నిశాని - DR Bokka Srinivasa Rao

Nishani
కోర్టు హాలంతా ఏవేవో మాటలతో... ఏ ఒక్క మాట కూడా వినపడనంత గందరగోళంగా వుంది. అలాంటి హాలులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏదో మంత్రం వేసినట్టు ఆవరించింది. అందరూ ఒకే వ్యక్తి వైపు చూస్తున్నారు. అతను ఆ కోర్టు జడ్జి కాదు. మరి ఎవరిని చూస్తున్నారు. వాళ్ళందరూ చూస్తున్నది.... కోర్టు డఫేదార్‌ని. అతను అన్న ఒక్క మాట ఆ హాలు నిశ్శబ్దానికి కారణం. ఆ మాట ‘సైలెన్స్‌’. జడ్జిగారు వస్తున్నారన్నదానికి సంకేతం. జడ్జిగారు రానే వచ్చారు. జడ్జమ్మగారు అనాలేమో. ఎందుకంటే వచ్చింది ప్రముఖ మహిళా జడ్జి కుమారి జ్ఞానేశ్వరీ దేవి. ఆమె న్యాయవాదిగా వున్నప్పుడు ఎన్నో మహిళా కేసుల్ని తన వాదనా పటిమతో గెలిపించి... అన్యాయమైపోయిన మహిళల్ని రక్షించిన ఘన చరిత్ర ఆమెది. అలాంటి మహిళల రక్షణకు ‘వివాహం’ అన్నది అడ్డుగోడగా తలచి... కుమారిగానే మిగిలిపోయిన ఐదు పదుల వయసున్న మహిళా జడ్జి. ఆనాడు వాదించి గెలిచింది. మరి ఈనాడు జడ్జిగా ఎన్నో చారిత్రక తీర్పుల్ని వెలువరించి... మహిళల హక్కుల్ని, న్యాయాల్ని కాపాడే ధీర వనితగా నిల్చింది. అలాంటి జడ్జి దగ్గరికి ఒక కేసు వచ్చింది. భర్త ‘నిశ్చల్‌ శాహిద్‌ నిఖారే’ ని చంపిన భార్య దీప కేసు. ఆమె షరిఫ్‌కి కోడలు. నిశ్చల్‌కి భార్య. ఆ కేసు ఫైనల్‌ నేడు వెలువడబోతోంది. అందుకే కోర్టు హాలంతా క్రిక్కిరిసిపోయింది. రాబోయే జడ్జిమెంటు వినడం కోసం. ఆ క్షణాలు రానే వచ్చాయి. ఆ హాలులో జడ్జి కంఠం మాత్రమే వినిసిస్తోంది. ఒకే ఒక్కమాట వెలువడిరది. ‘?’ ఆ మాటతో బోనులో నిలబడివున్న దీప ఉలిక్కిపడిరది. ఇదే తనకి ఆఖరిరోజు. ఈ రోజే తనకి శిక్ష పడే రోజు. ఇలా ఇలా ఆలోచిస్తూ... కానిస్టేబుల్‌ గా రిటైరయ్యిన షరీఫ్‌ ఇంటికి రెంట్‌కి సింగిల్‌ రూమ్‌ తీసుకోవడం దగ్గర్నుచి... ఆ ఇంటికి కోడలిగా మారడం... ఆయన కొడుకుని... షరీఫ్‌ కోరిక మేరకు పెళ్ళి చేసుకోవడం... ఆ తర్వాత చెడు మార్గంలో నడుస్తున్న తన భర్తని తానే చంపాల్సి రావడం వరకూ... ఒక్క క్షణంలో అన్నీ గుర్తు చేసుకుంది.
