సదానందుడు తన ఆశ్రమంలో రంగనాధం, మహనంది అనే ఇరువురు శిష్యులను తన ముందు కూర్చో పెట్టుకుని " నాయనలారా మన దేశానికి కొత్త రాయబారి పదవి అవసరం పడింది.మరికొద్ది సేపట్లో రాజభటులు వచ్చి రాజుగారి వద్దకు మీ ఇద్దరిని తీసుకువెళతారు నేను చెప్పే ఈవిషయాలు శ్రధ్ధగా వినండి.చతురంగ దళాలు అంటే.రథ,గజ, తురగ,పథాతి దళాలతో కూడిన దళాలు.ఇంకా,షడ్ గుణాలు అంటే. తనకన్నా శత్రువు బలం కలిగిన వాడైతే,అతనితో సఖ్యత పడటాన్ని 'సంధి'అంటారు.శత్రువుకన్న ఎక్కువ బలం కలిగి యుధ్ధం ప్రకటన చేయడాన్ని'విగ్రహం'అంటారు.బలం ఆధిక్యంగా ఉన్నప్పుడు దండయాత్త చేయడాన్ని'యానం'అంటారు.సమ బలం ఉన్నప్పుడు సమయ నిరీక్షణ చేయడాన్ని'ఆసనం'అంటారు.ఇతర రాజుల సహాయం లభించినప్పుడు ద్వివిధాన నీతి ప్రవర్తనను 'ద్వైధీభావం'అంటారు.బలం కోల్పోయినపుడు శత్రు ధనాన్ని పీడించడాన్ని'సమాశ్రయం' అంటారు.
ఇంతలో రాజభటులు వచ్చి రంగనాధం,మహనంది లను తీసుకువెళ్ళి రాజసభలో ప్రవేశపెట్టారు.
వారిని చూసిన మంత్రి సుబుధ్ధి " నాయనలారా మిమ్మలను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానాలు చెప్పగలిగినవారికే ఈరాయబారి పదవి లభిస్తుంది. మొదటి ప్రశ్న అన్న భార్యను,తమ్ముడి భార్యను, స్నేహితుడి భార్యను మనం ఏదృష్టితో చూడాలి ? "అన్నాడు సుబుధ్ధి. మొదటి యువకుడు "అయ్యా నాపేరు రంగనాధం మనపూర్వికలు ఎవరితో ఎలా ఉండాలి , ఎవరిని ఏమని పిలవాలి అని ఎప్పుడో చెప్పారు వాటి గురించి ఇప్పుడు మనం కొత్తాగా చెప్పుకునడానికి ఏమిఉంటుంది " అన్నాడు. రెండో యువకుడు అయ్యా నాపేరు మహనంది. అన్నభార్య వదినను తల్లిలా, తమ్ముడి భార్యను బిడ్డలా, స్నే హితుని భార్యను చెల్లిలా చూడాలి "అన్నాడు.
" నీవు స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు తీయగానే అతని చెల్లెలు బట్టలు వేసుకుంటూ కనిపిస్తుంది అప్పుడు మీరేంచేస్తారు? "అన్నాడు సుబుధ్ధి. "వెంటనే తలుపు దగ్గరకు లాగి తప్పుకుంటాను "అన్నాడు రంగనాధం .
" ఆస్నేహితుని చెల్లెలను ఎత్తుకుని ,తీసుకువెళ్ళిన మిఠాయి పొట్లాం ఆపాపకు అందించి బట్టలు నేనే సరిచెస్తాను " అన్నాడు మహనంది.
" రాయబారి గా వెళ్ళినపుడు శత్రుదేశపు రాజుకు మన సందేశం ఎలా వినిపిస్తారు? "అన్నాడు సుబుధ్ధి. " రాయబారి మాట్లాడే అవసరం ఉండకపోవచ్చు,రాజుగారు పంపింన లేఖ వారికి అందించి,ఆరాజుగారు ఇచ్చె లేఖ తీసుకు రావడమే రాయబారి పని " అన్నాడు రంగనాధం. "మంత్రివర్యా ఇక్కడి లేఖ అక్కడ ఇచ్చి,అక్కడి లేఖ ఇక్కడకు తీసుకు రావడం మాత్రమే రాయబారి పని అయితే ఈఎంపిక దేనికి, రాయబారి పదవి ఎంతో లౌక్యంతో కూడుకున్నపని , యుధ్ధం విషయమై వెళితే తెలివిగా మనబలాన్ని ,యుధ్ధంవలన జరిగే ప్రాణనష్టం,ఎందరికో అంగవైకల్యం,అన్నింటిని మించి ఆర్ధికంగా యుధ్ధం వలన ఎంతో నష్టపోతాము దీనికొరకు ప్రజలపై కొత్త పన్నులు వేయాలి , అప్పుడు ప్రజలు తమ నిరసన తెలియజేస్తారు పాలకులపై తిరుగు బాటుకూడా చేసే ప్రమాదం ఉందని సౌమ్యంగా ఈవిషయాలన్ని తెలియజేయవలసిన వాడే రాయబారి " అన్నాడు మహనంది . అతని మాటలకు రాజు గారి తోపాటు సభలోని వారంతా కరతాళధ్వనులు చేసారు. మహనందిని రాయబారిగా నియమించాడు చంద్రసేన మహరాజు.