స్త్రీ - chitti venkata subba Rao

STREE

నవవధువుగా రమ్య ఆ ఇంట్లో అడుగుపెట్టి నాలుగు రోజులు అయింది. అంతా కొత్త వాతావరణం. కొత్త మనుషులు. ఎవరిని ఏం అడగాలో తెలియదు రమ్యకి. భర్త రమేష్ ని అడుగుదామంటే భయం. లంకంత కొంప. రమేష్ కి నలుగురు తమ్ముళ్లు. అంతా చదువుల్లో ఉన్నారు. మామగారు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అత్తగారు ఇదివరకు ఇంటి పని అంతా ఆవిడే చేసుకునేవారట. ఈమధ్య కీళ్ల నొప్పులు వచ్చి ఎక్కువగా పని చేయలేకపోతున్నారు.

ఉదయం 7:00 అయింది. ఒక్కొక్కళ్ళు లేచి మొహాలు కడుక్కుని హాల్లో వచ్చి కూర్చున్నారు అత్తగారితో సహా." రమ్య కాఫీ కావాలంటూ భర్త కేక వినబడే సరికి ఒక్కసారి రమ్యకి చెమటలు పట్టే యి. 'అదేంటి ఎవరు కాఫీ కాయమని చెప్పలేదు. ఇప్పుడు అర్జెంటుగా కాఫీ కావాలంటే ఎలా వస్తుంది. అంటే ఇంట్లో ఎవరు పనులు చెప్పరా!. మనమే బాధ్యతలు తీసుకున్న పనులు చేయాలా! చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్లి ఒక అరగంటలో కాఫీ తయారు చేసి పట్టుకొచ్చి ఇచ్చింది. సాధారణంగా కొత్తకోడలకు వెంటనే బాధ్యతలు ఎవరు అప్ప చెప్పరు.

కొద్దిరోజులు ఆ ఇంటి వాతావరణం అలవాటు పడిన తర్వాత వాళ్లే స్వతంత్రంగా పనులు లేదంటే చేయవలసిన ఇంటి పనులు ముందుగానే చెప్పి చేయించుకోవాలి. అందుకు భిన్నంగా ఉంది ఇంటి పరిస్థితి.అత్తగారు మౌనంగా కాఫీ తాగేసింది గాని. తర్వాత ఏ పని చేయాలో కూడా ఏమీ చెప్పలేదు. ఏమిటో ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలో అంటే ఇక ముందు వంటిల్లు బాధ్యత నాదే అన్నమాట అనుకుంది రమ్య.

రమ్యకు ఒకసారి ఏడుపొచ్చింది. తన పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగింది. కనీసం భర్తతో సహా ఎవరు కూడా ఏ వస్తువు కూడా ఎక్కడుందో చెప్పలే దు. ఇదేo మనస్తత్వం. ఆ ఇంటి కోడలుగా బాధ్యత తనదే. కానీ ఏది ఎక్కడుందో తనకేం తెలుస్తుంది. ముందు నాలుగు రోజులు కూడా ఉండి పని అలవాటు చేయాలి కదా. ఆ పని చేయవలసింది ఎవరు అత్తగారు కదా.. అంటే కొడుకు పెళ్లి చేసాం కదా బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారు.. అలా అతి కష్టం మీద టమాటా బాత్ తయారు చేసి పెట్టింది. దొడ్లో ఎక్కడ అలికిడి వినిపించట్లేదు. పని మనిషి మటుకు వచ్చినట్టు కనపడలేదు. అంతే చచ్చినట్లు నిన్న రాత్రి తిన్న గిన్నెలన్నీ పాపం కడుక్కుంది రమ్య. ఇన్నాళ్లు ఆడుతూ పాడుతూ చదువుకుని ఒక్కసారి బాధ్యతలోకి వచ్చేటప్పటికి ఎక్కడలేని బెంగ బాధ ,భయం పట్టుకుంది రమ్యకి. అలాగే ఇల్లు అంతా తుడుచుకుని స్నానం చేసి వచ్చి వంట పని అంత పూర్తి చేసింది. రమ్య మరుదులు, భర్త క్యారేజీలు పట్టుకుని బయటకు వెళ్ళిపోయారు. అత్తగారు మామగారు వాళ్ల గదిలోకి వెళ్లిపోయారు.

మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత సాయంకాలం వరకు కాస్త రెస్ట్ తీసుకుని మళ్లీ రాత్రి అందరికి టిఫిన్లే. ఇలా గడిచిపోతోంది కొత్త పెళ్ళికూతురు జీవితం. ఆదివారం వస్తే బట్టల పని. ఇస్త్రీల పని. మరుదలు అందరూ పెద్దవాళ్లే అయినా ఎవరు సాయం చేయడానికి ముందుకు రారు. తన ఇంట్లో ఎలా పెరిగింది ఒక్కసారి పుట్టింటి వైపు మనసు మళ్లింది. నాన్నకు వరాల మూటగా గారాల పట్టిగా బాల్యమంతా బంగారం. కొండమీద కోతి నైనా తెచ్చి ఇచ్చే నాన్న ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టాలని ఇప్పటి నుంచే బెంగపెట్టుకుని గుండెల మీద వేసుకునే నిద్రపుచ్చే నాన్న. రేపు గడప దాటితే మాట పడాలని ఇప్పటినుంచి పని పాటలు బుద్ధులు నేర్పే అమ్మ. తోడబుట్టిన వాళ్ళు దెబ్బలాడిన అమ్మ పెట్టిన తాయిలం కాకి ఎంగిలి చేసి అందరూ పంచుకుతినే ప్రేమ అభిమానం పంచే అన్నయ్యలు తమ్ముళ్లు. బయట పోకిరి కుర్రాళ్ళు అదోలా చూస్తే సాయంకాలం ఇంటికెళ్లి తోలు తీసి వచ్చే అన్నయ్యలు ఇది నా బంగారు కుటుంబం. అమ్మ ఒడి దాటి బడిబాట పట్టి ఓనమాలు నేర్చుకుని బడిలో బాల సరస్వతిగా పేరు తెచ్చుకున్న బుడ్డి దాన్ని.

ఉన్న ఊర్లో చదువు అయిపోయి పక్క ఊర్లో కళాశాల కి అన్నయ్యని తోడిచ్చి పంపే బాధ్యతగల నాన్న. చీకటి పడే వేళ అయితే పిల్లలు ఇద్దరు ఇంటికి రాలేదని గుమ్మoల్లోంచి వీధిలోకి తొంగి చూసి కళ్ళల్లో భయం నింపుకుని వీధిలో నేను కనపడగానే హాయిగా ఊపిరి పీల్చుకునే అమ్మ . ఆడపిల్లని కన్న తల్లి ఎంత బాధ్యతగా చూసుకోవాలో చిన్నతనంలోనే నాకు నేర్పింది అమ్మ. పసిడి మొగ్గనైన నేను పరిమళాలు వెదజల్లే పువ్వుగా మారినప్పుడు నాన్న, అమ్మ కళ్ళల్లో ఆనందo ఒక రకమైన భయం తొంగి చూసే యి. కళాశాలలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని అమ్మ చేతికి చూపించినప్పుడు ఇక నీ బాధ్యత అయిపోయింది మా బాధ్యత ఉంది ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అంటూ కనబడిన దేవుడికి రోజు చేతులెత్తి మొక్కేది. క్యాంపస్ సెలక్షన్ వచ్చింది నాన్న అంటే ఎందుకమ్మా హాయిగా పెళ్లి చేసుకుని సుఖపడు నేను పదవి విరమణ చేసి లోపు నీ బాధ్యత తీరిపోవాలి కదమ్మా అంటూ బుజ్జగించి లాలించి అంగరంగ వైభవంగా రమేష్ నీ ఇచ్చి పెళ్లి చేశాడు. రమేష్ మనసున్న వాడే. కానీ పడక గదిలో ఉన్న మాటలకి తల్లిదండ్రుల ముందు మాట్లాడే మాటలకి ఎందుకో తేడా. కట్టుకున్న భార్యను ప్రేమగా చూస్తే తప్పేముంది. అలా అని ధైర్యంగా చెప్పే మగవాడు కాడు రమేష్. భార్య ఇంత కష్టపడుతోంది కనీసం ఇంకో పనిమనిషిని చూసి పెడదాం అనే ఆలోచన లేని భర్త. వంటింట్లో ఉన్న మంచినీళ్లు కూడా తెచ్చుకుని తాగకుండా ఆర్డర్లు వేసే మరుదులు పాపం వాళ్లకు తెలియదు.

మగవాళ్ళు అంటే కూర్చుని చాకరీ చేయించుకునే వాళ్ళనీ అని నూరిపోసిన తల్లి ప్రభావం అనుకుంటా వాళ్లకి. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అత్తగారు కీళ్ల నొప్పుల వలన మామగారు వయస్సు రీత్యా మంచం మించి లేవలేక గది దాటి బయటకు రాలేకపోతున్నారు. పాపం అన్ని మంచం దగ్గరికి అందించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు ఇంకెవరు ఆ ఇంటి కోడలిగా రమ్యదే ఆ బాధ్యత. ఒకరోజు ఉన్నట్టుండి రమ్య కళ్ళు తిరిగి పడిపోయింది.

డాక్టర్ గారు చెప్పిన మాటతో కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. అంతేకానీ రోజువారి పనులకు మటుకు ఎవరూ ముందుకు రాలే దు. రోజు నీరసంగా ఉంటోంది.పనులు చేయబుద్ధి కావడం లేదు. ఎక్కువసేపు నిద్ర పోవాలనిపిస్తోంది. పని చేయకపోతే ఎలా కుదురుతుంది. పోనీ తన బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు. పుట్టింటికి వెళ్ళిపోతే. వీళ్ళు ఏమనుకుంటారు ఏమో. మరి రోజులు గడపడం ఎలాగా అలా నీరసం తగ్గినప్పుడు పని చేసుకుంటూ పడుకుంటూ లేస్తూ ఏడు నెలల గడిపింది పాపం. సీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్లారు రమ్యని తల్లిదండ్రులు. వెళ్లే ముందు అత్తగారి కాళ్లకు నమస్కరిస్తే " నెల వెళ్లగానే బిడ్డను తీసుకుని వచ్చేయమ్మ నా సంగతి తెలుసు కదా అoటు చెప్పింది. రమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ఉన్న ఇంటి పరిస్థితుల గురించి మనసులో బాధపడుతూ ఒకపక్క తొలిచూలు కారణంగా వచ్చే బాధలను అనుభవిస్తూ కాలక్షేపం చేస్తోంది రమ్య. రమ్య పుట్టింటికి వచ్చి రమారమి రెండు నెలలైనా ఒక్కసారి కూడా రమేష్ చూడడానికి రాలేదు. ఫోన్లో మాట్లాడడం తప్ప. ఒకరోజు మన ఇంట్లో వంట పరిస్థితి ఏమిటి ?అని అడిగింది రమ్య పాపం మా అమ్మ చేస్తోంది అంటూ సమాధానం ఇచ్చాడు. కాళ్ల నొప్పులు తగ్గాయా !అని అడిగింది ఏమో తెలియదు మాట కొంచెం కరుకుగా వచ్చింది. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా నొప్పులు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయిన రమ్యకి కవల పిల్లలు ఇద్దరు మగ పిల్లలే పుట్టారు. రమ్య కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేదు.

చంటి పిల్లల పెంపకం అంటేనే చాలా కష్టం. అందులో ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ నీళ్లు పోయాలి ఇద్దరికి పాలు పట్టాలి ఎంత కష్టం. పిల్లల కోసం చేసే ఏ పనైనా తల్లికి కష్టం అనిపించదు. చూసే వాళ్లకు మటుకు చాలా బాధగా ఉంటుంది. పిల్లలు అంతా తండ్రి పోలికే. అత్తగారు చెప్పినట్లుగా నెల వెళ్ళిన వెంటనే పంపడానికి రమ్య తండ్రిగా అస్సలు ఒప్పుకోలేదు. కోపం వచ్చినా సరే అనుకుని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అలా మూడు నెలలు గడిచేయి. మూడో నెలలోనే బారసాల చేసుకుని అత్తారింటికి తీసుకెళ్లిపోయారు రమ్యని. అత్తవారింటి బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యత కూడా తోడై ఒత్తిడితో సతమతమయ్యేది రమ్య. ఇలా కాలం గడుస్తూ ఉంటే రమ్య మరుదలు అందరూ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. అందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఎవరు కాపరాలు వాళ్లు చేసుకునేలా ఏర్పాటు చేశారు రమ్య దంపతులు. ఆ తర్వాత ఒక సంవత్సరంలో రమ్య అత్తయ్య మావయ్య ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. రమ్య జీవితంలో ఏ విధమైన మార్పు లేదు . అప్పుడు భర్త కుటుంబం గురించి బాధ్యతలు మోసేది. ఇప్పుడు తన కుటుంబం బాధ్యతలు తన ఇద్దరు పిల్లలు భర్త వాళ్ల భవిష్యత్తు ఇవే ఆలోచనలు రమ్యకి. ఒక కుటుంబంలో అత్యున్నత బాధ్యత వహించేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. మగవాడు కూడా కుటుంబాన్ని గురించి కష్టపడి ఉద్యోగాలు చేసినా పదవీ విరమణ అనే ఒక అవకాశం మగవాడికి ఉంది.

పదవీ విరమణ చేసే వయసు నాటికి చాలామందికి పిల్లల బాధ్యతలు కూడా పూర్తవుతాయి. కానీ ఒక స్త్రీకి బ్రతికినంత కాలం ఆమెని వంటింటి బాధ్యతల నుండి విముక్తి చేసే అవకాశం మన భారతీయ స్త్రీలకు లేదు. ఎన్నో కుటుంబాల్లో వయసు మీరిన వాళ్ళు పిల్లలు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతుంటే ఆ ఊళ్ళల్లో ఇమడలేక తమ సొంత ఇంట్లోనే ఉంటూ ఒక స్త్రీ ఇంకా తన భర్తకి వండి పెడుతున్న కుటుంబాలు ఎన్నో. ఇలా కాలం గడిచిపోతోంది. పిల్లలు పెద్దవాళ్లయి ఉద్యోగాలు సంపాదించుకుని తన మనసుకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకొని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. రమ్య భర్త రమేష్ కూడా రిటైర్ అయిపోయి సొంత ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలా ఆనందంగా ఉన్న కుటుంబానికి దిష్టి తగిలిందేమో ఒకరోజు రమేష్ హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కన్నుమూశాడు. ఆనందంగా ఉన్న ఉండవలసిన సమయంలో జీవితం ఇలా అయిపోయింది ఏమిటని రమ్య కన్నీరు మున్నీరుగా విలపించింది. చిన్న వయసులో అంతా కుటుంబ బాధ్యతలు పెద్దయిన తర్వాత మనసుకు నచ్చిన విధంగా బతుకుదాం అంటే ఇంకేముంది భగవంతుడు అన్యాయం చేశా డు. రమేష్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పిల్లలు తమ తమ ఊర్లు వెళ్ళిపోతూ తమతో రమ్మని అడుగుతారు. రమ్య అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడకి వెళ్ళిన తర్వాత మళ్లీ బాధ్యతలు మొదలు. కొడుకులు కోడళ్ళు ఇద్దరు ఉద్యోగాలు. ఇంట్లో మళ్లీ తనకు వంట చేసి పెట్టే దిక్కు ఉండదు. తన వంట తనే చేసుకోవాలి. అయినా తెలియని ప్రదేశం. ఇదివరలో కూడా కోడలు దగ్గర ఉండడం పెద్దగా అలవాటు లేదు. ఎందుకంటే రమేష్ ఉన్నంతకాలం ఎందుకో తెలియదు కానీ ఎక్కడికి వెళ్లడానికి ఒప్పుకునే వాడు కాదు . బహుశా అక్కడ పరిస్థితులు తెలిసేమో. ఈ రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేయడం తప్పదు గాని రమ్య లాంటి భర్త లేని తల్లులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పెళ్లయి ఒకసారి అత్తవారింట్లో అడుగుపెట్టిన స్త్రీ బాధ్యత భుజానికి ఎత్తుకొని తను కన్నుమూసే వరకు ఆ బాధ్యతతోనే నలిగిపోతున్న రమ్య లాంటి స్త్రీలు ఎంతోమంది.

భార్య పోయిన మగవాడు ఎలాగైనా బతికేస్తాడు. భర్త పోయిన స్త్రీ ఈ లోకంలో బతకడం అనేది చాలా కష్టం. భర్త కోసం ,పిల్లల కోసం ,తన సంసారం కోసం ఎంత పని అయినా ఉత్సాహంగా చేస్తుంది ఒక స్త్రీ. భర్త చనిపోయిన తర్వాత ఉత్సాహం చచ్చిపోతుంది.అంటే స్త్రీ చనిపోయే వరకు బాధ్యతల కోసం పనిచేయవలసిందేనా. ఆమెకు కూడా విశ్రాంతి అనేది ఉండాలిగా. అందుకు కావలసిన పరిస్థితులు కల్పించవలసింది కడుపున పుట్టిన పిల్లలు లేదా భర్త. రమ్య భర్త పోయిన తర్వాత ఇలా ఒంటరిగా తన సొంత ఇంట్లో జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా పెద్దకొడుకు రఘు ఊరు నుండి వచ్చి తల్లిని పట్టుకుని గట్టిగా ఏడుస్తాడు. రమ్య ఎంత చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేసేసి నగరంలో తన సొంత ఇంటికి తీసుకువచ్చి మేడ మీద తల్లిని ఉంచి వంట మనిషిని పెట్టి వండించి పెడుతూ తల్లి బాగోగులు చూస్తూ ఉంటాడు. రమ్య పెద్ద కొడుకు రఘు ఎందుకు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు. దాని వెనక ఒక కథ ఉంది.

తండ్రి పోయిన తర్వాత రఘు ఇంటికి వెళ్లిన తర్వాత రఘు మామగారు కూడా కాలం చేస్తారు . కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత రఘు భార్య రఘు తోటి చెప్పకుండా తన తల్లిని తనతో పాటు తీసుకొస్తుంది. అప్పుడు అర్థమైంది రఘు కి తన బాధ్యత ఏమిటో. అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి తనకు బాధ్యతలు నుండి విముక్తి కలిగిందని ఆనంద పడింది రమ్య. బాధ్యత అంటే భయం కాదు. కొంత వయసు వచ్చిన తర్వాత శరీరంలో శక్తి సన్నగిల్లిపోతుంది. చేసే ఓపిక ఉండదు. ఆధారపడడానికి ఎవరూ కనిపించరు. ఇటువంటి సమయంలో స్త్రీని ఆ బాధ్యతల నుండి విముక్తి చేయవలసింది ఎవరు అని ఆలోచించుకోవాల్సింది కడుపున పుట్టిన పిల్లలే. తల్లి రుణం తీర్చుకోవడం అంటే ఇదే. చనిపోయిన తర్వాత ఆర్భాటంగా చేసే కార్యక్రమాలు కన్నా బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉంచడమే మనం చేయవలసింది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