ది సెకన్లలో ఎరుపు రంగులోకి మారబోతూండగా వామనరావు త్వరత్వరగా కుడిపక్కకి తిరిగి ఒక నిమిషంలో ఆ బహుళ అంతస్తుల సముదాయంలోకి తన స్కూటీతో ప్రవేశించేడు.

వామనరావు కుడి పక్కకు తిరిగిన కొద్ది సెకన్లలోనే ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగులోకి మారడంతో వామనరావుని ఫాలో అవుతున్న వ్యక్తి వామనరావు కుడి పక్కన ఉన్న బహుళ అంతస్తుల సముదాయంలోకి వెళ్లడం చూసినా, ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగులోకి మారే వరకూ ఉండిపోవలసి వచ్చింది.

తనను ఫాలో అవుతున్న వ్యక్తి ఈ భవనప్రాంగణంలోకి కూడా వస్తాడేమో అన్న అనుమానంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ చేతిలో వందరూపాయల నోటు ఉంచి, చెవిలో రహస్యంగా అరనిమిషం సేపు మాట్లాడి, సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన సూచనతో అతను మాత్రమే ఉపయాగించుకొనేందుకు ఉన్న టాయిలెట్ లోకి తన కాష్ బాగ్ తో సహా దూరి, తలుపు కొంచెంగా తెరిచి ఉంచి ఏమి జరగబోతుందా అని చూడసాగేడు.

మరో రెండు నిమిషాలకు ఆ వ్యకి కూడా అక్కడకే వచ్చి వామనరావు స్కూటీ పక్కనే తన స్కూటర్ కూడా ఆపి అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో అధికార స్వరం మేళవించి—

"ఈ స్కూటీ మీద వచ్చిన ఆసామీ ఎక్కడకు వెళ్ళేడు" అని అడిగేడు.

“1202 ఫ్లాట్ లో ఉంటున్న సర్ ని కలిసి వస్తున్నానని వెళ్ళేరు సర్" అని సెక్యూరిటీ గార్డ్ వినయంగా జవాబిచ్చేడు.

"ఆ ఫ్లాట్ ఏ ఫ్లోర్ లో ఉంది"

“పన్నెండో ఫ్లోర్ లో సర్"

"లిఫ్ట్ పనిచేస్తుందా" అని దర్పంగా అడిగేడు ఆ వ్యక్తి.

“"ఎస్ సర్, ఇప్పుడు ఆయన వెళ్ళేరు కదా"

వెంటనే ఆ వ్యక్తి లిఫ్ట్ లోకి వెళ్లి 12 నెంబర్ ఉన్న మీట నొక్కగానే లిఫ్ట్ కదలనారంభించింది.

టాయిలెట్ లోంచి వామనరావు ఇచ్చిన ఇషారాతో సెక్యూరిటీ గార్డ్ త్వరత్వరగా కదిలి లిఫ్టుని ఆపేసేడు. దాంతో ఆ లిఫ్ట్ ఆరు ఏడు అంతస్తుల మధ్యలో ఆగిపోయింది.

ఆ లిఫ్ట్ కి అమర్చిన ‘ఆటోమేటెడ్ రెస్క్యూ సిస్టమ్' టెక్నికల్ ఇస్స్యూ వల్ల కొద్ది రోజులుగా పనిచేయడం లేదు.

అందువలన, ఆ వ్యక్తి చాలా సేపు అదే లిఫ్ట్ లో ఉండిపోవలసి వచ్చింది.

టాయిలెట్ లోంచి బయటకు వచ్చిన వామనరావు మరో అరనిమిషం సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడి, అతని చేతిలో మరో వంద నోటు పెట్టి, స్కూటీ నడుపుకుంటూ ధైర్యంగా ఇంటి దారి పట్టెడు.

అలా లిఫ్ట్ ఆగిపోయిన రెండు నిమిషాలకే ఆ భవన సముదాయం గోల గోల అయిపొయింది.

కొందరు సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వచ్చి –

"ఏమైంది, లిఫ్ట్ ఎందుకు నడవడం లేదు" అని ప్రశ్నల వర్షం కురిపించేరు.

"ఆ లిఫ్ట్ లో దొంగున్నాడు. అందుకే, నేను మధ్యలో ఆపేసేను. పోలీసులకు పిలిచి ఆడిని పట్టిస్తే సరి"

"వాడు దొంగ అని నీకెలా తెలుసు"

"ఆ దొంగోడు ఎవరినైతే ఎంట పడుతున్నాడా, ఆ బాబు నాకు సెప్పి ఎల్లిపోయినారు"

ఈ గోల ఇలా సాగుతుండగా ఆ భవన సముదాయం అసోసియేషన్ తాలూకా ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వచ్చి చేరేరు.

అప్పుడు అందరూ ఆలోచించి - 'ముందు లిఫ్ట్ ని కిందకు తీసుకొని వచ్చి, అందులో ఉండిపోయిన మనిషిని పట్టుకొని పారిపోకుండా కట్టివేసి, పోలీసులకు పిలుద్దాం' అన్న ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చేరు.

దాంతో, సెక్యూరిటీ గార్డ్ లిఫ్ట్ స్విచ్ వేసేడు.

లిఫ్ట్ కిందకు రాగానే నలుగురు అందులో ఉన్న మనిషిని గట్టిగా పట్టుకొని తాళ్లతో కట్టివేసి, పోలీసులకు ఫోన్ చేస్తే వారు అరగంటకు వచ్చేరు. ఇన్స్పెక్టర్ గారు ఆ మనిషిని చూడగానే –

"వీడు మీకెలా దొరికేడు. వీడి కోసం ఆరు నెలలుగా గాలిస్తున్నాం. బ్యాంకుల గేట్ దగ్గర తారాడుతూ కాష్ బాగ్ తో వచ్చేవాళ్ళని వెంటాడి వారి దగ్గర డబ్బులు దొంగిలించడం, అవసరమైతే ఆ మనిషిని దారుణంగా గాయపరచడం వీడి వృత్తి. ‘వీడిని ఎవరైనా పట్టుకొని మాకు అప్పగిస్తే వెయ్యి రూపాయలు ఇవ్వబడును’ అని రెండు రోజుల క్రిందటే దినపత్రికలలో ప్రకటన వేయించేము కూడా"

"మా సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నాడండీ వీడిని" అని అందరూ ఒకే గొంతుకతో చెప్పేరు.

పోలీస్ ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ గార్డ్ తో –

"నీ పేరేమిటి, ఇక్కడికి ఎప్పుడు వచ్చేడు వీడు, నీకెలా తెలుసు వీడు దొంగని" అంటూ ప్రశ్నించేరు.

“స్కూటీ మీద ఒక బాబు ఒచ్చి – ‘తనను ఈడు ఎంటబడుతున్నాడు, తప్పించుకొని ఇక్కడికి ఒచ్చేను, నన్ను ఎక్కడేనా దాసేసి ఈడిని ఇలా లిఫ్ట్ లో ఆపేసి మీకు పిలిస్తే మీరే ఈడిని పట్టుకుపోయి నాకు పైసలు కూడా ఇస్తారని’ – సెప్పేరు"

"నీతో అలా చెప్పినతను ఏడీ"

"ఆ బాబు అప్పుడే ఎల్లిపోయేరండి"

"అతని చేతిలో కాష్ బాగ్ ఉందా, నువ్వు చూసేవా"

"ఉందండీ, నేను సూసేను. ఆ బాబు సేతిలో నల్ల రంగు కాష్ బాగ్ ని సాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొన్నారు"

"ఆయన పేరేమిటి, మీ రిజిస్టర్ లో అతని పేరు నోట్ చేసేవా"

"అంత సమయం లేదండీ అప్పుడు”

"ఏం, ఎందుకు లేదు"

“ఆ బాబు – ‘తన ఎనకాతలే ఈ దొంగెదవ ఒస్తున్నాడని సెప్పి, తనని ఎక్కడేనా దాసేయమన్నారు. అప్పుడు నేనతన్ని అగో ఆ టాయిలెట్ లో దాక్కోమని సెప్పేను. అరనిమిషంలోనే ఈ ఎదవ స్కూటర్ మీద ఒచ్చి ఆ బాబు ఎక్కడికెళ్లేడని అడిగితే, నేనే సెప్పేను ‘1202’ బాబుగారిని కలిసి ఒస్తారని సెప్పేరని. ఈడు లిఫ్ట్ లోకి ఎల్లగానే ఆ బాబు టాయిలెట్ తలుపు సందులోంచి లిఫ్ట్ ఆపేయమని ఇషారా సేసేరు’ - నేను లిఫ్ట్ ఆపేసేను. ఆ తరువాత ఆ బాబుగారు తొరతొరగా తన స్కూటీ మీద ఎల్లిపోనారు.’ -- ఆ సందడిలో ఆ బాబు పేరేమిటో నేను అడగలేదు సర్. పొరపాటైపోయింది, సెమించండి" అని జరిగినదంతా గుక్క తిప్పుకోకుండా వివరంగా చెప్పేడు.

"సరే, అతనెవ రైతేనేమి. ఈ వెధవ దొరికేడు. వారం రోజుల్లో నీకు కబురు చేసి వెయ్యి రూపాయలు ఒక సర్టిఫికెట్ ఇస్తాము. మీ ప్రెసిడెంట్ సెక్రటరీ గార్లతో కలిసి వద్దువుగాని"

"పదరా దొంగ వెధవా" అని దొంగని తీసుకొని ఇన్స్పెక్టర్ గారు పోలీసులు వెళ్ళిపోయేరు.

ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టే వారం రోజుల తరువాత, ఆ భవన సముదాయం అసోసియేషన్ తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీ గారితో సెక్యూరిటీ గార్డ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వెయ్యి రూపాయలు సర్టిఫికెట్ అందుకున్నాడు.

ఆ ఫోటో దానికి సంబంధించిన వివరాలు మరునాడు దినపత్రికలో వచ్చేయి.

ఆ వార్త చూసిన వామనరావు తేలుకుట్టిన దొంగ వలె ఉండిపోయి -

'గుడ్డిలో మెల్ల' లాగ తన వివరాలు కానీ ఫోటో కానీ ఎక్కడా లేకపోవడం, తాను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడమే మంచిదే అయింది అని ఆనందించేడు.

మరలా అతని ఎడమచేయి దాని పని అది చేయడం ఆరంభించింది.

*****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు