కోడి,కోయలయ్య కూతలకు మెలకువ వచ్చింది కోతికి. కూతకూస్తున్న కోయలయ్య ఉన్నచెట్టు కొమ్మవద్దకు వెళ్ళి " అన్నా ఆకోడయ్యకు కూత అలవాటు పుట్టుకతో వచ్చింది తెల్లవారకముందే కూస్తుంటాడు ,నీకు ఇది న్యాయంగా ఉందా? ఏప్రాణికైన మంచి నిద్రపట్టే సమయం వేకువనే ఆసమయంలో నువ్వు ఇలాకూతలు కూస్తుంటే మాఅందరి నిద్రాభంగం కాదా ? " అన్నాడు.
" నేను నిద్రలేచేసరికి నాభార్య కోయిల కనుపించలేదు అందుకే ఆమెకోసం కూతపెడుతున్నా " అన్నాడు కోయిలయ్య. " మావిచిగురులు తినడానికి వెళ్ళి ఉంటుంది వస్తుందిలే మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వు " అని తనచెట్టువద్దకు వస్తున్న కోతికి ,పురివిప్పిన నెమలయ్య అమోఘమైన నృత్యం చేస్తు కనిపించాడు. "బావా సమయం సందర్భంలేకుండా అర్దరాత్రి అంకమ్మ శివాలులా ఈచిందులేమిటి? " అన్నాడు. " కోతిబావా ఆకాశం అంతా మేఘాలు పట్టి చల్లటి గాలివీస్తుంది అహ్లదకరమైన ఈవాతావరణం నాకు ఎంతో ఆనందం కలిగించింది అందుకే నృత్యం చేస్తున్నా,చూడు నానృత్యం చూడటానికి ఎన్ని ఆడనెమళ్ళు నాచుట్టూచేరాయో " అన్నాడు.
ఏంమాట్లాడాలో తెలియని కోతి తలగీరుకుంటూ తనచెట్టువద్దకు వచ్చేసరికి పూర్తిగా తెల్లవారింది.
మరికొద్దిసేపటికి కుందేలు మామ,గుర్రం తాత కలసి కోతి చెట్టువద్దకు వచ్చారు. "అల్లుడు నువ్వు తల్లిభాష గురించి అడిగావుకదా గుర్రంతాత చాలాకాలం మనుషులతోకలసి సర్కస్ లో పని చేసాడు, ప్రపంచంలో చాలా దేశాలో ప్రదర్శనలు ఇచ్చాడు.తల్లిభాషగురించి నీకు ఉన్న అనుమానాలు అడిగి తెలుసుకో " అన్నాడు. " తాతా తల్లిభాష విలువ తెలియజేయి "అన్నాడు కోతి.
" తల్లిభాష అంటే అమ్మ నేర్పినభాష అందుకే దాన్ని మాతృభాష అనికూడా అంటాం.నేడు ప్రపంచం అంతటా పలుదేశాలు అంటే చైనా,జపాను,రష్యా, జర్మని,ఇటలి,ఫ్రాన్స్ వంటి పలు దేశాలు వారి దేశ మాతృభాషలోనే దేశ వ్యవహరాలన్ని నడుపుతున్నారు. అసలు భాషఅనేది ఏదేశ ప్రజలకైనా ఊపిరివంటిది. నేడు ప్రపంచంలో రమారమి ఎనిమిదివందల కోట్లప్రజలు సుమారు ఆరు వేల భాషలకు పైగామాట్లాడు తున్నారు.ఇందులో దాదాపు రెండువేల ఎనిమిది వందల భాషలు అంతరించాయి. ముఖ్యంగా మన భారతీయ అన్నిభాషలలో తోపాటుగా తెలుగు భాషలోకూడా ఆంగ్లపదాలు వేలసంఖ్యలో వాడుకలో వచ్చిచేరాయి. ఇవికాకుండా ఉర్దు,సంస్కృతం నుండి కూడా ఎన్నో పదాలు విరివిగా వచ్చి తెలుగు భాషలో చేరాయి. ఆంగ్లంలో ఊదాహరణకు రైల్వేష్టేషన్ ,బుకింగ్ ,టిక్కెట్ ,ట్రయిన్ ,ఫ్లాట్ ఫాం,టి.సి.,సిగ్నల్ ,ఇలా ఎక్కడ తెలుగు పదం కనపడదు.మరో ఉదాహరణ. ప్రభుత్వ వైద్యశాల ,జనరల్ హస్పెటల్ ,ఒ.పి. డాక్టర్ ,నర్స్ , టెస్టు, ఎక్స్ రే, బ్లడ్ టెస్టు, స్కాన్ , టాబ్ లెట్స్ ,టానిక్ , ఆపరేషన్ వంటి అన్ని పదాలు మనకు ఆంగ్లంలోనే కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇంకా తంతితపాల కార్యాలయం ,పోస్టాఫీస్ ,పోస్టు, యం.వో, కవర్ ,కార్డు,స్టాంపు ఇలా ఎక్కడా తెలుగు ఉండదు. బస్ స్టాండ్ ,బస్ ,డ్రవర్ ,కండక్టర్ ,టిక్కెట్ ,స్టేజి, ఇలా ఎన్నో వేల ఆంగ్లపదాలు మన నిత్యజీవితంలో మాట్లాడే భాషలో తిష్టవేసుకున్నాయి. పెద్దలుమాతృ భాషాప్రేమికులు,తెలుగు పండితులు, భాషాభిమానులు నడుంబిగించి ఆంగ్లపదాల స్ధానంలో తెలుగు పదాలను తయారు చేయవచ్చు. బ్రతకడానికి పలువిద్యలు,పలుభాషలు నేర్వవలసిందే కాని తల్లిభాషను నిర్లలక్ష్యం చేయకూడదు.జన్మనిచ్చిన మనతల్లి మనతో కొంతకాలమే ఉంటుంది కాని ఆతల్లినేర్పిన తల్లిభాష కడదాకమనతోనే ఉంటుందని మనం ఎన్నడూ మరువకూడదు" అన్నాడు గుర్రంతాత.
" నిజమే అన్నింటిలోనూ కల్తిజరుగుతుందని గగ్గోలు పెట్టెవారు తల్లిభాషలో జరిగిన కల్తిని గమనించకపోవడం శోచనీయం " అన్నాడు కోతి.