జంతువులన్నీ ఎంతో ఐకమత్యంగా ఉండేటువంటి ఆ అందమైన అడవిలో నక్కలకి కొంగలకి ఏమాత్రం పడేది కాదు. దానికి కారణం నక్కల తాత డమరుకం,
కొంగల తాత జంబూకం " మా పూర్వకాలం పెద్దల్ని మీ పూర్వకాలం పెద్దలు విందుకు పిలిచి అవమానించారని" ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటూ తమ పిల్లలకు, మనవలకు, 'ఎదుటిజాతిమీద' సఖ్యత లేకుండా రెచ్చగొట్టేలా మాట్లాడటమే కారణం.
ఆ కారణంగా కొంగజాతి పిల్లలు, నక్కజాతి పిల్లలు ఒంటరిగా ఒకరికి ఒకరు దొరికినప్పుడల్లా 'నువ్వు అలాంటి దానివి అంటే నువ్వు అలాంటి దానివి అని' కలహించుకునేవి.
" మీ తాత మా ఇంటికి విందుకు వచ్చినపుడు మాతాత పాయసం పెట్టిన కూజా ఇంకా మా ఇంట్లో ఉంది తెలుసా?" అని కొంగజాతి మనవడు విర్రవీగితే ...' మీ తాత మా ఇంట్లో విందుకు వచ్చినప్పుడు పాయసం పెట్టిన పెద్ద పళ్ళెం మా ఇంట్లోనూ ఉంది తెలుసా?' అని నక్కజాతి మనవడు మీసం మెలేసే వేసేది.
ఒకరి మీద పగ మరొకరు ఎప్పుడు ఎలా తీర్చుకుందామా అని ఆ మనవలిద్దరూ ఎంతో కసిగా ఉన్నారు.
ఇలా ఉండగా పక్క రాజ్యం అడవిలో యువరాజు పట్టాభిషేకానికి రమ్మని ఈ అడవిలో జంతువులు అందరికీ ఆహ్వానం అందింది. దాంతో ఒక్కరు కూడా మానకుండా
హాజరవ్వాలని ఈ అడవి రాజు చాటింపుయించాడు.
ఆ చాటింపు విని తమ జాతివైరం తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం అన్న ఆలోచన కొంగ మనవడికి, నక్క మనవడికి విచిత్రంగా ఒకేసారి కలిగింది.
'నాకు నీరసంగా ఉంది. నేను అంత దూరం రాలేను' అని నక్క మనవడు తన వాళ్లతో అంటే, ' నాకు చేపలు ఎక్కువగా తిని కడుపు నొప్పిగా ఉంది. నేను రాలేను' అని కొంగ మనవడు తన వాళ్ళతో చెప్పింది.
వాళ్లకి తగిన ఉపచారాలు చేసి సాయంత్రానికి వస్తామని చెప్పి అడవిలోని జంతువులతోబాటు కొంగలు, నక్కలు కూడా పట్టాభిషేకానికి వెళ్లిపోయాయి.
అవన్నీ అటు వెళ్ళగానే కొంగ మనవడు నక్క మనవడి ఇంటికి వచ్చి 'మా వాళ్లు అందరూ పట్టాభిషేకానికి వెళ్లారు. మా ఇంటికి విందు భోజనానికి రా...మనిద్దరం కలిసి హాయిగా భోజనం చేద్దాం.' అని నక్క మనవడిని ఆహ్వానించింది.
" ఒంటరిగా దొరికావ్! ఇప్పుడు చెప్తా నీ సంగతి!" ఎవరికి వారు అనుకున్నారు వాళ్ళు ఇద్దరు.
నక్క మనవడు తన ఇంటికి వచ్చాక తమ తాతలనాటి కూజాలోనే చేపల పాయసం చేసి వడ్డించింది కొంగ మనవడు.
దాని చుట్టూ తిరిగి ఘుమఘుమలాడుతున్న పాయసం వాసన చూసి పది అడుగులు వెనక్కి నడిచింది నక్క మనవడు.
వెనకడుగులు వేసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోవడం చూసి " నీ రోగం ఎలా కుదిరించాలో నాకు తెలిసే " అని కసిగా అనుకుంది కొంగ మనవడు.
నక్క మనవడు వేగంగా పరిగెత్తుకువచ్చి తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా ఆ పాతకాలం కూజాని బలంగా తన్నింది.
దాంతో కూజా ముక్కలు ముక్కలుగా పగిలిపోయి పాయసమంతా నేలపాలైపోయింది.
" అయ్యో! పైకి ఎగిరి కూజా అంచు మీద కూర్చుని పాయసం తిందాం అనుకున్నాను. కానీ పగిలిపోయింది ఏమీ అనుకోకు. పోనీలే నువ్వు మా ఇంటికి విందుకు రా! నీకు చక్కని చేపల పాయసం చేసి పెడతాను. " అని కొంగను తన ఇంటికి ఆహ్వానించి 'దానికి తగిన శాస్తి చేశాను' అని నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క మనవడు.
నక్కమనవడి ఇంటి నుంచి కమ్మని చేపల పాయసం వాసన వచ్చాక కొంగ మనవడు చొంగ కార్చుకుంటూ ఇంటికి వచ్చింది.
నక్క మనవడి ఇంట్లో తన తాతలనాటి విశాలమైన పళ్లెంలో పాయసం పోసి తినమని చెప్పింది నక్క మనవడు.
" చేపల పాయసం అన్నావ్.. చేపలేవి?" అడిగింది కొంగ మనవడు.
" చేపల ముల్లులు నీకు ఎక్కడ గుచ్చుకుంటాయోనని.. వాటిని నేను తినేసి నీకు పాయసం ఒకటీ మిగిల్చాను. కడుపునిండా తాగు." అంది నక్క మనవడు.
అసలే ఆకలితో ఉన్నటువంటి కొంగ మనవడికి పగతో పాటు తీవ్రమైన కోపం వచ్చేసింది.
వెంటనే తన బలమైన ముక్కుతో ఆ పళ్ళాన్ని సాధ్యమైనన్ని చిల్లులు పడేలా పోట్లు పొడిచేసింది.
దాంతో పాయసం అంతా కారిపోయి నేల పాలైపోయింది.
నక్కమనవడికి ఎంతో కోపం వచ్చేసింది. కొంగని పట్టుకుని కరకర నమలి తినేయాలని ఎంతో ప్రయత్నం చేసింది. నక్కమనవడు దానికి అందకుండా ఎగిరిపోయి తన పొడవాటి ముక్కుతో నక్కమనవడిని కూడా గాయపరచాలని ఎంతో ప్రయత్నం చేసింది.
కొద్దిసేపు అయ్యాక ఆ రెండింటికి తమ శక్తి నశించి కూర్చుండిపోయాయి.
అప్పుడు ఆ రెండు ఆలోచనలో పడ్డాయి. కొద్దిసేపటి తర్వాత కొంగ మనవడు నక్క మనవడితో అంది!
"ఇందులో మొదటి తప్పు నాదే నక్కబావా! మన తాతలు మనలో అర్థంపర్థం లేని కక్షనీ ఆవేశాన్ని పెంచి పోషించారు.
ఎప్పుడో వారి కాలంనాడు అలా ప్రవర్తించారని ఈనాడు మనం ఇలా ప్రవర్తించడంవల్ల నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు. మన ఆకలి తీరలేదు. నన్ను క్షమించు.
మనం స్నేహభావంతో కలిసి ఉంటే ఇటువంటి అనర్ధాలు జరిగేవి కావు.
మన పాతకాలం పగలవల్ల మన పెద్దలు ఎంతో ఇష్టపూర్వకంగా దాచుకున్న వస్తువుల్ని కూడా ఆవేశంతో అజ్ఞానంతో మనమిద్దరం నాశనం చేశాము. వాళ్లందరూ తిరిగి వస్తే మనని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారు.
వాళ్లంతా తిరిగి వచ్చే లోపల ఆ వస్తువుల స్థానంలో తిరిగి కొత్త వస్తువుల్ని కొనుక్కునివచ్చి వాటి స్థానాల్లో ఉంచేస్తే కొంత శిక్ష అయినా తగ్గుతుంది. ఏమంటావ్ నక్క బావ!"
ఆలోచనత్మకంగా ఉన్న ఆ మాటలు విని నక్క మనవడు ఎంతో సంతోషించింది.
''గతం గతః ఇకనుంచి మనం మంచి స్నేహితులం. వాళ్ళు చేసిన మంచి ఆదర్శంగా తీసుకోవాలి గానీ చెడు ను లెక్కలోకి తీసుకుని మనం ఇలా దెబ్బలాడుకోవడం మనజాతి వారికెవరికీ మంచిది కాదు.'' అంది కొంగ మనవడు.
''నువ్వు చెప్పింది నిజం బావా..అందుకే ఐకమత్యమే మహా బలం అన్నారు పెద్దలు . నువ్వు చెప్పిన అన్ని మాటలు నాకు ఎంతో నచ్చాయి బావ. ఆవేశము, పగల వల్ల నష్టమే జరుగుతుందని నేను తెలుసుకున్నాను. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. మన పెద్ద వాళ్ళు వచ్చే లోపల వెళ్లి అలాంటి కొత్త కూజా, కొత్త పళ్ళెం కొని తెచ్చి వాటి స్థానాల్లో పెట్టేద్దాం." అంది నక్క మనవడు.
. "సరే పద బావ!" అంటూ అనుసరించింది కొంగ మనవడు.
సమాప్తం