బ్రతుకు తెరువు - టి. వి. యెల్. గాయత్రి.

Bratuku teruvu

ప్రొద్దున ఎనిమిదిన్నర అయింది. ఆంజనేయులు ఫ్యాక్టరీకి వెళ్తూ మళ్ళీ ఒకసారి తన స్నేహితుడు రాజన్నకు ఫోన్ చేశాడు. స్విచిడాఫ్ వస్తోంది. "ప్చ్!"అనుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఆంజనేయులు విజయవాడ ఆటోనగర్ లో మిషనరీలకు నట్లు, బోల్ట్లు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్. అతడి అన్నయ్య రవికాంత్. రవికాంత్ ఫ్యాక్టరీ కూడా ఆటోనగర్ లోనే అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఆంజనేయులు పనిలో పడిపోయాడు. మధ్యలో కాస్త సమయం చూసుకొని భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు.

"రాజన్న నీకేమన్నా ఫోన్ చేశాడా? నేను చేస్తుంటే స్విచ్ డాఫ్ వస్తోంది."అన్నాడు.

"లేదే!అయినా ఉద్యోగం మానేసి వెళ్ళాడుగా!వాళ్ళ ఊళ్ళో పొలం చూసుకుంటానన్నాడుగా!పొలాల్లో ఫోన్ పనిచెయ్యటం లేదేమో!తర్వాత చేస్తాడులే!"

అసంతృప్తిగా ఉంది ఆంజనేయులుకు.

ఈ ఫ్యాక్టరీకి వచ్చి పదిహేనేళ్లయింది. అంతకు ముందు ఏడాది నుండి రాజన్న ఫ్యాక్టరీలో చేరాడు. రాజన్న చాలా సౌమ్యుడు. పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడడు. ఎవరైనా పలకరిస్తే జవాబిస్తాడు. ఆంజనేయులు పనిచేసే చోట స్వీపరు పని చేసేవాడు.ఫ్యాక్టరీలో రెండు ఫ్లోర్లను ఊడవటం, కడగటం, కంప్యూటర్ హాల్ లో బాత్ రూంల క్లీనింగ్ పని చేసేవాడు.అందరినీ "అన్నా!"అనో "తమ్ముడూ!"అనో సంబోధించేవాడు. ఎప్పుడైనా ఆంజనేయులు అడిగితే కొద్దిగా డబ్బు అప్పు ఇస్తూ ఉండేవాడు.మళ్ళీ ఆలస్యంగా తిరిగి ఇచ్చినా, అసలివ్వకపోయినా అంతగా పట్టించుకునే వాడు కాదు. అందుకే రాజన్న అంటే అభిమానం ఆంజనేయులుకు.

ఆంజనేయులు ఇల్లు ఆటోనగర్లోనే. రాజన్న ఇల్లు మాత్రం సత్యన్నారాయణపురంలో. భార్య లేదు. ఒక్కతే కూతురు. తల్లితో పాటు ఉంటాడు. "ఆటో నగర్లో ఇల్లు తీసికోరాదా రాజా! ఫ్యాక్టరీకి దగ్గరవుతుంది."అనేవాడు ఆంజనేయులు.

"పిల్లదాన్ని మంచి స్కూల్లో చదివిద్దామని అక్కడే ఇల్లు తీసికొన్నాను "అనే వాడు రాజన్న.

ఇల్లు దూరమైనా ఠంచనుగా ఎనిమిదింటికల్లా ఫ్యాక్టరీలో ఉండేవాడు.అందరూ వచ్చే సరికి క్లీనింగ్ చేస్తూ ఉండేవాడు.

రాజన్నకున్న అలవాటు ఏమిటంటే ఎప్పుడూ ఒక నల్లశాలువా భుజంమీద వేసుకునేవాడు.

అసలే విజయవాడ. ఎండాకాలం ఎంత ఉక్కపోస్తున్నా శాలువా మాత్రం తీయడు. అంత వేడిలో అందరూ చొక్కాలు, బనీన్లు విప్పి పనిచేస్తుంటే రాజన్న మాత్రం నల్ల శాలువా వేసుకోవటం చిత్రంగా అనిపించేది అందరికీ.

"నీకు ఉక్క పోయటం లేదా రాజా!"అంటూ ఎవరైనా అడిగితే నవ్వి ఊరుకునే వాడు కానీ నల్ల శాలువాని మాత్రం వదిలేవాడు కాదు.రాజన్న శాలువా అచ్చం హరిచ్చంద్ర నాటకంలో కాటికాపరి శాలువా లాగా ఉండేది.

"నీ చేతిలో కర్ర ఒకటి పెడితే అచ్చం అరిచ్చంద్రుడివే!"అంటూ తోటివాళ్ళు వెక్కిరించినా చిరునవ్వే సమాధానం.

ఆంజనేయులు తన కష్టసుఖాలనన్నింటినీ రాజన్నతో చెప్పుకునే వాడు. రాజన్న ఓపిగ్గా విని ఏదో తోచిన సలహా ఇచ్చేవాడు. అవసరానికి ఆదుకునే స్నేహశీలి రాజన్న అంటే అభిమానం ఆంజనేయులుకు.

వచ్చే నెల నుండి ఫ్యాక్టరీలో పనిమానేస్తున్నట్లు ఆంజనేయులుకు చెప్పాడు రాజన్న.

"ఇంకా సర్వీసు ఉందికదా!అప్పుడే ఉద్యోగం మానటం ఎందుకు రాజా!"

రాజన్న ఉద్యోగం మానేస్తానంటే దిగులుగా ఉంది ఆంజనేయులుకు.

"మాధవి చదువు అయిపోయింది కదా!ఉద్యోగం మా మొవ్వ లోనే స్కూల్లో వచ్చింది. అమ్మాయి దగ్గర ఉంటాను. అక్కడే రెండెకరాల పొలం ఉంది. నేను పొలం చూసుకుంటూ అమ్మాయిని కనిపెట్టుకొని ఉంటాను."

అందరికీ చెప్పి ఆ పై నెల పని మానేసి ఊరేళ్లి పోయాడు రాజన్న.

రాజన్న అప్పుడప్పుడూ ఫోన్ చేస్తాడేమో అనుకున్నాడు ఆంజనేయులు. ఫ్యాక్టరీ వదిలి వెళ్లాక రాజన్న దగ్గర్నుంచి ఒక్క ఫోన్ లేదు. పైగా ఫోన్ స్విచ్ డాఫ్ వస్తోంది. బెంగగా ఉంది ఆంజనేయులుకు. '

ఒకటా రెండా పదిహేనేళ్ళ స్నేహం. ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా!... ఎందుకు చెయ్యటం లేదు?... పది రోజులు.. పదిహేను.. నెల గడిచిపోయింది.

ఆరోజు ఆదివారం. ఎలాగైనా రాజన్న గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అంతకు ముందు రెండు మూడు సార్లు సత్యన్నారాయణ పురంలో రాజన్న ఇంటికి వెళ్ళాడు. రాజన్న ఉన్న ఇంట్లో ఎవరో అద్దెకు ఉన్నారు. ఇంటి ఓనరు దగ్గరికి వెళ్ళి రాజన్న గురించి అడిగాడు.

"నాకు కూడా ఫోన్ లేదు. కూతురి పెళ్లి కుదిరిందని చెప్పాడు. ఆ తరువాత ఏ సమాచారం లేదు."చెప్పాడు ఇంటి ఓనరు.

అవాక్కయ్యాడు ఆంజనేయులు.

కూతురు పెళ్లి గురించి తనతో చెప్పలేదు.

"మాధవికి ఉద్యోగం మొవ్వలోనే వచ్చిందని చెప్పాడు.పెళ్లి గురించి ఎవ్వరితో చెప్పలేదు."అన్నాడు ఆంజనేయులు.

"ఇక్కడ శారదా కాలేజీ లెక్చరర్ ఒకావిడ ఉంది. ఆవిడ పేరు సురేఖా మేడం. మాధవిని ఆవిడే చదివించింది. ఆవిడని అడిగితే ఏమన్నా వివరం తెలుస్తుందేమో!"

"ఆవిడ ఇల్లెక్కడ?"

చిరునామా చెప్పాడు ఇంటి ఓనరు.

గిరి వీధిలో ఇల్లు. గేట్ తీసికొని లోపలికి వెళ్ళాడు ఆంజనేయులు.

అదృష్టం!సురేఖామేడం ఇంట్లోనే ఉంది.

తనను తాను పరిచయం చేసుకొని రాజన్న గురించి, అతడి కూతురు మాధవిని గురించి సమాచారం అడిగాడు ఆంజనేయులు.

"మాధవి పెళ్లి కుదిరిందని చెప్పాడు. వాళ్ళ ఊళ్ళోనే పెళ్లి చేశాడు. రాజన్న చాలా మంచివాడు. మాధవికి మొవ్వలో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. రాజన్న అమ్మాయి దగ్గరే ఉంటానన్నాడు."

తనకు తెలిసిన విషయం చెప్పింది సురేఖామేడం.

"మీ దగ్గర మాధవి ఫోన్ నంబర్ ఏమన్నా ఉందామ్మా!"ఆశగా అడిగాడు ఆంజనేయులు.

"ఈ మధ్య నా ఫోన్ చెడిపోయింది. చాలా నంబర్స్ కనిపించటం లేదు."

చేసేదేమీ లేక వెనుతిరిగాడు ఆంజనేయులు.

కూతురు పెళ్లయితే తనకే కాదు ఫ్యాక్టరీలో ఎవ్వరికీ చెప్పలేదు. అందరితో స్నేహంగా ఉండే రాజన్న ఇలా ఎందుకు చేశాడు?

"ఆ పిల్ల వేరే మతం వాడిని చేసుకుంటానందేమో!"సందేహం వెలిబుచ్చారు తోటివాళ్ళు.

ఏదో బాధగా ఉంది ఆంజనేయులుకు. 'ఎవరితో చెప్పకపోయినా ఫర్వాలేదు. తనతోటయినా విషయం చెప్పొచ్చుగా!ఎంతో స్నేహంగా ఉండే రాజన్న తన దగ్గర కూతురు పెళ్లి గురించి దాచిపెట్టాడు. అసలు ఊరెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చెయ్యకపోవటం ఏమిటో!...'

ఆశాంతిగా ఉంది ఆంజనేయులుకు.

రాజన్న ఏదో కష్టంలో ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పుకోవటం లేదు. అదేదో తెలిసికోవాలి. ఎంతయినా మంచి మిత్రుడు.

ఆ పై సోమవారం ఫ్యాక్టరీకి సెలవు పెట్టి మొవ్వకు బయలుదేరాడు ఆంజనేయులు.

మొవ్వ చిన్న ఊరు. పచ్చటి పొలాలు. ఊరి మధ్యలో వేణుగోపాలస్వామి దేవాలయం. ముందు స్వామి దర్శనం చేసుకొని గవర్నమెంట్ స్కూల్ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళాడు.

మాధవి గురించి అడిగాడు.

"పిలుస్తా ఉండ"మని వాచ్ మాన్ లోపలికి వెళ్ళాడు.

కాసేపటికి మాధవి స్కూల్ బయటికి వచ్చింది.

ఆంజనేయులుని చూడంగానే ఆమె కళ్ళల్లో విస్మయం

"మామయ్యా!... మీరు.. మీరు..""

ఆమెకు మాటలు రావటం లేదు.

ఆంజనేయులు ముఖం విప్పారింది.

"మీ నాన్న మాకందరికీ చెప్పాపెట్టకుండా నీ పెళ్లి చేసాడుగా!పోనీలే! మీకు నేను గుర్తుకురాకపోయినా నేనే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఇంటికి రావద్దంటాడా మీ నాన్న!నన్ను కూడా మర్చిపోయాడుగా!గుర్తులేదంటాడేమో!..."నిష్టూరంగా మాట్లాడుతున్నాడు ఆంజనేయులు.

"అదేమి లేదు మామయ్యా!ఇంటికి పోదాం రండి!నేను హెడ్మిస్ట్రెస్ కు చెప్పి వస్తాను!"అంటూ లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసికొని వచ్చింది మాధవి.

ఇద్దరూ ఇంటికి వెళ్లారు.

మధ్యలో ఎక్కువ మాటలు సాగలేదు.

పెంకుటిల్లు. వరండాలో జనపనార కట్టలు వేరు చేస్తూ ఉంది రాజన్న తల్లి మంగమ్మ.

ఆంజనేయులును చూడంగానే ఆమె కళ్ళల్లో కూడా విస్మయం కనిపించింది. అయినా నవ్వుతూ

"రా!రా!ఆంజనేయులూ!"అంటూ లోపలికి పిలిచింది.

లోపల ఉన్న నవారు మంచం మీద కూర్చున్నాడు ఆంజనేయులు.

"అమ్మా!ఆంజనేయులు మామయ్య వచ్చాడు."అంటూ బిగ్గరగా పిలిచింది మాధవి.

లోపలినుంచి ఒకావిడ వచ్చింది.

ఆశ్చర్యం!....

గుడ్లప్పగించి ఆమెనే చూస్తున్నాడు ఆంజనేయులు.

అదే ముఖం... రాజన్నకు చీర కట్టినట్లు.అయితే క్రాపులేదు... కొద్దిగాజుట్టు పెరిగింది. మొహాన బొట్టులేదు. అసలు మాధవికి అమ్మలేదు . అమ్మ అంటుందేమిటి?

రాజన్నే.. సందేహం లేదు.

అయోమయంగా చూస్తూ

"రా.. జ.. న్నా!.. అన్నాడు గొంతు పెగల్చుకొని ఆంజనేయులు.

"నేనే అన్నా!"అదే గొంతు.. పదిహేనేళ్ళు' అన్నా!అన్నా!'అంటూ పిల్చిన గొంతు.

బుర్ర పనిచెయ్యటం లేదు.

రాజన్న.. కాదు కాదు.

"ఎండన బడి వచ్చావు. ముందు మంచి నీళ్లు తాగు!"

అంటూ కూజలోని నీళ్లు గ్లాసులోకి ఒంపి ఇచ్చింది ఆమె.

గటగట తాగేసాడు.

"నేను స్కూల్ కు వెళ్ళి వస్తానమ్మా!"అంటూ మాధవి వెళ్ళింది.

"అన్నా!కాళ్ళు కడుక్కొని రా!ఎప్పుడు బయల్దేరావో ఏమో!భోజనం చేద్దువుగాని!అంతా చెప్తాను!"

మౌనంగా కాళ్ళు కడుక్కొని వచ్చాడు.

అసలు ఇంకో మాట నోట్లోంచి వస్తే కదా!బుర్ర శూన్యంగా ఉంది.

ఆమె అరటాకు వేసి భోజనం వడ్డించింది.మంగమ్మ కూడా విసనకర్ర పట్టుకొని పక్కనే కూర్చుంది.

విస్తరి ముందు కూర్చొని ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు.

"కలుపుకో అన్నా!"

"నా కేమీ అర్థం కావటం లేదు..."

"అంతా చెప్తా అన్నయ్యా!విను!ఇరవై ఏళ్ల క్రితం పెద్దయ్యగారి ఫ్యాక్టరీలో మా ఆయన ఉద్యోగం. అదిగో అక్కడ ఫొటోలో ఉన్నారు చూడు!శ్రీనివాసు.."

అటు చూశాడు.

అక్కడే దేవుడి గూట్లో బొట్టుపెట్టి ఒక ఫోటో ఉంది.

"పిల్లకు ఐదేళ్లు. మా కాపురం చక్కగా సాగిపోయేది.. యాక్సిడెంటులో మా ఆయన పోయారు.ఏం చెయ్యాలో తోచలేదు. పెద్దయ్యగారు ఫ్యాక్టరీలో స్వీపరు పని ఇచ్చారు. చిన్న పిల్లతో మా అమ్మను తోడు పెట్టుకొని ఉండేదాన్ని.కానీ భర్త లేని దాన్ని. ఫ్యాక్టరీలో చాలా మంది నాతో వెకిలిగా ప్రవర్తించేవాళ్ళు. భుజం మీద చెయ్యి వేసేవాడొకడు. బరితెగించి నీచంగా మాట్లాడేవాడొకడు. నాలుగు నెలలు భరించాను. ఒంటరి ఆడదాన్ని ఈ ప్రపంచంలో బ్రతకడమెలాగ? పెద్దయ్య గారికి చెప్పి పనిమానేద్దామనుకున్నాను. పిల్ల, నేను బ్రతకాలంటే ఎక్కడో ఒక చోట పనిచేయాల్సిందే. ఎక్కడైనా మృగాల్లాంటి మగవాళ్ళు ఉండకుండా వుంటారా?

మా అయన ఉన్నప్పుడు ఆయనతో నేనొక సినిమా చూశాను. అందులో హీరో ఆడదాని వేషం వేసుకుంటాడు. అది గుర్తొచ్చింది. వెళ్ళి పెద్దయ్యగారికి మగవాడి వేషం వేసుకొని పనిచేస్తానాన్నను. దానికి పెద్దయ్య గారు 'నువ్వు వేషం మార్చినా ఇక్కడయితే అందరూ నిన్ను గుర్తుపడతారు. నా తమ్ముడి ఫ్యాక్టరీ కొంచెం దూరంలో ఉంది. అక్కడ పని చెయ్యి!'అన్నారు.

అక్కడి నుండి చిన్నయ్యగారి దగ్గరికి వచ్చి విషయం చెప్పాను.

'అంతా బాగానే ఉంది. మగవాడిగా మారటం అంత సులభం కాదు. ఒక నెల రోజులు మగవాడి నడక, మాట, ప్రవర్తన క్షుణ్ణంగా పరిశీలించు!మగవాళ్ల బాత్ రూమ్స్ నువ్వు ఉపయోగించలేవు. అక్కడ జాగ్రత్తగా వుండు!మా కంప్యూటర్ హాల్ లో బాత్ రూమ్స్ కడిగి, నువ్వు కూడా వాడుకో!కానీ జాగ్రత్త!'అంటూ హెచ్చరించారు.

అప్పటి నుండి ఒక నెలరోజులు మగవాడు ఎలా ఉంటాడో నేర్చుకున్నాను. జుట్టు కత్తిరించి క్రాపు చేయించుకున్నాను. రెండు బనీన్లు లోపల వేసుకున్నాను. పైన వదులు చొక్కా. ఆపైన నల్ల శాలువా.. ముందు ఆటోనగర్ నుండి ఇల్లు సత్యన్నారాయణపురానికి మార్చాను. బస్సుల్లో మగవాళ్ళు ఎక్కే వైపు ఎక్కేదాన్ని.క్యూలల్లో కూడా మగవాళ్లతో బాటే. చిన్నయ్యగారు నా పేరు రాజన్నగా మార్చారు. స్వీపర్ గా మీతో బాటు పనిచేశాను. పిల్లకు కూడా గట్టిగా చెప్పి అమ్మను కాస్త నాన్ననయ్యాను. చిన్నయ్యగారు నాకు ఎక్కువ జీతం ఇచ్చేవారు. కనిపించినప్పుడు జాగ్రత్తలు చెప్పేవారు. మగవాడిగా మారాక నిశ్చింతగా నా పని నేను చేసుకొని ఫ్యాక్టరీ నుండి బయటపడేదాన్ని.

పిల్ల చదువయింది. అల్లుడు నా మేనల్లుడు. అన్నకొడుకు. వాడికి ఇక్కడ పొలం, రెండు ఆవులు ఉన్నాయి.వాడు బి ఎస్సి. అగ్రికల్చర్ విజయవాడలో చదివాడు. నేను పిల్ల పెళ్లి చేశాను. మిమ్మల్ని ఎవ్వరినీ పిలవలేదు. బంధువులకు నేను ఆడదాన్ని. వాళ్లకు నా మగవేషం గురించి అంతగా తెలియదు. నేను స్వీపరుగానే వున్నానని చెప్తుంటాను. చిన్నయ్యగారు మా అమ్మాయి చదువుకు, పెళ్లికీ డబ్బు పెట్టుకున్నారు. ఆ అన్నదమ్ములిద్దరికీ రోజూ దణ్ణం పెట్టుకుంటూ ఉంటాను. నా పేరు రాధ... రాధమ్మ.. "

ఆవిడ కళ్లనుండి జలజలా కన్నీళ్లు జారుతున్నాయి.

నిశ్శబ్దం...

కాసేపటికి తెప్పరిల్లాడు ఆంజనేయులు.

"మంచి పని చేశావు చెల్లెమ్మా!"అన్నాడు. అతడి మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది.

అప్పుడే రాధమ్మ అల్లుడు ప్రకాష్ పొలం నుండి వచ్చాడు. ఆరోజు సాయంత్రం దాకా ఉండి విజయవాడ వెళ్తానని బయలుదేరాడు ఆంజనేయులు. అతడికి బట్టలు పెట్టారు ప్రకాష్, మాధవిలు. బుట్టనిండా కూరగాయలు, పండ్లు, ఒక పెద్ద డబ్బానిండా నెయ్యి ఇచ్చింది రాధమ్మ.

"చాలమ్మా!చాలు!"అంటూ మాధవి చేతిలో రెండొందలు పెట్టాడు చీరకొనుక్కోమని.

అందరూ బస్టాండు దాకా వచ్చారు.

"ఈ సారి పిల్లలను, వదినను తీసికొని రా అన్నయ్యా!"అంది రాధమ్మ.

సజలనయనాలతో తలూపాడు ఆంజనేయులు.

బస్సు కదిలింది.

రెండో రోజు ఫ్యాక్టరీకి వెళ్ళటానికి తయారవుతున్నాడు ఆంజనేయులు. అప్పుడే బ్యాగులు పట్టుకొని కాలేజీకి వెళ్లబోతున్నారు ఇద్దరు కొడుకులు. పిల్లల్ని దగ్గరగా పిలిచాడు.

"నాన్నా!కాలేజీకి వెళ్లి బుద్దిగా చదువుకోండి!ఏ ఆడపిల్లనూ ఏడిపించొద్దు!వెకిలి వేషాలు వెయ్యకండి!మీకు అక్కచెల్లెళ్ళు లేరు. ఎవరిని చూసినా మీ తోబుట్టువుల్లాగా అనుకోండి!జాగ్రత్తగా మసలుకోండి!"

తండ్రి కంఠంలో గాంభీర్యం పిల్లలకు కొత్తగా వినిపించింది. పిల్లలు ఒకింత భయంతో 'అలాగే 'నన్నట్లు తలలూపి వెళ్లారు.

'మగపిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలి!'అనుకుంటూ కండువాతో కన్నీళ్లు తుడుచుకొని ఫ్యాక్టరీకి వెళ్ళాడు ఆంజనేయులు.

సమాప్తం.

** ** ** ** ** ** ** ** **

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు