“కేవలం చూపులతో ఊసులాడుకుని
కాలం లో కలిసిపోయిన కథలు ఎన్నో
పెదవి దాటని మాటల మూటలతో
మూగబోయిన మనస్సులెన్నో
ఆశలన్నీ ఊహలకి వదిలేసి
కలలతో ఎదురు చూసిన కనులు
ఎవరికీ తెలియని కథలెన్నో
అవన్నీ చీకటిలో కలిసిన కథలే కాని
అప్పుడప్పుడు మెరిసి వెళ్ళిపోతుంటాయి.....
కాటన్ చీర పైన పువ్వుల డిజైన్ ని చేత్తో తడిమి చూస్తూ ఉంది. పసిడి వర్ణం చీరపై అక్కడక్కడా తెల్లటి ఎంబ్రాయిడరీ పువ్వుల అల్లిక పొందికగా కుదిరింది.
జీవం లేని పువ్వులే అయినా చీర మీద చూడ్డానికి బావున్నాయి తన లాగానే.
చీరని తన ఒంటి మీద పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ పదే పదే తడిమి చూస్తూ ఉంది వసుధ.
“అమ్మా...చీర నచ్చిందా? అంటూ గదిలోకి వచ్చింది బిందు.
భుజం మీద ఉన్న చీరని చటుక్కున తీసేస్తూ....నా వయస్సుకి ఈ చీరలెందుకే? ఉన్నవే సరిగ్గా కట్టుకోవట్లేదు అంటూ చీరని ఓ చేత్తో తడుముతూ ఉంది.
“అయినా...నచ్చిన బట్టలు వేసుకోడానికి వయస్సుతో పనేంటమ్మా...నీ వయస్సు ఉన్న వాళ్లు చూడు పంజాబీ డ్రెస్ లు కూడా వేసుకుంటున్నారు. నువ్వేమో ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ చీరకే వయస్సు లెక్కలేసుకుంటున్నావు అంది బిందు.
ఈ రంగులో నా దగ్గరో చీర ఉండేది అంటూ చీర వైపు చూస్తూనే ఉంది వసుధ.
“గుర్తుంది....దాని మీద ఊదారంగులో అక్కడక్కడా చిన్న పువ్వులుండేవి , అమ్మమ్మ వాళ్లింట్లో నువ్వు ఆ చీరతో దిగిన ఓ ఫోటో కూడా ఉండేది అంది బిందు పక్కన కూర్చుంటూ.
“ఆ(( అదే అంది వసుధ నవ్వుతూ.
“అమ్మా...నువ్వెవ్వరినైనా ప్రేమించావా?”అంది బిందు మెల్లగా
చివుక్కున తలెత్తి చూసి “ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిగాని పట్టిందా ఏంటి? నువ్వూ నీ పిచ్చి ప్రశ్నలు అంటూ లేచి చీరని బీరువాలో పెట్టేసింది.
“సర్లే ప్రేమ కాకపోయినా ఇష్టం లాంటివి? అంది బిందు మళ్ళీ
కోపంగా చూసి “వెళ్లు వెళ్లి వంట సంగతి చూడూ అంటూ గదిలో సర్దిన వస్తువులని మళ్ళీ పై పైన సర్దుతూ ఉంది.
“సరే పోనీలే...కనీసం నిన్ను ఎవరైనా ప్రేమించారా? అంది బిందు మళ్ళీ వాళ్లమ్మ వైపు చూస్తూ
బిందువైపు కోపంగా చూసి ఊరుకుంది.
కనీసం ఎవరో ఒకరు ఇష్టపడైనా ఉంటారు కదమ్మా అంది నవ్వుతూ
“నోర్ముసుకుని బయటకి వెళ్లు అంది గొంతుని కాస్త రెట్టిస్తూ
“సర్లే...చెప్పకపోతే పో అని వెళ్ళిపోయింది బిందు.
బలవంతంగా కళ్లు మూసుకున్నా నిద్ర పట్టట్లేదు.అటు ఇటు దొర్లుతూ మోకాళ్లకి తైలాన్ని రుద్దుకుని పడుకుంది
నిన్న బిందు అడిగిన ప్రశ్నమనస్సులో కలుక్కుమంటూ ఉంది
కాటికి కాలు చాపిన వయస్సులో ప్రేమ గురించి ఆలోచించడం తప్పో ఒప్పో కూడా అర్థం కాలేదు.
******
చెట్ల సందుల్లో గుడ్డిగా వెలుగుతున్న వీధి దీపాలు , దారి పొడవునా నేలపైన పరిచినట్టు రాలి ఉన్న పారిజాత పువ్వులు వాటి సువాసన వీధి మొత్తాన్ని ఆక్రమించేసి ఉంది. ఎదురుగా కింద పడిన పువ్వుల మీదుగా సైకిల్ పోనివ్వకుండా జాగ్రత్త గా దాటుకుంటూ వస్తున్నాడతను. ఇప్పటికీ ఆ రోజు కళ్లకు కట్టినట్టే గుర్తుకొస్తుంది.
అతన్ని చాలా సార్లు ఇంటి పిట్ట గోడ దగ్గర , వీధి చివరన ఇంకా బస్టాప్పుల్లోను చూసాను.
కాని దగ్గరగా చూడ్డం అదే మొదటి సారి. అతనలా సైకిల్ ని ఓ చేత్తో పైకి ఎత్తిపట్టుకుని వస్తుంటే తమాషాగా అనిపించింది.
కృష్ణుడు గోవర్దన గిరి ని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తున్నాడు. అక్కడున్న పువ్వులని ముగ్గులని దాటుకుని రావడం అంటే సాహసమనే చెప్పాలి. తర్వాత కూడా కనిపిస్తూ ఉండేవాడు. చాలా రోజులుగా అతన్ని చూడ్డం వలనేమో కొత్తదనం కాస్త పాత బడి దగ్గరగా అనిపించేవాడు.
ఒక మనిషితో కనీస పరిచయం లేకపోయినా దగ్గరగా అనిపించడమేంటో మరీ వింత గా.దానికి తోడు ఒకరిద్దరూ మంచివాడని చెప్పడంతో ఏదో తెలియని ఆశ పుట్టుకొచ్చింది.
రుక్మిణి దేవి శ్రీ కృష్ణుడి చూడకుండా కేవలం ఆయన గురించి విని ప్రేమ లో పడిపోయిందంట అలాంటిది సాధారణ మనుషులం మనమెంత ? అనిపించింది.
ప్రేమ అని ఖచ్చితంగా తెలీదు కాని తెలియకుండానే నా చూపులు అతని కోసం వెతికేవి. చూడాలన్న తపన చూసాక వచ్చే అనుభూతికన్నా గొప్పగా అనిపించేది. తను చూసెళ్లిపొయేది రెండు నిమిషాలే అయినా గడియలు లెక్కపెట్టుకునేదాన్ని. ఎన్నో మాటల్ని రాత్రి పూట వెన్నెలకి చెప్పుకునేదాన్ని కొన్ని మాటలని మూటగట్టి దాచి పెట్టుకునేదాన్ని.కలిసిన రోజు నా మాటల ప్రవాహంలో కొట్టుకునిపోతాడేమో అనిపించి నవ్వుకునేదాన్ని.కలిసే అవకాశమే రాలేదు.అప్పట్లో ఇంటి గడప దాటి బయటకి రావడమే అరుదు అలాంటిది కలిసి మాట్లాడం అస్సలు కుదరని పని. చూపులతోనే రోజులు గడిచిపోయాయి.
ఆ రోజు శ్రీ రామ నవమి వసంతోత్సవాలు ఊరు మొత్తం రంగులుని పులుముకుని నేల మీద విరిసిన ఇంద్ర ధనస్సులా ఉంది.
ఊరంతా పండగలా ఉంది. పల్లకిలో వస్తున్న సీతారాములని చూస్తూ ఉండగా
ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసాను.
అతనే....అంత దగ్గరగా చూడగానే నోటి నుండి ఒక్క మాట రాలేదు. చూస్తూ ఉండగానే కవర్ చేతికి ఇచ్చి జనాల మధ్య కలిసిపోయాడు.
ఎవరూ లేని సమయం లో కవర్ తెరిచి చూస్తే అందులో ఫోటో. నాకే తెలియకుండా తీసిన ఫోటో అది. బంగారు వర్ణం చీరలో ఉన్నాను. పెట్రో మాక్స్ లైట్ల వల్లేమో ఫోటో అందంగా వచ్చిందనిపించింది.
ఫోటో లోపల దాచేసి చాలా సేపు ఆలోచించాను. కనీసం అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదెందుకు అనిపించింది.
నిజం చెప్పాలంటే అప్పటి పరిస్థితులు కూడా అలానే ఉండేవి. ప్రేమ అనే మాటతో పాటు హత్యలు, ఆత్మహత్యలు వినపడేవి. పట్టింపులు ఎక్కువ, పరువు ప్రతిష్ట అనే ఎవరికీ కనిపించని కిరీటాన్ని తలమీద మోసుకుని తిరుగుతున్నట్టు అనిపించేది.
కొన్నాళ్లకి అతను కనిపించలేదు..తెలుసుకోవాలని ఉన్న తెలుసుకోలేని నిస్సహాయ స్థితి.
చాలా రోజుల తర్వాత అతను ఉన్న ఇంటి జాడ తెలుసుకున్నాను..అటుగా ఎప్పుడెళ్లినా తలుపులు మూసి ఉండేవి.
*******
ఎవరో తలుపు బాదుతున్నట్టనిపించి వెళ్ళి తీసింది వసుధ
“ఏంటమ్మా....పొద్దున్నే లేచేదానివి ఇంకా పడుకుని ఉన్నావు ఒంట్లో బాలేదా? అంది నుదుటి పై చేయి పెట్టి చూస్తూ
“బానే ఉంది...రాత్రి మోకాళ్ల నొప్పులతో నిద్ర పట్టకపోతేను అని చెప్తూ ఉండగా
“సరే తొందరగా స్నానం చేసి రా, కార్ కింద వెయిట్ చేస్తుంది అంటూ వెళ్లిపోయింది.
