నెమలి... కోకిల ... మధ్యలో రామచిలుక! - మొర్రి గోపి

Nemali kokila madhyalo ramachiluka

ఒక అడవిలో నెమలి, కోకిల చాలా స్నేహంగా మెలిగేవి. కోకిల చక్కగా పాడితే నెమలి కనువిందుగా నాట్యం చేసేది. వారి స్నేహం చూసి అడవిలోని పక్షులు జంతువులు చాలా అబ్బురపడేవి. ఆనందపడేవి. వారి స్నేహాన్ని అడవిలోనే జంతువులు పక్షులు ప్రశంసించడం అడవిలోని ఒక రామచిలకకు నచ్చలేదు. వారి మధ్య చిచ్చు పెట్టాలనుకుంది. వారి స్నేహాన్ని విడదీయాలనే తలంపుతో ఒకరోజు నెమలితో"పక్షులలో కెల్లా అందమైన నువ్వు , నల్ల రంగుతో అందవిహీనంగా ఉండే కోకిల తో స్నేహంగా మెలగడమేమిటి...? అసలు నీ దగ్గర నిలబడడానికే అర్హత లేని కోకిల తో నీకు స్నేహం ఎందుకు..? నాకే కాదు... మన అడవిలో చాలా జీవులకు నువ్వు కోకిల తో స్నేహం చేయడం నచ్చటం లేదు"అని అంది. రామచిలుక మాటలు విని నెమలి"ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్పడానికి నా దగ్గరికి రావద్దు"అని అక్కడనుండి నెమలి వెళ్లిపోయింది. రామచిలక నిరాశ పడింది. మరో రోజు రామచిలక కోకిలను కలిసి"చక్కగా రాగయుక్తంగా వనమంతా మెచ్చే విధంగా పాడే నీకు, ఏదో తెలిసి తెలియని నాట్యంతో గంతులు వేసే నెమలితో స్నేహం ఏమిటి...? నీ గాత్రంతో... పోటీపడి నెమలి నాట్యం చేయగలదా! నువ్వు పాడితేనే నాట్యం చేసే నెమలి తానే గొప్ప అని అందరితో చెప్పుకుంటుంది. నీ గాత్రం కోసం ఒక్క ముక్క కూడా చెప్పటం లేదు. అంతేకాకుండా నీ రంగును కూడా ఎద్దేవ చేస్తూ పక్షులతో జంతువులతో మాట్లాడుతున్నది నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నీకు ఈ విషయం చెబుతున్నాను. నీకు కనీస గౌరవం ఇవ్వని నెమలితో నీ స్నేహం వద్దు. నాతో స్నేహం ఉండు"అని విష బీజాలు కోకిలలో నాటింది. తన నల్లని రంగును నెమలి ఎద్దేవ చేస్తుందని రామచిలక అనడంతో కోకిల చాలా బాధపడింది. రెండు రోజులు నెమలి దగ్గరకు వెళ్ళలేదు. నెమలి కోకిల రాకపోవడంతో కోకిలకు ఏమైందో .... అని గాబరా పడుతూ కోకిల నివాసం దగ్గరకు వచ్చింది. కోకిల రామచిలుకతో కబుర్లు చెప్పుకుంటున్నది. నెమలి వచ్చినా కోకిల పట్టించుకోలేదు. కోకిలను నెమలి పలకరించినా ఉలుకు పలుకు లేకుండా కోకిల ఉండిపోయింది. దానితో మనసులో బాధ కలిగి ఇదంతా రామచిలక పన్నాగమని గ్రహించి తన నివాసం కి వచ్చేసింది. కొన్ని రోజులుగా హుషారుగా లేని నెమలిని చూసి చెట్టు పైన నివసిస్తున్న ఒక కోతి"ఈమధ్య చాలా దిగులుగా కనబడుతున్నావ్. నీ స్నేహితురాలు కోకిలమ్మ కూడా రావటం కారణమేమిటి"అని అడిగింది. నెమలి కోతితో రామచిలక గురించి మరియు జరిగిన కథ చెప్పింది. అప్పుడు కోతి నెమలితో"దిగులు పడకు. చెడ్డవారితో స్నేహం ఎల్లకాలం నిలవదు. నువ్వు ధైర్యంతో దిగులు వీడి నీ కర్తవ్యం చేసుకో"అని ఆత్మవిశ్వాసం కల్పించింది. ఇంతలో మృగరాజు పుట్టినరోజు సందర్భంగా మృగరాజు సమక్షంలో నాట్యం చేయవలసిందిగా నెమలికి, పాట పాడవలసిందిగా కోకిల కు ఆహ్వానం అందింది. కోకిల దగ్గర ఉన్న రామచిలుక"ఈసారి నువ్వు పాడితే నేను నాట్యం చేస్తాను. మృగరాజు నుంచి కానుకలు పొందే అవకాశం మనకే ఉంది. నీ గానం లేకపోతే నెమలి నాట్యం చేయలేదు కదా! నెమలి నీ రంగు కోసం ఎగతాళి చేసినందుకు ప్రతీకారం తీర్చుకో. ఇది నీకు ఒక అవకాశం"అని కోకిలను రెచ్చగొట్టింది. కోకిల రామచిలక మాయమాటలకు లొంగిపోయింది. మృగరాజు పుట్టినరోజు న అన్ని జంతువులు పక్షులు గుహ దగ్గరకు చేరాయి. కోకిల పాట మొదలుపెట్టింది. రామచిలుక నాట్యం చేయడానికి సిద్ధమైంది. ఇటీవల కాలంలో కోకిల సాధన చేయకపోవడం వలన రాగ యుక్తంగా పాడలేక తడబడింది. రామచిలక నాట్యం చూసి అక్కడికి వచ్చిన జంతువులు పక్షులు పకపకా నవ్వాయి. రామచిలుక, కోకిల సిగ్గుతో తలదించుకున్నాయి. మృగరాజు కు చాలా కోపం వచ్చి"నా పుట్టినరోజుకు ఆహ్వానం అందిందని తెలిసి కూడా చక్కగా సాధన చేయకుండా , రామచిలకతో నాట్యం చేయించడానికి నీకు ఎంత ధైర్యమని, నీకు తగిన శిక్ష విధించాలని" కోకిలపై మండిపడింది. ఇంతలో నెమలి ముందుకు వచ్చింది"మృగరాజ! కోకిలను క్షమించండి. తప్పు నాదే. నాకు ఇటీవల కాస్త అనారోగ్యంగా ఉండడం వలన సాధన చేయలేకపోయాం. శిక్ష నాకు విధించండి"అని కోరింది. నెమలి మాటలను విన్న కోకిల చాలా సిగ్గుపడింది. ఇంతలో కోతి పక్క అడవి నుండి తన స్నేహితురాలైన ఒక కోకిలను తీసుకుని వచ్చింది. ఆ కోకిల రాగయుక్తంగా పాడుతుంటే నెమలి అక్కడికి వచ్చిన జంతువులు పక్షులు , మృగరాజు మెచ్చే విధముగా కనులవిందుగా నాట్యం చేసింది. నాట్యం ముగిసిన తర్వాత కరతాల ధ్వనులతో జంతువులు పక్షులు మృగరాజు నెమలిని, పక్క అడవి కోకిలను అభినందించారు. మృగరాజు సంతోషంతో నెమలితో"చక్కని నాట్యంతో కనుల విందు చేశావు. నీకేం కావాలో కోరుకో"అని అడిగింది. నెమలి"కోకిలను రామచిలకను శిక్షించకుండా వదిలిపెట్టండి... అదే నాకు బహుమతి"అని అంది. మృగరాజు నెమలి కోరికను మన్నించి కోకిల రామచిలుకను శిక్షించకుండా వదిలిపెట్టారు. నెమలికి, చక్కగా పాడిన పక్క అడవి కోకిల కి బహుమతులు ఇచ్చారు. నెమలి దగ్గరకు రామచిలక వచ్చి క్షమించమని వేడుకుంటూ"నా వల్లనే కోకిల నీ స్నేహానికి దూరమైంది"అని చెప్పి కోకిలను నెమలి దగ్గరకు తెచ్చింది. కోకిల కూడా క్షమాపణ కోరుకొని చక్కగా నెమలితో ఇంతకు మునుపు వలె హాయిగా ఉండ సాగింది. నెమలి కోతి అందించిన స్థైర్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. **

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు