అవంతి రాజు గుణశేఖరుడు తనమంత్రి సుబుధ్ధితో " మంత్రివర్యా మన రాజ్యం వేగవంతంగా అభివృధ్ధి చెందడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయో తెలియజేయండి "అన్నాడు . " ప్రభూ మన ప్రజలకు నివాస యోగ్యమైన ఇళ్ళు, ఉచితంగా వైద్య,విద్య తోపాటుగా నిత్యవసర వస్తువులు తక్కువధరకు అందుబాటులోనికి తీసుకురావాలి అప్పుడే సామాన్యుడు సంతోషంతో జీవించగలడు. అందుకు మనం కొంత పొదుపు పాటించ వలసి ఉంటుంది . సందర్బం వచ్చినప్పుడు నేనే తమరికి విన్నవిస్తాను "అన్నాడు సుబుధ్ధి.
కొద్దిరోజుల అనంతరం.... అవంతికి పొరుగునే ఉన్న భువనగిరి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవారు. అతను అవంతి రాజు గుణశేఖరుడు ఇరువురు బాల్య మిత్రులు, ఒకే గురుకులంలో విద్య అభ్యసించారు.. పాలనవిషయంలో ఒకరి సలహ ఒకరు పాటిస్తుండేవారు.
తమ రాజ్య పొలిమేరలలోని అరణ్యం లోని కూృరముృగాలు సమీపంలోని గ్రామలలో ప్రవేసించడంతో ప్రజలు భయభ్రాంతులు కావడంతో వాటిని అరణ్యం లోపలకు తరమడం కోసం,రాజులు ఇరువురు తమ మంత్రులతో పొలిమేరలలో విడిదిచేసారు. రాత్రి విందుకు అవంతి రాజు గుణశేఖరుడు, భువనగిరి రాజుచంద్రసేనుని ఆహ్వానించాడు.
విందు ముగిసిన అనంతరం నృత్యం చూడటానికి రాజులు ఇరువురు ఆసీనులై ఉండగా ,గుణశేఖరుని మంత్రి సుబుధ్ధి "ప్రభులు అనుమతిస్తే ఒక విషయం విన్నవిస్తాను " అన్నడు. "తెలియజేయండి అమాత్యా " అన్నాడు గుణశేఖరుడు. " ప్రభు తమరు ఇరువురు బాల్య స్నేహితులు ఎట్టిపరిస్ధితులలో తమరు ఒకరిపై,మరోకరు దాడి చేసుకోరు కనుక తమరు ఇరువురు రక్షణ రంగానికి అవసరానికి మించిన ధనం కర్చు చేస్తున్నారు, అలావృధా కర్చులు తగ్గించుకుంటే ఆధనాన్ని ప్రజల ముఖ్య అవసరాలకు వినియోగించుకోవచ్చు,ధనం ఇంకామిగిలితే మూలధనంగా ఖజానాలో దాచుకోవచ్చు, ఆధనం అత్యవసర అవసరాలకు అంటే కరువు కాటకాలకు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలవలన ఏర్పడే విపత్కర పరిస్ధితులను ధైర్యంగా ఎదుర్కొనవచ్చు " అన్నాడు. " నిజమే మంచి ఆలోచనే,కాని మాఇద్దరివద్ద తక్కువ సైన్యం ఉందని ఇతర రాజులకు తెలిసి వారు మనపై యుధ్ధానికి వస్తే ,అప్పడు కష్టంకదా " అన్నాడు చంద్ర సేనుడు. " ప్రభూ మారాజ్యం పైకి యుధ్ధానికి వస్తే ,తమరు తమ సైన్యాన్ని మాకు అండగా పంపిస్తారు.అలాగే వేరెవరైనా తమపై యుధ్ధనికివస్తే , మాసైన్యం తమకు అండగా నిలబడుతుంది. ఎందుకంటే నేడు మాపైన యుధ్ధానికి వచ్చినవారు, రేపు తమరిపై తప్పక యుధ్ధానికివస్తాడు.కనుక మనం పరస్పర అవగాహనతో,ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది. ఇప్పటికే మీవద్ద పదివేల సైనికులు, మావద్ద పదివేల సైనికులు ఉన్నారు వీరిలో అర్ధభాగాన్ని అంటే ఇరువురి సైన్యంకలిపి పదివేలు చేయగలిగితేచాలు,ఇతరులు మనతో యుధ్ధం తలపెట్టరు " అన్నాడు మంత్రి సుబుధ్ధి.
" భేష్ చక్కటి సలహ ,మాత్రమా గుణశేఖరా సుబుధ్ధి వారి ఆలోచన అమోఘం, దీన్ని అమలు పరచడానికి నేను సమ్మతిస్తున్నాను తమరి అభిప్రాయం ఏమిటి? " అన్నాడు చంద్రసేనుడు. " అలాగే మన రెండు రాజ్యాలు అభివృధ్ధిచెంది ప్రజలు సుఖపడకంటే మనకు కావలసింది ఏముంటుంది " అన్నాడు గుణశేఖరుడు. మంత్రి సుబుధ్ధి ఆలోచనతో వేగంగా అవంతి,భువనగిరి రాజ్యాలు అభివృధ్ధి చెందాయి .