పిచ్చి పిల్ల ఎప్పుడూ అంతే హడావిడి చేస్తూ ఉంటుంది .అని గొణుగుతూ లోపలికి వెళ్లిపోయింది ఆవిడ
బిందు ఇచ్చిన కొత్త చీర కట్టుకుని వచ్చింది.
ఎక్కడికని అడిగితే చెప్పవేంటి ? అంటూ అరుస్తూ ఉంది వసుధ.
"వెళ్లాక నీకే తెలుస్తుంది అంది బిందు ఒక్క ముక్కలో
బయటకి చూస్తుంటే గుర్తు పట్టే విధంగా ఏ ఒక్కటి లేదు. కొండల్ని కూడా పిండి చేసి బిల్డింగ్ లు కట్టేసి ఉన్నారు.
కార్ ఓ చెట్టు కింద ఆగింది.
బిందు వాళ్ళమ్మ వైపు చూసి దిగమని సైగ చేసింది. దిగి చుట్టూ చూసింది.
పుట్టి పెరిగిన ఊరు...పూరి గుడిసెలు, పాకలన్నీ అగ్గి పెట్టెల్లాగా మారిపోయి వీధులన్నీ ఇరుగ్గా ఉన్నాయి.
అప్పటికీ ఇప్పటికీ గుర్తుగా మిగిలింది ఒక్క రావి చెట్టే అని బిందు వైపు చూసింది.
ముందుకి నడిచి వెళ్తుంటే ఎన్నో ఙాపకాలు వెనక్కి భారంగా లాక్కెళ్తున్నాయి.
అప్పట్లో అందరి దాహం తీర్చిన బావి పాడు బడి శిథిలావస్తలో ఉంది. చిన్న గుడిలో బయట నుండి చూస్తే రాముల వారి విగ్రహం పెద్దగా దగ్గరగా కనిపించేది. ఇప్పుడు గుడి పెద్దగా మారిపోయింది రాములు వారు దూరంగా కనిపిస్తున్నారు.
ఊర్లో తెలిసిన వాళ్లెవరూ కనిపించక మనస్సు చలించిపోయింది.ఒకరిద్దరిని పలకరించుకుంటూ గబగబా వెళ్లిపోతూ ఉంది.
బిందు వెనకనే నడుస్తూ “ఆనందంలో మోకాళ్లు బానే పనిచేస్తున్నాయమ్మా అంది నవ్వుతూ
ఆవిడ మురిపెంగా చూస్తూ “ఈ వీధి చూసావా...దారి పొడవునా పారిజాత చెట్లు ఉండేవి తెల్లగా తివాచీ పరిచినట్టు పువ్వులు రాలి పడి ఉండేవి అంది నవ్వుతూ.
మాటల్లో అతని ఇంటి వైపు వెళ్లారు. పాతబడి కూలిన ఇల్లు, విరిగిన తలుపులు గోడలపైన చెట్లు కూడా మొలిచి ఉన్నాయి.
బరువెక్కిన గుండెతో ముందుకు నడిచి వెళ్లిపోయింది.
*******
“రాత్రి నిద్రెలా పట్టిందో కూడా తెలీలేదు అంది వసుధ దూదితో వొత్తులు చేస్తూ..
“అమ్మా....అమ్మమ్మ పోయాక నువ్వు ఆ ఊరు వెళ్ళడం మర్చిపోయావు కదా అంది బిందు.
సమాధానం చెప్పకుండా వొత్తులు చేస్తూ ఉంది.
“మూసిన తలుపుల వెనక మనుషుల జీవితాలు కథలుగా మిగిలిపోయి ఉంటాయని ఎప్పుడూ ఆలోచించలేదమ్మా అంది బిందు మళ్లీ వాళ్ళమ్మ వైపు చూస్తూ.
“తను నా కోసం ఎదురు చూసిన రోజులెన్నో...నేను లేనని తెలిసినా నా కోసం ఎదురు చూసిన రోజులు మరెన్నో అంది దగ్ద స్వరంతో...
“తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? అంది బిందు ఆవిడ అరచేతుల్ని పట్టుకుంటూ.
“నన్ను నేను మర్చిపోయి కాలంతో పాటు పరుగులు పెడుతూ వచ్చేసా.ఇంట్లో అందరి ఇష్టాలని తెలుసుకుని అందరికీ నచ్చిన మనిషిలా మిగిలిపోయా.నువ్వు, అన్నయ్య పుట్టాక మీరే నా ప్రపంచం అయిపోయారు. ఆయన పోయాక మీ పిల్లలు దగ్గరయిపోయారు. మిగిలిన కాలం ఇలా నెట్టుకొచ్చేస్తే చాలు అంది నిస్సత్తువగా నవ్వి.
“పోని నేను కనుక్కోనా ? అంది బిందు ఆవిడ చేతిని పట్టుకుంటూ
“కొన్ని ఙాపకాలుగానే బావుంటాయి...అలానే ఉండనిద్దాం అంది వసుధ బిందు అరచేతిని ముద్దాడుతూ