నేటి మహిళ - షామీరు జానకీ దేవి

Neti mahila

రాఘవరావు, సీత ఇద్దరూ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు… డ్రీమ్ హౌజ్ లో ఉండాలని వారి కోరిక… మంచి గేటెడ్ కమ్యూనిటీలో విల్లా తీసుకుని ఉంటున్నారు… చిన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు, అత్తమామలతో, మూడు గదుల్లో ఉన్నవారికి, అప్పుడప్పుడు కూడా గత జీవితం గుర్తు చేసుకోవటం బాధగా ఉంటుంది…

మూడు గదుల్లో ఒకటి వంట గది… ఒక దాంట్లో బెడ్స్ వేసారు… ఇంకొకటి డ్రాయింగ్ రూమ్… ఆ రోజుల్లో ఏ చిన్న ఫంక్షన్ చేయవలసి వచ్చినా, ముందు గది ఖాళీ చేసే వారు… అత్తమామలకు తమ బెడ్ రూమ్ ఇచ్చేవారు… ఉన్న చిన్న కప్ బోర్డులో పిల్లల పుస్తకాలు పెట్టే వారు… ప్రతి రోజూ ఇలా సదురుకోవటం తమకు ఇబ్బందిగా ఉండేది…

ఇప్పుడు డూప్లెక్స్ విల్లా… క్రింద ఒక బెడ్ రూము, పైన రెండు బెడ్ రూమ్స్, హాలు… తాము కోరుకున్నట్లుగా కట్టుకున్న ఇల్లు… ఇద్దరమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసారు… ఇద్దరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు… అత్తమామలు కాలం చేసారు… ఇప్పుడు పెద్ద ఇల్లే కానీ ఉండేది తామిద్దరే…

ఈ మధ్య సీతకు మోకాళ్ళ నెప్పులు బాగా ఎక్కువ అయ్యాయి… పిల్లలు రమ్మన్నా, మృదువుగా తిరస్కరించింది… ఈ కారణాల వలన తాము, కొన్ని రోజులు ప్రయాణం వద్దనుకునున్నారు… అందుకే దగ్గరే ఉన్న పార్కులో కూర్చుని, ప్రతి వారిలో తమ పిల్లల్ని చూసుకుంటూ, గతాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు…

“సీతా!.. ఆ అమ్మాయి చూడు ఎంత పద్ధతిగా ఉందో… చక్కగా చీర కట్టుకుంది… చీరలోని అందం ఈ జనరేషన్ కి తెలియదేమో అనిపిస్తుంది, నాకు అప్పుడప్పుడు… కాని ఈ అమ్మాయి చూడు, ఎంత హుందాగా ఉందో….” ఆమెతో మాట్లాడాలి అనిపించినా, సభ్యత కాదేమో అని, తన చూపు తిప్పుకుని భార్య వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు…

“అవునండీ… మన మనవరాళ్ళు అసలు చీర కట్టుకుంటారా? అమెరికా వెళ్ళిన తరువాత మన పిల్లలు కూడా చీర కట్టడం వదిలేసారు…” చీర తప్ప, ఏనాడూ డ్రెస్ వేసుకోని సీత, తన ఆవేదనను వ్యక్తం చేసింది…

తాను అమెరికా వెళ్ళినప్పుడు, పిల్లలు ఎంత బ్రతిమిలాడినా, డ్రెస్ వేసుకోలేదు… ఎంత చలి ఉన్నా, అలాగే స్వెట్టరుతో మేనేజ్ చేసింది…

ఏ దేశమేగినా… ఎందు కాలిడినా… అన్నట్లుగా ఉంటుంది తన మనస్తత్వం… అమెరికాలో ఉన్నంత కాలం చీరలు మాత్రమే కట్టేది… అవి డ్రైయరులో వెయ్యకుండా, బేస్ మెంటులో త్రాడు కట్టి, ఆరేసేది… తన చాదస్తానికి అల్లుళ్ళు నవ్వేవాళ్ళు… కూతుళ్ళు విసుక్కునే వాళ్ళు…అయినా తన పద్ధతి మార్చుకోలేదు…

“సరేలే, ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్లల సంగతి ఎందుకు ఇప్పుడు?.. ఇక్కడ అమ్మాయిలను రోజూ చూస్తున్నాము కదా… ఏమన్నా అంటే సమానత్వం అంటారు… అందాలను ఆరబోయటమా… ఆ అమ్మాయి చూడు, చీర కట్టులో ఎంత రాయల్ గా ఉందో…”

మనిషికి గౌరవం వారు ధరించిన దుస్తులతోనే లభిస్తుంది… కానీ, ఇది గ్రహించే రోజు ఎప్పుడు వస్తుందో, అనుకుంటూ ఇరువురూ ఇలా చర్చించుకుంటున్నారు…

వీరి మాటలు విన్నదేమో, వెళ్తున్నది కాస్తా, వెనక్కు తిరిగి చూసింది అనూష వారిని… పలకరింపుగా నవ్వింది… “హాయ్ అంకుల్!.. నా పేరు అనూష… మీ వెనుక లైనులో ఉంటాము…” అంటూ తనను పరిచయం చేసుకుని, వారి పక్కన కూర్చుంది…

“చాలా సంతోషమమ్మా!.. నీ చీరకట్టు చూసి, మా ఇద్దరికీ ముచ్చటగా అనిపించింది... అలాగే నీ మాట కూడా పొందికగా, చక్కగా ఉంది…” ఇద్దరూ అనూషను ఆప్యాయంగా చూస్తూ, పలకరించారు…

“థాంక్సండీ… చీర ఇచ్చే అందం వేరే ఏ డ్రెస్సులో ఉండదు… కాని మా ఉరుకుల పరుగుల జీవితంలో మా వేషధారణలో కొన్ని మార్పులు అనివార్యం…” సరదాగా చెప్తోంది…

“నిజమే కావచ్చు, ఏదైనా ఒక లిమిట్లో ఉంటే, బాగుంటుంది… పెద్దవాళ్ళం కదా… నా భార్య కూడా ఉద్యోగం చేసింది… మేమిద్దరం ప్రస్తుతం పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నాము” రాఘవరావు కించిత్తు గర్వంగా అన్నాడు…

“మీ రోజులు వేరు అంకుల్!.. మేము డైరెక్ట్ గా కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేస్తున్నాము… మీలాగా మాకు టైమ్ లిమిట్ ఉండదు… ఒక్కోసారి లేట్ అవర్స్ కూడా చేయాల్సి వస్తున్నది… ఇలా చీరతో ఆఫీసులో ఉండలేము కదా… అదీ కాక మాకు డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది… మాకూ ఇలా తెలుగమ్మాయిలా ఉండాలని ఉంటుంది… కానీ చాలా ముందుకు వెళ్ళి పోయాము అంకుల్… ఎలా మారాలో మాకు కూడా తెలియడం లేదు…” ఆమె స్వరంలో ఏదో కోల్పోయిన బాధ కనిపించింది…

“నిజమే అనూషా!.. మా కాలంలో మేము మొదలు పెట్టిన ఉద్యోగాలు, మీ తరానికి తప్పనిసరి అవుతున్నాయి… అందులో, వైకుంఠపాళిలోలా పాములూ ఉంటాయి, నిచ్ఛెనలూ ఉంటాయి…” ఆమెను అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడింది సీత…

“నిజం ఆంటీ… ఈ ఉద్యోగాల వెనుక మీరు ఎందుకు పరుగెట్టారో అనుకుంటాను నేను… మన జీవితాలకు కొన్ని సుఖాలు అలవాటు అయ్యాయి… ఆ రోజుల్లో మీరు అవసరం అనుకున్నారు… అందులో మీకు తెలియకుండానే మాకు సుఖాలు అందించారు… ఇక మేము, మా పిల్లల కోరికలు తీర్చటానికి మాకు ఈ ఉద్యోగాలు తప్పనిసరి అవుతున్నాయి… సున్నితమైన స్త్రీ హృదయం ఎన్ని కోల్పోతుందో కదా!.. ఒక్కసారి ఆలోచించండి…” అనూష మాటలు ఆమెను ఆలోచనలో పడేసాయి…

“మళ్ళీ కలుద్దాం ఆంటీ, అంకుల్” అంటూ వారి వద్ద నుంచి కదిలింది అనూష…

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి