‘సౌందర్య లహరి’ - Doctor Bokka Srinivasa Rao

Soundarya Lahari

టీ.వీ ఛానళ్ళు సిద్ధం అయిపోయాయి.

భారతీయులు కూడా సిద్ధం అయిపోయారు.

భారతదేశంలోని టీ.వీ ఛానళ్ళన్నీ ఒకే విషయం మీద చర్చిస్తున్నాయి.

కోట్లాది భారతీయులు కూడా ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

ప్రపంచం మొత్తం టీ.వీ సెట్ల ముందు ఆసక్తిగా కూర్చుంది.

అందరి ఆసక్తి ఆ ఒక్క విషయం గురించే.

ఆ విషయం మరేదో కాదు. అది...

‘మిస్‌ వరల్డ్‌`2024 విజేత ప్రకటన’

అవును... మరి కొద్ది సేపట్లో మిస్‌ వరల్డ్‌ విజేత ప్రకటన గురించి వెలువడబోతోంది.

ప్రపంచం నలుమూలల్లో రోజూ ఏదో ఒక పోటీ జరుగుతుంది. అందులో ఈ పోటీ ఒకటి అంతేగా.. అయితే ఏంటిట అని అనుకోవచ్చు. ఇంతటి ఉత్కంఠకి కారణం ఒకటే. ఫైనల్‌ రౌండ్‌కి చేరిన వాళ్ళల్లో మన ఇండియాకి చెందిన మోడల్‌ వుండడమే ఆ కారణం. దాదాపు పదేళ్ళ తర్వాత మిస్‌ వరల్డ్‌ కిరీటం భారతదేశానికి రాబోతోందని వార్తలు. అనధికార వర్గాల భోగట్టా ప్రకారం ‘2024`మిస్‌ వరల్డ్‌’ కిరీటం మన భారతీయ వనితకే దక్కొచ్చని తెలిసింది. అదీ గాక ఆమె ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వనిత. అందుకే భారతదేశంతో పాటు... ఇతర దేశాలన్నీ ఆసక్తిగా ఫలితం కోసం ఎదురు చూస్తోంది. కానీ ఇంతటి విశాల ప్రపంచంలో ఒకే ఒక్క కుటుంబం... ప్రత్యేకించి ఆ కుటుంబ యజమాని వెంకట్‌ మాత్రం ఆ ఫలితం వినడానికి సిద్ధంగా లేడు.

వెంకట్‌ భార్య కమల భర్తని బ్రతిమిలాడుతోంది. ‘ఏవండీ...! మిస్‌ వరల్డ్‌`2024 కిరీటం మనకే రాబోతోందటున్నారు. రండి ఆ విజేతని కళ్ళారా చూద్దాం’ అని అన్ని విధాలా కమల ప్రయత్నిస్తోంది. వెంకట్‌లో ఏ మాత్రం చలనం లేదు. వెంకట్‌ బాబాయ్‌ సోల్జర్‌ గోపాల్‌ కుంటుకుంటూ వెంకట్‌ దగ్గరికి వచ్చాడు. ‘ఒరేయ్‌ అబ్బాయ్‌.. రారా. అందరం కలిసి ఆ విజేతని ఆశీర్వదిద్దాం’ అని సోల్జర్‌ గోపాల్‌ కూడా బ్రతిమిలాడతాడు. వీళ్ళిద్దరి మాటలతో విసుగెత్తిపోయిన వెంకట్‌ వున్నట్టుండి ఒక్కసారిగా అరుస్తాడు. ‘నా మాట కాదని బాహ్య సౌందర్యానికే విలువిచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయిన నా కూతురు ప్రపంచ విజేత అయితే ఎవడికి గొప్ప. నేను రాను’ అని భీష్మించుకుని కూర్చున్నాడు. ఇంక చెప్పి లాభం లేదని... కమల సోల్జర్‌ గోపాల్‌ దగ్గరికి వచ్చి.. ‘ఆయనకి అంత పంతం అయినపుడు... నేను మాత్రం ఈ టీవీలో ఆ ప్రోగ్రామ్‌ ఎందుకు చూడాలి. చూడను’ అని తెగేసి చెప్తుంది. ఈసారి ఆశ్చర్యపోవడం సోల్జర్‌ గోపాల్‌ వంతయింది. ఆ షాక్‌నుండి తేరుకోకముందే... ‘మావయ్యగారూ..! మీ ఇంట్లోని టీవీలో చూద్దాం పదండి’ అని సోల్జర్‌ గోపాల్‌ని లాక్కెళుతుంది. అతని ఇల్లు వెంకట్‌ పక్క ఇల్లే. కమల వెళ్తూ.. వెళ్తూ... ‘మీకు చూడ్డం ఇష్టం లేకపోతే ఆ టీవీని మీరే కట్టేసుకోండి’ అని విసురుగా వెళ్ళిపోతుంది. వెనకనే సోల్జర్‌ గోపాల్‌ వెంబడిస్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత... టీవీని కట్టేద్దామని వెంకట్‌ టీవీ దగ్గరికి వచ్చి స్విచ్‌ ఆఫ్‌ చేయబోతూండగా... ఒక పేరు విని ఆగిపోతాడు. ఆ పేరు ‘హిమశ్రీ’. గుమ్మం దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ చూసి.. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. టీవీ ముందు కూర్చుంటాడు.

టీవీలో ప్రకటన వస్తోంది. ‘ఎస్‌ హిమశ్రీ. ఇవాళ ఆ పేరు కోట్లాది భారతీయుల గుండె చప్పుడయింది. మరి కొద్ది సేపట్లో విజేత ఎవరో తేలిపోతుంది. పదండి మీతో పాటు మేం కూడా ఆ విజేత ఎవరో విందాం’ అని ప్రకటన వచ్చింది. వెంకట్‌ అప్పటి దాకా బెట్టు చేసినా... తన కూతురు అన్న విషయం బలవంతంగా టీవీ ముందు కూర్చునేలా చేసింది. ‘ఇంట్లో ఎవరూ లేకపోవడం నా మంచికే అయింది. ఆ విజేత ఎవరో చూద్దాం’ అని తను కూడా ఆసక్తిగా చూడ్డం మొదలుపెట్టాడు. ఎవరూ లేరు అని వెంకట్‌ అనుకున్నాడు గానీ... ఈ చోద్యమంతటినీ వీథి గుమ్మం తలుపు పక్కనుండి కమల, సోల్జర్‌ గోపాల్‌లు చూసి నవ్వుకుంటున్నారు. ‘ఇందుకే మావయ్యగారూ...! మీ ఇంట్లో చూద్దాం’ అని మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఆయనది మొండి పట్టు కదా. అహం అడ్డువచ్చి చూడరని... ఆయనకి అడ్డు లేకుండా ఇటు వచ్చేసాం. ‘గడుసుదానివే అమ్మాయ్‌’ అని సోల్జర్‌ గోపాల్‌ మెచ్చుకోలుగా కితాబిస్తాడు. వీళ్ళిద్దర్నీ వెంకట్‌ గమనించడం లేదు. టీవీలో మునిగిపోయాడు. ఎనౌన్స్‌మెంట్‌ స్టార్ట్‌ అయింది.

‘డియర్‌ ఆడియన్స్‌...! నౌ వుయ్‌ ఫీల్‌ ప్రౌడ్‌ టూ ఎనౌన్స్‌ మిస్‌ వరల్డ్‌`2020. ద టైటిల్‌ గోస్‌ టూ మిస్‌ హిమశ్రీ, ఫ్రమ్‌ ఇండియా’ అని ఎనౌన్స్‌మెంట్‌ వచ్చింది. తర్వాత మాటలు ఎవరికీ వినపడ్డం లేదు. వెంకట్‌ ఒకింత గర్వంగా ఫీలయ్యాడు. బయట్నుంచి చూస్తున్న కమల, సోల్జర్‌ గోపాల్‌లు ఆనందం తట్టుకోలేకపోతున్నారు. కానీ బయటికి గట్టిగా అరవలేని పరిస్థితి. ఎక్కడ వెంకట్‌కి వినపడితే... టీవీ ముందునుంచి లేచిపోతాడని.. మౌనంగానే ఆనందపడుతున్నారు. ఆనందాన్ని దాచుకోవడం కూడా ఎంత కష్టమో అపుడే ఇద్దరికీ తెలిసొచ్చింది.

మిస్‌ హిమశ్రీకి కిరీటధారణ అయిపోయింది. ఇంక ఛానళ్ళన్నీ ఆమెని చుట్టుముట్టేసాయి. అంత రాత్రి సమయం అయినాసరే.. ఆ ఫ్లడ్‌ లైట్ల కాంతిలో పట్టపగలునే మరిపిస్తోంది. విశ్వసుందరి`2024 మిస్‌ హిమశ్రీ ఇంటర్వ్యూ మొదలయింది. అందరూ ఆమె చెప్పబోయే మొదటి మాట గురించి ఎదురు చూస్తున్నారు. ఆమె పెదాలు మెల్లగా కదులుతున్నాయి. ‘కమాన్‌ కమాన్‌’ అంటూ ఆడియన్స్‌ ఎలా అరుస్తున్నారో.. అంతకు మించి టీవీ చూస్తున్నవాళ్ళు అరుస్తున్నారు. ఆమె పెదాలు విచ్చుకున్నాయి... ‘ఐ లవ్‌ యూ డాడ్‌..!’ అని నేల మీద కూర్చుండిపోయి... తలని మోకాళ్ళలో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. చూస్తున్నవాళ్ళంతా నివ్వెరపోయారు. విశ్వసుందరే అయినప్పటికీ తను కూడా ఒక మనిషే కదా అని అందరూ ఆమె బాధతో పాటు తాము కూడా బాధపడుతున్నారు.

వెంకట్‌ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. ‘ఏడవకు నా బంగారు తల్లీ..!’ అంటూ టీవీని తుడుస్తున్నాడు ఏమీ కనపడ్డం లేదని. నీళ్ళతో నిండిన కళ్ళ వల్ల కన్పడ్డం లేదని కూడా గ్రహించలేనంతగా ఏడుస్తున్నాడు. కమల, సోల్జర్‌ గోపాల్‌లు కూడా ఏడుస్తున్నారు. భర్తని ఓదార్చడానికి రాబోయి.. తమాయించుకుని ఆగిపోతుంది. మరకత మాణిక్య వజ్ర వైఢూర్యాలని, ఎన్నో జీవరాశుల్ని, కడుపులో దాచుకున్న సముద్రం తన ఘోషని కెరటాల రూపంలో వెళ్ళగక్కినట్లు... ఇంత కాలం కూతురిని దూరముంచిన ఒక తండ్రి తన ఘోషని కళ్ళ నీళ్ళ రూపంలో వెలిబుచ్చుతున్నాడు. అందుకే ఆయన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.

హిమశ్రీ తనని తాను ఓదార్చుకుంది. వెంటనే తేరుకుంది. ఇంకా ఏం మాట్లాడాలో తెలియని అగమ్య గోచర స్థితిలోనే వుంది. కానీ ఒక రిపోర్టర్‌ వేసిన ప్రశ్నతో ఆమె కళ్ళు ఆనందంగా వెలిగాయి. కూతురు ఏం చెప్తూందా అని వెంకట్‌ మరింత ముందుకి వంగి వింటున్నాడు.

ఆ ప్రశ్న... ‘విశ్వ సుందరి మిస్‌ హిమశ్రీగారూ..! మీరు ఈ కిరీటాన్ని దక్కించుకోవడం వల్ల... మీకు కోట్లాది రూపాయిల పారితోషికం లభిస్తుంది కదా..! దాన్నేం చేయబోతున్నారు..?’

ప్రశ్న అడిగినంత వేగంగానే జవాబిచ్చింది. ‘మా నాన్నగారికి మాత్రం ఇవ్వడం లేదు’ అని చెప్పింది. అదేంటి ఇందాక ‘ఐ లవ్‌ యూ డాడ్‌’ అని ఇందాక అంత భావోద్వేగానికి గురయ్యారు అని రిపోర్టర్స్‌ అడిగారు. దానికి సమాధానంగా... ‘అవును. ఐ లవ్‌ మై డాడ్‌. బట్‌ ఈ డబ్బుని మా నాన్నగారికి ఇవ్వడం లేదు. నేనీ డబ్బుని మా నాన్నగారి మానసిక పుత్రిక అయిన ధార్మిక సంస్థ... లెటజ్‌ హెల్ప్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి ధారాదత్తం చేస్తున్నాను. ఎందుకంటే నేనా ట్రస్ట్‌ వల్లనే అంతటి మహానుభావుడు వెంకట్‌గారికి కూతుర్ని కాగలిగాను.’ అని చెబ్తుంది. అలా చెబ్తూ చెబ్తూ గతంలోకి వెళ్తుంది.

``ంం``

వెంకట్‌ ఒక సాంఘిక కార్యకర్త. రక్తదానమే తాను చేయడమే కాకుండా ఇతరులతో కూడా చేయించే ఆశయంగా పెరిగిన వ్యక్తి. తన ఆశయాలకు అనుగుణంగా నలుగురైదుగురి దగ్గర చందాలు వసూలు చేసి... ‘లెటజ్‌ హెల్ప్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ని నెలకొల్పాడు. అప్పటికే 120 సార్లు రక్తదానం చేయడంతో అతని పేరు గిన్నిస్‌ బుక్‌లో నమోదయ్యింది.

ఒక రోజున తన ట్రస్ట్‌ ఆఫీస్‌కి బయలుదేరాడు వెంకట్‌. దారి మధ్యలో మార్కెట్‌ ప్రాంతానికి రాగానే ఎవరిదో ఒక ఏడుపు గొంతు చిన్నగా వినపడిరది. కానీ ఆ ఏడుపు తనకే వినబడిరదని వెంకట్‌కి అర్థం అయింది.

ఎందుకంటే... అక్కడ జనాలందరూ కొని తెచ్చుకున్న చెవిటి మా లోకంలో నడుస్తున్నారు. అందరి చేతుల్లో ఫోన్లున్నాయి. ఒకడు ఫేస్‌బుక్‌ని ఫాలో అవుతూ.. చేతిని నిలువుగా పైకి, కిందకి తోసేస్తూ నిమగ్నమై వున్నాడు. మరొకామె వాట్సాప్‌ మెసేజ్‌ల్ని చూస్తూ.. పిచ్చిదానిలా నవ్వుకుంటూ... చేతిని కుడి, ఎడమ పక్కలకి తోసేస్తూ నిమగ్నమై వుంది. వున్నవారిలో సగానికి పైగా చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌, హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటల్లో నిమగ్నమై వున్నారు. ఇలా అందరూ ఏదో ఒక పనిలో వున్నారు. అందువల్ల ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన ఒక ఆడ చిన్నారి గొంతు ఎవరికీ వినిపించలేదు.

వెంకట్‌ ఆ అరుపు ఎటునుంచి వస్తుందో అని జాగ్రత్తగా వింటున్నాడు. అది ఒక కుప్పతొట్టెలోంచి వస్తోందని తెలుసుకుని.. ఆ తొట్టె దగ్గరకి పరిగెడుతున్నాడు. తానొక్కడే ఆ విషయాన్ని గ్రహించానని ఒకింత గర్వంతో వెళుతున్న అతడితో పాటుగా కమల అనే మహిళ కూడా ఆ కుప్పతొట్టె దగ్గరికి చేరుకుంది. ఇద్దరూ ఒకేసారి ఆ పాపని పట్టుకున్నారు. వెంకట్‌, కమలలిద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు. వెంకట్‌ తన చేయిని సడలించాడు. ఆమె ఆ పసికందుని తన రెండు చేతులతో పొదివి పట్టుకుని తొట్టెలోంచి తీసింది. తాను చేసేది నర్సు వుద్యోగం కావడంతో... వెంటనే దగ్గరున్న మెడికల్‌ షాపు వైపుకి పరిగెత్తింది. ఆమెతో పాటు వెంకట్‌ కూడా పరిగెత్తాడు. ఆమె మెడికల్‌ షాప్‌ అతనితో ‘యాంటీ`ఇన్‌ఫెక్టెంట్‌’ సోల్యూషన్స్‌, బేబీ పౌడర్‌, బేబీ సోప్స్‌, క్లీనింగ్‌ క్లాత్‌లు చెప్తోంది. వెంకట్‌ వాటిని తీసుకుని.. డబ్బులు చెల్లించి... ఆమె ఆ పసికందుని శుభ్రపరిచడంలో సాయం చేస్తున్నాడు. నర్సుగా తెలిసిన పద్ధతిలో ప్రాథమిక వైద్యాన్ని చేసింది.

ఆ తర్వాత వెంకట్‌ పనికందుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కమలకి ధన్యవాదాలు చెప్పి... తన దారిని తాను వెళ్ళబోతోంటే... కమల ఆయన్ని ‘ఈ బిడ్డని ఎక్కడికి తీసుకెళ్తున్నారు’ అని అడిగింది. ‘ప్రస్తుతానికి అవేం తెలియదండి. ఈ పక్కనే మా ఇల్లు. ముందుకి పాపని ఇంటికి తీసుకెళ్ళతాను. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాను’ అని వెంకట్‌ చెప్తాడు. అయితే నేను మీ ఇంటికి వస్తాను పదండి. పాపని ముందు స్నానం చేయించి... కాసిన్ని పాలు పట్టించాలి. ఆ తర్వాత నిద్రబుచ్చాలి. అపుడేం చెయ్యాలో ఇద్దరం ఆలోచిద్దాం’ అని అంటుంది. వెంకట్‌ సంతోషంగా సరేనంటాడు. ఇద్దరూ వెంకట్‌ ఇంటి వైపుకి వెళుతుంటారు.

వెంకట్‌ ఎవరో కమలకి తెలియదు. కమల ఎవరో వెంకట్‌కి తెలియదు. తానెవరో ఆ పసికందుకి అస్సలు తెలియదు. మరి తెలియని వీరిద్దరి మధ్యకి చేరిన ఆ పాప భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తూ.. నడుస్తున్నారు. వెంకట్‌ ఇల్లు రానే వచ్చింది. రాగానే కమల పాపని తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళింది.

వెంకట్‌ హాలులోనే వున్నాడు. ఒక అమ్మాయితో, ఆమెతో ఒక పసికందుతో వచ్చిన వెంకట్‌ని చూసి... వెంకట్‌ బాబాయ్‌ సోల్జర్‌ గోపాల్‌ ‘ఎవరు వీళ్ళంతా...?’ అని అడుగుతాడు. వెంకట్‌ జరిగిందంతా వివరంగా చెబుతాడు. సోల్జర్‌ గోపాల్‌ బాధపడతాడు. ఇంట్లో పాలు ఉన్నాయో లేదో అని చూడడానికి వెళ్ళి.. వుండడంతో ఊపిరి పీల్చుకుని వెంటనే వేడి చేస్తాడు.

ఈ లోగా కమల గీజర్‌ వాటర్‌లోంచి గోరువెచ్చని నీళ్ళని సిద్ధం చేసి... వెంట తెచ్చిన సొల్యూషన్స్‌, సోప్స్‌ వాడి పాపని మరింత శుభ్రం చేస్తుంది. ఈ తతంగం పూర్తయ్యేటప్పటికి పాలతో సిద్ధంగా వెంకట్‌, కమల ముందు ప్రత్యక్షంగా అవుతాడు. ఆమె పాలని బిడ్డకి పట్టిస్తూంటుంది. తొట్టెలో అరిచి, అరిచీ అలసిన ప్రాణం మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ బిడ్డను మంచం మీద పడుకోబెడతారు.

ఆ పాపకి వీళ్ళిద్దరూ చేస్తున్న సేవ చూసి.. సోల్జర్‌ గోపాల్‌ మనసులో వెంకట్‌, కమలలిద్దర్నీ అపురూప దంపతుల్లాగా ఊహించుకుంటాడు. ‘ఏమాలోచిస్తున్నావ్‌ బాబాయ్‌..?’ అన్న పిలుపుతో లోకంలోకొచ్చిన గోపాల్‌... కమలని డైరెక్టుగా ‘మీకు పెళ్ళయిందా’ అని అడిగేస్తాడు. వెంకట్‌ వారించబోతే... కమల అడ్డు చెప్పి.. ‘అయ్యే భాగ్యం లేదు’ అని చెబ్తుంది. వివరం అడిగేసరికి... ‘తనని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మోసం చేసిన డాక్టర్‌ రమేశ్‌’ అనే దుర్మార్గుడి గురించి చెబ్తుంది. ఇంకేం ఆలోచించకుండా సోల్జర్‌ గోపాల్‌ వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి... ‘మీరేమైనా అనుకోండి. ఆ పాప కోసమైనా మీరిద్దరూ ఒకటవ్వండి’ అని అంటాడు. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకుంటారు. ఏమీ చెప్పలేని స్థితిలో వుంటారు. అసలు తమకి ఆ వుద్దేశం లేదంటారు. ‘మరి ఆ పిల్లని ఏం చేద్దామని తెచ్చారు. మళ్ళీ ఆ కుప్పతొట్టెలోనే వదిలేయండి.’ అని పిల్లని తేవడానికి వెళ్తూంటే ఇద్దరూ గోపాల్‌ చెయ్యి పట్టుకుని ఆపేస్తారు. ఆ రెండు చేతుల్ని గోపాల్‌ తన చేతిలోకి తీసుకుని... ‘నా మాట కాదనకండి. మీరిద్దరూ ఒకటవ్వండి.’ అని వాళ్ళ వంక చూస్తాడు. వాళ్ళ మౌనాన్ని అర్థాంగీకారంగా తీసుకుని... ‘శుభం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు’ అని దీవిస్తాడు.

కాలం గిర్రున తిరిగిపోయింది. వెంకట్‌, కమలల జీవితాన్నే మార్చిన పసికందు... ‘హిమశ్రీ’గా ఎదిగి... ఇంటర్మీడియెట్‌ చదువుకొచ్చింది. ఇదిలా వుండగా... చందాలు ఇచ్చే వాళ్ళు లేక ఛారిటబుల్‌ ట్రస్టు ఆశయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఆ బాధని కమలతో చెప్పుకుంటూండగా హిమశ్రీ చాలా సార్లు విని.. ఎలాగైనా నాన్న ఆశయాలు నెరవేరేలా... మంచి ఫండ్‌ ఏర్పాటయ్యేలా ఏదైనా చేయాలని స్థిరమైన నిర్ణయం తీసుకుంది. తనకి భగవంతుడు సహజమైన అందాన్ని ఇచ్చింది ఈ ప్రయోజనం నెరవేర్చడానికే అయ్యుంటుంది అని సర్దిచెప్పుకుంటుంది. తొందరగా, ఎక్కువ డబ్బులు సాధించాలంటే దానికి సాధనమే తన అందమనీ.. దానికి మార్గం ‘మోడలింగ్‌’ అని నిర్ణయించుకుంటుంది.

అదే నిర్ణయాన్ని తల్లిదండ్రులికి చెబితే... వెంకట్‌ కూతురి మీద కోప్పడతాడు. ‘బాహ్య సౌందర్యం వెంట బడే ఆ మోడలింగ్‌’ అంటే తనకి అసహ్యం అనీ.. నల్గురికి సాయం చేసే మానసిక సౌందర్యమే అసలైన మోడలింగ్‌ అనీ హితబోధ చేస్తాడు. ఆ మాట ఇంట్లో ఎత్తవద్దని కూతుర్ని హెచ్చరిస్తాడు. నేను మోడలింగ్‌ చేసి తీరతానని హిమశ్రీ మొండిపట్టు పడుతుంది. ఎవరికీ సర్దిచెప్పలేని స్థితి కమలది. చివరికి సాహసించి... ‘ఏదో చిన్నపిల్ల అలా పెంకిగా అంటోంది. నేను దానికి సర్ది చెబుతాను’ అని భర్తతో అంటుంది. సరే అని చెప్పి వెంకట్‌ ఆ విషయాన్ని తేలికగా వదిలేస్తాడు. కానీ సదాశయంతో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే హిమశ్రీ తన అడుగులు వేసుకుంటూ... తల్లిదండ్రులకి తెలియకుండా మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెడుతుంది. ఒక్కో మెట్టు పైకి ఎదుగుతోంది.

నిజం దాగదు. ఏనాటికైనా నిప్పులా కాలుస్తుందన్నట్టు... తన కూతురి నిర్వాకంతో వెంకట్‌ మండిపోతాడు. మోడలింగ్‌ వదిలేస్తేనే తనకి ఇంట్లో స్థానం అని తెగేసి చెప్తాడు. అలా అయితే తాను అనుకున్నది సాధించాకనే గర్వంగా ఇంటికి వస్తాను’ అని హిమశ్రీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది.

అలా వెళ్ళిన హిమశ్రీనే...

ఈనాటి ‘మిస్‌ వరల్డ్‌`2024 హిమశ్రీని...!

అని తన గతాన్ని గురించి చెప్పగానే... కరతాళ ధ్వనులు, కేకలతో హాలు దద్దరిల్లిపోతుంది. ఇక్కడ వెంకట్‌ గుండె అంతకంటే తీవ్రంగా దద్దరిల్లుతోంది. వేగంగా కొట్టుకుంటోంది. నా ఆశయాన్ని తన ఆశయంగా మలుచుకుని.... హిమాలయాల ఎత్తుకు ఎదిగిన కూతురి మనస్సుని అర్థం చేసుకోలేకపోయానే అని అల్లాడిపోతున్నాడు. ఇంక బయట వుండలేక కమల పరిగెత్తుకుని లోపలికి వచ్చేస్తుంది.

కమల రాగానే... ఆమెని పట్టుకుని ఊపేస్తూ... ‘కమలా..! నా కూతురు ఏమందో చూసావా..? నేనెన్ని మాటలంటున్నా సహించింది పిచ్చిపిల్ల. ఇంతటి ఆశయంతో మానసిక సౌందర్యాన్ని పెంచుకుందే తను. అలాంటి నా కూతుర్ని అర్థం చేసుకోకుండా.. బాహ్య సౌందర్యానికే విలువిచ్చిందని నానా మాటలన్నాను. ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. వెళ్ళాలి. వెంటనే నా కూతురి దగ్గరికి వెళ్ళాలి. తనని ఆప్యాయంగా ఈ ఇంటికి తీసుకురావాలి. పద’ అని కమలని వెంటబెట్టుకుని కూతురు దగ్గరికి వెళుతుంటాడు. గోపాల్‌ వాళ్ళని అనుసరిస్తుంటాడు.

కానీ వెంకట్‌ మనస్సు...

బాహ్య ప్రపంచంలోంచి మానసిక ప్రపంచంలోకి పయనిస్తోంది. సౌందర్య లహరిలో తేలియాడుతూ విహరిస్తోంది. తన పెంపకం సరైనదేనని... తాననుకున్న మార్గంలోనే నిలబడిరదని సంతోషపడుతూంటాడు. తన ఆశయాల కొనసాగింపుకి వారసురాలు మిస్‌ హిమశ్రీ అయినందుకు మనసులో ఆనందాలు పరవళ్ళు తొక్కుతున్నాయి అలా.. అలా... అలా..!

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి