పోదామా వద్దా - మద్దూరి నరసింహమూర్తి

Podama vadda

"మనం ఇప్పుడు మరి ఈ ఊళ్ళో ఉండలేము స్వాతీ. పుణ్యం పురుషార్థం అన్నట్టు ఇంటినుండి పని చేసుకొనే నాకు, మన ఊరు పల్లెటూరైనా అక్కడ స్వంత ఇల్లుంది అమ్మా నాన్నలు ఉన్నారు కాబట్టి అక్కడికే పోదామా వద్దా"

"నీ మాటలు నాకు అర్ధం అవడం లేదు పవన్"

"ఇందులో అర్ధం కాకపోడానికి ఏమి ఉంది. నేను పని చేసే కంపెనీ వాళ్ళు ఇక నువ్వు ఆఫీసుకు రానక్కరలేదు, ఆఫీసుకు నువ్వు వచ్చినప్పుడు నీకిచ్చే కాఫీ టిఫిన్ల ఖర్చు కూడా మాకు అక్కరలేదు, నీకంటూ ఇక్కడొక ఆఫీస్ గది, టేబులు, కుర్చీ, నిన్ను చల్లగా ఉంచేందుకు AC వగైరా హంగామా ఏమక్కరలేదు, మొబైల్ ఫోన్, కంప్యూటర్ సహాయంతో ఇంటినుంచి నీ పని చేస్తూండు అని తెలియచేసి, నా జీతంలో 25 శాతం తగ్గించేరు. గోరిచుట్టు మీద రోకలిపోటు అన్నట్టు, ఇంతకు మునుపే వచ్చిన ఇంటిగలాయన అద్దె తీసుకున్న వరకూ నిశ్శబ్దంగా కూర్చొని, అద్దె చేతిలో పడిన తరువాత 'వచ్చేనెల నుంచి అద్దె 15 శాతం పెంచి ఉండగలుస్తే ఉండండి, లేదంటే ఈ నెలాఖరుకి ఇల్లు ఖాళీ చేయాలి' అని చెప్పి వెళ్ళేడు. ఇంకా ఆశపరుడైన అతను ఆలెక్కలో ఇంతకు ముందు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా పెంచాలి అని కూడా చెప్పేడు"

"మరి, పుణ్యం పురుషార్థం అన్నావదేమిటి"

"మన ఊరికి పోయి మన ఇంట్లోనే ఉంటే, అద్దె అడ్వాన్స్ లాంటి ఖర్చులు ఉండవు. అది పురుషార్థం అంటే. పట్నంలో దొరికే సుఖం వదులుకొని పల్లెటూరిలో ఉన్న వయసుడిగిన తల్లితండ్రులను దగ్గరుండి చూసుకుందికి వచ్చేసేడు అన్న మంచి పేరు నాకు, అత్తమామల అవసానదశలో సహాయంగా ఉండేందుకు వచ్చిన కోడలు అన్న మంచి పేరు నీకూ వస్తుంది. అది పుణ్యం అంటే, అర్థమైందా. ఇప్పుడు చెప్పు పోదామా వద్దా "

"కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. కాబట్టి నీ ఆలోచన ఆచరణలో ఎంతవరకూ సాధ్యమో అది కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. తరువాత ‘కరణేషు మంత్రి’ అనిపించుకుంటున్న నువ్వు ముందే తగిన సలహా ఎందుకు ఇవ్వలేదు అని తరువాత నన్ను ఆడిపోసుకుంటే నేనూరుకోను"

"నా ఆలోచనలో కీడేముందో వివరించు వింటాను"

"పల్లెటూరిలో మన ఇంట్లో ఎన్ని గదులున్నాయి"

"నీకు తెలియనట్టు అడుగుతావేంటి, ముచ్చటగా మూడు గదులున్నాయి కదా"

"మొత్తం మనం ఎంత జనం ఉండాలి ఆ ఇంట్లో"

"మళ్ళా నీకు తెలియనట్టు అడుగుతావేంటి. అమ్మా, నాన్న, నువ్వు, నేను, మన పిల్లలిద్దరూ ఇంతే కదా"

"ఎప్పుడైనా నీ అన్న వదిన పిల్లలు అలాగే నీ తమ్ముడు మరదలు పిల్లలు వస్తేనో"

"మహా అయితే నాలుగు రోజులకు వచ్చే వారి గురించి ఇప్పటినుంచీ ఆలోచించవలసిన అగత్యం లేదు"

"నీ చెల్లెలు భర్త పిల్లలు వస్తేనే"

"వాళ్ళ పట్ల అదే నియమం వర్తిస్తుంది"

"అంటే అవసరాన్ని బట్టి సర్దుకోవొచ్చు అని స్థిరపడ్డావన్నమాటేగా"

"తప్పదు కదా. అయినా అందరూ అదే ఇంట్లో పెరిగి పెద్దైనవారు, వారి కుటుంబాలేగా"

"కూరా నారా తేవాలంటే నువ్వే తిరగాలి తప్పితే, పెద్దవారైన మామగారిని పంపితే మెచ్చుకున్న ఊరిజనం మొహంమీదే తిట్టే ప్రమాదం లేకపోలేదు"

"వెళ్తాను. అయినా మార్కెట్ కి వెళ్లి సరుకులు కూరగాయలు తేవడం నాకేమీ కొత్తకాదు కదా"

"ఆహా, ఇక్కడికి వచ్చిన ఆరేళ్లై ఎన్నిసార్లు మార్కెట్ కి వెళ్ళేవేమిటి"

"ఇంట్లో కూర్చునే నీకు కాస్త వ్యాయామం అవసరం కదా అని నువ్వు వెళుతూంటే ఊరుకున్నాను కానీ, నాకు చేతకాక కాదు, నీ మీద ప్రేమ లేకకాదు" అంటూ దగ్గరకు తీసుకుంటున్న పవన్ పక్కకు తోసి --

"అక్కడుండేటట్లయితే పగటిపూట ఇలాటి సరసాలకు దూరంగా ఉండక తప్పదు"

రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత ---

"ఇన్ని ప్రశ్నలు వేసేవంటే మనం మన పల్లెటూరికి వెళ్లిపోయి మన ఇంట్లో ఉండడం నీకు సమ్మతమా కాదా"

"నాకు నూటికి నూరు శాతం సమ్మతమే"

"మరి అన్ని ప్రశ్నలేందుకు వేసేవు"

"సహాధర్మచారిణిగా నీ ఆలోచనలో ఎంత దృఢత్వం ధైర్యం ఉన్నాయో తెలుసుకోవాలి కదా"

"అయితే ఇప్పుడు నీకు ఏమి తెలిసింది"

"నా భర్త రూపంలో మన్మధుడే కాదు, అవసరమైతే అర్జునిడికి ఉన్న మనోధైర్యం ఉన్నవాడివని తెలుసుకున్నాను"

"అంటే, భీముడితో పోలికకు నేను తగనా" అంటూ తనకున్న కండలను చూసుకోసాగేడు పవన్.

"భీముడు శారీరక బలానికి ప్రసిద్ధి తప్పితే మనోధైర్యాన్ని కాదు. మత్స్య యంత్రం కొట్టి తెచ్చుకున్న ద్రౌపదిని అన్నదమ్ములతో పంచుకున్న మనోధైర్యం ఉన్న వాడు అర్జునుడు కదా మరి" అంటూ అతని సందేహాన్ని దూరం చేస్తూ తన పోలికను సమర్ధించుకుంది స్వాతి.

"అంటే నువ్వు ద్రౌపదివి అన్నమాటే కదా"

"అంత అదృష్టం నాకెక్కడిది? ఏమో వచ్చే జన్మలోనైనా పంచభర్త్రుకగా మెలిగే అదృష్టం వస్తే బాగుండును"

"రాదు. ఎందుకంటే ఈ అర్జనుడు నిన్ను వచ్చే జన్మలో కూడా వదలడు”

"అంతే మరి, దేనికైనా పెట్టి పుట్టాలి" అంటూ స్వాతి తన నుదిటిమీద మూడు సార్లు మెల్లిగా కొట్టుకుంది.

ఆ చర్యతో నవ్వుతున్న పవన్ ని చూసిన స్వాతి బుంగమూతి పెట్టుకొని వంటింట్లోకి వెళ్ళింది స్వాతి.

పవన్ మాటలు ఏవీ వినిపించడం లేదేమిటా అని వంటిల్లు వదలి ఈవలకు వచ్చిన స్వాతికి –

అటూ ఇటూ తిరుగుతున్న పవన్ కనపడితే –

"ఎందుకలా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నావు"

"అంటే నేను పిల్లినా"

"ఊహకి లోటేమిటి, పోనీ పులే అనుకుందాం. ఇప్పుడు చెప్పు ఎందుకలా తిరుగుతున్నావో"

"మన ఊరైన ఆ పల్లెటూరికి 'పోదామా వద్దా' అన్న సందిగ్ధం నా మనసుని వదలడం లేదు స్వాతీ"

"ఎందుకలా"

“మన పిల్లాడిని ఇక్కడ కార్పొరేట్ స్కూల్ లో ఈ ఏడు జాయిన్ చేద్దామనుకున్నాం. మరో రెండేళ్లకు అమ్మాయిని కూడా స్కూల్ లో జాయిన్ చేయాలి. ఇప్పుడు తొందరపడి తీసుకున్న నిర్ణయంతో మనం మన పల్లెటూరికి పొతే, పిల్లలని మంచి చదువులనుంచి దూరం చేస్తున్నామా అన్న శంక పీడిస్తోంది”

"నువ్వు పదోతరగతి వరకూ ఎక్కడ చదువుకున్నావు"

"మా ఊరి బడిలోనే. నేను పదో తరగతిలోకి వచ్చిన సంవత్సరమే, మా బడి మీద వేసిన నాలుగు గదులలో జూనియర్ కాలేజీ పెట్టి ఇంటర్ చదువు ఆరంభించడంతో, నేను ఇంటర్ వరకూ అక్కడే చదువుకున్నాను. ఇప్పుడు మన ఊళ్ళో రెగ్యులర్ కాలేజీయే నడుస్తూంది" అని ఉత్సాహంగా గుక్క తిప్పుకోకుండా చెప్పుకోవొచ్చాడు పవన్.

"అలాటప్పుడు మన పిల్లల చదువు గురించి ఆందోళన అర్ధరాహిత్యం కాదా"

"అంటే ఇక్కడ కార్పొరేట్ లెవెల్ స్కూళ్లున్నాయని"

"అలాగైతే వాళ్ళని ఇక్కడ బోర్డింగ్ స్కూల్ లో పడేద్దామా"

"ఆమ్మో, పిల్లల్ని వదిలి నేను ఒక్క రోజూ ఉండలేను స్వాతీ"

"అంటే నేనుండగలనా"

"నేనలా అనలేదే"

"గొప్పగొప్పవాళ్లంతా చిన్నప్పుడు వీధి బడి, ఊరి బడిలో చదువుకున్నవారే అన్నది వినలేదా"

"సరిలే ఈ మంత్రిగారి సలహా వినకుండా ఈ రాజు మనగలడా"

"అయితే, మన మకాం ఎప్పుడు మారుస్తున్నాం"

ఐదు నిమిషాలు ఆలోచించిన పవన్ –

"రెండు రోజులుపోతే శనివారం ఆదివారం మరేదో కారణాన సోమవారం సెలవు కలిసి మూడు రోజులు ఆఫీసు పని లేదు. కాబట్టి, శనివారం ఉదయమే మన కారులో బయలుదేరదాం. చెప్పా పెట్టకుండా వచ్చిన మన రాకతో మా అమ్మానాన్నలను ఆశ్చర్యంలో ముంచి, ఆ ఊళ్ళో మనం ఉండేందుకు పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆకళింపు చేసుకొని, రెండో రోజు రాత్రికి మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లి వాళ్ళను కూడా ఆశ్చర్యానందపరిచి, మూడో రోజు సాయంత్రం అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుప్రయాణం చేసి వచ్చి మన మకాం మార్పిడి గురించి ఆఖరి నిర్ణయం తీసుకుందాం. "

"ఏమో అనుకున్నాను కానీ నువ్వు మంచి ప్లానర్ వే"

"నీ అభినందనకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాడు ఈ ప్లానింగ్ మేనేజర్. మనం తిరిగి ఇక్కడికి వచ్చి ఒక అంతిమ నిర్ణయానికి వచ్చేంతవరకూ మన ఊరిలో నేను ఎవరికీ ఏమీ చెప్పను, నువ్వు కూడా ఎవరికీ ఏమీ చెప్పకూడదు. సరేనా"

"నా నోటి మాట లాక్కున్నావు నువ్వు"

"అంటే"

"నేనూ నీకదే చెపుదామనుకుంటున్నాను"

"మన మాటలు మాత్రమే కాదు తనువులు కూడా ఒక్కటవ్వడానికి తహతహమంటున్నాయి శ్రీమతిగారూ"

"ఆ ముచ్చటకు ఇంకా కొన్ని గంటలు పోవాలి శ్రీవారూ. వెళ్లి పిల్లల్ని తీసుకొని వస్తే భోజనాలు కానిద్దాం" అన్న స్వాతి మాటతో క్రిందన ఆడుకుంటున్న పిల్లల్ని తేవడానికి వెళ్ళేడు పవన్.

కుటుంబంతో వచ్చిన కొడుకుని చూసి అతని తల్లితండ్రులు మహదానందపడిపోయేరు. ఆరోజు సాయంత్రం అమ్మానాన్నలకు చెప్పి స్వాతిని తీసుకొని ఊళ్లోకి తిరగడానికి వెళ్ళేడు పవన్.

ఆ ఊరిలో, వీరి కంటే వయసులో పెద్దవారు ఎవరు ఎదురైనా –

"ఏమిరా ఎప్పుడొచ్చేవు. నువ్వు నీ పెళ్ళాం మన పల్లెటూరు చూడడానికి వచ్చేరా, లేక ఇక్కడ ఉండిపోవడానికి వచ్చేరా. నీ అమ్మానాన్నలను నీతో పట్నం తీసుకుపోయి, ఈ వయసులో ఆ ముసిలాళ్లకు అండగా ఉండరా" అని ఎంతో ఆప్యాయంగా చనువుగా మాట్లాడేవారే.

అంతేకాక, కనపడినవారందరూ స్వాతితో "ఈ వయసులో కూడా చెయ్యి కాల్చుకుంటున్న నీ అత్తయ్యను జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీమీదే ఉంది తల్లీ. లేకపోతే ముదుసలి అత్తయ్యని ఆదుకొని కోడలు అని నలుగురిలో నింద పడవలసి వస్తుంది. అయినా చదువుకున్నవాళ్ళు మీకు మంచి చెడు తెలియదా ఏమిటి. ఏదో మన ఊరివాళ్ళు కదా అని రెండు మాటలు చెప్పుము. ఏమీ అనుకోకురా. నువ్వు కూడా ఏమనుకొకమ్మా" అన్న వాళ్ళే.

మరి కొంతసేపు నడిచేసరికి – సమవయస్కు లైన పవన్ స్నేహితులు కొందరు కనపడి –

"ఎన్నాళ్లకు కనిపించేవురా" అంటూ ఒక్కసారిగా చేతులు పట్టుకొని చిన్న పిల్లల్లాగా చేతులు ఊపుతూ అలవికాని ఆనందం అనుభవించేరు.

వారంతా ముక్తకంఠంతో -- "ఏరా నీ పొలం కౌలుకి ఇచ్చేసి పెద్దనాన్నను నీతో తీసుకుపో. లేకుంటే ఈ వయసులో ఆయన పొలం పనులకి తిరుగుతూంటే చూస్తున్న మాకు చాలా కష్టంగా ఉండి, నిన్ను మనసులో తిట్టుకోని రోజు లేదు. ఇంకా ఉత్తమం, నువ్వే ఇక్కడికి పెర్మనెంట్ గా వచ్చేసి దగ్గరుండి పొలం పనులు చూసుకుంటూ పెద్దనాన్నను సుఖపెట్టు" అని ఊరుకోక –

"వీడికి నువ్వే బుద్ధి చెప్పాలి వదినా" అంటూ చనువుగా ప్రవర్తించేరు.

కనబడిన చిన్నా పెద్దా అలా ఆప్యాయంగా చనువుగా మాట్లాడుతూంటే --

పవన్ కి స్వాతికి కూడా గుండె లోతుల్లోంచి అవ్యక్తమైన అనుభూతి కలిగి కళ్ళలో నీళ్లు తిరిగేయి.

కొంచెం ముందుకు వెళ్లి పొలంగట్ల వెంబడి తిరుగుతూంటే ---

స్వచ్ఛమైన గాలి, పొలాల్లో తలలూపుతున్న వరి వంగడాలు, కాలవల్లో గలగలా పారుతున్న గోదారమ్మ, పొలంగట్లమీద చెట్లు, చేతికందుతూ చెట్లకున్న కాయలు పళ్ళు, సాయం సమయంలో గూళ్లకు చేరుకునేందుకు గుంపులుగా ఎగురుతూ పక్షుల గుంపులు, వాటి కిలకిలారావాలు -- కలగలిపి --

ఇంతటి ప్రాకృతిక ఆనందానికి దూరంగా –

పక్కవారు కూడా పలకరించక, స్వచ్ఛమైన గాలంటే ఏమిటో తెలియక, భూతాపంతో వేడెక్కి వీచే వడగాడ్పులతో, ఇంట్లో ఉండే పైపులలో రోజుకో గంట రెండు గంటలు మాత్రమే వచ్చే నీటి ఎద్దడితో, నాలుగు పైసలు ఎక్కువ వస్తాయన్న ఆశతో జీవించే ఆ పట్నం బ్రతుకుతో సరిపోల్చుకుంటూ --

పైకి చెప్పలేని, చెప్పుకోలేని ఒక రకమైన అపరాధభావనకు లోనైన దంపతులు –

'కష్టమో నష్టమో మనదైన ఈ పల్లెటూరే మన మజిలీ ఇక' - అన్న నిర్ణయానికి వచ్చి, ఆ ఆలోచనను అమలుచేసే దిశలో పెద్దవాళ్ళతో మాట్లాడేందుకు త్వరగా అడుగులు వేస్తూంటే, రామమందిరంలో సంధ్యా హారతి గంటలు వినిపించి, తమ ఆలోచన సఫలమయేలా ఆశీర్వదించమని వేడుకునేందుకు మందిరంలోకి అడుగిడేరు ఆ నవ్యభవ్యమనస్కుల దంపతులు.

*****

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు