గొడ్డలిపెట్టు (జాతీయం కథ) - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Goddalupettu

చిత్రావతి నదీ తీరాన ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో గట్టి కలప నిచ్చే పెద్ద పెద్ద వృక్షాలు ఎన్నో ఉండేవి. ఆ వృక్షాల మీద గూళ్ళు కట్టుకుని ఎన్నో పక్షులు పిల్లా పాపలతో హాయిగా జీవించేవి. అంతే కాకుండా దేశ విదేశాలనుంచి కూడా ఎన్నో పక్షులు వేసవి విడిదిగా ఆ అడవికి చేరుకునేవి. వేసవి తాపానికి చిత్రావతి నదిలో నీళ్ళను తాగి స్నానాలు చేసి ఆడుకునేవి. కొద్దిరోజులు ఉండి గుడ్లు పొదిగిన తర్వాత పిల్లా పాపలతో కొన్ని వేల మైళ్ళ దూరం ఎగురుకుంటూ తిరిగి వాటి స్వంత గూటికి చెరుకునేవి. అలా ఆడవి అంతా పక్షుల కిలకిలా రావాలతో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఒక రోజు సుబుద్ధి అనే పావురం అడవిలోకి వచ్చి, “మిత్రులారా! చెట్లను నరకడానికి మనుషులు గొడ్డళ్లు పట్టుకుని ఇటువైపుగా వస్తున్నారు. మనమంతా ఏకం కావాలి. వారిమీద తిరుగుబాటు చెయ్యాలి.” అని చెప్పింది. “మనవల్ల సాధ్యమయ్యే పనేనా?” అని ఎదురుప్రశ్న వేశాయి మిగతా పక్షులు. చేసేదేమీ లేక మిన్నకుండిపోయింది పావురం. కాసేపటి తర్వాత కొంతమంది మనుషులు వచ్చి గొడ్డళ్ళతో నరకడం ప్రారంభించారు. గొడ్డలి పెట్టుకు విలవిల్లాడి పోయింది మహావృక్షం. “మమ్మల్ని నరక వద్దు, మీ చావు కొని తెచ్చుకోవద్దు. పర్యావరణానికి, పక్షి జీవనానికి గొడ్డలి పెట్టు. ఒక్కసారి ఆలోచించుకోండి” అని హెచ్చరించింది మహా వృక్షం. అయినా మూర్ఖులు వినిపించుకోలేదు. గొడ్డలి వేటుకు తట్టుకోలేక చెట్టు నేలకొరిగింది. పక్షులు పైకెగిరాయి. గూళ్ళు చెల్లాచెదురయ్యాయి. పక్షిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తల్లి పక్షుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. అలా కొన్నాళ్ళకు అడవిలో ఉన్న వృక్షాలన్నీ స్వార్థపూరిత మనుషుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వర్షాలు లేక ఆ ప్రాంతమంతా ఎడారిగా మారింది. అప్పటి నుంచి గొడ్డలిపెట్టు అనే నానుడి ప్రజల నోళ్లలో నానింది. గొడ్డలి పెట్టు అంటే విఘాతం కల్గించు, ఆపదకలిగించు, ఆటంకం కలిగించు, అడ్డుకొను, భంగపరచు అర్థాలు స్ఫురిస్తున్నాయి. ఏదైనా ఒక పనికి, ఒక వ్యవస్థకి, అభివృద్ధికి ఆటంకం కలిగించే సందర్భంలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణగా అవిద్య అభివృద్ధికి గొడ్డలి పెట్టు. మత మౌఢ్యం లౌకిక రాజ్యానికి గొడ్డలిపెట్టు, చెట్లను నరకడం పర్యావరణానికి గొడ్డలిపెట్టు. తీవ్రవాదం దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టు, కాలుష్యం పర్యావరణానికి గొడ్డలిపెట్టు, అడవుల విధ్వంసం జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టు. ఇలా మనం సొంత వాక్యాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇదీ గొడ్డలి పెట్టు పలుకుబడి వెనుక ఉన్న కథ.

మరిన్ని కథలు

Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్
Jeevinchu
జీవించు
- B.Rajyalakshmi