"అమ్మా..! ఆషాఢమాసం వచ్చిందని నన్ను తీసుకొచ్చి, ఇక్కడే పుట్టింట్లో ఉంచేసావు..మా ఆయన అక్కడ ఎలా ఉన్నారో.. ఏమిటో? ఉత్తరం రాసిన నాలుగు రోజులకి గానీ చేరదు.."
"ఆషాఢమాసంలో అంతే సుధా..కొత్త దంపతులు దూరంగా ఉండాలి. కొత్త కోడలి ముఖాన్ని అత్తగారు చూడకూడదు. కొత్త అల్లుడు అత్తారింటికి వెళ్లకూడదనే ఆనవాయితీ ఉంది. అసలే, మీ అత్తగారు చాలా స్ట్రిక్ట్. అయినా ఒక నెల ఆగలేవా..?"
"నీకేం తెలుసు..? పెళ్ళై కొన్నిరోజులు గడవక ముందే వచ్చేసింది ఆషాఢమాసం. అప్పటివరకు ఒకటిగా ఉన్న మా ఇద్దరినీ అటు మా అత్తగారు, ఇటు నువ్వు విడదీశారు.. సుఖానికి అలవాటు పడిన ప్రాణం అమ్మా..! ఎలా చెప్పు..?"
"మేమంతా పెళ్ళి చేసుకుని ఉండలేదే..! మొగుడిని చూడకుండా ఉండలేకపొతే ఎలా చెప్పు..?"
"నీకేం అమ్మా..! మీ పెళ్లి ఆషాఢమాసం తర్వాత జరిగింది..నా పెళ్లి మాత్రం ఆషాఢమాసానికి ముందు జరిగింది.."
"అయితే ఏం చేయమంటావు..? కావాలంటే, ఫోన్ బూత్ కెళ్ళి ఫోన్ చేసి, మీ ఆయనతో మాట్లాడుకో.."
"మాట్లాడగలను అంతేగా..! చూడలేను..ఏమీ చెయ్యలేను.."
"ఛి..ఛి..మరి ఇలా మొగుడిని చూడకుండా ఉండలేకపోవడం ఏమిటే..?"
"నీకూ, నాన్నకు పెళ్ళైన కొత్తలో..మీ స్టోరీ నాకు తెలియదనుకున్నావా అమ్మా..?"
"ఏమిటే నీకు తెలిసింది..? నీకు అల్లరి బాగా ఎక్కువ అయిపోయింది.."
"చెప్పనా..అమ్మా..చెప్పేస్తున్నా..."
మీకు పెళ్ళైన కొత్తలో..నాన్నకి ఉద్యోగం వేరే ఊరులో వేసారు. అక్కడ నాన్న ఒక్కడే ఉండేవాడు.. నువ్వేమో అత్తారింట్లో ఉండేదానివి..రెండు ఊళ్ళకి ఇరవై కిలోమీటర్లు. అప్పుడు నువ్వు కూడా నాన్నని చూడకుండా ఉండలేక పోయేదానివి. అప్పుడు నాన్నని కలవమని ఉత్తరం రాసావు. ఒక ఆదివారం నాన్న నీ కోసం వచ్చారు. ఇద్దరు ప్రతి ఆదివారం సరదాగా ఉండేవారు. కానీ..నువ్వు నాన్నతో రోజూ కలవాలి, మాట్లాడాలి అని అడిగావు. దానికి నాన్న ఒక్క ఆదివారం తప్ప వేరే రోజులు కలవడం కుదరదని.. ఆఫీస్ లో పని ఎక్కువ ఉందని చెప్పారు..
దానికి నువ్వు బుంగమూతి పెట్టి..నాన్న కాళ్ళ మీద పడి..కనీసం రోజూ రాత్రి ఒక గంట కలిసి వెళ్ళమని అడిగావు. నీ మీద ప్రేమతో, నీ పరిస్థితి చూసి, నాన్న నీ కోసం రోజూ ఆఫీస్ అయిపోయాక, ఇరవై కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ..నిన్ను రోజూ ఊరి చివర తోటలో కలిసేవాడు..నానమ్మకు తెలియకుండా. ప్రతి రాత్రి ఇలాగే పాపం నాన్న.. సైకిల్ మీద నీ కోసం వచ్చేవాడు. నువ్వు మాత్రం ఉండగలిగావా అమ్మా..! అప్పట్లోనే నువ్వు అలా ఉంటే, ఇప్పుడు కాలం మారింది..నన్ను ఎలా ఉండమంటావు..? పోనీ..మా ఆయన్ని ఎక్కడైనా వేరే చోట కలుద్దామా అంటే.., మా ఆయనకీ నాకు ఐదొందల కిలోమీటర్ల దూరం ఉంది.
"ఇదంతా నీకెలా తెలుసు..?"
"నాన్న తన డైరీ లో అంతా రాసుకున్నారు..ఇంకా చాలా ముచ్చట్లు రాసారులే..అవి చెబితే బాగుండదని చెప్పలేదు అమ్మ..!"
"ఛి..ఇలా తయారయ్యావేంటే పిల్లా నువ్వు.."
"రేపే మీ అత్తగారితో, అల్లుడితో మాట్లాడి..దీనికో పరిస్కారం చూస్తాము. అంతవరకూ ఓపిక పట్టు. నువ్వే ఇక్కడ ఇలా ఉంటే, మీ ఆయన అక్కడ ఎలా ఉన్నాడో పాపం..!"
*******