``:00:``
షరీఫ్‌ నిఖారే అప్పటికి కానిస్టేబులుగా రిటైరయ్యి దాదాపు నెల రోజులయింది. హాలులో సోఫాలో కూర్చుని తనే తయారుచేసుకున్న కాఫీ తాగుతూ కూర్చున్నాడు. తన భార్య సర్వీసులో వుండగానే చనిపోయింది. ఒక్కగానొక్క కొడుకు ‘నిశ్చల్‌’లో తనని చూసుకుంటూ బ్రతకేస్తున్నాడు. కొడుకుకి దాదాపు 35 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఆరోజు కూడా ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అంతలో తనలాగే రిటైరయిన, తన ఫ్రెండ్‌ సుబ్రహ్మణ్య దగ్గరనుంచి ఫోన్‌ వచ్చింది. ‘హలో సుబ్బూ..! ఏంట్రా ఇంత పొద్దున్నే ఫోన్‌ చేసావు’ అన్నాడు. అవతల వాడు చెప్పేది వింటూ... ‘అవునా.... అలా జరిగిందా..? అయ్యో... మరిపుడు ఏం చేస్తున్నావ్‌..? అయినా నేను ముందుగానే చెప్పాను కదరా..! ఈ విదేశీ ఉద్యోగాల మోజు వద్దురా. మన దేశంంలోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమనరా అని చెప్పాను. విన్నావా..? సరే సరే. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగంలోంచి పీకేసారు. ఇంక ఆలోచించేదేముంది. వెంటనే ఇండియాకి వచ్చేయమను. ఆ విదేశం లేకపోయినా... మనం దేశం ఇంకా వుందని చెప్పు. దానికి మించి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పు. ఆ... ఆ... సరే. నేను ఓ అరగంటలో వచ్చి కలుస్తాను.’ అని ఫోన్‌ పెట్టేస్తాడు. లేచి వంటగదిలోకి వెళ్ళబోతూండగా... ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. అప్పటికే దాదాపు పాతికేళ్ళ అమ్మాయి ఇంట్లోకి రావడం... ఇల్లంతా కలియదిరుగుతూ ఇంటిని పరిశీలిస్తూ వుంటుంది. ఆమెను హఠాత్తుగా చూసి... ఉలిక్కిపడిన షరీఫ్‌ ఆమెని అడుగుతాడు. ‘అమ్మాయి... ఎవరు నువ్వు..? సరాసరి ఇంట్లోకి వచ్చేసి... ఇల్లంతా తిరిగేస్తున్నావు.’ అని అడగ్గానే... ఆ అమ్మాయి షరీఫ్‌ కాళ్ళకి దణ్ణం పెడుతూ.... ‘నమస్కారమండి మావయ్యాగారూ..! బయట ‘టు`లెట్‌ బోర్డ్‌ చూసి వచ్చాను. నా పేరు దీప. మాది ఈ ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న పల్లెటూరు. హాస్టల్లో వుంటూ.. ఎం.బీ.ఏ చదివాను. కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా వచ్చింది. అందుకే ఏదైనా రూమ్‌ తీస్కుని.. ఇండివిడ్యువల్‌గా వుందామని ఈ కాలనీలో రూమ్స్‌కోసం తిరుగుతూండగా... మీ ఇంటి ముందు ‘టు`లెట్‌ ఫర్‌ సింగిల్స్‌’ బోర్డు కనిపించింది. చూద్దామని లోపలికి వచ్చాను. మీరు అప్పటికే ఫోన్‌ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయడం ఇష్టం లేక ఇల్లు చూస్తున్నాను.’ అని షరీఫ్‌కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా... పాఠం అప్పజెప్పినట్టు అప్పజెప్పేసింది. ఇప్పటికైనా ఆపిందిరా అని... షరీఫ్‌ పూపిరి పీల్చుకుని..... ‘అదేంటమ్మాయ్‌... గుక్క తిప్పుకోకుండా అలా మాట్లాడేసావ్‌. వుండు. ఒక్క నిముషం’ అని బయటికి వెళ్ళి... ఆ ‘టు`లెట్‌’ బోర్డు తెచ్చేస్తాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం దీప వంతు అయింది. ‘అదేంటి మావయ్యగారూ..! బోర్డ్‌ తెచ్చేసారు. అద్దెకు ఎవరైనా వచ్చేసారా..?’ అని అడుగుతుంది. దానికి షరీఫ్‌... ‘నువ్వు వచ్చావ్‌గా అమ్మాయి. రాగానే ఏ పొరపొచ్చాలు లేకుండా... ఆత్మీయంగా ‘మావయ్య’ అని వరస కలిపేసావ్‌. పైగా సింగిల్‌ అని అన్నావ్‌. ఇంక నీకు రూమ్‌ అద్దెకు ఇచ్చేసాను. కాబట్టి ఈ బోర్డ్‌ తీసేసాను.’ అని అంటాడు. దీప ఆనందపడుతూ... ‘చాలా థాంక్స్‌ మావయ్యగారూ..!’ అంటుంది.
షరీఫ్‌ ఆమెను తీసుకెళ్ళి... ఎడమ పక్క వున్న గదిని చూసిప్తూ వుండగా... షరీఫ్‌ కొడుకు నిశ్చల్‌ విసురుగా ఇంట్లోకి ప్రవేశించి... చేతిలో వున్న విసిరేసి... చిరాకుగా సోఫాలో కూర్చుంటాడు. విసిరేసిన ఫైల్‌లోంచి విడిపోయిన సర్టిఫికెట్స్‌ని ఫైలులో సర్దుతూండగా... షరీఫ్‌, కొడుకుని పలకరిస్తాడు. ‘ఇంటర్వ్యూ ఏమైందిరా..?’ అంటాడు. ‘ఏమవుతుంది..? ఎప్పటిలానే మొండి చెయ్యినే. ఈ ఉద్యోగం కూడా దొరకలేదు. దీనితో ఇంక నేను స్టేట్‌ గవర్నమెంట్‌ జాబ్స్‌ కి కూడా పనికిరానివాణ్ణి అయ్యాను. ఏజ్‌బార్‌ అయిపోయాను. ముప్ఫై ఐదులోకి ప్రవేశించాను. ఆ సర్టిఫికెట్స్‌తో పనిలేదు. ఇంక ఏ కూలో నాలో చేసుకుని బ్రతకడమే.’ అని నిరాశగా మాట్లాడతాడు. ఇంతలో సర్టిఫికెట్స్‌ని సర్దిన ఫైలుని షరీఫ్‌కిచ్చి... నిశ్చల్‌తో మాట్లాడుతుంది. ‘బాగుంది మిస్టర్‌...?’ అని పేరు అడిగినట్టుగా అంటుంది. ‘నిశ్చల్‌ శాహిద్‌ షరీఫ్‌’ అని ముభావంగా చెబుతాడు. దీప మాట్లాడుతూ... ‘నిశ్చల్‌గారూ..! ప్రభుత్వం ఉద్యోగాలిస్తేనే ఉద్యోగం అనుకోవాలా..? ప్రైవేటుగా ఏ చిన్న ఉద్యోగం చేసినా దానిని ఉద్యోగం అనరా..?. థింక్‌ ప్రాసెస్‌ మార్చండి. కాస్త ఆశాజనకంగా ఆలోచించండి. నా వరకు చూస్తూ. నేను ఎం.బీ.ఏ చదివాను. కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను.’ అనగానే... వెంటనే నిశ్చల్‌ రియాక్ట్‌ అయ్యి... ‘మీ ఆడాళ్ళ గురించి చెప్పకు. మా మగాళ్ళం ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రావు.. కానీ మీరు ఓ కనుసైగతో ఉద్యోగం కొట్టేస్తారు. అవసరమైతే పైట కొంచెం జారేసి... ’ అని ఇంకేదో చెప్పబోతూండగా... షరీఫ్‌ చాచిపెట్టి చెంప మీద కొట్టి.... ‘ఆడాళ్ల గురించి నీచంగా మాట్లాడే సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావ్‌రా. అదీ ఒక స్త్రీ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు..?’ అని మందలిస్తాడు. దీప, షరీఫ్‌ని ఆపి... ‘మీరుండండి మావయ్యగారూ..! ఇంక ఉద్యోగాలు రావన్న డిప్రెషన్‌లా మాట్లాడి వుంటారు. కాస్త సైకలాజికల్‌గా ఆలోచించండి. అయినా ఆయనన్న మాటల్లో కూడా కొంత నిజముందిగా. అలాంటి ఆడాళ్ళ వల్లే... మాలాంటి వాళ్ళు మాటలు పడాల్సి వస్తోంది.’ అని చెప్పి... నిశ్చల్‌తో... ‘నిశ్చల్‌గారూ..! మీ నాన్నగారు కొట్టినందుకు బాధపడకండి. మీరేం వర్రీ కాకండి. ఏదో ఉద్యోగం తొందరలో సాధిస్తారు. బీ బ్రేవ్‌.’ అని ఓదారుస్తుంది. దానికి నిశ్చల్‌ సిగ్గుపడి... ‘నన్ను క్షమించండి. ఏదో ఆవేశంలో అలా మాట్లాడేసాను. ఐ యామ్‌ సారీ’ అంటాడు. ‘ఇట్జ్‌ ఓకె’ అంటుంది. షరీఫ్‌ దీపని మెచ్చుకుంటూ... ౖ‘మరీ సత్తెకాలపు అమ్మాయిలా వున్నావ్‌. మరీ ఇంత మెతకతనం, మంచితనం నేటి రోజుల్లో పనికిరావు. కాస్త కరకుతనం కూడా నేర్చుకోమ్మా.’ అని నేటికాలపు తీరుని వివరిస్తాడు. దానికి సమాధానంగా దీప ఓ నవ్వు మాత్రం నవ్వుతుందంతే. షరీఫ్‌ ఆమెని కొడుక్కి, కొడుకుని దీపకి పరిచయం చేస్తాడు.
అలా దీప, నిశ్చల్‌ల పరిచయం పెరిగి, పెరిగీ వారి స్నేహం బలపడుతూండగా ఒకనాడు ఓ సన్నివేశం జరుగుతుంది. నిశ్చల్‌ వంటినిండా రక్తపు మరకలతో, చేతిలో ఓ కత్తితో హడావిడిగా ఇంట్లోకి ప్రవేశించి... బయటికి తొంగి తొంగి చూస్తుంటారు. ఆ సమయంలో దీప, షరీఫ్‌లిద్దరూ టీవీ చూస్తున్నారు. వెంటనే షరీఫ్‌... దీపని కంగారుపడొద్దని చెప్పి... తన కానిస్టేబుల్‌ వృత్తిలోని మెళకువని గుర్తు తెచ్చుకుని... వెంటనే జేబురుమాలుతో వాడి చేతిలోని కత్తిని తీసుకుని.... నిశ్చల్‌ని దొడ్డిగుమ్మంలోకి తీసుకెళతాడు. తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో... స్వార్థంతో... వెంటనే ఆ కత్తిని కడిగేసి... కొడుకు వేసుకున్న దుస్తుల్ని కాల్చేసి... బూడిదని పక్క చెత్తలో పడేసి... వాడిన వేరే దుస్తులు వేసుకుని రమ్మంటాడు. దీపకి ఇదేమీ అర్థంగాక నిశ్చేష్టురాలై చూస్తుంటుంది. నిశ్చల్‌ తండ్రి చెప్పినట్టు బొమ్మలా చేస్తుంటాడు. వాడు రాగానే, వాడి చేతికి కడిగిన కత్తిని ఇచ్చి... తన ఇంట్లోనే పెరుగుతున్న ఓ కోడిని తెచ్చి... వాడి దుస్తుల మీద కూడా రక్తం పడేలా... దాన్ని చంపమంటాడు. నిశ్చల్‌కి ఏమీ అర్థంగాక తండ్రి చెప్పినట్టే చేస్తాడు. ఇదంతా చూడలేని దీప ఇంటి హాలులోనికి వచ్చేస్తుంది. కొద్ది సేపటికి షరీఫ్‌, నిశ్చల్‌లిద్దరూ హాలులోకి వస్తారు. ఇందాక హడావిడిగా లోపలికి వచ్చిన నిశ్చల్‌ ఎలా వున్నాడో... ఇప్పుడు కూడా అలానే వున్నాడు. కాకపోతే తేడా వున్నదల్లా రెండే రెండు విషయాలు. ఒకటి... కత్తికున్న రక్తం కోడి రక్తం. రెండు.... నిశ్చల్‌ వంటి మీదున్న దుస్తులు తాను బయటినుండి వచ్చినప్పటివి కాకుండా వేరేవి. వీళ్ళిద్దరూ ఇలా రాగానే... బయటినుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో పోలీసులు వస్తారు. ఆ వ్యక్తులు నిశ్చల్‌ని చూపించి... ‘ఇతనే సార్‌. ఆ బిజినెస్‌ మాగ్నెట్‌ని చంపింది. అదిగో ఆ చేతిలోని ఆ కత్తితోనే చంపాడు’ అని చెప్పగానే... అతని చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకుని, నిశ్చల్‌ని అరెస్ట్‌ చేసి తీసుకుని పోతారు.
తన కొడుకుని తీసుకుపోయాక... తండ్రి షరీఫ్‌ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తాడు. అనుభవజ్ఞుడైన క్రిమినల్‌ లాయర్‌ని ఏర్పాటు చేసి... తన కొడుకు విడుదలకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవిడెన్స్‌గా ప్రవేశపెట్టిన కత్తిపై ఉన్నది కోడి రక్తమని... అతని దుస్తులపై వున్నది కోడి రక్తమేనని డిఫెన్స్‌ వాదించడంతో... నిశ్చల్‌ నిర్దోషిగా బయటికి వస్తాడు. గానీ దాని ఫలితం షరీఫ్‌ని బాగా క్రంగదీస్తుంది. తన కొడుకుని రక్షించుకునే ప్రయత్నంలో... కోర్టుని తప్పుదోవ పట్టించానన్న అపరాధ భావంతో మంచం పడ్తాడు. కొడుక్కి పెళ్ళి చేస్తే... కాస్త దారిలోకి వస్తాడేమో అని భావించి... దీపని బ్రతిమిలాడుకుని ఒప్పించి... నిశ్చల్‌తో పెళ్ళి జరిపిస్తాడు. గానీ దీనికి భిన్నంగా కొడుకు నిశ్చల్‌ ప్రవర్తన మారిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేస్తూ... రౌడీ షీట్‌ కూడా తెరిపించుకున్న కిరాతకుడిగా మారిపోతాడు. దీప ఏం చేయలేక మావయ్యతో చెబుతుంది. కాస్త కోలుకున్న షరీఫ్‌, తన కొడుకుని సముదాయించడానికి ప్రయత్నిస్తాడు. ‘బిజినెస్‌ మాగ్నెట్‌ హత్య కేసులో నిన్ను రక్షించి చాలా తప్పు చేసానురా. నీ మీద రౌడీషీట్‌ తెరిచేలా ఎందుకు మారావని నిలదీస్తాడు.’ దానికి నిశ్చల్‌ చాలా నిష్కర్షగా మాట్లాడుతూ... ‘నా లక్ష్యానికి చేరుకోవడానికి నేనెంతకైనా తెగిస్తాను’ అని చెబ్తాడు. ‘ఏవిటా లక్ష్యం..?’ అని దీప అడిగితే... ‘రాజకీయ నాయకుడ్ని కావడమే నా లక్ష్యం’ అని నిశ్చల్‌ జవాబిస్తాడు. ‘అలా కావాలంటే... నా మీద రౌడీషీట్‌ ఓపెన్‌ కావడమే నాకు మార్గం. అందుకే ఈనాడు అది కూడా సంపాదించాను. ఇప్పుడు రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా సీటు రాబోతోంది. ఆ తర్వాత ఎం.ఎల్‌.ఏ. స్థానానికి ఎదగడమే నా కోరిక. బుద్ధిగా చదువుకుని ఉద్యోగం సాధించలేని అసమర్థుడ్ని. కానీ అడ్డదారిలో ఎదిగి... ఈజీగా రాజకీయ నాయకుడ్ని అవుతున్నా’ అంటాడు. దానికి షరీఫ్‌ అందుకుని... ‘చాలా తప్పుగా ఆలోచిస్తున్నావ్‌. ఇప్పటికైనా మించిపోయింది లేదు.’ అని అంటే... ‘లేదు. నేను అన్నీ నిర్ణయించుకున్నాకనే ఈ దారిలోకి వచ్చాను. ఇది ఒక పద్మవ్యూహం. దీనిలోకి అర్జునుడ్ని ప్రవేశించినా... అభిమన్యుడిలా బలి కావాల్సిందే. తిరిగి రావడానికి మార్గం లేదు. కాబట్టి ఐ యామ్‌ సారీ. ఈ విషయంలో మనసు మార్చుకునేది లేదు’ అంటూ విసురుగా వెళ్ళిపోతాడు.
రోజులు గడిచిపోయాయి. పరిస్థితులు మారిపోయాయి. కౌన్సిలర్‌గా ఎదిగిన నిశ్చల్‌... ఎం.ఎల్‌.ఏ.గా కూడా గెలిచాడు. కానీ కుటుంబ బాంధవ్యాల విషయంలో ఓడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజున దీప భర్తకి హితబోధ చేస్తుంది. తండ్రి కూడా కొడుకుకి మారమని చెబుతాడు. ‘ఇప్పటికైనా మారండి. ఎలాగూ ఎం.ఎల్‌.ఏగా గెలిచారు. ఇప్పుడైనా కాస్త ప్రజలకు సేవ చేసి... చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి’ అని నచ్చచెప్తుంది. ‘సరే చేసుకో. ఎవడొద్దన్నాడు’ అని అంటాడు. అంతలోనే నిశ్చల్‌కి ఫోన్‌ వస్తుంది. ఎత్తగానే అవతలి కంఠం ‘ఏవయ్యా..! ఎం.ఎల్‌.ఏ.గా గెలిచావ్‌. మరి మంత్రిగా ప్రయత్నిస్తున్నావటగా. పార్టీ ప్రతినిధి ఆయన కంపెనీ చైతన్య గ్రూప్స్‌ ఆఫీస్‌లో వున్నాడు. వెళ్ళి కలువు. ఇంకో విషయం... ఎవరైనా ఫ్యామిలీ టైపు స్త్రీని తీసుకుని వెళ్ళు. పని సులువుగా అయిపోతుంది.’ అని చెబుతుంది. దానికి నిశ్చల్‌... ‘అవునా... మంచి సలహా ఇచ్చారు. అలాగే వెళతాను. ఫ్యామిలీ టైపు కాదు ఫ్యామిలీనే తీసుకుని వెళ్తాను’ అని తన భార్య కేసి చూస్తూ... చివరి మాట చాలా చిన్నగా చెబుతాడు. ఫోన్‌ పెట్టేసి... దీప దగ్గరికి వచ్చి... ‘సరే. నువ్వు చెప్పినట్టు మారడానికి ప్రయత్నిస్తాను.’ అని మారినట్టు నటించి... దీపని ఎలాగోలా ఆ పార్టీ ప్రతినిధి దగ్గరికి పంపించి... ఆమె ద్వారా మంత్రి పదవిని సాధించాలన్నంత నీచపు ఆలోచన చేస్తాడు. దాంతో ప్రేమ నటిస్తూ... ‘ఇకనుంచి ప్రజలకు సేవ చేయడానికి నీ సలహాలు తీసుకుంటాను. అవునూ.. నువ్వు ఏదో ఉద్యోగం చేస్తానన్నావ్‌గా. ప్రముఖ కంపెనీ చైతన్య గ్రూప్స్‌ అధినేతకి పి.ఏ. కావాలన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళు.’ అని ఒక కార్డ్‌ ఇస్తాడు. దానికి దీప, తన భర్త మారతానన్నందుకు సంతోషించి... ‘సరే వెళతానండి. మీరు మారతానన్నారుగా. నాకు చాలా ఆనందంగా వుందండి’ అని ఆ కార్డు తీసుకుంటూండగా... షరీఫ్‌ వచ్చి ఆ కార్డుని లాగేసుకుని... ‘పిచ్చిదానా..! ఇంకా వాడ్ని నమ్ముతున్నావా..? వాడేదో ప్లాన్‌తో నిన్ను పంపిస్తున్నాడు. నా కొడుకయినా నేను సమర్థించను. వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఇంత తొందరగా మారిపోతానని వాడంటే ఎలా నమ్ముతున్నావు. ఇప్పుడు వాడు నిన్ను పంపడం వెనక ఏదో దురుద్దేశం వుంటుంది’ అని దీపకి చెబుతాడు. తన ప్లాన్‌కి అడ్డు తగులుతున్నాడని నాన్న మీద కోపం వస్తుంది. తన ప్లాన్‌ పాడయితే... ఇంక మంత్రి పదవి దక్కదని భయపడి... లాభం లేదనుకుని... దీపని బలవంతంగా లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. దానికి షరీఫ్‌ అడ్డుపడతాడు. కోడలిని తీసుకెళితే వూరుకోనని అంటాడు. దీప చేయి విదుల్చుకోడానికి ప్రయత్నిస్తూ... ‘ నేను మీ భార్యనండి. మీ రాజకీయానికి నన్ను బలి చేయాలని చూస్తారా..? ఇంత నీచానికి ఒడిగడతారా..?. నేను రాను’ అని అంటుంది. షరీఫ్‌ అడ్డంగానే నిలబడి కొడుకుని ఆపడానికి ప్రయత్నిస్తాడు. నాన్నని పక్కకు తోసేస్తే సోఫాలో పడిపోతాడు. నాన్న దగ్గరికి వెళ్ళి... ‘చూడు నాన్నా..! నేననుకున్నది జరిగి తీరాల్సిందే. ఏనాడు నా సర్టిఫికెట్స్‌ విలువ లేదని తెలిసిందో ఆనాడే నిర్ణయించుకున్నాను. ఎంత చదువుకున్నా వుద్యోగం రాదు గానీ... నిశాని అయినా కూడా రాజకీయ నాయకులం కావచ్చు. అంత గొప్పది ఈ ప్రజాస్వామ్యం. ఎంతో ఉన్నతవిద్య చదువువుకుని... దాదాపు 30 సంవత్సరాల సర్వీసు చేసే ఐ.ఏ.ఎస్‌, ఐ.పీ.ఎస్‌ ఆఫీసర్లని కూడా శాసించగలడు మా నిశాని రాజకీయనాయకుడు. అదే ఈ రాజకీయంలోని ప్రత్యేకత. నిశ్చల్‌ శాహిద్‌ నిఖారే వురఫ్‌ ని॥శా॥ని అనబడే నేను కనుగొన్న సత్యం అదే. కాబట్టి నా దారికి అడ్డురాకండి . తప్పుకోండి’ అని హఠాత్తుగా రివాల్వర్‌ తీసి... నాన్నవైపు గురి పెట్టి... దీపతో... ‘నువ్వు మర్యాదగా నాతో రాకపోయావో... నాన్న అని కూడా చూడకుండా చంపేస్తాను. నేనెంత క్రూరుడ్నో తెలుసు కదా... వూ నడు.’ అని బెదిరించి లాక్కుని పోతూంటే దీప విడిపించుకోడానికి పెనుగులాడుతుంది. షరీఫ్‌ కల్పించుకుని... దీపని విడిపించడానికి పెనుగులాడుతాడు. ఆ పెనుగులాటలో ఒక్క సారిగా రివాల్వర్‌ పేలిన శబ్దం వినిపిస్తుంది. ఒక్క క్షణంలో ఏం జరిగిందో తెలీని పరిస్థితి. హడావుడి సర్దుకునేసరికి.... నిశ్చల్‌ శవమై పడివుంటాడు. షరీఫ్‌, దీపలు నిశ్చేష్టులై చూస్తుంటారు. షరీఫ్‌ కొడుకు మరణానికి బాధపడుతుంటాడు. ఆ బాధలో అలానే స్పృహ కోల్పోతాడు. ‘మావయ్యా..!’ అంటూ దీప ఏడుస్తూ... 108 కి ఫోన్‌ చేస్తుంది.
``:00:``
‘మిసెస్‌ దీపా..! మిమ్మల్నే’ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కుదిపిన కుదుపుకి ఒక్కసారిగా దీప ఈ లోకంలోకి వస్తుంది. తానున్నది కోర్టులో అని గుర్తుకు చేసుకుంటుంది. క్షణాల్లో గుర్తుకి వచ్చిన తన గతాన్ని తల్చుకుని విరక్తిగా ఓ నవ్వు నవ్వుతుంది. అప్పుడు జడ్జి మళ్ళీ... ‘అమ్మా దీపా... మీరు ఈ కోర్టుకి చెప్పుకోవలసింది ఏమైనా మిగిలి వుందా..?’ అని అడుగుతుంది. దానికి బదులుగా దీప... ‘నేను తప్పు చేసాను. ఇంతకు మించి చెప్పలేను’ అని చేతులు జోడిరచి కోర్టుకి నమస్కరిస్తుంది. జడ్జి తన తీర్పుని వినిపిస్తుంది. ‘ఇట్జ్‌ ఓకె. పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత...’ అని ఆగుతుంది. కోర్టు హాలంతా నిశ్శబ్దం. మళ్ళీ చదువుతుంది. ‘దీప అనబడే ముద్దాయి తన భర్తని తానే చంపానని ఒప్పుకోవడంమే కాకుండా... ప్రాసిక్యూషన్‌ వారు కూడా సాక్ష్యాధారాలతో నిరూపించడంతో... నేరం ఋజువయింది. కాకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని... సమాజాన్ని కబళించాలనుకునే ఓ దుర్మార్గుడ్ని చంపడం నేరమే అయినప్పటికీ... ఒక అబల తన శీలాన్ని రక్షించుకునే ఆత్మరక్షణా ప్రయత్నాన్ని దృష్టిలో వుంచుకుని... ఆ కోణంలో ఈ కేసుని చూసి... రైట్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ డిఫెన్స్‌కి సంబంధించిన విషయాలను అన్నిటినీ కూలంకషంగా పరిశీలించి... ఐ.పి.సి. సెక్షన్‌ 96 నుండి 106 వరకు వున్న సెక్షన్ల ప్రకారం ఆమెని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను’ అని తీర్పుని ముగిస్తుంది. షరీఫ్‌, కోడలికేసి ఆప్యాయంగా చూస్తాడు. కోర్టు హాలు మళ్ళీ కలకలం చెలరేగుతుంది. మళ్లీ వెంటనే ఒకే ఒక్క మాట.... ‘సైలెన్స్‌’ తో నిశ్శబ్దం అలుముకుంటుంది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు